తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం
‘దేవుని వాక్యం సజీవమైనది.’—హెబ్రీ. 4:12.
1. (ఎ) దేవుడు ఆదాముకు ఏ పని అప్పగించాడు? (బి) ఆదాము కాలం నుండి దేవుని ప్రజలు భాషను దేనికి ఉపయోగిస్తున్నారు?
యెహోవా దేవుడు మనుషులకు భాష అనే వరాన్ని ఇచ్చాడు. ఏదెను తోటలో ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టే పనిని దేవుడు తనకు అప్పగించినప్పుడు, ఆదాము ఆ వరాన్నే ఉపయోగించాడు. ఆయన ప్రతీ జంతువును పరిశీలించి వాటికి సరిగ్గా సరిపోయే పేర్లు పెట్టాడు. (ఆది. 2:19, 20) ఆదాము కాలం మొదలుకొని దేవుని ప్రజలందరూ యెహోవాను స్తుతించడానికి, ఆయన గురించి ఇతరులకు చెప్పడానికి భాష అనే వరాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో, ఆ వరాన్ని ఉపయోగించి దేవుని ప్రజలు బైబిల్ని కూడా అనువదించారు. దానివల్ల ఎంతోమంది యెహోవా గురించి తెలుసుకోగలుగుతున్నారు.
2. (ఎ) న్యూ వరల్డ్ బైబిల్ ట్రాన్స్‌లేషన్ కమిటీ ఏ మూడు సూత్రాల్ని పాటించింది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
2 నేడు వేలకొలది బైబిలు అనువాదాలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మిగతావాటికన్నా ఖచ్చితంగా ఉన్నాయి. అయితే, బైబిల్ని ఖచ్చితంగా అనువదించడానికి మూడు సూత్రాలు పాటించాలని న్యూ వరల్డ్ బైబిల్ ట్రాన్స్‌లేషన్ కమిటీ నిర్ణయించుకుంది. అవి, (1) మొదట్లో దేవుని పేరు బైబిల్లో ఎక్కడెక్కడ ఉండేదో అక్కడ తిరిగి చేర్చి, ఆయన పేరును ఘనపర్చాలి. (మత్తయి 6:9, 10 చదవండి.) (2) వీలైన ప్రతీచోట ఉన్నదున్నట్లు అనువదించాలి, అలా సాధ్యంకాని చోట మాత్రం సరైన అర్థాన్ని అనువదించాలి. (3) చదవడానికి, అర్థంచేసుకోవడానికి తేలిగ్గా ఉండే భాషను ఉపయోగించాలి. a (నెహెమ్యా 8:8, 12 చదవండి.) బైబిల్ని 130 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు కూడా అనువాదకులు ఈ సూత్రాల్నే పాటించారు. అయితే, నూతనలోక అనువాదం 2013 రివైజ్డ్ బైబిల్ని ఇంగ్లీషులో, అలాగే ఇతర భాషల్లో తయారుచేస్తున్నప్పుడు ఈ సూత్రాల్ని ఎలా పాటించారో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
దేవుని పేరును ఘనపర్చే బైబిలు
3, 4. (ఎ) టెట్రగ్రామటన్ ఏ ప్రాచీన రాతప్రతుల్లో కనిపిస్తుంది? (బి) చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరును ఏమి చేశారు?
3 దేవుని పేరును హీబ్రూలో నాలుగు అక్షరాలతో రాస్తారు, దాన్నే టెట్రగ్రామటన్ అంటారు. మృత సముద్రపు చుట్టలవంటి పాత హీబ్రూ రాతప్రతుల్లోని చాలావాటిలో ఆ టెట్రగ్రామటన్ కనిపిస్తుంది. అలాగే సా.శ.పూ. రెండవ శతాబ్దం నుండి సా.శ. మొదటి శతాబ్దం మధ్యకాలానికి చెందిన కొన్ని గ్రీకు సెప్టువజింటు ప్రతుల్లో కూడా దేవుని పేరు కనిపిస్తుంది. ప్రాచీన రాతప్రతుల్లో ఆ పేరు ఎక్కువసార్లు ఉండడం చూసి, చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
4 దేవుని పేరు బైబిల్లో ఉండాలనడానికి ఎన్నో రుజువులు ఉన్నప్పటికీ చాలా బైబిలు అనువాదాల్లో ఆ పేరును తీసేస్తున్నారు. ఉదాహరణకు, క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం విడుదలైన రెండేళ్లకే అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ రివైజ్డ్ ఎడిషన్ ప్రచురించారు. అయితే, దాని అనువాదకులు 1901 ఎడిషన్‌లో దేవుని పేరును ఉపయోగించారు కానీ 1952 రివైజ్డ్ ఎడిషన్‌లో మాత్రం ఉపయోగించలేదు. ఎందుకు? ఎందుకంటే బైబిల్లో దేవుని పేరును ఉపయోగించడం “అస్సలు సరికాదు” అని ఆ అనువాదకులు భావించారు. ఇంగ్లీషులో, అలాగే ఇతర భాషల్లో ఉన్న చాలా బైబిలు అనువాదాల్లో కూడా దేవుని పేరును తీసేశారు.
5. బైబిల్లో దేవుని పేరును ఉంచడం ఎందుకు ప్రాముఖ్యం?
5 అనువాదకులు బైబిల్లో దేవుని పేరును ఉంచడం లేదా తీసేయడం అనేది అంత ప్రాముఖ్యమైన విషయమా? అవును. ఎందుకంటే, తన పేరును ప్రజలు తెలుసుకోవాలని బైబిలు గ్రంథకర్త యెహోవా కోరుకుంటున్నాడు. ఓ మంచి అనువాదకునికి, గ్రంథకర్త ఏమి కోరుకుంటున్నాడో తెలిసుండాలి అలాగే దాని ప్రకారం అనువదించగలగాలి. దేవుని పేరు ప్రాముఖ్యమైనదని, దాన్ని ఘనపర్చాలని చాలా లేఖనాలు చెప్తున్నాయి. (నిర్గ. 3:15; కీర్త. 83:18; 148:13; యెష. 42:8; 43:10; యోహా. 17:6, 26; అపొ. 15:14) ప్రాచీన రాతప్రతుల్లో తన పేరును వేలసార్లు రాసేలా యెహోవా బైబిలు రచయితల్ని ప్రేరేపించాడు. (యెహెజ్కేలు 38:23 చదవండి.) కాబట్టి అనువాదకులు బైబిల్లో దేవుని పేరును తీసేస్తే వాళ్లకు యెహోవామీద గౌరవం లేనట్లే.
6. నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్‌లో దేవుని పేరును అదనంగా ఆరు చోట్ల ఎందుకు చేర్చారు?
6 బైబిల్లో దేవుని పేరు ఉంచాలనడానికి నేడు మరిన్ని రుజువులున్నాయి. అందుకే ఇంగ్లీషు నూతనలోక అనువాదం 2013 రివైజ్డ్ ఎడిషన్‌లో దేవుని పేరును 7,216 సార్లు ఉపయోగించారు. ఈ ఎడిషన్‌లో, ముందటి ఎడిషన్‌లో కన్నా అదనంగా ఆరు చోట్ల దేవుని పేరును చేర్చారు. అందులో ఐదు ఏమిటంటే 1 సమూయేలు 2:25; 6:3; 10:26; 23:14, 16 లేఖనాలు. ఈ మధ్యకాలంలో దొరికిన మృత సముద్రపు చుట్టల్లో ఆ ఐదు లేఖనాల్లో దేవుని పేరు ఉంది, కాబట్టే రివైజ్డ్ ఎడిషన్‌లో ఈ ఐదు చోట్ల దేవుని పేరును చేర్చారు. b అలాగే ప్రాచీన బైబిలు రాతప్రతుల్ని మరింతగా పరిశీలించిన తర్వాత, న్యాయాధిపతులు 19:18 వ వచనంలో కూడా దేవుని పేరును చేర్చారు.
7, 8. యెహోవా అనే పేరుకు అర్థమేమిటి?
7 దేవుని పేరుకున్న పూర్తి అర్థాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యమని నిజక్రైస్తవులకు తెలుసు. దేవుని పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. c గతంలో, మన ప్రచురణలు నిర్గమకాండము 3:14, NW ఉపయోగించి దేవుని పేరుకున్న అర్థాన్ని వివరించాయి. అక్కడిలా ఉంది, “నేను ఎలా అవ్వాలనుకుంటే అలా అవుతాను.” తన వాగ్దానాల్ని నెరవేర్చడానికి యెహోవా ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వగలడు అని నూతనలోక అనువాదం 1984 ఎడిషన్ వివరించింది. d అయితే, “యెహోవా అనే పేరుకు ఆ అర్థం ఉన్నా, అది తాను అనుకున్నది అవ్వడానికి మాత్రమే పరిమితం కాదు. తన సంకల్పం నెరవేర్చడానికి తన సృష్టిని కూడా ఎలా అవ్వాలనుకుంటే అలా అయ్యేలా చేయగలడు” అని 2013 రివైజ్డ్ ఎడిషన్ వివరిస్తుంది.
8 యెహోవా తన సృష్టిని కూడా ఎలా కావాలనుకుంటే అలా అయ్యేలా చేయగలడు. ఉదాహరణకు, నోవహు ఓడను నిర్మించేలా యెహోవా చేశాడు. అంతేకాదు, బెసలేలును ఓ అద్భుత కళాకారునిగా, గిద్యోనును ఓ గొప్ప శూరునిగా, పౌలును ఓ మిషనరీగా చేశాడు. అవును, దేవుని పేరుకు ఓ అద్భుతమైన అర్థం ఉందని దేవుని ప్రజలు గుర్తిస్తారు. అందుకే, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ కమిటీ ఈ అనువాదంలో దేవుని పేరును చేర్చింది.
9. నూతనలోక అనువాదం బైబిల్ని ఇతర భాషల్లోకి అనువదించాలని పరిపాలక సభ ఎందుకు నిర్ణయించింది?
9 చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరును తీసేసి, దాని స్థానంలో “ప్రభువు” లేదా స్థానిక దేవుని పేరు పెట్టారు. ఈ కారణాన్నిబట్టి కూడా దేవుని పేరును ఘనపర్చే బైబిలు, అన్ని భాషల ప్రజలకు అందుబాటులో ఉండాలని పరిపాలక సభ కోరుకుంది. (మలాకీ 3:16 చదవండి.) ప్రస్తుతం 130 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న నూతనలోక అనువాదం యెహోవా పేరును ఘనపరుస్తోంది.
స్పష్టత, ఖచ్చితత్వం ఉన్న బైబిలు అనువాదం
10, 11. నూతనలోక అనువాదం బైబిల్ని వేరే భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
10 నూతనలోక అనువాదం బైబిల్ని ఇంగ్లీషు నుండి వేరే భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదాహరణకు, ఇంగ్లీషు నూతనలోక అనువాదంలో ప్రసంగి 9:10 అలాగే మరితర వచనాల్లో “షియోల్” అనే హీబ్రూ పదం ఉంది. ఆ పదం వేరే ఇంగ్లీషు బైబిళ్లలో కూడా కనిపిస్తుంది. కానీ వేరే భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు ఆ పదాన్ని ఉపయోగించలేం. ఎందుకంటే ఆ హీబ్రూ పదం చాలామంది పాఠకులకు తెలియదు, పైగా వాళ్ల డిక్షనరీల్లో కూడా ఆ పదం లేదు. కొంతమందైతే “షియోల్” అనేది ఓ ప్రాంతం పేరేమో అనుకున్నారు. ఈ కారణాలనుబట్టి, “షియోల్” అనే హీబ్రూ పదాన్ని, “హేడిస్” అనే గ్రీకు పదాన్ని “సమాధి” అని అనువదించేందుకు పరిపాలక సభ అనుమతిచ్చింది. అలా ఈ అనువాదం ఖచ్చితంగా, మరింత స్పష్టంగా ఉంది.
11 అలాగే, “ఆత్మ” అనే అర్థమున్న హీబ్రూ, గ్రీకు పదాలను కొన్ని భాషల్లోకి అనువదించడం కష్టమైంది. ఎందుకంటే ఆ భాషల్లో “ఆత్మ” అంటే దయ్యం లేదా చనిపోయిన తర్వాత శరీరాన్ని విడిచి వెళ్లేది అనే అర్థాలున్నాయి. అందుకే, ఆ పదానికి నూతనలోక అనువాదం రెఫరెన్సు బైబిలు అనుబంధంలో ఇచ్చిన అర్థాలనుబట్టి, సందర్భానికి తగ్గట్టుగా అనువదించుకోవడానికి పరిపాలక సభ అనుమతిచ్చింది. నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్ అధస్సూచీల్లో హీబ్రూ, గ్రీకు పదాలకు సంబంధించిన సమాచారం ఉంది. దానివల్ల వచనాల్ని చదవడం, అర్థంచేసుకోవడం తేలికౌతుంది.
12. నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్‌లో ఇంకా ఏయే మార్పులు చేశారు? (ఈ సంచికలో ఉన్న “నూతనలోక అనువాదం 2013 రివైజ్డ్ ఎడిషన్” అనే ఆర్టికల్ కూడా చూడండి.)
12 అనువాదకులు రాసిన ప్రశ్నల్నిబట్టి, బైబిల్లో ఉన్న మరికొన్ని పదాల్ని కూడా ప్రజలు తప్పుగా అర్థంచేసుకుంటున్నారని తెలిసింది. అందుకే, ఇంగ్లీషు నూతనలోక అనువాదం బైబిల్ని రివైజ్ చేయడానికి 2007, సెప్టెంబరులో పరిపాలక సభ ఆమోదించింది. అలా రివైజ్ చేస్తున్నప్పుడు, బైబిల్ని అనువదిస్తున్న సహోదరసహోదరీలు రాసిన వేలకొలది ప్రశ్నల్ని ఆ కమిటీ పరిశీలించింది. అంతేకాదు, నూతనలోక అనువాదం బైబిల్లో అప్పటికే ఉన్న పాత ఇంగ్లీషు పదాల్ని తీసేసి, ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న పదాల్ని పెట్టారు. దానివల్ల వచనాలు చదవడానికి, అర్థంచేసుకోవడానికి తేలిగ్గా ఉండడంతోపాటు ఖచ్చితంగా కూడా ఉన్నాయి. నూతనలోక అనువాదం బైబిల్ని అప్పటికే వేరే భాషల్లోకి అనువదించడం వల్ల, రివైజ్డ్ ఇంగ్లీషు బైబిల్ని ఇంకా తేలిగ్గా అర్థమయ్యేలా అనువదించగలిగారు.—సామె. 27:17.
ప్రశంసల వెల్లువ
13. ఇంగ్లీషు నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్ గురించి చాలామంది ఎలా భావిస్తున్నారు?
13 ఇంగ్లీషు నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్ గురించి చాలామంది ఏమంటున్నారు? ఆ బైబిల్ని ప్రశంసిస్తూ చాలామంది సహోదరసహోదరీలు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయానికి వేలకొలది ఉత్తరాలు రాశారు. ఓ సహోదరి ఇలా రాసింది, “బైబిలు విలువైన రత్నాలున్న ఓ పెట్టె లాంటిది. 2013 రివైజ్డ్ ఎడిషన్‌లో వచనాల్ని చదువుతున్నప్పుడు, ఆ పెట్టెలో ఉన్న ఒక్కో రత్నాన్ని పరిశీలిస్తూ, దాని ప్రతీ కోణాన్ని, స్వచ్ఛతను, రంగును, అందాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఉంది. లేఖనాలు తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఉండడం వల్ల నేను యెహోవాను మరింత ఎక్కువగా తెలుసుకున్నాను. ఈ బైబిలు చదువుతుంటే, ఆయన ఓ తండ్రిలా నా చుట్టూ చేతులు వేసి, ఓదార్పుకరంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.” చాలామంది ఆ సహోదరిలాగే భావిస్తున్నారు.
14, 15. వేరే భాషల్లో నూతనలోక అనువాదం బైబిల్ని అందుకున్నవాళ్లు ఎలా భావించారు?
14 వేరే భాషల్లో నూతనలోక అనువాదం బైబిల్ని అందుకున్నవాళ్లు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. బల్గేరియాలోని సోఫియాకు చెందిన ఓ వృద్ధుడు, బల్గేరియన్ భాషలో ఉన్న నూతనలోక అనువాదం బైబిలు గురించి ఇలా చెప్పాడు, “నేను ఎన్నో ఏళ్లుగా బైబిలు చదువుతున్నాను కానీ ఇంత తేలిగ్గా అర్థమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా ఉన్న బైబిలు అనువాదాన్ని ఎప్పుడూ చదవలేదు.” అదేవిధంగా, అల్బేనియాకు చెందిన ఓ సహోదరి ఇలా రాసింది, ‘అల్బేనియన్ భాషలో దేవుని వాక్యం ఎంత మధురంగా ఉందో! యెహోవా మాతో మా భాషలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది!’
15 చాలా దేశాల్లో, బైబిళ్లు ఖరీదైనవిగా ఉంటాయి, అవి దొరకడం కూడా కష్టమే. కాబట్టి అక్కడి ప్రజలు, బైబిలు తమ దగ్గర ఉండడాన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తారు. రువాండా దేశం నుండి వచ్చిన ఓ నివేదిక ఇలా చెప్తుంది, “సహోదరుల దగ్గర ఎంతోకాలంగా స్టడీ తీసుకుంటున్నప్పటికీ, అక్కడి ప్రజలు తమ దగ్గర బైబిలు లేనందువల్లే ప్రగతి సాధించలేకపోతున్నారు. కనీసం స్థానిక చర్చీ ఉపయోగించే బైబిల్ని కొనడానికి కూడా వాళ్ల దగ్గర డబ్బులు లేవు. కాబట్టి కొన్ని వచనాల్ని వాళ్లు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయేవాళ్లు, దానివల్ల వాళ్లు ప్రగతి సాధించలేకపోయారు.” రువాండాలోని ఓ కుటుంబంలో నలుగురు టీనేజీ పిల్లలున్నారు. ఆ కుటుంబం తమ సొంత భాషలో నూతనలోక అనువాదం బైబిల్ని అందుకున్నప్పుడు ఇలా చెప్పింది, “మాకు ఈ బైబిల్ని ఇచ్చినందుకు యెహోవాకు, నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసునికి ఎన్నో కృతజ్ఞతలు. మేము చాలా పేదవాళ్లం. మా కుటుంబంలో అందరికీ బైబిలు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. కానీ, ఇప్పుడు మా కుటుంబంలో ప్రతీఒక్కరి దగ్గర బైబిలు ఉంది. యెహోవాపట్ల మా కృతజ్ఞత చూపించడానికి మేము ప్రతీరోజు కుటుంబమంతా కలిసి బైబిలు చదువుతాం.”
16, 17. (ఎ) యెహోవా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? (బి) మనం ఏమని తీర్మానించుకోవాలి?
16 నూతనలోక అనువాదం రివైజ్డ్ బైబిలు భవిష్యత్తులో మరిన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే సాతాను ఈ పనిని ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యే భాషలో ప్రజలందరూ తన మాటల్ని వినాలని యెహోవా కోరుకుంటున్నాడని మనకు తెలుసు. (యెషయా 30:21 చదవండి.) ‘సముద్రం జలంతో నిండివున్నట్టు లోకం యెహోవా గూర్చిన జ్ఞానంతో నిండివుండే’ కాలం త్వరలోనే రాబోతుంది.—యెష. 11:9.
17 యెహోవా పేరును ఘనపర్చే నూతనలోక అనువాదం బైబిలుతోపాటు, ఆయనిస్తున్న ప్రతీ వరాన్ని ఉపయోగించుకోవాలని తీర్మానించుకుందాం. తన వాక్యం ద్వారా యెహోవా చెప్పే మాటల్ని ప్రతీరోజు విందాం. ఆయన మనందరి ప్రార్థనల్ని శ్రద్ధగా వినగలడు. యెహోవాతో అలా సంభాషించడం ద్వారా మనం ఆయన్ను ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం, అంతేకాదు ఆయనమీద మనకున్న ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది.—యోహా. 17:3.
a ఇంగ్లీషు నూతనలోక అనువాదం రివైజ్డ్ బైబిల్లో అనుబంధం A1 చూడండి.
b హీబ్రూ మసోరెటిక్ ప్రతి కన్నా మృత సముద్రపు చుట్టలు 1,000 కన్నా ఎక్కువ సంవత్సరాలు పాతవి.
c కొన్ని రెఫరెన్సు పుస్తకాలు ఈ వివరణ ఇస్తున్నాయి, కానీ కొంతమంది విద్వాంసులు దాన్ని అంగీకరించడం లేదు.
d దేవుని వాక్యం అధ్యయనం చేయడానికి మార్గదర్శి అనే చిన్నపుస్తకంలో “హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు” అనే ఒకటవ భాగాన్ని చూడండి.