యెహోవా సంభాషించే దేవుడు
“నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము.” —యోబు 42:4.
1-3. (ఎ) దేవుని ఆలోచనలు, భాష మనుషులకన్నా ఉన్నతమైనవని ఎలా చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి తెలుసుకుంటాం?
యెహోవా ఇతరులతో జీవాన్ని, సంతోషాన్ని పంచుకోవడం కోసం దూతలను, ఆ తర్వాత మనుషులను సృష్టించాడు. (కీర్త. 36:9) యెహోవా చేసిన మొట్టమొదటి సృష్టిని అపొస్తలుడైన యోహాను “వాక్యము” అని పిలిచాడు. (యోహా. 1:1; ప్రక. 3:14) ఆ వాక్యమే యేసు. యెహోవా ఆయనతో మాట్లాడుతూ తన ఆలోచనల్ని, భావాల్ని పంచుకునేవాడు. (యోహా. 1:14, 17; కొలొ. 1:15) దూతలకు కూడా ఓ భాష ఉంటుందనీ వాళ్లు కూడా మాట్లాడుకుంటారనీ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అయితే ఆ భాష మనుషులు మాట్లాడే భాష లాంటిది కాదు.—1 కొరిం. 13:1.
2 తాను సృష్టించిన కోటానుకోట్ల దూతల గురించి, మనుషుల గురించి యెహోవాకు ప్రతీది తెలుసు. అంతేకాదు లక్షలమంది ఒకేసారి ప్రార్థన చేసినా, ఏ భాషలో చేసినా ఆయన వినగలడు, అర్థంచేసుకోగలడు. అంతేకాదు, ఆయన ఆ ప్రార్థనలు వింటూనే మరోవైపు దూతలతో మాట్లాడుతూ వాళ్లకు నిర్దేశాలివ్వగలడు. యెహోవా ఇవన్నీ చేయగలుగుతున్నాడంటే ఖచ్చితంగా ఆయన ఆలోచనలు, భాష మనుషులకన్నా ఎంతో ఉన్నతమైనవై ఉండాలి. (యెషయా 55:8, 9 చదవండి.) అందుకే ఆయన మనుషులతో మాట్లాడేటప్పుడు, తాను చెప్పాలనుకున్న విషయాల్ని వాళ్లకు అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్తాడు.
3 యెహోవా ఏయే విధాల్లో మనుషులతో స్పష్టంగా మాట్లాడుతున్నాడో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అంతేకాదు, పరిస్థితుల్నిబట్టి ఆయన మాట్లాడే విధానాన్ని ఎలా మార్చుకుంటాడో కూడా మనం చూస్తాం.
దేవుడు మనుషులతో మాట్లాడతాడు
4. (ఎ) మోషే, సమూయేలు, దావీదులతో యెహోవా ఏ భాషలో మాట్లాడాడు? (బి) బైబిల్లో ఏయే విషయాలు ఉన్నాయి?
4 యెహోవా ఏదెను తోటలో, మొదటి మానవుడైన ఆదాముతో మాట్లాడినప్పుడు బహుశా ప్రాచీన కాలం నాటి హీబ్రూ భాషలో మాట్లాడివుంటాడు. ఆ తర్వాతి కాలాల్లో, యెహోవా హీబ్రూ భాష మాట్లాడే మోషే, సమూయేలు, దావీదువంటి వాళ్లతో కూడా మాట్లాడాడు. వాళ్లు బైబిలు పుస్తకాల్ని హీబ్రూ భాషలో తమ సొంత మాటల్లో శైలిలో రాసినా, నిజానికి వాళ్లు రాసింది దేవుని ఆలోచనల్నే. అంతేకాదు వాళ్లు యెహోవా చెప్పింది చెప్పినట్లే రాయడంతోపాటు ఆయన తన ప్రజలతో వ్యవహరించిన విధానం గురించి కూడా రాశారు. ఉదాహరణకు దేవునిపట్ల తమకున్న విశ్వాసం, ప్రేమ గురించే కాకుండా వాళ్లు చేసిన తప్పుల గురించి కూడా రాశారు. వాటన్నిటినీ యెహోవా మన ప్రయోజనం కోసమే రాయించాడు.—రోమా. 15:4.
5. యెహోవా మనుషులతో ప్రతీసారి హీబ్రూ భాషలోనే మాట్లాడాడా? వివరించండి.
5 యెహోవా మనుషులతో ప్రతీసారి హీబ్రూ భాషలోనే మాట్లాడలేదు. బబులోను చెర నుండి విడుదలయ్యే సమయానికి ఇశ్రాయేలీయుల్లో కొంతమంది అరామిక్ భాష మాట్లాడేవాళ్లు. బహుశా అందుకేనేమో యెహోవా దానియేలును, యిర్మీయాను, ఎజ్రాను ఉపయోగించి బైబిల్లో కొన్ని భాగాల్ని అరామిక్ భాషలో రాయించాడు. a
6. హీబ్రూ లేఖనాల్ని గ్రీకు భాషలోకి ఎందుకు అనువదించారు?
6 గ్రీకు పరిపాలకుడైన అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచంలోని చాలా దేశాల్ని జయించడం వల్ల కొయిని గ్రీకు అనే సామాన్య గ్రీకు భాష అప్పట్లో ముఖ్య భాష అయింది. అప్పుడు చాలామంది యూదులు కూడా గ్రీకు భాష మాట్లాడడం మొదలుపెట్టారు. దానివల్ల హీబ్రూ లేఖనాల్ని కూడా గ్రీకులోకి అనువదించారు, ఆ అనువాదాన్నే సెప్టువజింటు అంటారు. అదే మొట్టమొదటి బైబిలు అనువాదం, అది ముఖ్యమైనది కూడా. దీన్ని 72 మంది అనువదించారని నిపుణులు అంటారు. b వాళ్లలో కొంతమంది హీబ్రూ లేఖనాల్ని గ్రీకులోకి ఉన్నదున్నట్లుగా అనువదించారు, మరికొంతమంది వేరే పద్ధతిలో అనువదించారు. దానివల్ల సెప్టువజింటులోని అనువాద శైలి వేర్వేరుగా ఉంటుంది. ఏదేమైనా గ్రీకు మాట్లాడే యూదులు, క్రైస్తవులు సెప్టువజింటును దేవుని వాక్యమని నమ్మారు.
7. యేసు భూమ్మీదున్నప్పుడు ఏ భాష మాట్లాడాడు?
7 యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు బహుశా హీబ్రూ భాషలో మాట్లాడివుంటాడు. (యోహా. 19:20; 20:16; అపొ. 26:14) అంతేకాదు, ఆ కాలంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే కొన్ని అరామిక్ పదాల్ని కూడా ఆయన ఉపయోగించివుంటాడు. అయితే మోషే, ఇతర ప్రవక్తలు మాట్లాడిన ప్రాచీన హీబ్రూ భాష కూడా యేసుకు తెలుసు. ఆ ప్రవక్తలు రాసినవాటినే ప్రతీవారం సమాజమందిరాల్లో చదివేవాళ్లు. (లూకా 4:17-19; 24:44, 45; అపొ. 15:21) యేసు జీవించిన కాలంలో గ్రీకు, లాటిన్ భాషలు వాడుకలో ఉన్నప్పటికీ ఆయన ఆ భాషలు మాట్లాడాడో లేదో బైబిలు చెప్పట్లేదు.
8, 9. చాలామంది క్రైస్తవులు గ్రీకు భాషను ఎందుకు మాట్లాడారు? ఇది యెహోవా దేవుని గురించి మనకేమి నేర్పిస్తుంది?
8 యేసు తొలి శిష్యులు హీబ్రూ భాష మాట్లాడారు, ఆయన చనిపోయిన తర్వాత వాళ్లు వేరే భాషలు కూడా మాట్లాడారు. (అపొస్తలుల కార్యములు 6:1 చదవండి.) సువార్త విస్తరించేకొద్దీ చాలామంది క్రైస్తవులు గ్రీకు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పట్లో ప్రజలు ఎక్కువగా గ్రీకు భాషే మాట్లాడేవాళ్లు కాబట్టి మత్తయి, మార్కు, లూకా, యోహాను వంటి సువార్త వృత్తాంతాల్ని గ్రీకు భాషలోనే పంచిపెట్టారు. c అంతేకాదు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికల్ని, ఇతర బైబిలు పుస్తకాల్ని కూడా గ్రీకు భాషలోనే పంచిపెట్టారు.
9 ఆసక్తికరంగా, బైబిలు రచయితలు గ్రీకు లేఖనాల్ని రాసేటప్పుడు, హీబ్రూ లేఖనాల్ని ఎత్తి రాయాల్సివస్తే సెప్టువజింటునే ఎక్కువగా ఉపయోగించారు. కానీ కొన్నిసార్లు అలా ఎత్తిరాసినవి ఆదిమ హీబ్రూ పదాలకు కాస్త వేరుగా ఉండేవి. అపరిపూర్ణులైన ఆ అనువాదకులు చేసిన పొరపాట్లు ఇప్పుడున్న బైబిల్లో కూడా కనిపిస్తాయి. వీటన్నిటినిబట్టి యెహోవా దేవుడు ఒక భాషను లేదా సంస్కృతిని మరో దానికన్నా ఎక్కువగా చూడడని చెప్పవచ్చు.—అపొస్తలుల కార్యములు 10:34 చదవండి.
10. యెహోవా మనుషులతో మాట్లాడే విధానం నుండి మనమేమి తెలుసుకున్నాం?
10 యెహోవా మనుషులతో మాట్లాడే భాషను పరిస్థితుల్నిబట్టి, అవసరాల్నిబట్టి మార్చుకుంటాడని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. తన గురించి లేదా తన సంకల్పాల గురించి తెలుసుకోవాలంటే మనం ఫలానా భాషే నేర్చుకోవాలని యెహోవా చెప్పట్లేదు. (జెకర్యా 8:23; ప్రకటన 7:9, 10 చదవండి.) అంతేకాదు బైబిల్లో ఉన్నవి యెహోవా ఆలోచనలే అయినప్పటికీ, వాటిని బైబిలు రచయితలు తమ సొంత మాటల్లో రాసేందుకు యెహోవా అనుమతిచ్చాడని మనం తెలుసుకున్నాం.
దేవుడు తన వాక్యాన్ని భద్రపర్చాడు
11. మనుషులు వేర్వేరు భాషలు మాట్లాడినా, అనువాదంలో చిన్నచిన్న తేడాలున్నా, అవి దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఏమైనా అడ్డుగా నిలిచాయా?
11 మనుషులు వేర్వేరు భాషలు మాట్లాడినా, అనువాదంలో చిన్నచిన్న తేడాలు ఉన్నా, దేవుడు మనుషులతో మాట్లాడడానికి అవి ఏమైనా అడ్డుగా నిలిచాయా? లేదు. ఉదాహరణకు, యేసు ఉపయోగించిన ఆదిమ భాషలోని మాటలు బైబిల్లో కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. (మత్త. 27:46; మార్కు 5:41; 7:34) కానీ యేసు బోధలన్నీ బైబిల్లో ఉండేలా, అవి గ్రీకులోకి ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదం అయ్యేలా యెహోవా చూశాడు. దేవుని వాక్యాన్ని యూదులు, క్రైస్తవులు చాలాసార్లు నకలు రాయడం వల్ల అది భద్రపర్చబడింది. ఆ తర్వాత వాటిని ఎన్నో భాషల్లోకి అనువదించారు. క్రీస్తు చనిపోయిన దాదాపు 400 సంవత్సరాల తర్వాత, ఆయన బోధల్ని సిరియన్లు, ఐగుప్తీయులు, భారతీయులు, పర్షియన్లు, ఐతియోపీయులు, ఇతర ప్రజలు మాట్లాడే భాషల్లోకి అనువదించారని జాన్ క్రిసోస్టమ్ చెప్పాడు.
12. బైబిలు ఎలాంటి దాడుల్ని తట్టుకుని నిలబడింది?
12 చరిత్రంతటిలో బైబిలు మీద, దాన్ని అనువదించి పంచిపెట్టిన వాళ్లమీద ఎన్నో దాడులు జరిగాయి. ఉదాహరణకు సా.శ. 303లో రోమా చక్రవర్తి డయక్లీషన్, బైబిలు కాపీలన్నిటిని నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. అయితే 16వ శతాబ్దంలో విలియమ్ టిండేల్ బైబిల్ని ఇంగ్లీషులోకి అనువదించడం మొదలుపెట్టాడు. ఒకవేళ దేవుడు తనను ఎక్కువకాలం బ్రతకనిస్తే, మతగురువుల కన్నా పొలం పని చేసుకునే పిల్లవాడు బైబిల్ని ఎక్కువగా తెలుసుకునేలా చేస్తానని టిండేల్ చెప్పాడు. కానీ హింసవల్ల ఆయన ఇంగ్లండ్ నుండి యూరప్‌కు పారిపోయి, బైబిల్ని అనువదించి ప్రింట్ చేయాల్సివచ్చింది. మతగురువులు తమకు దొరికిన బైబిలు కాపీలన్నిటినీ కాల్చేయడానికి ప్రయత్నించినప్పటికీ, టిండేల్ అనువదించిన బైబిలు మాత్రం చాలామందికి చేరింది. చివరికి టిండేల్‌ను కొయ్యకు ఉరితీసి తగలబెట్టారు. కానీ ఆయన అనువదించిన బైబిలు ఎన్నో దాడుల్ని తట్టుకుని నిలబడడమే కాకుండా, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిలు అనువాదాన్ని తయారుచేయడానికి కూడా ఉపయోగపడింది.—2 తిమోతి 2:9 చదవండి.
13. ప్రాచీన రాతప్రతుల్ని అధ్యయనం చేయడంవల్ల ఏ విషయం నిర్ధారణ అయింది?
13 కొన్ని ప్రాచీన బైబిలు కాపీల్లో చిన్నచిన్న తప్పులు, తేడాలు ఉన్నాయన్న మాట నిజమే. అయితే బైబిలు విద్వాంసులు కొన్ని వేల రాతప్రతుల్ని, వాటి భాగాల్ని, ప్రాచీన బైబిలు అనువాదాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేశారు. వాటిని ఒకదానితో ఒకటి పోల్చి చూశాక కేవలం కొన్ని వచనాల్లో మాత్రమే తేడాలు ఉన్నాయని, అవి కూడా చాలా చిన్నవని నిర్ధారించారు. కానీ వాటివల్ల బైబిలు సందేశం మాత్రం ఏమీ మారలేదు. ఇలాంటి అధ్యయనాల వల్ల, నేడున్న బైబిలు నిజంగా దేవుని వాక్యమనే నమ్మకం బైబిలు విద్యార్థులకు కుదిరింది.—యెష. 40:8. d
14. నేడు బైబిలు ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది?
14 బైబిల్ని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రస్తుతం బైబిలు మొత్తంగా లేదా భాగాలుగా 2,800 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. నేడు మరే ఇతర పుస్తకం ఇన్ని భాషల్లో లేదు. చాలామందికి దేవునిపై విశ్వాసంలేని కాలంలో కూడా అన్నిటికన్నా ఎక్కువగా పంచిపెట్టబడిన పుస్తకం బైబిలే. అయితే కొన్ని బైబిలు అనువాదాలు చదవడానికి తేలిగ్గా లేకపోయినా లేదా అందులోని విషయాలు అంత ఖచ్చితంగా లేకపోయినా, దాదాపు అన్నిటిలో నిరీక్షణ, నిత్యజీవం గురించిన సందేశమే ఉంది.
ఓ కొత్త బైబిలు అనువాదం అవసరమైంది
15. (ఎ) మన ప్రచురణలు నేడు ఎన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి? (బి) వాటిని మొదట ఇంగ్లీషులో ఎందుకు తయారుచేస్తారు?
15 యేసుక్రీస్తు 1919లో కొంతమంది బైబిలు విద్యార్థుల్ని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ నియమించాడు. వాళ్లు ఆ కాలంలోని ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎక్కువగా ఇంగ్లీషులోనే అందించేవాళ్లు. (మత్త. 24:45) కానీ నేడు 700 కన్నా ఎక్కువ భాషల్లో అందిస్తున్నారు. ప్రాచీన కాలంలో గ్రీకు భాషలాగే నేడు ఇంగ్లీషును కూడా వ్యాపారానికి, విద్యకు సంబంధించిన వ్యవహారాలన్నిటిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి మన ప్రచురణల్ని ముందుగా ఇంగ్లీషులో తయారుచేసి, ఆ తర్వాత వేరే భాషల్లోకి అనువదిస్తున్నారు.
16, 17. (ఎ) దేవుని ప్రజలకు ఏమి అవసరమైంది? (బి) ఆ అవసరం ఎలా తీరింది? (సి) సహోదరుడు నార్ ఏమి కోరుకున్నాడు?
16 మన ప్రచురణలన్నిటినీ బైబిలు ఆధారంగానే తయారుచేస్తారు. మొదట్లో దేవుని ప్రజలు కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని ఉపయోగించేవాళ్లు. అది 1611 కాలంనాటిది కాబట్టి దానిలోని భాష చాలా పాతగా, అర్థంచేసుకోవడానికి కష్టంగా ఉండేది. అంతేకాదు ప్రాచీన రాతప్రతుల్లో దేవుని పేరు వేలసార్లు ఉన్నా, ఆ బైబిలు అనువాదంలో మాత్రం కేవలం కొన్నిసార్లే కనిపిస్తుంది. అందులో కొన్ని వచనాల్ని తప్పుగా అనువదించారు, పైగా ప్రాచీన రాతప్రతుల్లో లేని వచనాల్ని కూడా చేర్చారు. ఇతర ఇంగ్లీషు బైబిలు అనువాదాల్లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి.
17 అందుకే ఖచ్చితమైన, తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం దేవుని ప్రజలకు అవసరమైంది. దాంతో కొంతమంది సహోదరులు, న్యూ వరల్డ్ బైబిల్ ట్రాన్స్‌లేషన్ కమిటీగా ఏర్పడ్డారు. వాళ్లు 1950 నుండి 1960 మధ్యకాలంలో నూతనలోక అనువాదం బైబిల్లోని కొన్ని భాగాల్ని విడుదల చేశారు. ఆరు సంపుటుల్లోని మొదటిదాన్ని 1950, ఆగస్టు 2న జరిగిన ఓ సమావేశంలో విడుదల చేశారు. ఆ సమావేశంలో సహోదరుడు నార్, దేవుని ప్రజలకు ఓ ఆధునిక బైబిలు అనువాదం అవసరమని అన్నాడు. అంతేకాదు ఆ అనువాదం ఖచ్చితంగా ఉండాలని, తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఉండాలని, సత్యాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలని కూడా ఆయన చెప్పాడు. క్రీస్తు తొలి శిష్యులు రాసిన బైబిలు పుస్తకాలు అప్పటి ప్రజలకు తేలిగ్గా అర్థమైనట్లే, ఇప్పుడున్న ప్రజలకు కూడా చదవడానికి, అర్థంచేసుకోవడానికి తేలిగ్గా ఉండే ఓ అనువాదం అవసరమని ఆయన భావించాడు. యెహోవాను తెలుసుకునేందుకు నూతనలోక అనువాదం లక్షలమందికి సహాయపడాలని సహోదరుడు నార్ కోరుకున్నాడు.
18. బైబిల్ని అనువదించే విషయంలో పరిపాలక సభ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది?
18 క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం 1963 కల్లా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అలా సహోదరుడు నార్ కోరిక తీరింది. బైబిలు అనువాదకులకు సహాయం చేయడానికి పరిపాలక సభ 1989లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఓ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2005లో, కావలికోట పత్రిక ఏయే భాషల్లో అందుబాటులో ఉందో, ఆ భాషలన్నిటిలోకి బైబిల్ని అనువదించడానికి పరిపాలక సభ అనుమతినిచ్చింది. ఫలితంగా, నూతనలోక అనువాదం మొత్తంగా లేదా భాగాలుగా ప్రస్తుతం 130 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది.
19. ఏ చారిత్రాత్మక సంఘటన 2013లో జరిగింది? తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి తెలుసుకుంటాం?
19 అయితే, కాలం గడుస్తుండగా ఇంగ్లీషు భాషలో మార్పు వచ్చింది కాబట్టి నూతనలోక అనువాదం ఇంగ్లీషు ఎడిషన్‌లోని పదాల్ని కూడా మార్చాల్సి వచ్చింది. 2013, అక్టోబరు 5, 6 తేదీల్లో జరిగిన వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా 129వ వార్షిక కూటానికి నేరుగా అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా మొత్తం 31 దేశాలకు చెందిన 14,13,676 మంది హాజరయ్యారు. ఆ కూటంలో, ఓ పరిపాలక సభ సభ్యుడు నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్‌ను ఇంగ్లీషులో విడుదల చేశాడు. ఆ కూటానికి హాజరైనవాళ్లందరూ ఆశ్చర్యపోయారు, తమ సొంత కాపీని అందుకున్న చాలామంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రసంగీకులు ఆ బైబిలు నుండి వచనాల్ని చదువుతుండగా, ఆ వచనాలు చదవడానికీ అర్థంచేసుకోవడానికీ చాలా తేలిగ్గా ఉన్నాయని హాజరైనవాళ్లందరూ గ్రహించారు. ఈ రివైజ్డ్ ఎడిషన్ గురించిన మరిన్ని విషయాల్ని, అలాగే అది వేరే భాషల్లోకి ఎలా అనువాదం అవుతోందో మనం తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
a ఎజ్రా 4:8–6:18; 7:12-26; యిర్మీయా 10:11; దానియేలు 2:4–7:28 లేఖనాల్ని అరామిక్ భాషలో రాశారు.
b సెప్టువజింటు అంటే “డెబ్భై” అని అర్థం. దీన్ని అనువదించడం సా.శ.పూ. మూడవ శతాబ్దంలో మొదలుపెట్టి సా.శ.పూ. 150 కల్లా పూర్తి చేశారు. ఈ అనువాదం ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే కష్టమైన హీబ్రూ పదాల్ని లేదా వచనాల్ని అర్థంచేసుకోవడానికి నిపుణులకు ఇదెంతో ఉపయోగపడుతోంది.
c మత్తయి తన పుస్తకాన్ని మొదట హీబ్రూ భాషలోనే రాశాడని, ఆ తర్వాత బహుశా ఆయనే దాన్ని గ్రీకు భాషలోకి అనువదించి ఉంటాడని కొంతమంది అంటారు.
d సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషుర్‌లోని 7-9 పేజీల్లో ఉన్న “ఈ గ్రంథమెలా తప్పించుకుని నిలిచింది?” అనే ఆర్టికల్ చూడండి.