కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ నాలుకను మంచి కోసం ఉపయోగించండి

మీ నాలుకను మంచి కోసం ఉపయోగించండి

‘యెహోవా, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారమగు గాక.’కీర్త. 19:14.

పాటలు: 21, 35

1, 2. బైబిలు మన నాలుకను అగ్నితో ఎందుకు పోలుస్తుంది?

 అమెరికాలోని విస్కాన్‌సిన్‌ అడవుల్లో 1871వ సంవత్సరంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు అడవి అంతా వ్యాపించాయి. ఆ మంటల్లో దాదాపు 200 కోట్ల చెట్లు కాలిపోయాయి, 1200 కన్నా ఎక్కువమంది సజీవ దహనమయ్యారు. అమెరికాలో జరిగిన ఏ అగ్ని ప్రమాదాల్లో ఇంతమంది చనిపోలేదు. ఆ అడవి గుండా వెళ్తున్న ట్రైన్‌ నుండి వచ్చిన నిప్పురవ్వలే ఆ ప్రమాదానికి కారణమై ఉండవచ్చు. “ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును” అని యాకోబు 3:5లో ఉన్న మాటలు ఎంత నిజమో కదా! ఇంతకీ, యాకోబు ఎందుకు అలా అన్నాడు?

2 ఎందుకంటే, “నాలుక అగ్నియే” అని యాకోబు 6వ వచనంలో వివరించాడు. “నాలుక” అంటే మనకున్న మాట్లాడే సామర్థ్యం. అగ్ని లేదా మంటలాగే మన మాటలు కూడా చాలా నష్టాన్ని కలిగించగలవు. అంతేకాదు, అవి ఎదుటివాళ్ల మీద ఎంతో ప్రభావాన్ని కూడా చూపించగలవు. ‘జీవమరణములు నాలుక వశములో’ ఉన్నాయని బైబిలు కూడా చెప్తుంది. (సామె. 18:21) అంటే మనం ఏమైనా తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అస్సలు మాట్లాడకూడదని దానర్థమా? ఎంతమాత్రం కాదు. కాలుతుందనే భయంతో మంటను వాడకుండా ఉండంగానీ దాన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఉదాహరణకు, మనం వంట చేసుకోవడానికి, చలికాచుకోవడానికి అలాగే వెలుతురు కోసం మంటను ఉపయోగిస్తాం. అదేవిధంగా, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మన నాలుకను అంటే మాట్లాడే సామర్థ్యాన్ని యెహోవాను ఘనపర్చడానికి, ఇతరులకు మంచి చేయడానికి ఉపయోగించగలుగుతాం.—కీర్త. 19:14.

3. ఈ ఆర్టికల్‌లో మనం వేటి గురించి తెలుసుకుంటాం?

3 మన ఆలోచనల్ని, భావాల్ని మాటలతో లేదా సంజ్ఞలతో చెప్పే సామర్థ్యాన్ని యెహోవా మనకిచ్చాడు. ఈ అద్భుతమైన బహుమతిని ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఎలా ఉపయోగించవచ్చు? (యాకోబు 3:9, 10 చదవండి.) అయితే మనం ఎప్పుడు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

ఎప్పుడు మాట్లాడాలి?

4. ఏయే సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి?

4 కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే మంచిది. ‘మౌనముగా ఉండడానికి సమయం కలదు’ అని బైబిలు చెప్తుంది. (ప్రసం. 3:1, 7) ఉదాహరణకు, ఎదుటివాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల మీద గౌరవంతో మనం మౌనంగా ఉంటాం. (యోబు 6:24) అంతేకాదు, ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి లేదా రహస్యంగా ఉంచాల్సిన విషయాల గురించి మనం మాట్లాడం. (సామె. 20:19) మనకు ఎవరైనా కోపం తెప్పించినా సరే ప్రశాంతంగా, మౌనంగా ఉండడం తెలివైన పని.—కీర్త. 4:4.

5. మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చిన యెహోవాకు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

5 అయితే, మనం మాట్లాడాల్సిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. (ప్రసం. 3:7) ఉదాహరణకు మనం యెహోవాను స్తుతించడానికి, ఇతరుల్ని ప్రోత్సహించడానికి, మన భావాల్నీ, అవసరాల్నీ వ్యక్తం చేయడానికి మాట్లాడతాం. (కీర్త. 51:15) మన నాలుకను ఇలాంటి వాటికోసం ఉపయోగిస్తే, మాట్లాడే సామర్థ్యాన్ని బహుమతిగా ఇచ్చినందుకు యెహోవాపట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తాం. ఎంతైనా ఓ స్నేహితుడు మనకు అందమైన బహుమతి ఇస్తే దాన్ని వీలైనంత బాగా ఉపయోగిస్తాం కదా!

6. మనం సరైన సమయాన్ని ఎంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

6 మాట్లాడడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ‘సమయోచితంగా పలికిన మాట చిత్రమైన వెండి పళ్లెంలో ఉంచిన బంగారు పండ్లలాంటిది’ అని సామెతలు 25:11 చెప్తుంది. బంగారు పండ్లు చాలా అందంగా ఉంటాయి, వాటిని వెండి పళ్లెంలో పెట్టినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాయి. అదేవిధంగా, మనం మాట్లాడడానికి సరైన సమయాన్ని ఎంచుకున్నప్పుడు మన మాటల్ని ఎదుటివ్యక్తి బాగా వింటాడు, దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఎలా?

7, 8. జపాన్‌లోని మన సహోదరులు యేసును ఎలా అనుకరించారు?

7 మనం సరైన సమయాన్ని ఎంచుకోకపోతే, ఎదుటివాళ్లకు మనం చెప్పేది అర్థంకాకపోవచ్చు లేదా వాళ్లు మనం చెప్పేది వినకపోవచ్చు. (సామెతలు 15:23 చదవండి.) ఉదాహరణకు 2011, మార్చిలో తూర్పు జపాన్‌లో వచ్చిన భూకంపం, సునామీ వల్ల చాలా పట్టణాలు నాశనమయ్యాయి. 15,000 కన్నా ఎక్కువమంది చనిపోయారు. చాలామంది యెహోవాసాక్షులు తమ కుటుంబాలను, స్నేహితులను కోల్పోయినా వాళ్లు బైబిల్ని ఉపయోగించి తమలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయాలనుకున్నారు. కానీ, అక్కడున్న వాళ్లలో చాలామంది బౌద్ధ మతస్థులు, వాళ్లకు బైబిలు గురించి తెలియదు. కాబట్టి ఆ సమయంలో మన సహోదరులు వాళ్లకు పునరుత్థానం గురించి చెప్పే బదులు మంచివాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయో వివరించి, ఓదార్చారు.

8 ఆ సహోదరులు యేసును అనుకరించారు. యేసుకు ఎప్పుడు మౌనంగా ఉండాలో మాత్రమే కాదు, ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలుసు. (యోహా. 18:33-38; 19:8-11) అంతేకాదు, ఆయన తన శిష్యులకు కొన్ని విషయాలను బోధించేందుకు సరైన సమయం కోసం వేచిచూశాడు. (యోహా. 16:12) జపాన్‌లో ఉన్న సహోదరులు, పునరుత్థానం గురించి తమ దేశ ప్రజలకు చెప్పడానికి ఏది సరైన సమయమో అర్థంచేసుకున్నారు. వాళ్లు సునామీ వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? అనే కరపత్రాన్ని పంచిపెట్టారు. చాలామంది దాన్ని తీసుకుని చదివి ఎంతో ఓదార్పు పొందారు. మనం కూడా మన ప్రాంతంలోని ప్రజల సంస్కృతి, నమ్మకాల గురించి ఆలోచించినప్పుడు వాళ్లతో మాట్లాడడానికి సరైన సమయాన్ని ఎంచుకోగలుగుతాం.

9. ఇంకా ఏయే సందర్భాల్లో మనం సరైన సమయం కోసం వేచిచూడాలి?

9 ఇంకా ఏయే సందర్భాల్లో మనం సరైన సమయం కోసం వేచిచూడాలి? ఒకవేళ మనల్ని ఎవరైనా బాధపెట్టేలా మాట్లాడితే, మనం వెంటనే కోపం తెచ్చుకుని వాళ్లను ఏదో ఒకటి అనే బదులు కాసేపు ఆగి ఆలోచించడం మంచిది. మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘ఆయన అలా కావాలనే అన్నాడా? ఆయన అన్న మాటల గురించి ఆయనతో నిజంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా?’ మనం ఏమి మాట్లాడకుండా ఉండడమే మంచిది కావచ్చు. ఒకవేళ ఆ విషయం గురించి ఆయనతో మాట్లాడడానికి సరైన కారణం ఉందనిపిస్తే మన కోపం చల్లారే వరకు మనం వేచిచూడాలి. (సామెతలు 15:28 చదవండి.) అంతేకాదు, యెహోవా గురించి తెలుసుకోమని సాక్షులుకాని మన బంధువుల్ని ప్రోత్సహించాలని అనుకున్నప్పుడు కూడా మనం ఓపికతో సరైన సమయం కోసం చూడాలి. మనం ఏమి మాట్లాడాలని అనుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచించి, వాళ్లు వినడానికి ఇష్టపడే సమయం కోసం ఎదురుచూడాలి.

ఏమి మాట్లాడాలి?

10. (ఎ) మనం ఎందుకు జాగ్రత్తగా మాట్లాడాలి? (బి) మనం ఎలా మాట్లాడకూడదు?

10 మన మాటలు ఎదుటివాళ్లను సంతోషపెట్టగలవు లేదా బాధపెట్టగలవు. (సామెతలు 12:18 చదవండి.) సాతాను లోకంలో ఉన్న చాలామంది ‘బాణాలు’ లేదా ‘కత్తులు’ లాంటి కఠినమైన మాటలతో ఎదుటివాళ్లను గాయపరుస్తారు, బాధపెడతారు. (కీర్త. 64:3, 4) చాలామంది ఇలాంటి మాటల్ని సినిమాల్లో, టీ.వీ కార్యక్రమాల్లో చూసి నేర్చుకుంటున్నారు. కానీ క్రైస్తవులు సరదాకైనాసరే కఠినంగా గానీ దురుసుగా గానీ మాట్లాడకూడదు. సరదాగా మాట్లాడడం మంచిదే, అలా మాట్లాడితే ఇతరులు మనం చెప్పేది మరింత ఆసక్తిగా వింటారు. కానీ మనం ఇతరుల్ని నవ్వించడం కోసం, ఒకర్ని ఇబ్బందిపెట్టేలా లేదా కించపర్చేలా ఎన్నడూ మాట్లాడకూడదు. క్రైస్తవులు ‘దూషణకరమైన’ మాటలు మాట్లాడకూడదని బైబిలు ఆజ్ఞాపిస్తుంది. అంతేకాదు, “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి” అని కూడా బైబిలు చెప్తుంది.—ఎఫె. 4:29, 31.

11. మన హృదయానికి, మాటలకు ఉన్న సంబంధమేమిటి?

11 “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు. (మత్త. 12:34) అంటే, మన మాటలు మన హృదయంలో నిజంగా ఏమి ఉందో చెప్తాయి. కాబట్టి మనకు ఇతరుల మీద ప్రేమ, నిజమైన శ్రద్ధ ఉంటే సరైన పదాల్ని ఎంచుకుని వాళ్లను బలపర్చి, ప్రోత్సహించేలా మాట్లాడతాం.

12. ఇంపైన మాటలు ఎంచుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

12 సరైన పదాల్ని ఎంచుకోవాలంటే కృషి అవసరం. రాజైన సొలొమోను జ్ఞానవంతుడైనప్పటికీ, ఇంపైన మాటలు, యథార్థభావంతో రాసేలా ఆయన ‘ఆలోచించి సంగతులు పరిశీలించాడు.’ (ప్రసం. 12:9, 10) మరి ఇంపైన మాటలు ఎంచుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? దానికోసం మనం కొత్తకొత్త పదాలను నేర్చుకోవాల్సిరావచ్చు. అందుకు ఓ మార్గం ఏమిటంటే, బైబిల్లో అలాగే మన ప్రచురణల్లో ఎలాంటి పదాలను ఉపయోగిస్తున్నారో గమనిస్తూ ఉండడం. అంతేకాదు, మనకు అర్థంకాని పదాల భావం తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఇతరులకు ఉపయోగపడేలా మాట్లాడడం నేర్చుకోవడానికి యేసు ఉదాహరణను అధ్యయనం చేయాలి. ఆయనకు ఏమి మాట్లాడాలో బాగా తెలుసు ఎందుకంటే, “అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము” యెహోవాయే ఆయనకు ఇచ్చాడు. (యెష. 50:4) మన మాటలు ఎదుటివాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించడం కూడా చాలా ప్రాముఖ్యం. (యాకో. 1:19) మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఇలా చెప్తే, నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో ఆ వ్యక్తికి అర్థమౌతుందా? నా మాటలు ఆ వ్యక్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?’

13. మనం తేలిగ్గా అర్థమయ్యేలా ఎందుకు మాట్లాడాలి?

13 ప్రాచీన ఇశ్రాయేలులో బూర శబ్దాల్ని కొన్ని రకాలైన సూచనలు ఇవ్వడానికి ఉపయోగించేవాళ్లు. ఉదాహరణకు, ప్రజలందర్నీ ఒక్క దగ్గరకు రమ్మని సూచించడానికి ఒక రకమైన శబ్దాన్ని చేసేవాళ్లు. శత్రువుల మీద దాడి చేయమని సైనికులకు సూచించడానికి మరో రకమైన శబ్దాన్ని చేసేవాళ్లు. ఒకవేళ ఆ శబ్దాలు స్పష్టంగా లేకపోతే ఆ సైన్యానికి ఏమి జరిగేదో ఒక్కసారి ఆలోచించండి! బైబిలు తేలిగ్గా అర్థమయ్యే పదాలను, స్పష్టంగా ఉండే బూర శబ్దంతో పోలుస్తుంది. ఒకవేళ మనం విషయాల్ని స్పష్టంగా వివరించకపోతే, ప్రజలు తికమకపడవచ్చు లేదా మనం చెప్పేది తప్పుగా అర్థంచేసుకోవచ్చు. అయితే మన భావాల్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నంలో మన మాటలు కఠినంగా లేదా అమర్యాదగా ఉండకుండా జాగ్రత్తపడాలి.—1 కొరింథీయులు 14:8, 9 చదవండి.

14. యేసు తేలిగ్గా అర్థమయ్యే పదాలను ఎంచుకున్నాడని ఏ ఉదాహరణ చూపిస్తుంది?

14 తేలిగ్గా అర్థమయ్యే పదాలను ఎంచుకోవడంలో యేసే మనకు అత్యుత్తమ మాదిరి. ఆయనిచ్చిన ప్రసంగాన్ని మనం మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో చూడవచ్చు. ఆయన ఆ ప్రసంగంలో కష్టమైన లేదా అనవసరమైన పదాల్ని ఉపయోగించి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నించలేదు. అంతేకాదు, ఇతరులను నొప్పించేలా ఏమీ మాట్లాడలేదు. బదులుగా ఆయన ఎంతో లోతైన, ప్రాముఖ్యమైన విషయాలను కూడా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు. ఉదాహరణకు, ఆయన తన శిష్యులకు ఆహారం గురించి చింతించాల్సిన అవసరం లేదనే భరోసాను ఇవ్వాలనుకున్నాడు. అందుకే, ఆకాశ పక్షులను యెహోవా ప్రతీరోజు ఎలా పోషిస్తున్నాడో వివరించి, “మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా” అని అడిగాడు. (మత్త. 6:26, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అలాంటి తేలికైన పదాలను ఉపయోగించి శిష్యులు ఓ ముఖ్యమైన పాఠాన్ని అర్థంచేసుకోవడానికి, ప్రోత్సాహాన్ని పొందడానికి యేసు సహాయం చేశాడు.

ఎలా మాట్లాడాలి?

15. మనం ఎందుకు దయగా మాట్లాడాలి?

15 మనం ఎదుటివాళ్లతో ఎలా మాట్లాడతామనేది కూడా చాలా ప్రాముఖ్యం. యేసు చెప్పేది వినడానికి ప్రజలు ఇష్టపడ్డారు, ఎందుకంటే ఆయన చాలా ‘దయగా’ లేదా సౌమ్యంగా మాట్లాడేవాడు. (లూకా 4:22) మనం దయగా మాట్లాడినప్పుడు ఎదుటివాళ్లు మనం చెప్పేది వినడానికి, పాటించడానికి మరింత ఇష్టపడతారు. (సామె. 25:15) మనం ఎదుటివాళ్లను గౌరవించి, వాళ్ల భావాలను పట్టించుకుంటే వాళ్లతో దయగా మాట్లాడతాం. యేసు చేసింది అదే. ఉదాహరణకు, తన బోధ వినడానికి ఎంతో కష్టపడి వస్తున్న జనసమూహాన్ని చూసినప్పుడు యేసు ఎంతో సంతోషంగా వాళ్లతో సమయం గడిపి, ఎన్నో విషయాలు బోధించాడు. (మార్కు 6:34) అంతేకాదు, ప్రజలు తనను ఎంత అవమానించినా ఆయన మాత్రం తిరిగి వాళ్లను అవమానించలేదు.—1 పేతు. 2:23.

16, 17. (ఎ) కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మనం యేసును ఎలా అనుకరించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఓ ఒంటరి తల్లి దయగా మాట్లాడడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?

16 మనం మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని ఎంతో ప్రేమిస్తాం. కానీ వాళ్లు మనకు బాగా తెలిసినవాళ్లు కాబట్టి వాళ్లతో కొంచెం దురుసుగా మాట్లాడే అవకాశం ఉంది. వాళ్లతో ఎలా మాట్లాడినా ఫర్వాలేదని మనం అనుకోవచ్చు. కానీ యేసు ఎన్నడూ తన స్నేహితులతో దురుసుగా మాట్లాడలేదు. వాళ్లలో కొంతమంది, తమలో ఎవరు గొప్పని వాదించుకుంటున్నప్పుడు ఆయన దయగా సరిదిద్దాడు. ఒక చిన్నపిల్లవాడిని చూపించి వాళ్లు తమ ఆలోచనను మార్చుకోవడానికి సహాయం చేశాడు. (మార్కు 9:33-37) సంఘపెద్దలు, ఇతరులను దయగా సరిదిద్దే విషయంలో యేసును అనుకరించవచ్చు.—గల. 6:1.

17 ఎవరైనా మనల్ని నొప్పించేలా మాట్లాడినా మనం మాత్రం దయగా మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి. (సామె. 15:1) టీనేజీ కొడుకు ఉన్న ఓ ఒంటరి తల్లి అనుభవాన్ని పరిశీలించండి. ఆ అబ్బాయి యెహోవాను సేవిస్తున్నట్లు నటిస్తూ చెడ్డ పనులు చేసేవాడు. ఆ విషయం తెలిసిన ఓ సహోదరి ఆ అబ్బాయి తల్లితో, “నువ్వు మీ అబ్బాయిని సరిగ్గా పెంచలేదు” అని అంది. ఆ తల్లి ఒక్కసారి ఆగి ఆలోచించి ఇలా అంది, “ప్రస్తుతం మా అబ్బాయి ప్రవర్తన అంత బాలేదని నాకు తెలుసు, కానీ వాడికి నేను ఇస్తున్న శిక్షణ ఇంకా పూర్తి కాలేదు. దీని గురించి హార్‌మెగిద్దోను తర్వాత మాట్లాడుకుందాం.” ఆ అబ్బాయి తల్లి కోప్పడకుండా దయగా ఇచ్చిన సమాధానం వల్ల వాళ్ల స్నేహం ఇంకా కొనసాగుతోంది. అంతేకాదు, వాళ్ల మాటల్ని విన్న ఆ అబ్బాయి, తను మారతాడని వాళ్ల అమ్మ ఇంకా నమ్ముతోందని అర్థంచేసుకున్నాడు. దాంతో ఆ అబ్బాయి చెడు స్నేహాలు మానేసి, బాప్తిస్మం తీసుకుని ఆ తర్వాత బెతెల్‌లో సేవచేశాడు. మనం మాట్లాడుతున్నది తోటి సహోదరసహోదరీలతోనైనా, కుటుంబ సభ్యులతోనైనా లేదా కొత్తవాళ్లతోనైనా సరే ‘ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగా,’ దయగా మాట్లాడాలి.—కొలొ. 4:6.

18. మనం యేసును అనుకరిస్తే ఎలా మాట్లాడతాం?

18 మన భావాల్ని, ఆలోచనల్ని మాటల్లో చెప్పగలిగే సామర్థ్యం నిజంగా యెహోవా ఇచ్చిన అద్భుతమైన బహుమతి. మనం యేసును అనుకరిస్తే, మాట్లాడడానికి సరైన సమయాన్ని ఎంచుకుంటాం, పదాల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తాం, ఎల్లప్పుడూ దయగా మాట్లాడతాం. కాబట్టి మన నాలుకను ఇతరుల్ని ప్రోత్సహించడానికి, యెహోవాను సంతోషపెట్టడానికి ఉపయోగిద్దాం.