కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మా విశ్వాసము వృద్ధి పొందించు”

“మా విశ్వాసము వృద్ధి పొందించు”

“నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము.” —మార్కు 9:24, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

పాటలు: 54, 24

1. విశ్వాసం కలిగివుండడం ఎందుకు ముఖ్యం? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ‘మహాశ్రమల కాలంలో యెహోవా నన్ను కాపాడతాడా’ అని మీరెప్పుడైనా ఆలోచించారా? రక్షణ పొందాలంటే మనకు విశ్వాసం చాలా అవసరమని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీ. 11:6) అది మనకు బాగా తెలిసిన విషయంలా అనిపించవచ్చు, అయితే “విశ్వాసము అందరికి లేదు” అని బైబిలు చెప్తుంది. (2 థెస్స. 3:2) ఈ రెండు లేఖనాలనుబట్టి, విశ్వాసాన్ని బలపర్చుకోవడం చాలా ముఖ్యమని అర్థమౌతుంది.

2, 3. (ఎ) విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఎందుకు కృషి చేయాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

2 ‘శోధనలచేత పరీక్షించబడిన’ విశ్వాసం గురించి అపొస్తలుడైన పేతురు మాట్లాడాడు. (1 పేతురు 1:7 చదవండి.) మహాశ్రమలు చాలా దగ్గర్లో ఉన్నాయి కాబట్టి మనం ప్రాణాల్ని ‘రక్షించుకోవడానికి తగిన విశ్వాసం గలవాళ్లుగా’ ఉండాలి. (హెబ్రీ. 10:39, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) అందుకే మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలి. రాజైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు బహుమానం పొందేవాళ్లలో మనమూ ఉండాలని కోరుకుంటాం. అందుకే, తన విశ్వాసాన్ని బలపర్చమని యేసును వేడుకున్న వ్యక్తిలాగే మనం కూడా “నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము” అని అడగవచ్చు. (మార్కు 9:24) లేదా అపొస్తలుల్లాగే మనం కూడా ‘మా విశ్వాసం వృద్ధి పొందించు’ అని వేడుకోవచ్చు.—లూకా 17:5.

3 అయితే, మనం విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు? మనకు బలమైన విశ్వాసం ఉందని ఎలా చూపించవచ్చు? విశ్వాసాన్ని బలపర్చమని మనం చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడనే నమ్మకంతో మనమెందుకు ఉండవచ్చు? వీటికి జవాబులను ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

మన విశ్వాసాన్ని బలపర్చుకుంటే యెహోవా సంతోషిస్తాడు

4. మన విశ్వాసాన్ని బలపర్చే ఎలాంటి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి?

4 విశ్వాసం చాలా ముఖ్యమైనది కాబట్టే బలమైన విశ్వాసం చూపించినవాళ్ల గురించి యెహోవా బైబిల్లో రాయించాడు. ‘అవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి.’ (రోమా. 15:4) ఉదాహరణకు అబ్రాహాము, శారా, ఇస్సాకు, యాకోబు, మోషే, రాహాబు, గిద్యోను, బారాకు, మరితరుల గురించి బైబిల్లో చదివినప్పుడు వాళ్లలాగే మనం కూడా బలమైన విశ్వాసం చూపించాలని కోరుకుంటాం. (హెబ్రీ. 11:32-35) వాళ్లలా చెక్కుచెదరని విశ్వాసం చూపించిన సహోదరసహోదరీలు మనకాలంలో కూడా ఎంతోమంది ఉన్నారు.

5. యెహోవాపై తనకు బలమైన విశ్వాసం ఉందని ఏలీయా ఎలా చూపించాడు? మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

5 ఏలీయా ప్రవక్త కూడా యెహోవాపై బలమైన విశ్వాసం చూపించాడు. ఉదాహరణకు ఈ ఐదు సందర్భాలను గమనించండి, (1) యెహోవా కరువు రప్పించబోతున్నాడని అహాబు రాజుతో చెప్తూ ఏలీయా ఎంతో నమ్మకంతో ఇలా అన్నాడు, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరాల్లో మంచుగానీ వర్షంగానీ పడదు.’ (1 రాజు. 17:1) (2) ఆ కరువు కాలంలో తన అవసరాలను, ఇతరుల అవసరాలను యెహోవా తీరుస్తాడని ఏలీయా నమ్మాడు. (1 రాజు. 17:4, 5, 13, 14) (3) ఓ విధవరాలి కొడుకును యెహోవా మళ్లీ బ్రతికించగలడనే నమ్మకాన్ని ఏలీయా చూపించాడు. (1 రాజు. 17:21) (4) కర్మెలు పర్వతం దగ్గర తాను ఏర్పాటు చేసిన బలిని దహించడానికి యెహోవా తప్పకుండా అగ్నిని పంపిస్తాడని ఏలీయా నమ్మాడు. (1 రాజు. 18:24, 37) (5) వర్షం ఇంకా పడకముందే ఏలీయా ఎంతో నమ్మకంగా అహాబుతో ఇలా చెప్పాడు, “విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుము.” (1 రాజు. 18:41) వీటిని పరిశీలించాక మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నాకు కూడా ఏలీయాకు ఉన్నంత బలమైన విశ్వాసం ఉందా?’

మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

6. విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

6 మన సొంత శక్తితో విశ్వాసాన్ని వృద్ధి చేసుకోలేం. విశ్వాసం ఆత్మఫలంలో భాగం కాబట్టి పరిశుద్ధాత్మను ఇవ్వమని యెహోవాను అడగాలి. (గల. 5:22-24) పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించమని యేసు మనకు చెప్పాడు. యెహోవా ‘తనను అడిగేవాళ్లకు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడనే’ భరోసాను కూడా యేసు ఇచ్చాడు.—లూకా 11:13.

7. మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలంటే ఏమి చేయాలో ఓ ఉదాహరణతో చెప్పండి.

7 మనం యెహోవాపై బలమైన విశ్వాసం పెంచుకున్నాక, దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణ చూద్దాం. బాగా మండుతున్న అగ్నిలో కట్టెలు వేస్తూ ఉండకపోతే అది కాసేపటికి ఆరిపోతుంది. అది అలానే మండుతూ ఉండాలంటే దానిలో కట్టెలు వేస్తూ ఉండాలి. మన విశ్వాసం విషయంలో కూడా అంతే. మనం క్రమంగా బైబిల్ని చదువుతూ దాన్ని అధ్యయనం చేస్తూ ఉంటేనే బైబిలుపట్ల, యెహోవాపట్ల మనకున్న ప్రేమ చల్లారకుండా ఉంటుంది. అప్పుడే మన విశ్వాసాన్ని బలపర్చుకుని, దాన్ని కాపాడుకోగలుగుతాం.

8. విశ్వాసాన్ని బలపర్చుకుని, దాన్ని కాపాడుకుంటూ ఉండాలంటే ఏమి చేయాలి?

8 మీ విశ్వాసాన్ని బలపర్చుకుని, దాన్ని కాపాడుకోవాలంటే ఇంకా ఏమి చేయవచ్చు? మీరు బాప్తిస్మం తీసుకోకముందు నేర్చుకున్న విషయాలతోనే సరిపెట్టుకోకూడదు. (హెబ్రీ. 6:1, 2) ఇప్పటికే నెరవేరిన ప్రవచనాల గురించి మరింత నేర్చుకుంటూ ఉండాలి. అలాగే మీ విశ్వాసం బలంగా ఉందో లేదో దేవుని వాక్యం సహాయంతో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి.—యాకోబు 1:25; 2:24, 26 చదవండి.

9, 10. (ఎ) మంచి స్నేహితుల వల్ల (బి) మీటింగ్స్‌ వల్ల (సి) ప్రకటనా పనివల్ల మన విశ్వాసం ఎలా బలపడుతుంది?

9 క్రైస్తవులు ఒకరి విశ్వాసం చేత ఒకరు “ప్రోత్సాహం పొందాలని” అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (రోమా. 1:11-12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) తోటి సహోదరసహోదరీలతో కలిసి సమయం గడిపినప్పుడు మనం ఒకరి విశ్వాసాన్ని ఒకరం బలపర్చుకుంటాం. ముఖ్యంగా, పరీక్షల్ని తట్టుకుని తమ విశ్వాసాన్ని నిరూపించుకున్న వాళ్లతో మనం సమయం గడపాలి. (యాకో. 1:2, 3) చెడ్డ స్నేహితులు మన విశ్వాసాన్ని పాడుచేస్తారు, కానీ మంచి స్నేహితులవల్ల మన విశ్వాసం బలపడుతుంది. (1 కొరిం. 15:33) అందుకే మీటింగ్స్‌కి క్రమంగా వెళ్లమని బైబిలు మనకు చెప్తుంది. అక్కడ మనం ఒకర్నొకరం ‘పురికొల్పుకుంటాం.’ (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) అంతేకాక, మీటింగ్స్‌లో మనం వినే విషయాలు కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. ‘వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది’ అని బైబిలు చెప్తుంది. (రోమా. 10:17) కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘నేను మీటింగ్స్‌కి క్రమంగా వెళ్తూ సహోదరసహోదరీలతో సమయం గడుపుతున్నానా?’

10 ఇతరులకు సువార్త ప్రకటించడం ద్వారా, బోధించడం ద్వారా కూడా మన విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. సువార్త ప్రకటించేటప్పుడు మనం కూడా తొలి క్రైస్తవుల్లా యెహోవాపై నమ్మకం ఉంచడం నేర్చుకుంటాం. అంతేకాక ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా మాట్లాడడం నేర్చుకుంటాం.—అపొ. 4:17-20; 13:46.

11. యెహోషువ, కాలేబుల విశ్వాసం ఎలా బలపడింది? మనం వాళ్లను ఎలా అనుకరించవచ్చు?

11 యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడో, మన ప్రార్థనలకు ఏవిధంగా జవాబిస్తున్నాడో అర్థం చేసుకున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. యెహోషువ, కాలేబుల విషయంలో అదే జరిగింది. వాళ్లు యెహోవామీద విశ్వాసంతో వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి వెళ్లారు. అయితే కాలం గడుస్తుండగా, యెహోవా తమకెలా సహాయం చేస్తున్నాడో చూసిన ప్రతీసారి వాళ్ల విశ్వాసం మరింత బలపడుతూ వచ్చింది. అందుకే యెహోషువ ఇశ్రాయేలీయులతో ఎంతో నమ్మకంగా ఇలా చెప్పగలిగాడు, “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” ఆ తర్వాత ఆయనింకా ఇలా అన్నాడు, ‘మీరు యెహోవాయందు భయభక్తులు కలవారై, ఆయన్ను నిష్కపటంగా, సత్యంగా సేవించండి . . . మీరు ఎవర్ని సేవించాలని కోరుకున్నా నేనూ నా ఇంటివాళ్లు యెహోవాను సేవిస్తాం.’ (యెహో. 23:14; 24:14, 15) యెహోవా మంచితనాన్ని రుచి చూసేకొద్దీ మనం కూడా అలాంటి నమ్మకాన్నే పెంచుకుంటాం.—కీర్త. 34:8.

మన విశ్వాసాన్ని ఎలా చూపించవచ్చు?

12. మనకు బలమైన విశ్వాసం ఉందని ఎలా చూపించవచ్చు?

12 మనకు బలమైన విశ్వాసం ఉందని ఎలా చూపించవచ్చు? ‘నేను నా క్రియలచేత నా విశ్వాసం కనబరుస్తాను’ అని శిష్యుడైన యాకోబు చెప్పాడు. (యాకో. 2:18) అవును, మన విశ్వాసం ఎంత బలంగా ఉందో మన పనులు చూపిస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

సువార్త ప్రకటించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు మనకు బలమైన విశ్వాసం ఉందని చూపిస్తాం (13వ పేరా చూడండి)

13. సువార్త ప్రకటించినప్పుడు మనకు విశ్వాసం ఉందని ఎలా చూపిస్తాం?

13 మన విశ్వాసాన్ని చూపించగల అత్యుత్తమ మార్గం, సువార్త ప్రకటించడం. ఎందుకు? ఎందుకంటే మనం ప్రకటనా పనిలో పాల్గొన్నప్పుడు, యెహోవా ఆలస్యం చేయకుండా సరైన సమయంలోనే అంతం తీసుకొస్తాడని నమ్ముతున్నట్లు చూపిస్తాం. (హబ. 2:3) మనమిలా ప్రశ్నించుకోవచ్చు, నేను ప్రకటనా పనిని ముఖ్యమైనదిగా చూస్తున్నానా? యెహోవా గురించి ఇతరులకు చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నానా? యెహోవా సేవను మరింత ఎక్కువగా చేసే అవకాశాల కోసం చూస్తున్నానా? (2 కొరిం. 13:5) మనం ‘రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవడం’ ద్వారా అంటే సువార్త ప్రకటించడం ద్వారా మన విశ్వాసం ఎంత బలంగా ఉందో చూపిద్దాం.—రోమీయులు 10:10 చదవండి.

14, 15. (ఎ) జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సహించేటప్పుడు మనం విశ్వాసం ఎలా చూపించవచ్చు? (బి) తమకు బలమైన విశ్వాసం ఉందని ఓ కుటుంబం ఎలా చూపించింది?

14 జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల్ని సహించేటప్పుడు కూడా మనం యెహోవాపై విశ్వాసం చూపిస్తాం. పేదరికం, అనారోగ్యం, నిరుత్సాహం, కృంగుదల లేదా మరేదైనా సమస్యవల్ల బాధపడుతున్నప్పుడు యెహోవా, యేసు మనకు సరైన సమయంలో సహాయం చేస్తారనే విశ్వాసాన్ని చూపించాలి. (హెబ్రీ. 4:16) ఆధ్యాత్మిక అవసరాలతోపాటు మిగతా అవసరాల గురించి కూడా యెహోవాకు ప్రార్థించినప్పుడు మనం ఆయనపై విశ్వాసం చూపిస్తాం. “మాకు కావలసిన అనుదినాహారము” ఇవ్వమని ప్రార్థించవచ్చని యేసు చెప్పాడు. (లూకా 11:3) మనకు అవసరమైన వాటిని యెహోవా ఇవ్వగలడని బైబిలు వృత్తాంతాలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రాచీన ఇశ్రాయేలులో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, యెహోవా ఏలీయాకు ఆహారాన్ని, నీటిని ఇచ్చి పోషించాడు. “అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను” అని బైబిలు చెప్తుంది. (1 రాజు. 17:3-6) యెహోవా మన అవసరాల్ని కూడా తీరుస్తాడనే విశ్వాసం మనకు ఉంది.

రోజూవారీ జీవితంలో ఉండే ఒత్తిళ్లను తట్టుకునేటప్పుడు మనం యెహోవాపై విశ్వాసం చూపిస్తాం (14వ పేరా చూడండి)

15 కుటుంబాన్ని పోషించే విషయంలో బైబిలు సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. ఆసియాలోని రెబెకా అనే ఓ వివాహిత సహోదరి, మత్తయి 6:33, సామెతలు 10:4⁠లో ఉన్న సూత్రాలను తన కుటుంబం ఎలా పాటించిందో వివరిస్తుంది. వాళ్లాయన ఓ ఉద్యోగం చేసేవాడు, అయితే దానివల్ల తన కుటుంబం యెహోవాకు దూరం అవుతోందని ఆయన గ్రహించి ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. వాళ్లకు నలుగురు పిల్లలు ఉండడంతో కుటుంబ పోషణ కోసం తినుబండారాలను తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లు అలా కష్టపడి పనిచేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకున్నారు. రెబెకా ఇలా చెప్తుంది, “యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదని మాకనిపించింది. మేము ఒక్కపూట కూడా పస్తులు లేము.” మీ విశ్వాసాన్ని బలపర్చిన ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఏమైనా ఉన్నాయా?

16. యెహోవాపై విశ్వాసం ఉంచితే మనం ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

16 దేవుని నిర్దేశాలు పాటిస్తే ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హబక్కూకు మాటల్ని ఎత్తిచెప్తూ పౌలు ఇలా అన్నాడు, “నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.” (గల. 3:11; హబ. 2:4) కాబట్టి నిజంగా సహాయం చేసే యెహోవాపై మనకు బలమైన విశ్వాసం ఉండాలి. ఆయన ‘మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తిగలవాడు’ అని పౌలు చెప్పాడు. (ఎఫె. 3:20, 21) యెహోవా సేవకులమైన మనం ఆయన చిత్తం చేయడానికి చేయగలిగినదంతా చేస్తాం. అయితే మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి, యెహోవా మనకు అండగా ఉంటూ మన ప్రయత్నాలన్నిటినీ దీవిస్తున్నందుకు ఆయనకు మనమెంతో కృతజ్ఞులం.

విశ్వాసాన్ని బలపర్చమని చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడు

17. (ఎ) విశ్వాసాన్ని బలపర్చమని అపొస్తలులు చేసిన విన్నపానికి ఎలా జవాబు వచ్చింది? (బి) విశ్వాసాన్ని బలపర్చమని మనం చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడని ఎందుకు నమ్మవచ్చు?

17 మనం ఇప్పటివరకు చర్చించిన విషయాల గురించి ఆలోచిస్తే, అపొస్తలుల్లాగే మనం కూడా “మా విశ్వాసము వృద్ధిపొందించు” అని ప్రార్థించాలని కోరుకుంటాం. (లూకా 17:5) అపొస్తలులు చేసిన ఆ విన్నపానికి సా.శ. 33 పెంతెకొస్తు రోజున ఓ ప్రత్యేకమైన విధానంలో జవాబు వచ్చింది. వాళ్లు ఆ రోజున పరిశుద్ధాత్మ పొంది, దేవుని సంకల్పం గురించి లోతుగా అర్థం చేసుకోగలిగారు. దాంతో వాళ్ల విశ్వాసం మరింత బలపడింది. అప్పుడు వాళ్లు అత్యంత గొప్ప సువార్త ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. (కొలొ. 1:23) మరి, విశ్వాసాన్ని బలపర్చమని మనం చేసే ప్రార్థనలకు కూడా యెహోవా జవాబిస్తాడా? ‘ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా’ యెహోవా ఇస్తాడని బైబిలు చెప్తుంది.—1 యోహా. 5:14.

18. విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి కృషి చేసేవాళ్లను యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడు?

18 యెహోవా మీద మనం పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. విశ్వాసం బలపర్చమని మనం చేసే ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబిస్తాడు. అప్పుడు మన విశ్వాసం మరింత బలపడుతుంది, మనం దేవుని రాజ్యానికి అర్హులమౌతాం.—2 థెస్స. 1:3, 5.