కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?

“ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” (అపొస్తలుల కార్యములు 1:⁠6) యేసు తన రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తాడో తెలుసుకోవాలనే కుతూహలంతో శిష్యులు అలా అడిగారు. నేడు, దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు.

యేసు ప్రకటనా పనిలో రాజ్యాన్ని ముఖ్యమైన అంశంగా బోధించాడు కాబట్టి, ఆయన ఆ ప్రశ్నకు జవాబిచ్చివుంటాడని మీరు అనుకోవచ్చు. అవును మీరనుకున్నది నిజమే! ఆయన తన [‘ప్రత్యక్షత,’ NW] అని పిలిచిన నిర్దిష్ట సమయావధి గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు. (మత్తయి 24:​37) ఆ ప్రత్యక్షతకు, మెస్సీయ రాజ్యం స్థాపించబడడానికి మధ్య దగ్గరి సంబంధముంది. ఈ ప్రత్యక్షత అంటే ఏమిటి? క్రీస్తు ప్రత్యక్షత గురించి బైబిలు వెల్లడిచేసే నాలుగు సత్యాలను మనమిప్పుడు పరిశీలిద్దాం.

1. క్రీస్తు మరణించిన చాలాకాలం తర్వాతే పరలోకంలో రాజుగా పరిపాలించడం ప్రారంభిస్తాడు. “రాజ్యము సంపాదించు[కోవడానికి] . . . దూరదేశము​నకు ప్రయాణమై” వెళ్ళిన రాజకుమారుని గురించి ఉపమానం చెబుతూ యేసు తననుతాను ఆ రాజ​కుమారునితో పోల్చుకున్నాడు. (లూకా 19:​12) ఆ ప్రవచనార్థక ఉపమానం ఎలా నెరవేరింది? యేసు మరణించి, పునరుత్థానం చేయబడి, ఆ తర్వాత “దూరదేశమునకు” అంటే పరలోకానికి వెళ్ళాడు. అలాంటి మరో ఉపమానంలోనే యేసు, “బహు కాలమైన తరువాత” మాత్రమే తాను తిరిగి రాజ్యాధికారం పొందుతానని ప్రవచించాడు.​—⁠మత్తయి 25:​19.

యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఈయనయైతే [యేసు] పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు​వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీను​డాయెను.” (హెబ్రీయులు 10:​12, 13) కాబట్టి, యేసు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన చాలాకాలం వేచివుండాల్సివచ్చింది. ఎంతో కాలం క్రితం వాగ్దానం చేయబడిన మెస్సీయ రాజ్యానికి, యెహోవా దేవుడు తన కుమారుణ్ణి రాజుగా చేసినప్పుడు ఆ వేచివుండే కాలం చివరకు ముగిసింది. అప్పుడే క్రీస్తు ప్రత్యక్షత ప్రారంభమయ్యింది. భూమ్మీదున్న మానవులు ఈ మహత్తరమైన సంఘటనను చూస్తారా?

2. ఆ ప్రత్యక్షత మానవులకు కనిపించదు. యేసు తన ‘ప్రత్యక్షతకు’ సంబంధించిన సూచన ఇచ్చాడనే విషయాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. (మత్తయి 24:⁠3, NW] ఒకవేళ ఆయన రాజుగా పరిపాలించడం మానవులకు కనిపించేదైతే ఆయన సూచన ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఉదాహరణకు, మీరు సముద్ర తీరానికి వెళ్తున్నారనుకోండి. అక్కడికి ఎలా వెళ్లాలో చూపించే మార్గ సంకేతాలు మీకు కనిపించవచ్చు. చివరకు మీరు అక్కడికి చేరుకుని, సువిశాల సముద్ర తీరాన నిలబడిన తర్వాత, మీకక్కడ పెద్ద అక్షరాలతో ఇదే “మహాసముద్రం” అని బాణం గుర్తుతో వ్రాయబడివున్న బోర్డు కనిపిస్తుందని అనుకుంటారా? మీరలా అనుకోనే అనుకోరు! మీ కళ్ళతో స్పష్టంగా చూడగలిగే​దానికి గుర్తు ఎందుకు?

తన ప్రత్యక్షత, మానవులు తమ కళ్లతో చూడగలిగేదని సూచించేందుకు కాదుగానీ పరలోకంలో జరగబోయేదని గ్రహించేలా వారికి సహాయం చేసేందుకే యేసు ఆ సూచన​నిచ్చాడు. అందుకే యేసు ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.” (లూకా 17:​20, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అయితే భూమ్మీది ప్రజలు క్రీస్తు ప్రత్యక్షత ప్రారంభమైందని తెలుసుకోవడానికి ఆ సూచన ఎలా సహాయం చేస్తుంది?

3. యేసు ప్రత్యక్షతా కాలంలో ఈ భూమ్మీద విపరీతమైన కష్టాలుంటాయి. పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్న తన ప్రత్యక్షతా కాలంలో, భూమ్మీద యుద్ధాలు, కరవులు, భూకంపాలు, వ్యాధులు, అవినీతి వంటివి గుర్తులుగా ఉంటాయని యేసు చెప్పాడు. (మత్తయి 24:​7-12; లూకా 21:​10, 11) ఆ కష్టాలకు కారకుడెవరు? రాజుగా క్రీస్తు ప్రత్యక్షత ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి, “లోకాధికారి” అయిన సాతానుకు, తనకు ఇక కొంచెం సమయమే మిగిలివుందని తెలుసు, అందుకే వాడు బహు క్రోధము​గలవాడై ఉన్నాడని బైబిలు చెబుతోంది. (యోహాను 12:​31; ప్రకటన 12:​9, 12) సాతాను కోపోద్రేకంతో ఉన్నాడు అనడానికి, క్రీస్తు పరిపాలన ప్రారంభమైంది అనడానికి మన కాలంలో కళ్లకు కనిపించే రుజువులు ఎన్నో ఉన్నాయి. చరిత్రకారులు పెనుమార్పులు జరిగిన సంవత్సరంగా పరిగణించిన 1914 నుండి మరి ముఖ్యంగా ఈ రుజువులు ముందెన్నడూ లేనంతగా లోకవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.

ఇవన్నీ దుర్వార్తల్లా అనిపిస్తాయి కానీ నిజానికి అవి దుర్వార్తలు కావు. అవన్నీ జరుగుతున్నాయంటే మెస్సీయ రాజ్యం ఇప్పుడు పరలోకంలో పరిపాలిస్తోందని అర్థం. అతి త్వరలో ఆ ప్రభుత్వం, భూమంతటిపై పరిపాలించనైయుంది. అలాంటప్పుడు, ప్రజలు ఆ రాజ్య పరిపాలనను అంగీకరించి దాని పౌరులుగా మారేందుకు ఆ రాజ్యం గురించి వారెలా తెలుసుకుంటారు?

4. యేసు ప్రత్యక్షతా కాలంలో లోకవ్యాప్తంగా ప్రకటనా పని జరుగుతుంది. తాను పరిపాలించే కాలం, ‘నోవహు దినాల్లాగే’ ఉంటుందని యేసు చెప్పాడు. * (మత్తయి 24:​37-39) ఈ నోవహు అనే వ్యక్తి దేవుని సేవకుడు. ఆయన కాలంలో దుష్టులను నాశనం చేయడానికి జలప్రళయం రప్పిస్తానని దేవుడు ఆయనతో చెప్పాడు. ఆ జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఓడ నిర్మించమని దేవుడు నోవహుకు ఆదేశించాడు. ఆయన ఓడ నిర్మించడంతోపాటు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:⁠5) దేవుడు త్వరలో తీర్పు తీర్చబోతున్నాడని ఆయన ప్రజలను హెచ్చరించాడు. తన పరిపాలనా కాలంలో కూడా తన అనుచరులు ఇతరులను అలాగే హెచ్చరిస్తారని యేసు చెప్పాడు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని ఆయన ముందే చెప్పాడు.​—⁠మత్తయి 24:​14.

ముందరి ఆర్టికల్‌లో మనం చూసినట్లుగా, దేవుని రాజ్యం ఈ లోకప్రభుత్వాలన్నింటినీ నిర్మూలిస్తుంది. ప్రకటనా పని, ఆ పరలోక ప్రభుత్వం త్వరలో చర్యతీసుకోబోతుందని ప్రజలను హెచ్చరిస్తూ, రాబోయే నాశనాన్ని తప్పించుకుని ఆ రాజ్య పౌరులయ్యే అవకాశాన్ని వారికందరికీ ఇస్తోంది. కాబట్టి ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న ఏమిటంటే, దానికి మీరెలా స్పందిస్తారు?

దేవుని రాజ్య వార్త మీకు శుభవార్తేనా?

యేసు ఒక సాటిలేని నిరీక్షణ గురించి ప్రకటించాడు. వేలాది సంవత్సరాల క్రితం ఏదెనులో తిరుగుబాటు జరిగిన తర్వాత, యెహోవా దేవుడు ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పాలని సంకల్పించాడు. అది పరిస్థితులను సరిదిద్ది, మానవులు పరదైసు భూమిపై నిరంతరం జీవించాలనే దేవుని తొలి ఉద్దేశానికి అనుగుణంగా విశ్వసనీయమైన మానవులకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది. పూర్వమెన్నడో వాగ్దానం చేయబడిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు పరలోకంలో పరి​పాలిస్తోందని తెలుసుకోవడం కన్నా ఉత్తేజకరమైన శుభవార్త ఇంకేముంటుంది? అది, అభూత కల్పనో, నిగూఢమైన విషయమో కాదు, అది ఒక నిజమైన ప్రభుత్వం!

దేవుడు నియమించిన రాజు ప్రస్తుతం తన శత్రువుల మధ్య పరిపాలిస్తున్నాడు. (కీర్తన 110:⁠2) దేవుని నుండి దూరమై, భ్రష్టుపట్టిన ఈ ప్రపంచంలో దేవుని నిజమైన వ్యక్తిత్వమేమిటో తెలుసుకుని, ఆయనను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేవారిని వెదకాలనే తండ్రి కోరికను మెస్సీయ నెరవేరుస్తున్నాడు. (యోహాను 4:​24) దేవుని రాజ్య పరిపాలన క్రింద నిరంతరం జీవించే నిరీక్షణ అన్ని జాతుల, వయసుల, సామాజిక నేపథ్యం గల ప్రజలకు ఉంది. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) మీ ముందున్న ఇంత చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకొమ్మని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఆ నీతియుక్త పరిపాలన క్రింద మీరు నిరంతరం జీవితాన్ని ఆస్వాదించ​గలిగేలా, మీరిప్పుడే దేవుని రాజ్యం గురించి తెలుసుకోండి!​—⁠1 యోహాను 2:​17. (w 08 1/1)

[అధస్సూచి]

^ పేరా 10 కొన్ని బైబిళ్ళు “ప్రత్యక్షత” అనే పదాన్ని అనువదించిన విధానం వల్ల ఏర్పడే తప్పు అభిప్రాయాన్ని సరిదిద్దడానికి యేసు మాటలు మనకు సహాయం చేస్తాయి. కొన్ని అనువాదాలు దానిని “రాకడ,” “రాక,” లేదా “తిరిగి రావడం” అని అనువదించాయి, ఆ పదాలు క్షణకాలంలో జరిగే సంఘటనను మాత్రమే సూచిస్తున్నాయి. అయితే, యేసు తన ప్రత్యక్షతను నోవహు కాలంలోని జలప్రళయానికి అంటే ఒక సంఘటనతో పోల్చలేదు గానీ “నోవహు దినముల”తో అంటే కీలకమైన సమయావధితో పోల్చాడని గమనించండి. ఆ ప్రాచీన కాలవ్యవధిలాగే, క్రీస్తు ప్రత్యక్షత నిర్దిష్టకాలం నిలిచివుంటుంది. ఆ కాలంలోలాగే ప్రజలు ఈ కాలంలో కూడా తమ దైనందిన జీవన వ్యవహారాల్లో ఎంతగా మునిగిపోయుంటారంటే వారు తమకివ్వబడే హెచ్చరికను లక్ష్యపెట్టరు.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

మనం ప్రతీరోజు వినే దుర్వార్తలు త్వరలోనే మంచి పరిస్థితులు రాబోతున్నాయని రుజువుచేస్తున్నాయి

[చిత్రసౌజన్యం]

యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌: U.S. Army photo