కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును”

“జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును”

“అసలెప్పుడూ న్యూస్‌పేపర్‌ చదవనివాడు తెలివితక్కువవాడు; అయితే పేపర్లో వచ్చిన ప్రతీ వార్తను నమ్మేవాడు అంతకన్నా తెలివితక్కువవాడు.” —ఆగస్ట్‌ ఫన్‌ ష్లట్స, జర్మనీకి చెందిన చరిత్రకారుడు, పబ్లిసిస్ట్‌ (1735-1809).

న్యూస్‌పేపర్లో వచ్చే ప్రతీ వార్తను నమ్మగలిగే పరిస్థితి ఆ కాలంలోనే లేదంటే మరి మనకాలంలో ఇంటర్నెట్‌లో వస్తున్న సమాచారాన్ని ఇంకెంత అనుమానించాలో కదా! ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఎంతో సమాచారం అందుబాటులోకి వస్తోంది. ఇంటర్నెట్‌లో మనకు ఉపయోగపడే, వాస్తవమైన, హానికరంకాని ఎంతో సమాచారం ఉంటుంది. దాంతోపాటు అబద్ధాలు, పనికిరాని విషయాలు, ప్రమాదకరమైన విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి వేటిని చదవాలో మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న వాళ్లు, సంచలనం కలిగించే ఏదైనా వార్తను చూసినప్పుడు అది ఇంటర్నెట్‌లో ఉంది కాబట్టి లేదా తమ స్నేహితులు పంపించారు కాబట్టి అది నిజమని నమ్మవచ్చు. అందుకే బైబిలు ఇలా హెచ్చరిస్తుంది, “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామె. 14:15.

మనం ‘వివేకంతో’ నడుచుకుంటూ, ఇంటర్నెట్‌లో వచ్చే మోసపూరిత సమాచారాన్ని, కట్టుకథల్ని, తప్పుడు వార్తల్ని ఎలా గుర్తించవచ్చు? మొదటిగా, ఏదైనా వార్తను చదివినప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘ఇది నమ్మదగిన, అధికారిక వెబ్‌సైట్‌ నుండి వచ్చిందా లేక ఏదో గుర్తుతెలియని వెబ్‌సైట్‌ నుండి లేదా వ్యక్తుల నుండి వచ్చిందా? ఆ వార్త నిజం కాదని నమ్మదగిన వెబ్‌సైట్‌లు ఇప్పటికే చెప్పాయా?’ a రెండవదిగా, ‘బుద్ధిని’ లేదా తెలివిని ఉపయోగించండి. (సామె. 7:7) ఏదైనా ఓ వార్త నమ్మశక్యంగా లేదంటే, బహుశా అది తప్పుడు సమాచారం అయ్యుండవచ్చు. అంతేకాక, ఆ వార్త ఇతరుల పేరును చెడగొడుతుంటే, దాన్ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో, దానివల్ల ఎవరు లాభం పొందుతున్నారో ఆలోచించండి.

మీకు వచ్చిన ప్రతీ మెయిల్‌ను ఇతరులకు పంపిస్తారా?

కొంతమంది తమకు ఏదైనా వార్త తెలిస్తే, అది ఎక్కడి నుండి వచ్చిందో, దాన్ని వేరేవాళ్లకు పంపిస్తే ఏం జరుగుతుందో ఆలోచించకుండా అందరికీ పంపిస్తుంటారు. ఇతరులు తమ గురించి గొప్పగా అనుకోవాలనో లేదా ఆ విషయాన్ని తామే ముందుగా ఇతరులకు చెప్పాలనో వాళ్లు అలా చేస్తారు. (2 సమూ. 13:28-33) అయితే మనకు ‘వివేకం’ ఉంటే, ఆ వార్తను ఇతరులకు పంపించడం వల్ల జరిగే నష్టం గురించి ఆలోచిస్తాం. కొన్నిసార్లు అది ఓ వ్యక్తికి లేదా సంస్థకు ఉన్న మంచి పేరును పాడుచేయవచ్చు.

ఫలానా వార్త నిజమో కాదో తెలుసుకోవాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది, కాబట్టి దాన్ని ఇతరులకు పంపించేస్తే వాళ్లే చూసుకుంటారులే అని కొంతమంది అనుకుంటారు. అయితే దానివల్ల వేరేవాళ్లకు ఎంత సమయం వృథా అవుతుందో వాళ్లు ఆలోచించరు. సమయం చాలా విలువైనది. (ఎఫె. 5:15, 16) కాబట్టి, నిజమో కాదో మనకు ఖచ్చితంగా తెలియని సమాచారాన్ని ఇతరులకు పంపించే బదులు దాన్ని డిలీట్‌ చేయడం మంచిది.

మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘నాకొచ్చే ప్రతీ ఈ-మెయిల్‌ను ఇతరులకు పంపించే అలవాటు నాకుందా? తప్పుడు సమాచారం పంపినందుకు నేను ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిందా? తమకు ఇకమీదట మెయిల్స్‌ పంపించవద్దని నాకు ఎవరైనా చెప్పారా?’ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఎవరికైతే మెయిల్స్‌ పంపిస్తున్నారో వాళ్లకూ ఇంటర్నెట్‌ ఉంది కాబట్టి ఆసక్తి కలిగించే విషయాల్ని మీ సహాయం లేకుండా వాళ్లే చూసుకోగలరు. జోకుల్ని, వీడియోల్ని లేదా ఫోటోల్ని అదేపనిగా పంపిస్తూ వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయాల్సిన అవసరం లేదు. అలాగే బైబిలు ప్రసంగాల రికార్డింగ్‌లను లేదా మీరు రాసుకున్న నోట్సులను కూడా ఇతరులకు పంపించడం సరికాదు. b మీరు పరిశోధన చేసి పంపించిన విషయాల్ని చదివినప్పుడు కన్నా, ఓ వ్యక్తి స్వయంగా బైబిలు వచనాలను తెరచి, పరిశోధన చేసి, సొంతగా కూటాలకు సిద్ధపడినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందుతాడు.

ఈ మెయిల్‌ని వేరేవాళ్లకు పంపించాలా?

ఒకవేళ మీరు ఇంటర్నెట్‌లో యెహోవా సంస్థ గురించి తప్పుడు సమాచారాన్ని చూస్తే ఏం చేయాలి? అలాంటి సమాచారాన్ని అస్సలు చదవకూడదు. అయితే అలాంటి సమాచారాన్ని ఇతరులకు పంపించి వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకోవాలని కొంతమంది అనుకుంటారు. కానీ అలా చేస్తే హానికరమైన సమాచారాన్ని ఇంకా ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నట్లే. అలాంటి సమాచారం మనకు ఆందోళన కలిగిస్తే, మనం జ్ఞానం కోసం యెహోవాకు ప్రార్థించాలి. ఆ విషయం గురించి పరిణతిగల సహోదరులతో మాట్లాడాలి. (యాకో. 1:5, 6; యూదా 22, 23) ఇతరులు మన గురించి అబద్ధాలు వ్యాప్తి చేసినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు. యేసుమీద కూడా ఎన్నో నిందలు వేశారు. శత్రువులు తన శిష్యుల్ని హింసించి ‘వాళ్లమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపుతారు’ అని యేసు హెచ్చరించాడు. (మత్త. 5:11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం; 11:19; యోహా. 10:19-21) మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తే, ‘అబద్ధాలాడి మోసం చేసేవాళ్లను’ గుర్తించగలుగుతాం.—సామె. 2:10-16, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఇతరుల హక్కును గౌరవించండి

మన సహోదరసహోదరీల గురించి ఏదైనా విషయం తెలిసినప్పుడు లేదా మనం ఏదైనా అనుభవం విన్నప్పుడు ఏం చేయాలి? మనం విన్నది నిజమే అయినా దాన్ని అందరికీ చెప్పడం కొన్నిసార్లు సరికాదు, అది ప్రేమ అనిపించుకోదు. (మత్త. 7:12) ఉదాహరణకు, ఇతరుల బలహీనతలను వ్యాప్తి చేస్తే మనకు వాళ్లమీద ప్రేమలేనట్లే, పైగా దానివల్ల ఎవ్వరూ ప్రయోజనం పొందరు. (2 థెస్స. 3:11; 1 తిమో. 5:13) అంతేకాదు, రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని సరైన సమయంలో సరైన మార్గంలో తెలియజేసే హక్కు ఇతరులకు ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అలాంటివాటిని ముందే అందరికీ చెప్పడంవల్ల ఎంతో నష్టం జరగవచ్చు.

ఈ రోజుల్లో ఎలాంటి సమాచారాన్నైనా క్షణాల్లో అందరికీ చేరవేయవచ్చు. మనం ఒక్క వ్యక్తికి ఈ-మెయిల్‌ లేదా మెసేజ్‌ పంపించినా, ఆయన దాన్ని భూమ్మీద ఎక్కడున్న వాళ్లకైనా క్షణాల్లో పంపించగలడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు వచ్చిన ప్రతీ మెయిల్‌ని లేదా మెసేజ్‌ని ఏమాత్రం ఆలోచించకుండా, వెంటనే ఇతరులకు పంపించే అలవాటు మానుకోవాలి. ప్రేమ అనవసరంగా అనుమానపడదు, అది ‘అన్నిటిని నమ్ముతుంది’ అని బైబిలు చెప్తుంది. అంతమాత్రాన, ఇతరులు మనకు పంపించే ప్రతీ ఆసక్తికరమైన వార్తను నమ్మడం తెలివితక్కువతనం. (1 కొరిం. 13:7) మనం ప్రేమించే మన సంస్థ గురించి, మన సహోదరసహోదరీల గురించి ఇతరులు వ్యాప్తి చేసే అబద్ధాల్ని లేదా తప్పుడు విషయాల్ని మనం అస్సలు నమ్మం. నిజానికి, అలాంటి అబద్ధాల్ని వ్యాప్తి చేసేవాళ్లు, ‘అబద్ధానికి’ తండ్రియైన సాతానును సంతోషపెడుతున్నారు. (యోహా. 8:44) మనకు ప్రతీరోజు ఎంతో సమాచారం అందుబాటులో ఉంటోంది, కాబట్టి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో జాగ్రత్తగా ఆలోచిస్తూ వివేచనతో నడుచుకుందాం. బైబిలు చెప్తున్నట్లుగా ‘జ్ఞానం లేనివాళ్లకు మూఢత్వమే స్వాస్థ్యం, వివేకులు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.’—సామె. 14:18.

a ఏదైనా ఓ విషయం అబద్ధమని తేలిన తర్వాత కూడా దానికి చిన్నచిన్న మార్పులు చేసి మళ్లీ ఇంటర్నెట్‌లో పెడుతుంటారు. అది నిజమని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు.

b 2010 ఏప్రిల్‌ మన రాజ్య పరిచర్యలో “ప్రశ్నాభాగం” చూడండి.