కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను సేవించేలా టీనేజీలో ఉన్న మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

యెహోవాను సేవించేలా టీనేజీలో ఉన్న మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

“యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.”లూకా 2:52.

పాటలు: 41, 11

1, 2. (ఎ) టీనేజీ పిల్లలున్న కొంతమంది తల్లిదండ్రులు దేని గురించి చింతిస్తారు? (బి) టీనేజీలో ఉన్న పిల్లలకు ఎలాంటి సామర్థ్యాలు ఉంటాయి?

 తమ పిల్లలు బాప్తిస్మం తీసుకోవడంకన్నా తల్లిదండ్రులకు ఎక్కువ సంతోషాన్నిచ్చే సందర్భం మరొకటి ఉండదు. బరనీస్‌ అనే ఓ సహోదరి నలుగురు పిల్లలూ 14 ఏళ్లలోపే బాప్తిస్మం తీసుకున్నారు. ఆమె ఇలా చెప్తుంది, ‘ఆ క్షణంలో మేము ఆనందం పట్టలేకపోయాం. మా పిల్లలు యెహోవా సేవచేయాలని నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ టీనేజీలో ఉన్న మా పిల్లలకు చాలా సవాళ్లు ఎదురౌతాయని మాకు తెలుసు.’ మీకు కూడా, టీనేజీలో ఉన్న లేదా టీనేజీకి ఎదుగుతున్న పిల్లలుంటే, వాళ్ల గురించి మీరూ అలాగే ఆలోచిస్తుండవచ్చు.

2 టీనేజీలో ఉన్న పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయని ఓ పిల్లల మనస్తత్వ నిపుణుడు చెప్తున్నాడు. అయితే టీనేజీలో ఉన్న తమ పిల్లలు మరీ అతిగా లేదా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు అనుకోకూడదు. టీనేజీ పిల్లలకు ఏదో కొత్తగా చేయాలనే తపన, లోతైన భావోద్వేగాలు, స్నేహితులతో సమయం గడపాలనే కోరిక ఉంటాయని కూడా ఆ నిపుణుడు చెప్తున్నాడు. కాబట్టి యేసులాగే మీ పిల్లలు కూడా యౌవనంలో ఉన్నప్పుడే యెహోవాతో స్నేహాన్ని పెంచుకోగలరు. (లూకా 2:52 చదవండి.) అంతేకాదు, పరిచర్యలో తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోగలరు, అలాగే యెహోవా సేవను మరింతగా చేయాలనే కోరికను పెంచుకోగలరు. యెహోవాకు సమర్పించుకోవాలని, ఆయనకు లోబడాలని తమంతట తామే నిర్ణయించుకోగలరు. అయితే యెహోవాను సేవించేలా మీ టీనేజీ పిల్లలకు మీరెలా శిక్షణ ఇవ్వవచ్చు? ప్రేమ, వినయం, వివేచన చూపించి యేసు తన శిష్యులకు శిక్షణ ఇచ్చిన విధానం నుండి మీరు ఎంతో నేర్చుకోవచ్చు.

మీ పిల్లలమీద ప్రేమ చూపించండి

3. యేసు తన శిష్యుల్ని స్నేహితులుగా చూశాడని ఎలా చెప్పవచ్చు?

3 యేసు తన శిష్యులకు యజమానిలా మాత్రమే కాదు ఓ మంచి స్నేహితునిగా కూడా ఉండేవాడు. (యోహాను 15:15 చదవండి.) బైబిలు కాలాల్లో, యజమానులు తమ ఆలోచనల గురించి, భావాల గురించి దాసులకు చెప్పేవాళ్లు కాదు. కానీ యేసు తన శిష్యుల్ని దాసులుగా చూడలేదు. ఆయన వాళ్లను ప్రేమించాడు, వాళ్లతో సమయం గడిపాడు. యేసు తన ఆలోచనల గురించి, భావాల గురించి వాళ్లకు చెప్పేవాడు, అలాగే వాళ్లు తమ మనసులోని విషయాల్ని చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడు. (మార్కు 6:30-32) ఇలా యేసు, ఆయన శిష్యులు మనసువిప్పి మాట్లాడుకోవడంవల్ల మంచి స్నేహితులయ్యారు. అంతేకాదు, అది ముందుముందు చేయబోయే పని కోసం శిష్యుల్ని సిద్ధం చేసింది.

4. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా స్నేహితులుగా ఉండవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 మీ పిల్లలమీద మీకు అధికారం ఉన్నప్పటికీ మీరు వాళ్లకు మంచి స్నేహితులుగా ఉండవచ్చు. మంచి స్నేహితులు కలిసి సమయం గడుపుతారు. కాబట్టి మీరు ఉద్యోగం కోసం లేదా ఇతర విషయాల కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వీలౌతుందేమో జాగ్రత్తగా ఆలోచించండి. ఆ విషయం గురించి ప్రార్థించండి. సాధారణంగా స్నేహితుల ఇష్టాయిష్టాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకు ఎలాంటి పాటలు, సినిమాలు, ఆటలు ఇష్టమో తెలుసుకుని వాళ్లతో కలిసి మీరు కూడా వాటిని ఆనందించండి. ఇటలీలో ఉంటున్న ఈలారీయా అనే సహోదరి ఇలా చెప్తుంది, ‘నాకు ఇష్టమైన పాటల్ని మా అమ్మానాన్నలు కూడా వినేవాళ్లు. నిజానికి మా నాన్నే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌, నేను ఆయనతో అన్ని విషయాల్ని, చివరికి వ్యక్తిగత విషయాల్ని కూడా చెప్పేదాన్ని.’ మీ పిల్లలు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయాలంటే మీరు వాళ్లకు మంచి స్నేహితులుగా ఉండాలి. అయితే అలా ఉన్నంతమాత్రాన తల్లిదండ్రులుగా మీ అధికారమేమీ తగ్గిపోదు. (కీర్త. 25:14) బదులుగా మీరు తమను ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మీ పిల్లలు అర్థం చేసుకుంటారు. అంతేకాదు, మీతో ఏ విషయాన్నైనా మనసువిప్పి చెప్పుకోగలుగుతారు.

5. శిష్యులు సంతోషంగా ఉండాలంటే వాళ్లేమి చేయాలని యేసుకు తెలుసు?

5 తన శిష్యులు నిజంగా సంతోషంగా ఉండాలంటే వాళ్లు ఉత్సాహంగా యెహోవా సేవచేస్తూ, ప్రకటనా పనిలో బిజీగా ఉండాలని యేసుకు తెలుసు. అందుకే పరిచర్యలో కష్టపడి పనిచేయమని వాళ్లను ప్రోత్సహించాడు. అంతేకాదు, ఆ పనిలో వాళ్లకు సహాయం చేస్తానని కూడా మాటిచ్చాడు.—మత్త. 28:19, 20.

6, 7. పిల్లలు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో క్రమంగా పాల్గొనడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతారు?

6 మీ పిల్లలకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉండాలని మీరు కోరుకుంటారు. అందుకోసం మీరు వాళ్లకు నిర్దేశం, క్రమశిక్షణ ఇవ్వాలి. (ఎఫె. 6:4) అది యెహోవా మీకిచ్చిన బాధ్యత కాబట్టి మీ పిల్లలకు క్రమంగా శిక్షణనిస్తూ ఉండండి. ఈ విషయం గురించి ఆలోచించండి: మీ పిల్లలు చదువుకోవడం ముఖ్యమని మీకు తెలుసు కాబట్టి మీరు వాళ్లను స్కూల్‌కు పంపిస్తారు. అంతేకాదు, అక్కడ వాళ్లు కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఇష్టం పెంచుకోవాలని మీరు కోరుకుంటారు. అదేవిధంగా మీ పిల్లలకు మీటింగ్స్‌, సమావేశాలు, కుటుంబ ఆరాధన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ యెహోవా నేర్పించే విషయాలు వాళ్ల ప్రాణాల్ని కాపాడతాయి. కాబట్టి మీ పిల్లలు యెహోవా దేవుని గురించి సంతోషంగా నేర్చుకునేలా, ఆయన నిజమైన జ్ఞానాన్ని ఇవ్వగలడని అర్థం చేసుకునేలా సహాయం చేయండి. (సామె. 24:14) వాళ్లు క్రమంగా పరిచర్యకు వెళ్లేలా శిక్షణ ఇవ్వండి. దేవుని వాక్యాన్ని బోధించడంలో ఎంత సంతోషం ఉందో తన శిష్యులు తెలుసుకునేలా యేసు సహాయం చేశాడు. మీరు కూడా మీ పిల్లలకు అలాగే సహాయం చేయండి.

7 మీ పిల్లలు బైబిలు స్టడీ, మీటింగ్స్‌, పరిచర్య వంటివాటిలో క్రమంగా పాల్గొనడం ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతారు? దక్షిణ ఆఫ్రికాలో ఉంటున్న ఎరిన్‌ అనే సహోదరి ఇలా చెప్తుంది, ‘చిన్నప్పుడు మాకు బైబిలు స్టడీ, మీటింగ్స్‌, పరిచర్య అంటే అస్సలు ఇష్టముండేది కాదు. కొన్నిసార్లయితే కుటుంబ ఆరాధన జరిగేటప్పుడు ఏదో రకంగా ఆటంకం కలిగించి దానినుండి తప్పించుకోవాలని చూసేవాళ్లం. కానీ మా అమ్మానాన్నలు అస్సలు ఒప్పుకునేవాళ్లు కాదు.’ అలా అవి ఎంత ప్రాముఖ్యమో గుర్తించేలా తల్లిదండ్రులు తనకు సహాయం చేసినందుకు ఆమె ఎంతో కృతజ్ఞతతో ఉంది. ఒకవేళ ఎప్పుడైనా మీటింగ్‌కి లేదా పరిచర్యకి వెళ్లలేకపోతే మళ్లీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆమె ఆత్రంగా ఎదురుచూస్తుంటుంది.

వినయం చూపించండి

8. (ఎ) యేసు ఎలా వినయం చూపించాడు? (బి) దానినుండి శిష్యులు ఏమి నేర్చుకున్నారు?

8 యేసు పరిపూర్ణుడే అయినా తనకు యెహోవా సహాయం అవసరమని వినయంగా గుర్తించాడు. (యోహాను 5:19 చదవండి.) దానివల్ల శిష్యులకు యేసుమీద గౌరవం తగ్గిందా? ఏమాత్రం తగ్గలేదు. యేసు యెహోవాపై ఆధారపడడం చూసేకొద్దీ వాళ్లకు యేసుపై నమ్మకం మరింతగా పెరిగింది. ఆ తర్వాత వాళ్లు కూడా యేసులాగే వినయంగా యెహోవాపై ఆధారపడ్డారు.—అపొ. 3:12, 13, 16.

9. మీరు మీ పొరపాట్లను ఒప్పుకుంటే మీ పిల్లలు కూడా ఏమి చేయడం నేర్చుకుంటారు?

9 యేసులా మనం పరిపూర్ణులం కాదు, ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి వినయంగా మన పరిమితులను గుర్తించి, చేసిన పొరపాట్లను ఒప్పుకోవాలి. (1 యోహా. 1:8) అలాచేస్తే మీ పిల్లలు కూడా తమ తప్పుల్ని ఒప్పుకోవడం నేర్చుకుంటారు, వాళ్లకు మీమీద గౌరవం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఎవర్ని ఎక్కువ గౌరవిస్తారు? ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ చెప్పే యజమానినా లేక తన తప్పును అస్సలు ఒప్పుకోని యజమానినా? ముగ్గురు టీనేజీ పిల్లలున్న రోజ్‌మెరీ అనే సహోదరి ఇలా చెప్తుంది, ‘నేనూ నా భర్త మా తప్పుల్ని ఒప్పుకోవడం చూసి, మా పిల్లలు కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు మాతో చెప్పేవాళ్లు.’ ఆమె ఇంకా ఇలా చెప్పింది, ‘వాళ్లకు ఎదురయ్యే సమస్యలకు చక్కని పరిష్కారాలు ఎక్కడ కనుగొనవచ్చో నేర్పించాం. వాళ్లకు ఏ విషయంలోనైనా సహాయం అవసరమైతే, దానికి సంబంధించిన సమాచారం మన ప్రచురణల్లో ఎక్కడ ఉందో చెప్పేవాళ్లం. వాళ్లతో కలిసి ప్రార్థించేవాళ్లం.’

10. ఫలానా పని చేయమని శిష్యులకు చెప్పేటప్పుడు యేసు ఎలా వినయం చూపించాడు?

10 ఫలానా పని చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించే అధికారం యేసుకు ఉంది. అయినప్పటికీ ఆయన వినయంగా, ఆ పని ఎందుకు చేయాలో కూడా వాళ్లకు చెప్పేవాడు. ఉదాహరణకు, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకమని తన శిష్యులకు చెప్పడంతో పాటు, దాని కారణాన్ని కూడా వివరించాడు. ఆయనిలా అన్నాడు, “అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” అలాగే, తీర్పు తీర్చకండి అని చెప్పడంతోపాటు అలా ఎందుకు చేయకూడదో వివరిస్తూ ఆయనిలా అన్నాడు, “అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును.”—మత్త. 6:31–7:2.

11. మీరు ఫలానా నియమం ఎందుకు పెట్టారో మీ పిల్లలకు వివరించడం ఎందుకు మంచిది?

11 మీరు ఫలానా నియమం ఎందుకు పెట్టారో, ఫలానా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వీలైనప్పుడల్లా మీ పిల్లలకు వివరించండి. ఆ నియమాన్ని ఎందుకు పెట్టారో మీ పిల్లలు అర్థం చేసుకుంటే, దాన్ని సులభంగా పాటిస్తారు. నలుగురు పిల్లలున్న బారీ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ‘ఫలానా నియమం ఎందుకు పెడుతున్నారో మీ పిల్లలకు వివరించినప్పుడు వాళ్లకు మీమీద నమ్మకం పెరుగుతుంది.’ అధికారం ఉందని కాదుగానీ మీరు సరైన కారణంతోనే ఫలానా నియమం పెట్టారని లేదా నిర్ణయం తీసుకున్నారని మీ టీనేజీ పిల్లలు తెలుసుకుంటారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లౌతున్నారని, వాళ్లు సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారని గుర్తుంచుకోండి. బారీ ఇంకా ఇలా చెప్తున్నాడు, ‘ఆవేశంతో కాకుండా ఆలోచించి ఎలా నిర్ణయాలు తీసుకోవాలో టీనేజర్లు నేర్చుకోవాలి.’ (కీర్త. 119:34) కాబట్టి మీరు ఫలానా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వినయంగా మీ పిల్లలకు వివరించడంవల్ల వాళ్లు సొంతగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నేర్చుకుంటారు. అంతేకాదు మీరు వాళ్లను గౌరవిస్తున్నారని, వాళ్లు పెద్దవాళ్లౌతున్నారనే విషయం గుర్తిస్తున్నారని మీ పిల్లలు అర్థం చేసుకుంటారు.

వివేచన చూపిస్తూ మీ పిల్లల్ని అర్థం చేసుకోండి

12. యేసు వివేచనతో పేతురుకు ఎలా సహాయం చేశాడు?

12 యేసు వివేచన చూపిస్తూ తన శిష్యులకు ఏ విషయంలో సహాయం అవసరమో అర్థం చేసుకున్నాడు. ఉదాహరణకు, తాను చంపబడతానని యేసు శిష్యులతో చెప్పినప్పుడు, పేతురు “అది నీకు దూరమగుగాక” అని అన్నాడు. పేతురుకు తనమీద ప్రేమ ఉందిగానీ అతని ఆలోచనా విధానం సరిగా లేదని యేసు గుర్తించాడు. మరి యేసు పేతురుకు, ఇతర శిష్యులకు ఎలా సహాయం చేశాడు? మొదట ఆయన పేతురును సరిదిద్దాడు. తర్వాత, కష్టాలు వచ్చాయని దేవుని చిత్తం చేయకుండా ఉండేవాళ్లకు ఏమి జరుగుతుందో ఆయన వివరించాడు. అంతేకాక, నిస్వార్థంగా యెహోవా చిత్తం చేసేవాళ్లు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారో కూడా చెప్పాడు. (మత్త. 16:21-27) దాంతో పేతురు తన అభిప్రాయాన్ని సరిచేసుకున్నాడు.—1 పేతు. 2:20, 21.

13, 14. (ఎ) మీ పిల్లల విశ్వాసం బలహీనపడుతుంటే మీరెలా గుర్తించవచ్చు? (బి) మీ పిల్లలకు నిజంగా ఎలాంటి సహాయం అవసరమో మీరెలా తెలుసుకోవచ్చు?

13 టీనేజీలో ఉన్న మీ పిల్లలకు ఏయే విషయాల్లో సహాయం అవసరమో గుర్తించేందుకు వివేచన ఇవ్వమని యెహోవాను వేడుకోండి. (కీర్త. 32:8) బహుశా మీ పిల్లలు యెహోవా సేవలో ఒకప్పుడున్నంత సంతోషంగా ఉండకపోవచ్చు, లేదా సహోదరసహోదరీల్ని విమర్శిస్తూ మాట్లాడుతుండవచ్చు. లేదంటే వాళ్లు మీ దగ్గర ఏదో దాస్తుండవచ్చు. అంతమాత్రాన, మీ పిల్లలు రహస్యంగా ఏదో పెద్ద తప్పు చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చేయకండి. a అలాగని వాళ్ల సమస్యను చూసీచూడనట్లు వదిలేయకండి, లేదా అన్నీ అవే సర్దుకుంటాయిలే అని అనుకోకండి. బహుశా తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీ పిల్లలకు మీ సహాయం అవసరం కావచ్చు.

సంఘంలో మంచి స్నేహితుల్ని సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి (14వ పేరా చూడండి)

14 మీ పిల్లలకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవాలంటే వాళ్లను దయగా, గౌరవపూర్వకంగా ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడగడం బావిలో నుండి నీళ్లు తోడడంలాంటిది. మీరు హడావిడిగా తోడితే కొన్ని నీళ్లు కిందపడిపోతాయి. అదేవిధంగా మీరు ఏమాత్రం సహనం లేకుండా ప్రశ్నలు అడుగుతూ, జవాబు చెప్పమని మీ పిల్లల్ని బలవంతం చేస్తే, వాళ్లు తమ ఆలోచనల్ని, భావాల్ని మీకు చెప్పరు. (సామెతలు 20:5 చదవండి.) ముందు పేరాల్లో చూసిన ఈలారీయా టీనేజీలో ఉన్నప్పుడు, తప్పని తెలిసినా తన తోటివిద్యార్థులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకునేది. ఆమెలో జరుగుతున్న ఈ సంఘర్షణను వాళ్ల అమ్మానాన్నలు గుర్తించారు. ఈలారీయా ఇలా చెప్తుంది, ‘ఓ రోజు సాయంత్రం మా అమ్మానాన్నలు నా దగ్గరికి వచ్చి, నేను ఎందుకు దిగులుగా ఉన్నానో చెప్పమని అడిగారు. అప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు, వాళ్లకు నా పరిస్థితి అంతా చెప్పి సహాయం చేయమని అడిగాను. వాళ్లు నన్ను దగ్గరికి తీసుకుని, నా సమస్యను అర్థం చేసుకున్నామనీ నాకు తప్పకుండా సహాయం చేస్తామనీ చెప్పారు.’ వాళ్లు వెంటనే, తమ కూతురు సంఘంలో మంచి స్నేహితుల్ని సంపాదించుకునేలా సహాయం చేశారు.

15. యేసు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎలా వివేచన చూపించాడు?

15 యేసు తన శిష్యుల్లో ఉన్న మంచి లక్షణాల్ని గుర్తించడం ద్వారా కూడా వివేచన చూపించాడు. ఉదాహరణకు, యేసు నజరేతు నుండి వచ్చాడని తెలుసుకున్న నతనయేలు “నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా” అని అడిగాడు. (యోహా. 1:46) ఒకవేళ మీరే అక్కడ ఉండివుంటే నతనయేలు గురించి ఏమనుకునేవాళ్లు? ఆయన అతిగా విమర్శిస్తున్నాడనో, వివక్ష చూపిస్తున్నాడనో లేదా ఆయనకు విశ్వాసం లేదనో అనుకునేవాళ్లా? కానీ యేసు మాత్రం అలా అనుకోలేదు. బదులుగా ఆయన వివేచన చూపిస్తూ నతనయేలులో ఉన్న మంచినే చూశాడు. అందుకే యేసు ఇలా అన్నాడు, ‘ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదు.’ (యోహా. 1:47) హృదయాల్ని చదవగల సామర్థ్యాన్ని ఉపయోగించి యేసు ప్రజల్లోని మంచి లక్షణాల్ని చూశాడు.

16. మంచి లక్షణాల్ని వృద్ధి చేసుకునేలా మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు?

16 యేసులా హృదయాల్ని చదవలేకపోయినా మీరు కూడా వివేచన చూపించగలరు. మీ టీనేజీ పిల్లల్లో ఉన్న మంచి లక్షణాల్ని గుర్తించేలా మీకు యెహోవా సహాయం చేస్తాడు. మీ పిల్లలు ఒకవేళ మీకు నచ్చనిది చేసినా, వాళ్లు చెడ్డవాళ్లు లేదా మొండివాళ్లు అనే ముద్ర వేయకండి. అలాంటి ఆలోచన కూడా మీకు రానివ్వకండి. బదులుగా వాళ్లలో మంచి లక్షణాలు ఉన్నాయనీ, వాళ్లు సరైనది చేస్తారనే నమ్మకం మీకుందనీ వాళ్లకు చెప్పండి. వాళ్లు మారడానికి చేస్తున్న ప్రయత్నాల్ని గమనించి వాళ్లను మెచ్చుకోండి. వీలైనప్పుడల్లా మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ, వాళ్లకున్న మంచి లక్షణాల్ని మెరుగుపర్చుకునేందుకు సహాయం చేయండి. యేసు కూడా అదే చేశాడు. నతనయేలును (బర్తొలొమయి) కలిసిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత యేసు ఆయనకు ఓ ప్రాముఖ్యమైన బాధ్యతను అప్పగించాడు. ఆయన్ను అపొస్తలునిగా నియమించాడు, నతనయేలు కూడా తనకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేశాడు. (లూకా 6:13, 14; అపొ. 1:13, 14) కాబట్టి, తాము ఏదీ సరిగ్గా చేయలేమనే భావన మీ పిల్లల్లో రాకుండా ఉండాలంటే మీరు వాళ్లను మెచ్చుకోవాలి, ప్రోత్సహించాలి. అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని, యెహోవాను సంతోషపెట్టగలమనీ తమ సామర్థ్యాలను యెహోవా సేవలో ఉపయోగించగలమనీ నమ్ముతారు.

మీ పిల్లలకు శిక్షణ ఇచ్చినప్పుడు మీరు చాలా సంతోషం పొందుతారు

17, 18. మీ పిల్లలకు శిక్షణనివ్వడానికి మీరు ఎందుకు కృషి చేస్తూ ఉండాలి?

17 అపొస్తలుడైన పౌలు, తాను ఎవరికైతే యెహోవా గురించి నేర్పించాడో వాళ్లను పిల్లలుగా భావించాడు. ఆయన వాళ్లను ఎంతో ప్రేమించాడు కాబట్టి వాళ్లలో ఎవరైనా యెహోవాకు దూరమైపోతారేమోనని చాలా బాధపడ్డాడు. కొన్నిసార్లు మీరు కూడా పౌలులాగే భావించవచ్చు. (2 కొరిం. 2:4; 1 కొరిం. 4:15, 16) ముగ్గురు పిల్లలున్న విక్టర్‌ ఇలా చెప్తున్నాడు, “టీనేజీలో ఉన్న పిల్లల్ని పెంచడం కష్టమే. అయితే మా పిల్లల్ని పెంచేటప్పుడు ఎదురైన సవాళ్ల కన్నా మాకు సంతోషాన్నిచ్చిన సందర్భాలే ఎక్కువున్నాయి. యెహోవా సహాయంవల్ల మేము మా పిల్లలకు మంచి స్నేహితులమయ్యాం.”

18 తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వడానికి కృషి చేస్తూ ఉండండి. ఎట్టిపరిస్థితుల్లో మీ ప్రయత్నాల్ని ఆపకండి. వాళ్లు యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ సేవలో నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు మీకెంతో సంతోషం కలుగుతుంది.—3 యోహా. 4.

a కావలికోట జూలై 1, 2012 సంచికలోని 22-25 పేజీల్లో ఉన్న సమాచారాన్ని తల్లిదండ్రులు పరిశీలించవచ్చు.