కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ప్రేమాస్వరూపి

యెహోవా ప్రేమాస్వరూపి

“దేవుడు ప్రేమాస్వరూపి.”1 యోహా. 4:8, 16.

పాటలు: 18, 51

1. యెహోవాకున్న ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆయన గురించి మీకేమనిపిస్తుంది?

 “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెప్తుంది. (1 యోహా. 4:8) ఆ మాటల అర్థమేమిటి? యెహోవాకు ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నప్పటికీ వాటన్నిటిలో ముఖ్యమైన లక్షణం ప్రేమే. ఆయన ప్రేమకు ప్రతిరూపం. ఆయన చేసే ప్రతీ పనిలో ప్రేమ కనిపిస్తుంది. ప్రేమతో ఈ విశ్వాన్నీ, సమస్త ప్రాణుల్నీ సృష్టించినందుకు ఆయనకు మనమెంతో కృతజ్ఞులం.

2. దేవునికి ప్రేమ ఉంది కాబట్టి మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 తన సృష్టిప్రాణుల మీద యెహోవాకు ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి కాబట్టి, మన విషయంలో ఆయన సంకల్పం శ్రేష్ఠమైన విధంగా నెరవేరుతుందని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. అప్పుడు, ఆయనకు లోబడేవాళ్లందరూ నిజమైన సంతోషం పొందుతారు. ప్రేమతో యెహోవా, ‘తాను నియమించిన మనుష్యుని [యేసుక్రీస్తు] చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పుతీర్చడానికి ఒక దినం నిర్ణయించాడు.’ (అపొ. 17:31) ఆ తీర్పుదినం ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అప్పుడు ఆయనకు లోబడేవాళ్లందరూ అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు.

చరిత్ర ఏమి రుజువుచేసింది?

3. ఒకవేళ యెహోవాకు మనమీద ప్రేమ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?

3 ఒకవేళ యెహోవాకు మనమీద ప్రేమ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనుషులు, ఏమాత్రం ప్రేమలేని ఈ లోకాధికారియైన సాతాను చెప్పుచేతల్లో ఉంటూ, ఒకర్నొకరు పరిపాలించుకుంటూ ఉంటారు. (2 కొరిం. 4:4; 1 యోహా. 5:19; ప్రకటన 12:9, 12 చదవండి.) అవును, యెహోవా మనల్ని ప్రేమించకపోయుంటే మన భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుంది.

4. యెహోవా సాతానుకు ఎందుకు కొంత సమయం ఇచ్చాడు?

4 సాతాను దేవుని పరిపాలనకు ఎదురుతిరగడమే కాకుండా, మన మొదటి తల్లిదండ్రులు కూడా ఎదురుతిరిగేలా చేశాడు. అతను దేవుని పరిపాలనా హక్కును ప్రశ్నించాడు, దేవునికన్నా తాను బాగా పరిపాలించగలనని వాదించాడు. (ఆది. 3:1-5) దాన్ని నిరూపించుకోవడానికి యెహోవా సాతానుకు కొంత సమయం ఇచ్చాడు. అయితే కష్టాలతో నిండిన మానవ చరిత్రను చూస్తే సాతానుగానీ, మనుషులుగానీ మంచి పరిపాలకులుగా ఉండలేరని స్పష్టమౌతోంది.

5. చరిత్రంతటిని చూస్తే ఏ విషయం అర్థమౌతుంది?

5 నేడు లోకంలోని పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. గడిచిన 100 ఏళ్లలో పది కోట్లకన్నా ఎక్కువమంది యుద్ధాల్లో చనిపోయారు. అంత్యదినాల్లో ‘దుర్జనులు, వంచకులు అంతకంతకు చెడిపోతారు’ అని బైబిలు ముందే చెప్పింది. (2 తిమో. 3:1, 13) అంతేకాదు, బైబిలు ఇంకా ఇలా చెప్పింది, “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీ. 10:23) చరిత్రంతటిని చూస్తే, ఈ మాటలు అక్షరాలా నిజమని అర్థమౌతుంది. దేవుని సహాయం లేకుండా మనుషులు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యంతో లేదా హక్కుతో యెహోవా వాళ్లను సృష్టించలేదు.

6. యెహోవా చెడుతనాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు?

6 యెహోవా కొంతకాలంపాటు చెడుతనాన్ని అనుమతించడం వల్ల, ఆయన మాత్రమే మంచి పరిపాలకుడనే విషయం స్పష్టంగా రుజువైంది. యెహోవా భవిష్యత్తులో చెడుతనాన్ని పూర్తిగా తీసేస్తాడు. ఆ తర్వాత, ఇంకెవరైనా తన ప్రేమపూర్వక పరిపాలనను ప్రశ్నిస్తే, యెహోవా వాళ్లకు ఇంకో అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో మానవ చరిత్ర అప్పటికే నిరూపించింది కాబట్టి చెడుతనం వ్యాప్తి కాకుండా యెహోవా వాళ్లను వెంటనే నాశనం చేస్తాడు.

యెహోవా ఎలా ప్రేమ చూపించాడు?

7, 8. యెహోవా తన గొప్ప ప్రేమను ఏయే విధాల్లో చూపించాడు?

7 యెహోవా తనకున్న గొప్ప ప్రేమను ఎన్నో విధాల్లో చూపించాడు. మన విశ్వం ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మన విశ్వంలో వందలకోట్ల నక్షత్రవీధులు ఉన్నాయి. ఒక్కో నక్షత్రవీధిలో కొన్నికోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. మనం ఉంటున్న పాలపుంత నక్షత్రవీధిలో ఉన్న నక్షత్రాల్లో సూర్యుడు ఒకటి. సూర్యుడే లేకపోతే ఈ భూమిపై ఏ ప్రాణీ బ్రతకదు. ఈ సృష్టంతటినీ చూస్తే సృష్టికర్త ఉన్నాడనీ, ఆయనకు శక్తి, జ్ఞానం, ప్రేమ వంటి లక్షణాలు ఉన్నాయనీ తెలుస్తుంది. అవును, దేవుని “అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.”—రోమా. 1:20.

8 ఈ భూమ్మీద తన సృష్టిప్రాణులు జీవించడానికి కావాల్సినవన్నీ యెహోవా సృష్టించాడు. మనుషులు ఉండడానికి ఆయన ఒక అందమైన తోటను తయారుచేశాడు, వాళ్లు నిత్యం జీవించేలా పరిపూర్ణమైన మనసుల్ని, శరీరాల్ని ఇచ్చాడు. (ప్రకటన 4:10, 11 చదవండి.) అంతేకాదు, ‘సమస్త జీవులకు ఆయన ఆహారమిస్తున్నాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది.’—కీర్త. 136:25.

9. యెహోవా దేన్ని ద్వేషిస్తాడు? ఎందుకు?

9 యెహోవా ప్రేమాస్వరూపి అయినా ఆయన చెడుతనాన్ని ద్వేషిస్తాడు. యెహోవా గురించి కీర్తన 5:4-6 ఇలా చెప్తుంది, ‘నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడవు కావు, పాపం చేసేవాళ్లందరు నీకు అసహ్యులు.’ అంతేకాదు హత్యలు, మోసాలు చేసేవాళ్లను ఆయన అసహ్యించుకుంటాడు.

చెడుతనం ఇక ఉండదు

10, 11. (ఎ) చెడ్డవాళ్లకు ఏమౌతుంది? (బి) తన మాట వినేవాళ్లకు యెహోవా ఏ బహుమానం ఇస్తాడు?

10 యెహోవా ప్రేమాస్వరూపి, చెడుతనాన్ని అసహ్యించుకుంటాడు కాబట్టి ఆయన సరైన సమయంలో చెడుతనాన్ని పూర్తిగా తీసేస్తాడు. బైబిలు ఇలా మాటిస్తుంది, “కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు.” దేవుని శత్రువులు “పొగవలె కనబడక పోవుదురు.”—కీర్త. 37:9, 10, 20.

11 “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని కూడా బైబిలు చెప్తుంది. (కీర్త. 37:29) అంతేకాదు వాళ్లు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్త. 37:11) ప్రేమగల దేవుడైన యెహోవా తన నమ్మకమైన సేవకులకు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైనవే ఇస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది, “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రక. 21:4) దేవుని మాట వింటూ ఆయన ప్రేమకు కృతజ్ఞత చూపించేవాళ్లకు ఎంత అద్భుతమైన భవిష్యత్తు వేచివుందో కదా!

12. ‘నిర్దోషులు’ అంటే ఎవరు?

12 దేవుని వాక్యం ఇలా చెప్తుంది, “నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.” (కీర్త. 37:37, 38) ‘నిర్దోషులు’ అంటే దేవున్ని, ఆయన కుమారున్ని తెలుసుకుని, దేవుని చిత్తం చేసేవాళ్లు. (యోహాను 17:3 చదవండి.) “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని వాళ్లు ఖచ్చితంగా నమ్ముతారు. (1 యోహా. 2:17) అంతం చాలా దగ్గర్లో ఉంది కాబట్టి మనం ‘యెహోవా కోసం కనిపెట్టుకొని ఉంటూ ఆయన మార్గాన్ని అనుసరించడం’ చాలా ముఖ్యం.—కీర్త. 37:34.

దేవుని గొప్ప ప్రేమకు రుజువు

13. యెహోవా ప్రేమకు అత్యంత గొప్ప రుజువు ఏమిటి?

13 మనం అపరిపూర్ణులమైనా యెహోవాకు లోబడవచ్చు. యేసు అర్పించిన బలి ఆధారంగా ఆయనతో దగ్గరి సంబంధాన్ని కూడా కలిగివుండవచ్చు. మనల్ని పాపమరణాల నుండి విడిపించడం కోసమే యెహోవా ఆ ఏర్పాటును చేశాడు. యెహోవాకు మనమీద ప్రేమ ఉందనడానికి ఇదే అత్యంత గొప్ప రుజువు. (రోమీయులు 5:12; 6:23 చదవండి.) తన కుమారుడు పరలోకంలో ఎంతోకాలంగా తనకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి భూమ్మీద కూడా నమ్మకంగా ఉంటాడని యెహోవాకు తెలుసు. యెహోవా ప్రేమగల తండ్రి కాబట్టి ప్రజలు తన కుమారుణ్ణి హింసించినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయితే యేసు నమ్మకంగా దేవుని పరిపాలనా హక్కును సమర్థిస్తూ, పరిపూర్ణులైన మనుషులు తీవ్రమైన కష్టాల్లో కూడా యెహోవాకు నమ్మకంగా ఉండగలరని నిరూపించాడు.

యెహోవా ఎంతో ప్రేమతో తన కుమారుణ్ణి ఈ భూమ్మీదికి పంపించాడు (13వ పేరా చూడండి)

14, 15. యేసు తన ప్రాణాన్ని అర్పించడం వల్ల ఏమి సాధ్యమైంది?

14 తీవ్రమైన కష్టాలు వచ్చినా యేసు మరణంవరకు తన తండ్రికి నమ్మకంగా ఉంటూ, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించాడు. యేసు తన ప్రాణాన్ని అర్పించి, మనం కొత్తలోకంలో నిత్యం జీవించే మార్గాన్ని తెరిచినందుకు మనమెంతో కృతజ్ఞులం. యెహోవా, యేసు మనమీద చూపించిన ప్రేమ గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వర్ణించాడు, “మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమా. 5:6-8) “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది” అని అపొస్తలుడైన యోహాను కూడా రాశాడు.—1 యోహా. 4:9, 10.

15 యేసు ఇలా అన్నాడు, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహా. 3:16) యెహోవాకు ఎంతో వేదన కలిగినా మనకోసం తన కుమారుణ్ణి బలి అర్పించాడు. మనుషులమీద యెహోవాకు ఎంత ప్రేమ ఉందో దీనిబట్టి తెలుస్తుంది. ఆయన మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. పౌలు ఇలా రాశాడు, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.”—రోమా. 8:38, 39.

దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది

16. దేవునికి మనమీదున్న ప్రేమకు మరో రుజువు ఏమిటి? యెహోవా ఎవర్ని రాజుగా నియమించాడు?

16 దేవునికి మనమీద ఉన్న ప్రేమకు మరో రుజువు, మెస్సీయ రాజ్యం. ఏవిధంగా? మనుషులమీద ఎంతో ప్రేమ, వాళ్లను పరిపాలించే అర్హత ఉన్న యేసుక్రీస్తును యెహోవా ఇప్పటికే రాజుగా నియమించాడు. (సామె. 8:31) క్రీస్తుతోపాటు పరిపాలించడానికి ఆయన 1,44,000 మంది మనుషుల్ని ఎంపికచేశాడు. వాళ్లు పునరుత్థానమై పరలోకానికి వెళ్లినప్పుడు, మనుషులుగా తమకున్న అనుభవాన్ని ఉపయోగించి చక్కగా పరిపాలిస్తారు. (ప్రక. 14:1) యేసు భూమ్మీదున్నప్పుడు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే బోధించాడు. అంతేకాదు ఇలా ప్రార్థించమని శిష్యులకు నేర్పించాడు, “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్త. 6:9, 10) ఆ ప్రార్థనకు జవాబుగా యెహోవా తన రాజ్యం ద్వారా మనుషులకు ఆశీర్వాదాలు తీసుకొచ్చే రోజు కోసం మనం ఎదురుచూస్తున్నాం.

17. యేసు పరిపాలనకు మనుషుల పరిపాలనకు తేడా ఏమిటి?

17 యేసు ప్రేమతో చేసే పరిపాలనకు, మనుషుల పరిపాలనకు చాలా తేడా ఉంది. మనుషుల పాలనవల్ల జరిగిన యుద్ధాలు కోట్లమందిని పొట్టనబెట్టుకున్నాయి. కానీ మన రాజైన యేసుకు మనమీద నిజమైన శ్రద్ధ ఉంది. ఆయన యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల్ని, ముఖ్యంగా ప్రేమను చూపిస్తాడు. (ప్రక. 7:10, 16, 17) యేసు ఇలా మాటిచ్చాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్త. 11:28-30) ఆ మాటల్లో ఎంత ప్రేమ కనిపిస్తుందో కదా!

18. (ఎ) 1914 నుండి ఏ పని జరుగుతోంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి తెలుసుకుంటాం?

18 దేవుని రాజ్యం 1914 నుండి పరిపాలిస్తోందని బైబిలు ప్రవచనాలు చూపిస్తున్నాయి. అప్పటినుండి, భూమ్మీద మిగిలివున్న అభిషిక్తుల్ని సమకూర్చే పని, అలాగే అంతాన్ని తప్పించుకుని కొత్తలోకంలోకి ప్రవేశించే ‘గొప్ప సమూహాన్ని’ సమకూర్చే పని జరుగుతోంది. (ప్రక. 7:9, 13,14) ఇప్పుడు ఈ గొప్ప సమూహం ఎంత పెద్దగా ఉంది? వాళ్లనుండి యెహోవా ఏమి కోరుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు జవాబుల్ని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.