జీవిత కథ
ఆయన తన యౌవనంలో తీసుకున్న నిర్ణయం గురించి ఎప్పుడూ బాధపడలేదు
నికొలై డ్యూబవీన్స్‌కీ మా నానమ్మ వాళ్ల అన్నయ్య. ఆయన ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ప్రకటనా పనిపై నిషేధం ఉన్న కాలంలో యెహోవా సేవ చేశాడు. ఆ సేవలో తాను పొందిన సంతోషాల గురించి, అనుభవించిన కష్టాల గురించి తన చివరిరోజుల్లో రాసుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఆయన ఎప్పుడూ యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు, ఎన్నడూ జీవితంమీద ఆసక్తి కోల్పోలేదు. తన అనుభవాల గురించి యౌవనులు తెలుసుకోవాలని ఆయన తరచూ అనేవాడు. అందుకే ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. నికొలై 1926లో యుక్రెయిన్‌లోని చిర్‌నిఫ్ట్‌సీ ఆబ్లస్ట్ లో ఉన్న పడ్విరైఫ్కా అనే గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పుట్టాడు.
నికొలై సత్యం తెలుసుకోవడం
ఇవి నికొలై చెప్పిన మాటలు: “1941లో ఓ రోజు మా పెద్దన్నయ్య ఇవాన్ మా ఇంటికి ద హార్ప్ ఆఫ్ గాడ్, ద డివైన్ ప్లాన్ ఆఫ్ ద ఏజెస్ పుస్తకాల్ని, కొన్ని వాచ్‌టవర్ పత్రికల్ని, చిన్న పుస్తకాల్ని తెచ్చాడు. నేను వాటన్నిటినీ చదివేశాను. లోకంలో ఉన్న బాధలన్నిటికీ కారణం సాతానేగానీ దేవుడు కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. వాటితోపాటు బైబిల్లోని సువార్తలను కూడా చదివాను, దాంతో ఇదే సత్యమని నాకర్థమైంది. నేను తెలుసుకున్న విషయాల గురించి ఉత్సాహంగా ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాను. ఆ ప్రచురణలను చదివేకొద్దీ సత్యాన్ని మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నాను, యెహోవా సేవ చేయాలనే బలమైన కోరిక కూడా కలిగింది.”
“నా మత నమ్మకాల కారణంగా నేను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు అర్థమైంది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది, కానీ నేను మాత్రం యుద్ధంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే మత్తయి 10:28; 26:52 వంటి లేఖనాల గురించి ఆలోచిస్తూ, ముందుముందు రాబోయే కష్టాల కోసం సిద్ధపడ్డాను. ప్రాణంపోయినా సరే యెహోవాకే నమ్మకంగా ఉండాలని తీర్మానించుకున్నాను.”
“నన్ను 1944లో సైన్యంలో చేరడానికి పిలిచారు, అప్పుడు నా వయసు 18 ఏళ్లు. నాతోపాటు కొంతమంది యౌవన సహోదరుల్ని కూడా ఓ చోట సమకూర్చారు. అప్పుడే నేను మొదటిసారి యెహోవా సాక్షుల్ని కలిశాను. మేము యుద్ధంలో పాల్గొనమని అక్కడి అధికారులకు తేల్చి చెప్పేశాం. దాంతో వాళ్లకు బాగా కోపమొచ్చింది. వాళ్లు మాకు తిండి పెట్టకుండా గొడ్డుచాకిరి చేయిస్తామంటూ, లేదా కాల్చిపారేస్తామంటూ బెదిరించారు. అయితే మేము ధైర్యంగా ఇలా చెప్పాం, ‘ఏమి చేస్తారో మీ ఇష్టం. మీరేమి చేసినా మేము మాత్రం “నరహత్య చేయకూడదు” అనే దేవుని ఆజ్ఞకు లోబడే ఉంటాం.’”—నిర్గ. 20:13.
“తర్వాత వాళ్లు, నన్నూ మరో ఇద్దరు సహోదరుల్ని పొలాల్లో పని చేయడానికి, పాడైన ఇళ్లను బాగుచేయడానికి బెలారస్ అనే దేశానికి పంపించారు. అక్కడ మిన్‌స్క్ అనే నగర పొలిమేరల్లో యుద్ధం మిగిల్చిన నష్టాల్ని చూడడం నాకింకా గుర్తుంది. దారిపొడవునా నల్లగా మాడిన చెట్లు; అడవుల్లో, కాలువల్లో మనుషుల శవాలు, ఉబ్బిపోయిన గుర్రాల కళేబరాలు; పాడుబడ్డ
వాహనాలు, యుద్ధ ట్యాంకర్లు, విమాన శకలాలు అక్కడ చూశాను. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో కళ్లారా చూశాను.”“యుద్ధం 1945లో ముగిసినా మేము దాంట్లో పాల్గొననందుకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. మొదటి మూడు సంవత్సరాలపాటు మేము సాక్షులెవర్నీ కలవలేకపోయాం, మా దగ్గర ప్రచురణలు కూడా లేవు. అయితే ఉత్తరాల ద్వారా కొంతమంది సహోదరీలతో మాట్లాడగలిగాం, కానీ వాళ్లను కూడా అరెస్ట్ చేసి 25 ఏళ్లు లేబర్ క్యాంపులో ఉండేలా శిక్ష విధించారు.”
“అయితే మమ్మల్ని 1950లోనే విడుదల చేయడంతో నేను మా ఇంటికి వెళ్లాను. నేను జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ, చెల్లి మరీయా కూడా యెహోవాసాక్షులయ్యారు. మా అన్నయ్యలు స్టడీ తీసుకుంటున్నారు. నేను విడుదలయ్యాక ప్రకటనా పనిని కొనసాగించడంతో సోవియట్ సెక్యూరిటీ ఏజెన్సీ నన్ను మళ్లీ అరెస్ట్ చేయాలని చూసింది. అప్పుడు మన పనిని పర్యవేక్షిస్తున్న సహోదరులు, భూగర్భంలో మన ప్రచురణల్ని తయారుచేసే పనిలో సహాయం చేయమని నన్ను అడిగారు. అప్పుడు నా వయసు 24 ఏళ్లు.”
ప్రచురణల్ని తయారుచేయడం
“అప్పట్లో సాక్షులు సరదాగా ఇలా అనేవాళ్లు, ‘భూమ్మీద రాజ్యసంబంధ పనుల్ని నిషేధిస్తే, భూమికింద అవి కొనసాగుతాయి.’ (సామె. 28:28) ఆ సమయంలో మన ప్రచురణల్ని చాలావరకు భూమికింద రహస్యంగా ముద్రించేవాళ్లు. మా అన్నయ్య మీట్రాయ్ ఉండే ఇంటికింద ఓ రహస్య స్థావరంలో నేను ప్రచురణల్ని ప్రింట్ చేయడం మొదలుపెట్టాను. కొన్నిసార్లయితే బయటికి రాకుండా రెండువారాల పాటు దాంట్లోనే ఉండి పనిచేసేవాణ్ణి. ఎప్పుడైనా ఆక్సిజన్ లేక నాదగ్గరున్న దీపం ఆరిపోతే, గదిలోకి మళ్లీ ఆక్సిజన్ వచ్చేవరకు కాసేపు పడుకునేవాణ్ణి.”
“ఓ రోజు, నాతోపాటు పని చేస్తున్న సహోదరుడు ‘నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా?’ అని నన్ను
అడిగాడు. నేను 11 సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్నా బాప్తిస్మం మాత్రం తీసుకోలేదు. ఆయన నాతో బాప్తిస్మం గురించి చర్చించాడు, నేను ఆ రాత్రే ఓ చెరువులో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నా వయసు 26 ఏళ్లు. మూడేళ్ల తర్వాత, నన్ను కంట్రీ కమిటీ సభ్యునిగా నియమించారు. అప్పట్లో, సహోదరులు ఎవరైనా అరెస్టయితే వాళ్ల స్థానంలో వేరే సహోదరుల్ని నియమించేవాళ్లు, అలా రాజ్యసంబంధ పని కొనసాగేది.”భూగర్భంలో పని చేస్తున్నప్పుడు ఎదురైన కష్టాలు
“భూమికింద ప్రింట్ చేసే పని జైలు జీవితంకన్నా చాలా కష్టంగా ఉండేది. రష్యా సీక్రెట్ పోలీసుల కంటబడకుండా ఉండడం కోసం నేను ఏడు సంవత్సరాల పాటు సంఘ కూటాలకు హాజరవ్వలేదు. దాంతో నా ఆధ్యాత్మికతను నేనే చూసుకోవాల్సి వచ్చింది. నా కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడోగానీ కలిసేవాణ్ణి కాదు. అయితే వాళ్లు నా పరిస్థితిని అర్థం చేసుకోవడం చూసి కాస్త ఊరట పొందాను. తీవ్రమైన ఒత్తిడి వల్ల, పోలీసులు కనిపెడతారేమో అని చాలా జాగ్రత్తగా పనిచేయడం వల్ల నేను బాగా కృశించిపోయాను. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి. ఓ రోజు సాయంత్రం ఇద్దరు పోలీసులు నేను ఉంటున్న ఇంటికి వచ్చారు. నేను కిటికీలోనుండి బయటకు దూకి అడవిలోకి తప్పించుకుని అక్కడినుండి ఓ పొలంలోకి పరిగెత్తాను. అంతలోనే ఏవో పెద్ద శబ్దాలు వినిపించాయి. అవి తుపాకీ పేలుస్తున్న శబ్దాలని కాసేపటికి అర్థమైంది. నేను పరిగెత్తుతుంటే ఓ పోలీసు గుర్రంమీద నన్ను వెంటాడుతూ, బుల్లెట్లు అయిపోయేవరకు నా వైపు కాలుస్తూనే ఉన్నాడు. ఓ బుల్లెట్ నా చేతిలోకి దిగింది. అలా ఐదు కి.మీ. పరిగెత్తి వాళ్లకు కనబడకుండా అడవిలోకి పారిపోయాను. ఆ తర్వాత నన్ను విచారిస్తున్నప్పుడు తెలిసింది, వాళ్లు నా వైపు 32 సార్లు కాల్చారని!”
“భూగర్భంలోనే ఎక్కువసేపు ఉండడం వల్ల బాగా పాలిపోయాను. దాంతో నేనేమి చేస్తున్నానో వేరేవాళ్లకు అర్థమైపోయేది, అందుకే వీలైనప్పుడల్లా ఎక్కువసేపు ఎండలో ఉండేవాణ్ణి. భూగర్భంలో ఉండడంవల్ల నా ఆరోగ్యం కూడా పాడైంది. ఓసారైతే ముక్కు నుండి, నోటినుండి రక్తం కారడం వల్ల ఓ ముఖ్యమైన మీటింగ్‌కు కూడా వెళ్లలేకపోయాను.”
నికొలై అరెస్ట్ అవ్వడం
“నన్ను 1957, జనవరి 26న అరెస్ట్ చేశారు. ఆరు నెలల తర్వాత, యుక్రెయిన్ సుప్రీం కోర్టు నన్ను కాల్చి చంపమని తీర్పు ఇచ్చింది. అయితే ఆ దేశంలో మరణశిక్షను రద్దుచేశారు కాబట్టి నా శిక్షను 25 ఏళ్ల జైలు శిక్షగా మార్చారు. నాకు, నాతో ఉన్న ఏడుగురికి కలిపి మొత్తం 130 సంవత్సరాలు లేబర్ క్యాంపుల్లో
ఉండేలా శిక్ష వేశారు. మమ్మల్ని మార్డ్‌వినియాలోని లేబర్ క్యాంపులకు పంపించారు, అక్కడ దాదాపు 500 మంది సాక్షులున్నారు. మేమందరం రహస్యంగా చిన్నచిన్న గుంపులుగా కలుసుకుని కావలికోట అధ్యయనం చేసుకునేవాళ్లం. ఓసారి ఒక గార్డు, స్వాధీనం చేసుకున్న మన పత్రికల్ని చదివి ఇలా అన్నాడు, ‘మీరు వీటిని చదువుతుంటే, మీ విశ్వాసాన్ని ఎవ్వరూ నీరుగార్చలేరు.’ మేము రోజంతా ఎంతో కష్టపడి పనిచేసేవాళ్లం, చాలాసార్లు మాకు అప్పగించిన దానికన్నా ఎక్కువ పని చేసేవాళ్లం. అయినా ఆ క్యాంపు అధికారి ఇలా అనేవాడు, ‘మీరు చేస్తున్న పని మాకు ముఖ్యం కాదు. మాకు కావల్సింది మీరు దేశానికి నమ్మకంగా, యథార్థంగా ఉండడం.’”“మేము రోజంతా ఎంతో కష్టపడి పనిచేసేవాళ్లం, చాలాసార్లు మాకు అప్పగించిన దానికన్నా ఎక్కువ పని చేసేవాళ్లం”
ఆయన తన యథార్థతను కోల్పోలేదు
నికొలై 1967లో లేబర్ క్యాంపు నుండి విడుదలైన తర్వాత ఇస్టోనియాలో, అలాగే రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్ లో సంఘాలను సంస్థీకరించడంలో సహాయం చేశాడు. నికొలై నేరం చేశాడనడానికి ఆధారాలు లేకపోవడంతో అంతకుముందు 1957లో కోర్టు ఇచ్చిన తీర్పును 1991లో రద్దుచేశారు. అధికారులవల్ల తీవ్రమైన కష్టాలు అనుభవించిన చాలామంది సాక్షులు ఆ సమయంలో నిర్దోషులుగా విడుదలయ్యారు. 1996లో నికొలై, సెయింట్‌పీటర్స్‌బర్గ్ కు సుమారు 500 కి.మీ. దూరంలో ఉన్న స్కాఫ్ అబ్లాస్ట్ లోని విలీకీయ లూకీ అనే నగరానికి వెళ్లిపోయాడు. అక్కడ ఆయన ఓ చిన్న ఇంటిని కొనుక్కున్నాడు. ఆ స్థలంలో 2003లో ఓ రాజ్యమందిరాన్ని కట్టారు. అందులో ఇప్పుడు రెండు సంఘాలు కూటాలు జరుపుకుంటున్నాయి.
నేను, నా భర్త రష్యా బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాం. చనిపోవడానికి కొన్ని నెలలముందు మా తాతయ్య నికొలై 2011 మార్చిలో మమ్మల్ని చివరిసారి కలిశాడు. ఆయన ఉత్సాహంగా అన్న ఈ మాటలు మమ్మల్ని ఎంతో కదిలించాయి, ‘జరుగుతున్నవన్నీ చూస్తుంటే, యెరికో చుట్టూ తిరగాల్సిన ఏడవ రోజు ప్రారంభమైందని అనిపిస్తుంది.’ (యెహో. 6:15) ఆయనకు అప్పుడు 85 సంవత్సరాలు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయనిలా అన్నాడు, “యౌవనంలోనే యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాని గురించి నేనెప్పుడూ బాధపడలేదు.”