కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మిమ్మల్ని కాపాడతాడు

యెహోవా మిమ్మల్ని కాపాడతాడు

“రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును.”కీర్త. 41:3.

పాటలు: 23, 138

1, 2. గతంలో యెహోవా ఏమి చేశాడు? నేడు కూడా కొంతమంది ఏమి అనుకోవచ్చు?

 మీరెప్పుడైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, “నాకు బాగవుతుందా” అని అనుకున్నారా? లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో లేదా మీ స్నేహితుల్లో ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు, వాళ్లకు నయమవుతుందో లేదోనని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అలాగే మీకిష్టమైనవాళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకోవడం సహజమే. తమ ఆరోగ్యం బాగవుతుందో లేదోనని తెలుసుకోవాలనుకున్న కొంతమంది గురించి మనం బైబిల్లో చదువుతాం. ఉదాహరణకు, అహాబు యెజెబెలుల కొడుకైన అహజ్యా రాజు, తనకు తగిలిన గాయం తగ్గుతుందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత, సిరియా రాజైన బెన్హదదు కూడా తన జబ్బు నయమవుతుందో లేదోనని విచారించాడు.—2 రాజు. 1:2; 8:7, 8.

2 గతంలో యెహోవా కొంతమందిని అద్భుతరీతిలో స్వస్థపరిచాడని, మరికొంతమందిని ప్రవక్తల ద్వారా పునరుత్థానం చేశాడని బైబిలు చెప్తుంది. (1 రాజు. 17:17-24; 2 రాజు. 4:17-20, 32-35) అదేవిధంగా నేడు కూడా దేవుడు తమను అద్భుతరీతిలో స్వస్థపరుస్తాడని అనారోగ్యంతో ఉన్న కొంతమంది అనుకోవచ్చు.

3-5. యెహోవాకు, యేసుకు ఏ శక్తి ఉంది? మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

3 ఇతరుల ఆరోగ్యంపై ప్రభావం చూపే శక్తి యెహోవాకు ఉంది. ఉదాహరణకు అబ్రాహాము కాలంలో ఫరోను, ఆ తర్వాత మోషే అక్క మిర్యామును యెహోవా వ్యాధితో మొత్తాడు. (ఆది. 12:17; సంఖ్యా. 12:9, 10; 2 సమూ. 24:15) అంతేకాదు ఇశ్రాయేలీయులు తనకు అవిధేయత చూపించినప్పుడు వాళ్లను ‘రోగాలతో, తెగుళ్లతో’ శిక్షించాడు. (ద్వితీ. 28:58-61) అయితే కొన్ని సందర్భాల్లో, యెహోవా తన ప్రజల్ని రోగాల బారినుండి కాపాడాడు. (నిర్గ. 23:25; ద్వితీ. 7:15) కొందర్ని స్వస్థపర్చాడు కూడా. ఉదాహరణకు, తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంవల్ల చనిపోవాలనుకున్న యోబును యెహోవా బాగుచేశాడు.—యోబు 2:7; 3:11-13; 42:10, 16.

4 అనారోగ్యంతో ఉన్నవాళ్లను బాగుచేసే శక్తి యెహోవాకు ఉందని మనకు ఖచ్చితంగా తెలుసు. యేసుకు కూడా ఆ శక్తి ఉంది. ఆయన భూమ్మీదున్నప్పుడు, కుష్ఠురోగం లేదా మూర్ఛరోగం వంటివాటితో బాధపడుతున్న వాళ్లను బాగుచేశాడు. గుడ్డివాళ్లను, పక్షవాతం వచ్చినవాళ్లను కూడా ఆయన స్వస్థపర్చాడు. (మత్తయి 4:23, 24 చదవండి; యోహా. 9:1-7) యేసు చేసిన ఆ అద్భుతాలన్నీ, కొత్తలోకంలో ఆయన చేయబోయే వాటికోసం ఎదురుచూడడానికి మనకు సహాయం చేస్తాయి. అప్పుడు, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెష. 33:24.

5 అయితే మనం తీవ్రమైన అనారోగ్యం పాలైనప్పుడు యెహోవా లేదా యేసు అద్భుతరీతిలో మనల్ని స్వస్థపర్చాలని కోరుకోవచ్చా? ఏదైనా చికిత్సను ఎంచుకునే ముందు మనం దేనిగురించి ఆలోచించాలి?

అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యెహోవాపై ఆధారపడండి

6. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చేసిన అద్భుతాల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

6 మొదటి శతాబ్దంలో యెహోవా కొంతమంది క్రైస్తవుల్ని తన పరిశుద్ధాత్మతో అభిషేకించి అద్భుతాల్ని చేసే శక్తిని ఇచ్చాడు. (అపొ. 3:2-7; 9:36-42) దానివల్ల వాళ్లు రోగాల్ని నయం చేయగలిగారు అలాగే వేర్వేరు భాషల్లో మాట్లాడగలిగారు. (1 కొరిం. 12:4-11) అయితే బైబిలు ముందే చెప్పినట్లు అవి కొంతకాలానికి ఆగిపోయాయి. (1 కొరిం. 13:8) కాబట్టి నేడు మనల్ని లేదా మనకు ఇష్టమైనవాళ్లను దేవుడు అద్భుతరీతిలో బాగుచేయాలని ఆశించలేం.

7. కీర్తన 41:3వ వచనం నుండి మనమెలాంటి ప్రోత్సాహం పొందవచ్చు?

7 కానీ ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే, యెహోవా గతంలో తన సేవకుల్ని బలపర్చినట్లే మిమ్మల్ని కూడా ఓదార్చి బలపరుస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండండి. “బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును” అని రాజైన దావీదు రాశాడు. (కీర్త. 41:1, 2) అంటే తన కాలంలో బీదలకు సహాయం చేసే మంచివాళ్లు ఎప్పటికీ చనిపోకుండా ఉంటారని దావీదు ఉద్దేశం కాదు. మరి అలాంటి మంచివాళ్లకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు? దావీదు ఇలా వివరించాడు, “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.” (కీర్త. 41:3) తన సేవకులు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో యెహోవాకు పూర్తిగా తెలుసు, ఆయన వాళ్లను మర్చిపోడు. వాళ్లకు కావాల్సిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఆయన ఇవ్వగలడు. అంతేకాదు దానంతటదే బాగుపడేవిధంగా యెహోవా మనిషి శరీరాన్ని తయారుచేశాడు.

8. కీర్తన 41:4 ప్రకారం, దావీదు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యెహోవాకు ఏమని ప్రార్థించాడు?

8 దావీదు తీవ్ర అనారోగ్యంతో బలహీనపడి, ఆందోళనపడిన సందర్భం గురించి 41వ కీర్తనలో రాశాడు. బహుశా ఆ సమయంలోనే, తన స్థానంలో తన కొడుకైన అబ్షాలోము రాజవ్వడానికి ప్రయత్నిస్తుండవచ్చు. ఆయన తన కొడుకు ప్రయత్నాలను ఆపలేనంత బలహీనంగా ఉన్నాడు. బత్షెబతో చేసిన వ్యభిచారం వల్లే తన కుటుంబంలో సమస్యలు వచ్చాయని దావీదుకు తెలుసు. (2 సమూ. 12:7-14) మరి ఆయనేమి చేశాడు? ఆయనిలా ప్రార్థించాడు, “యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము.” (కీర్త. 41:4) తన పాపాల్ని యెహోవా క్షమించాడని దావీదుకు తెలుసు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన సహాయం కోసం యెహోవామీద ఆధారపడ్డాడు. కానీ దేవుడు తనను అద్భుతరీతిలో బాగుచేయాలని దావీదు కోరుకున్నాడా?

9. (ఎ) యెహోవా రాజైన హిజ్కియాకు ఏమి చేశాడు? (బి) యెహోవా ఏమి చేయాలని దావీదు కోరుకున్నాడు?

9 యెహోవా కొంతమందిని అద్భుత రీతిలో బాగు చేశాడన్నది వాస్తవమే. ఉదాహరణకు, రాజైన హిజ్కియా చావుబతుకుల్లో ఉన్నప్పుడు యెహోవా ఆయనను స్వస్థపర్చాడు. ఆ తర్వాత ఆయన మరో 15 ఏళ్లు బ్రతికాడు. (2 రాజు. 20:1-6) కానీ దావీదు మాత్రం, దేవుడు తనను అద్భుతరీతిలో బాగుచేయాలని కోరుకోలేదు. బదులుగా బీదలను ఆదరించేవాళ్లకు సహాయం చేసినట్లే తనకుకూడా సహాయం చేయమని దావీదు యెహోవాను కోరుకున్నాడు. దావీదుకు యెహోవాతో మంచి సంబంధం ఉంది కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తనకు ఓదార్పునివ్వమనీ, తనపట్ల శ్రద్ధ చూపించమనీ యెహోవాను అడగగలిగాడు. అంతేకాదు, తన జబ్బు తగ్గడానికి సహాయం చేయమని యెహోవాను కోరాడు. మనం కూడా యెహోవాను అలానే అడగవచ్చు.—కీర్త. 103:3.

10. త్రోఫిము, ఎపఫ్రొదితులకు ఏమి జరిగింది? దాని నుండి మనమేమి అర్థంచేసుకోవచ్చు?

10 అపొస్తలుడైన పౌలుకు అలాగే మరికొంతమందికి స్వస్థత చేసే శక్తి ఉన్నప్పటికీ, వాళ్లు ఆ శక్తిని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులందర్నీ బాగుచేయడానికి ఉపయోగించలేదు. (అపొస్తలుల కార్యములు 14:7-10 చదవండి.) ‘జ్వరముచేత, రక్తభేదిచేత బాధపడుతున్న’ పొప్లి వాళ్ల నాన్న దగ్గరకు పౌలు వెళ్లి ‘ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరిచాడు.’ (అపొ. 28:8) అలాగని తనకు తెలిసినవాళ్లందర్నీ పౌలు బాగుచేయలేదు. ఉదాహరణకు, ఓసారి పౌలు తన స్నేహితుల్లో ఒకడైన త్రోఫిమును తీసుకొని మిషనరీ యాత్రకు వెళ్లాడు. (అపొ. 20:3-5, 22; 21:29) ఆ సమయంలో త్రోఫిము అనారోగ్యం పాలైనప్పుడు పౌలు అతన్ని స్వస్థపర్చలేదు. దాంతో త్రోఫీము తన ఆరోగ్యం కుదుటపడే వరకు మిలేతులో ఆగిపోవాల్సి వచ్చింది. (2 తిమో. 4:20) పౌలుకు మరో స్నేహితుడైన ఎపఫ్రొదితుకు అనారోగ్యం వల్ల దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ పౌలు ఆయన్ను స్వస్థపర్చినట్లు బైబిలు చెప్పట్లేదు.—ఫిలి. 2:25-27, 29-30.

మీరు ఎలాంటి సలహాల్ని పాటించాలి?

11, 12. లూకా ఎవరు? ఆయన పౌలుకు ఏవిధంగా సహాయం చేసివుంటాడు?

11 లూకా ఓ వైద్యుడు, ఆయన పౌలుతో కలిసి మిషనరీ యాత్రలకు కూడా వెళ్లాడు. (అపొ. 16:10-12; 20:5, 6; కొలొ. 4:14) యాత్రల మధ్యలో పౌలుకు లేదా మరితరులకు ఆరోగ్యం బాలేనప్పుడు బహుశా ఆయనే వాళ్లకు చికిత్స చేసివుంటాడు. (గల. 4:13) ఎందుకంటే యేసు చెప్పినట్లు “రోగులకు” వైద్యుడు అవసరం.—లూకా 5:31.

12 లూకా, ఆరోగ్యం గురించి ఇతరులకు సలహాలు ఇచ్చే మామూలు వ్యక్తి కాదుగానీ ఆయన ఓ వైద్యుడు. అయితే ఆయన ఎప్పుడు, ఎక్కడ వైద్యునిగా శిక్షణ పొందాడో బైబిలు చెప్పడంలేదు. కానీ పౌలు కొలొస్సయులకు రాసిన పత్రికలో, లూకా వాళ్లకు శుభాకాంక్షలు తెలిపినట్లు రాశాడు. కాబట్టి ఆయన బహుశా కొలొస్సయి పట్టణానికి దగ్గర్లో ఉన్న లవొదికయలోని ఓ వైద్య కళాశాలలో శిక్షణ పొందివుంటాడు. అంతేకాదు, ఆయన లూకా సువార్తలో అలాగే అపొస్తలుల కార్యముల పుస్తకంలో వైద్యానికి సంబంధించిన కొన్ని పదాల్ని వాడాడు. ఆయన వైద్యుడు కాబట్టే యేసు ఇతరుల్ని స్వస్థపర్చిన సందర్భాల గురించి ఎక్కువగా రాశాడు.

13. ఆరోగ్యం విషయంలో ఏదైనా సలహాను ఇచ్చేముందు లేదా తీసుకునేముందు మనం ఏమి గుర్తుంచుకోవాలి?

13 నేడు, మన కాలంలోని సహోదరులెవ్వరూ అద్భుతాలు చేసి మనల్ని స్వస్థపర్చలేరు. కానీ మనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, మనం అడగకపోయినా ఆరోగ్యం విషయంలో వాళ్లు మనకు సలహాలు ఇవ్వవచ్చు. వాటిలో కొన్నింటివల్ల మనకు ఏ హానీ జరగకపోవచ్చు. ఉదాహరణకు, తిమోతి కలుషిత నీళ్లు తాగి కడుపు జబ్బుతో బాధపడుతున్నప్పుడు, కొంచెం ద్రాక్షారసం తాగమని పౌలు అతనికి సలహా ఇచ్చాడు. a (1 తిమోతి 5:23 చదవండి.) అయితే మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓ సహోదరుడు, మనల్ని ఫలానా మందు లేదా మూలికలు వాడమని, ఫలానా ఆహార పదార్థాలను తినమని లేదా తినవద్దని బలవంతపెట్టవచ్చు. అంతేకాదు మనలాంటి సమస్యతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ మందు బాగా పనిచేసిందని కూడా చెప్పవచ్చు. కానీ అది మనకు కూడా పని చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఒక్కటి మాత్రం నిజం, ఫలానా మందును లేదా చికిత్సను చాలామంది ఉపయోగిస్తున్నప్పటికీ దానివల్ల ఎన్నో చెడు ఫలితాలు రావచ్చు.—సామెతలు 27:12 చదవండి.

వివేచన ఉపయోగించండి

14, 15. (ఎ) మనం ఎలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? (బి) సామెతలు 14:15 నుండి మనమేమి నేర్చుకుంటాం?

14 మనం జీవితాన్ని ఆనందంగా గడపడానికి, యెహోవా సేవలో కష్టపడి పనిచేయడానికి మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాం. కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి అనారోగ్యానికి గురౌతూ ఉంటాం. అయితే మనం ఎప్పుడైనా రోగాలబారినపడితే, దాన్ని నయం చేసే ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉండవచ్చు, వాటిలో ఒకదాన్ని ఎంచుకునే హక్కు మనకు ఉంది. విచారకరంగా, డబ్బు కోసం కొంతమంది ప్రజలు అలాగే కొన్ని కంపెనీలవాళ్లు మన జబ్బును నయంచేసే చికిత్స తాము కనుగొన్నామని చెప్తారు. ఆ చికిత్స వల్ల చాలామందికి నయమైందని చెప్పి మనల్ని నమ్మించడానికి కూడా ప్రయత్నించవచ్చు. మనం అనారోగ్యంతో ఉన్నాం కాబట్టి మనకు బాగవ్వడానికి సహాయం చేస్తుందనిపించే దేన్నైనా వాడడానికి సిద్ధంగా ఉంటాం. కానీ బైబిలు ఇస్తున్న ఈ సలహాను మాత్రం మనం అస్సలు మర్చిపోకూడదు, “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామె. 14:15.

15 మనకు వివేచన ఉంటే, ఇతరులు చెప్పే ప్రతీదాన్ని నమ్మకుండా జాగ్రత్తపడతాం. ముఖ్యంగా సరైన వైద్య శిక్షణ లేనివాళ్లు మనకేదైనా సలహా ఇచ్చినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘ఈ మూలికల్ని, ఆహారపదార్థాల్ని లేదా విటమిన్లు వాడడంవల్ల కొంతమందికి నయమైందని ఈ వ్యక్తి చెప్తున్నాడు. కానీ అది నిజమని నమ్మడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ వాటివల్ల ఎవ్వరికైనా నయమైనా, నాకు అది పనిచేస్తుందా? నేను దీనిగురించి బాగా పరిశోధన చేసి, మంచి డాక్టరును కలిసి మాట్లాడాలా?’—ద్వితీ. 17:5, 6.

16. ఆరోగ్యం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునేముందు మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

16 ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలో లేదా ఏ చికిత్సను తీసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు మనం ‘స్వస్థబుద్ధిని’ లేదా మంచి వివేచనను ఉపయోగించాలి. (తీతు 2:12, 13) ముఖ్యంగా వైద్య పరీక్షలు లేదా చికిత్స చేసే పద్ధతి చాలా వింతగా అనిపిస్తే మనం వివేచనను ఉపయోగించాలి. మనకు వైద్య పరీక్షలు లేదా చికిత్స చేసే వ్యక్తి అవి ఎలా పనిచేస్తాయో మనకు వివరించగలడా? ఆయనిచ్చే వివరణ ఏమైనా తేడాగా ఉందా? వీటివల్ల జబ్బు నయమవుతుందని చాలామంది డాక్టర్లు ఒప్పుకుంటున్నారా? (సామె. 22:29) ఒకవేళ ఎవరైనా, ఓ మారుమూల ప్రాంతంలో ఒక కొత్త చికిత్సను కనిపెట్టారని దానిగురించి ఇంకా డాక్టర్లకు కూడా తెలియదని మనకు చెప్పవచ్చు. అయితే అది నమ్మడానికి మనకు ఏమైనా రుజువులు ఉన్నాయా? ఏదో రహస్య ఔషధంతో లేదా శక్తితో చేసే చికిత్సల గురించి కూడా కొంతమంది మనకు చెప్పవచ్చు. అలాంటివి చాలా ప్రమాదకరమైనవి. మానవాతీత శక్తులకు లేదా మంత్రతంత్రాలకు దూరంగా ఉండమని యెహోవా హెచ్చరిస్తున్నాడని గుర్తుంచుకోండి.—ద్వితీ. 18:10-12; యెష. 1:13.

మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం

17. సహజంగా మనందరం ఏమి కోరుకుంటాం?

17 మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ అప్పుడున్న సంఘాలకు ఓ ముఖ్యమైన ఉత్తరం పంపింది. క్రైస్తవులు దూరంగా ఉండాల్సిన వాటన్నిటి గురించి చెప్పాక, ఆ ఉత్తరాన్ని ఈ మాటలతో ముగించింది, “వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగునుగాక.” (అపొ. 15:28, 29) కొన్ని భాషల్లో ఈ చివరి మాటల్ని “మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము” అని అనువదించారు. ఆ మాటలకు “బలంగా ఉండండి” అనే అర్థం కూడా ఉంది. అవును, “ఆరోగ్యంగా,” బలంగా ఉంటూ మన దేవుడైన యెహోవాను సేవించాలని మనందరం ఖచ్చితంగా కోరుకుంటాం.

మనం యెహోవాను సేవించడానికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం (17వ పేరా చూడండి)

18, 19. మనం దేనికోసం ఎదురుచూస్తున్నాం?

18 మనం అపరిపూర్ణులం కాబట్టి పూర్తి ఆరోగ్యంతో ఉండలేం. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యెహోవా మనల్ని అద్భుతరీతిలో బాగుచేయాలని కోరుకోం. బదులుగా, భవిష్యత్తులో యెహోవా మనల్ని పూర్తిగా స్వస్థపర్చే రోజు కోసం ఎదురుచూస్తాం. అపొస్తలుడైన యోహాను ప్రకటన 22:1, 2 వచనాల్లో ప్రతీ ఒక్కర్ని స్వస్థపర్చే శక్తి ఉన్న “జీవజలముల” గురించి, ‘జీవవృక్షాల’ గురించి చెప్పాడు. అవి, ఇప్పుడుగానీ కొత్తలోకంలోగానీ రోగాల్ని నయం చేసే ఔషధాల్ని సూచించడంలేదు. బదులుగా మనం నిత్యం జీవించడానికి యెహోవా, యేసు చేసేవాటన్నిటినీ అవి సూచిస్తున్నాయి.—యెష. 35:5, 6.

19 ఆ అద్భుతమైన కాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం. అయితే అప్పటివరకు, యెహోవా మనలో ప్రతీఒక్కర్ని ప్రేమిస్తున్నాడనీ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన మన భావాల్ని అర్థంచేసుకుంటున్నాడనీ పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు యెహోవా తనను విడిచిపెట్టడని నమ్మిన దావీదులాగే మనం కూడా భావిస్తాం. తనకు నమ్మకంగా ఉండేవాళ్లపట్ల యెహోవా ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటాడు.—కీర్త. 41:12.

a ద్రాక్షారసం లేదా వైన్‌ వల్ల టైఫాయిడ్‌, మరితర ప్రమాదకరమైన క్రిములు వెంటనే చనిపోతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ద ఆరిజిన్స్‌ అండ్‌ ఏన్షియంట్‌ హిస్టరీ ఆఫ్‌ వైన్‌ అనే పుస్తకం చెప్తుంది.