కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిణామ సిద్ధాంతం బైబిలుతో పొందికగా ఉందా?

పరిణామ సిద్ధాంతం బైబిలుతో పొందికగా ఉందా?

పరిణామ సిద్ధాంతం బైబిలుతో పొందికగా ఉందా?

దేవుడు జంతువుల నుండి మానవులను సృష్టించడానికి పరిణామ క్రమాన్ని ఉపయోగించాడా? అతిసూక్ష్మమైన ఏకకణ జీవులే కాలక్రమేణా అంచెలంచెలుగా ఎదుగుతూ చేపలుగా, సరీసృపాలుగా, క్షీరదాలుగా, కోతులుగా చివరకు మానవులుగా అయ్యేలా చేశాడా? కొంతమంది శాస్త్రజ్ఞులు, మతనాయకులు అటు పరిణామ సిద్ధాంతాన్ని ఇటు బైబిలును కూడా నమ్ముతామని చెప్పుకుంటారు. బైబిల్లోని ఆదికాండము పుస్తకం ఒక కథలాంటిది మాత్రమే అని వారు అంటారు. మరైతే ‘జంతువుల నుండి మనిషి పరిణమించాడనే సిద్ధాంతం బైబిలుతో పొందికగా ఉందా’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు.

మనమెవరమో, ఎక్కడికి వెళ్తున్నామో, మనమెలా జీవించాలో తెలుసుకోవడానికి మనమెలా ఉనికిలోకి వచ్చామో తెలుసుకోవడం ప్రాముఖ్యం. మానవులు ఎలా ఉనికిలోకి వచ్చారో తెలుసుకున్నప్పుడే మనం దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో, మానవుల భవిష్యత్తు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అర్థంచేసుకోగలం. దేవుడు మన సృష్టికర్తో కాదో ఖచ్చితంగా తెలుసుకోకపోతే మనం ఆయనతో మంచి సంబంధాన్ని కలిగివుండలేము. అందుకే మానవులు ఎలా ఉనికిలోకి వచ్చారు, వారు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి భవిష్యత్తు ఏమిటి అనే వాటి గురించి బైబిలు ఏమి చెబుతోందో మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత పరిణామ సిద్ధాంతం బైబిలుతో పొందికగా ఉందో లేదో చూద్దాం.

మనిషి ఒక్కడేవున్న సమయం

ఒకప్పుడు ఒకే మనిషి ఉండేవాడు అనే విషయాన్ని త్రోసిపుచ్చుతూ జంతువులే కాలక్రమేణా మానవులుగా మారాయని పరిణామవాదులు చెబుతుంటారు. అయితే బైబిలు చెప్పే విషయం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మనమందరం ఒకే మానవుని నుండి వచ్చామని బైబిలు చెబుతోంది. ఆదాము నిజంగానే భూమ్మీద జీవించిన వ్యక్తి అని అది చెబుతోంది. దానిలో ఆయన భార్య పేరు, కొంతమంది పిల్లల పేర్లు ఇవ్వబడ్డాయి. ఆయన ఏమి చేశాడో, ఏమి చెప్పాడో, ఎప్పుడు జీవించాడో, ఎప్పుడు మరణించాడో వివరాలు ఇవ్వబడ్డాయి. యేసు ఆ వృత్తాంతాన్ని విద్యలేని పామరులకు చెప్పే కథగా పరిగణించలేదు. విద్యావంతులైన మతనాయకులతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు: “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెనని . . . మీరు చదువలేదా?” (మత్తయి 19:​3-5) ఆ తర్వాత ఆయన ఆదికాండము 2:​24లో ఆదాముహవ్వల గురించి చెప్పబడిన మాటలను ఉల్లేఖించాడు.

చరిత్ర విషయాలను ఎంతో శ్రద్ధగా పొందుపర్చిన బైబిలు రచయితైన లూకా, ఆదాము కూడా యేసులానే ఒక నిజమైన వ్యక్తి అని తెలియజేశాడు. యేసు వంశావళిని యేసు నుండి మొదటి మానవుడైన ఆదాము వరకు చెప్పుకుంటూ వెళ్లాడు. (లూకా 3:​23-38) అంతేకాదు, ప్రసిద్ధ గ్రీకు పాఠశాలల్లో విద్యనభ్యసించిన తాత్త్వికులతో, మరితరులతో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఇలా అన్నాడు: “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు . . . యావద్భూమిమీద కాపురముండుటకు యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టిం​[చాడు].” (అపొస్తలుల కార్యములు 17:​24-26) మనం ‘ఒకని’ నుండే వచ్చామని బైబిలు స్పష్టంగా బోధిస్తోంది. మరైతే మొదట్లో మానవుల జీవన పరిస్థితుల గురించి బైబిలు చెబుతున్న వివరాలతో పరిణామ సిద్ధాంతం పొందికగా ఉందా?

మానవులు పరిపూర్ణతను కోల్పోవడం

యెహోవా దేవుడు మొదటి మానవుణ్ణి పరిపూర్ణునిగా సృష్టించాడని బైబిలు చెబుతోంది. దేవుడు దేనినీ అపరి​పూర్ణంగా చేయలేడు. ఎందుకంటే సృష్టి వృత్తాంతం ఇలా చెబుతోంది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను . . . దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (ఆదికాండము 1:​27, 31) మరి పరిపూర్ణ మానవుడు ఎలా ఉండేవాడు?

పరిపూర్ణ మానవునికి స్వేచ్ఛాచిత్తం అంటే తాను అనుకున్నది చేసే స్వాతంత్ర్యం ఉండేది, ఆయన దేవుని లక్షణాలను పూర్తిగా అనుకరించగలిగేవాడు. “దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు” అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 7:​29) ఆదాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికే ఎంచుకున్నాడు. అలా తిరుగుబాటు చేయడంవల్ల ఆదాము తనకు, తన సంతానానికి పరిపూర్ణత లేకుండా చేశాడు. మనం మంచి చేయాలనుకున్నా, దానిని చేయలేకపోవడానికి మానవులు పరిపూర్ణత కోల్పోవడమే కారణం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.”​—⁠రోమీయులు 7:​15.

ఒక పరిపూర్ణ మానవుడు చక్కని ఆరోగ్యంతో నిరంతరం జీవిస్తాడని బైబిలు చెబుతోంది. మొదటి మానవుడు దేవునికి అవిధేయుడై ఉండకపోతే, అతడు మరణించి ఉండేవాడు కాదు అని దేవుడు చెప్పడాన్నిబట్టి అది రుజువౌతోంది. (ఆదికాండము 2:​16, 17; 3:​22, 23) ఒకవేళ మానవులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటే లేదా వారిలో తిరుగుబాటు స్వభావం ఉంటే మానవుని సృష్టి “చాలా మంచిదిగా” ఉంది అని యెహోవా చెప్పి ఉండేవాడు కాదు. మానవ శరీరం ఎంతో అద్భుతంగా రూపొందించబడినప్పటికీ మానవులు పరిపూర్ణతను కోల్పోవడం వల్ల వారు వ్యాధులకు, వైకల్యానికి గురౌతున్నారు. కాబట్టి పరిణామ సిద్ధాంతం బైబిలుతో పొందికగా లేదు. పరిణామ సిద్ధాంతం ఆధునిక మానవుణ్ణి ఉన్నత స్థాయికి పరిణమిస్తున్న జంతువుగా వర్ణిస్తుంది. బైబిలు ఆధునిక మానవుణ్ణి పరిపూర్ణ మానవుని సంతానంగా, పరిపూర్ణత నుండి దిగజారుతున్న వ్యక్తిగా వర్ణిస్తోంది.

దేవుడు మానవుణ్ణి చేయడానికి పరిణామ క్రమాన్ని ఉపయోగించాడనేది, బైబిల్లో వర్ణించబడిన దేవుని లక్షణాలతో కూడా పొందికగా లేదు. ఎందుకంటే, ఒకవేళ దేవుడు పరిణామ క్రమాన్ని ఉపయోగించివుంటే నేడు మానవజాతి వ్యాధిగ్రస్తులవడానికి, వారి బాధలకు ఆయనే కారకుడనే భావం వస్తుంది. అయితే దేవుని గురించి బైబిలు, “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు” అని చెబుతోంది. (ద్వితీయోపదేశకాండము 32:​4, 5) కాబట్టి దేవుడు పరిణామ క్రమాన్ని ఉపయోగించలేదు, గనుక నేడు మానవులు అనుభవిస్తున్న బాధలకు ఆయన కారణం కాదు. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా తిరుగు​బాటు చేసి తనకు, తన సంతానానికి పరిపూర్ణతను పోగొట్టుకోవడం వల్లే వారికి కష్టాలు ఎదురయ్యాయి. మనం ఇప్పటివరకు ఆదాము గురించి పరిశీలించాం, ఇప్పుడు యేసు గురించి పరిశీలిద్దాం. యేసు గురించి బైబిలు చెప్పే విషయాలతో పరిణామ సిద్ధాంతం పొందికగా ఉందా?

పరిణామ సిద్ధాంతాన్ని, క్రైస్తవత్వాన్ని ఈ రెంటినీ మీరు నమ్మవచ్చా?

“క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను.” అది క్రైస్తవుల ప్రాథమిక బోధల్లో ఒకటనే విషయం మీకు తెలిసేవుండవచ్చు. (1 కొరింథీయులు 15:⁠3; 1 పేతురు 3:​18) ఆ బోధతో పరిణామ సిద్ధాంతం ఎందుకు పొందికగా లేదో అర్థం చేసుకోవడానికి ముందుగా బైబిలు మనల్ని పాపులు అని ఎందుకు పిలుస్తోందో, ఆ పాపం వల్ల మనకేమి సంభవిస్తోందో తెలుసుకోవాలి.

మనం దేవుని మహిమాన్విత లక్షణాలైన ప్రేమ, న్యాయం వంటివాటిని పరిపూర్ణంగా అనుకరించలేము కాబట్టి మనమందరం పాపులమని చెప్పవచ్చు. అందుకే బైబిలు, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని చెబుతోంది. (రోమీయులు 3:​23) మరణానికి పాపమే కారణమని బైబిలు బోధిస్తోంది. “మరణపు ముల్లు పాపము” అని 1 కొరింథీయులు 15:⁠56 చెబుతోంది. మనం అనారోగ్యం పాలవడానికి మనకు వారసత్వంగా సంక్రమించిన పాపం కూడా ఒక ముఖ్య కారణం. మనం వ్యాధుల బారిన పడడానికి, మనలోని పాపానికి మధ్య సంబంధముందని సూచిస్తూ యేసు పక్షవాయువుగల వ్యక్తితో, “నీ పాపములు క్షమింపబడియున్నవి” అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి బాగయ్యాడు.​—⁠మత్తయి 9:​2-7.

మరి యేసు మరణం మనకెలా సహాయం చేస్తుంది? బైబిలు ఆదాముకు యేసుక్రీస్తుకు మధ్యవున్న తారతమ్యాన్ని చూపిస్తూ ఇలా చెబుతోంది: “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” (1 కొరింథీయులు 15:​22) తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా యేసు, మనం ఆదాము నుండి వారసత్వంగా పొందిన పాపానికి మూల్యం చెల్లించాడు. కాబట్టి యేసుపై విశ్వాసముంచి, ఆయనకు లోబడేవారు, ఆదాము పోగొట్టుకున్న దానిని అంటే నిరంతరం జీవించే భావినిరీక్షణను పొందుతారు.​—⁠యోహాను 3:​16; రోమీయులు 6:​23.

మరిప్పుడు మీరు పరిణామ సిద్ధాంతం క్రైస్తవత్వంతో పొందికగా లేదనే విషయాన్ని గ్రహించారా? “ఆదామునందు అందరు మృతిపొందుచున్నాము” అనే విషయాన్ని మనం సందేహిస్తే, “క్రీస్తునందు అందరు బ్రదికింపబడ[తా]రు” అని మనమెలా ఆశించగలం?

పరిణామ సిద్ధాంతం మనుష్యులకు ఎందుకు ఆకర్షణీయంగా ఉంది?

పరిణామ సిద్ధాంతం లాంటి బోధలు ఎలా జనాదరణ పొందుతాయో వెల్లడిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథల​వైపునకు తిరుగుకాలము వచ్చును.” (2 తిమోతి 4:​3, 4) పరిణామ సిద్ధాంతం విజ్ఞానపరంగా బోధించబడుతున్నప్పటికీ, అది నిజానికి మతపరమైన సిద్ధాంతం. అది జీవన తత్వంపట్ల ఏ దృక్కోణంతో ఉండాలో, దేవునిపట్ల ఎలాంటి వైఖరితో ఉండాలో బోధిస్తోంది. దాని నమ్మకాలు, మానవుల్లో అంతర్లీనంగా ఉండే స్వార్థపూరిత, స్వేచ్ఛాపూర్వక ప్రవృత్తులను ఆకర్షిస్తాయి. పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే​వారిలో చాలామంది తాము దేవుణ్ణి కూడా నమ్ముతున్నామని చెబుతారు. అయితే, వారు దేవుడనేవాడు దేనినీ సృష్టించ​లేదని, మానవుల విషయాల్లో జోక్యం చేసుకోనివాడని, ప్రజలకు తీర్పుతీర్చనివాడని అనుకుంటారు. ఉన్నవీ లేనివీ వినేందుకు ఉబలాటపడే వారికే ఈ పరిణామ సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది.

పరిణామ సిద్ధాంతాన్ని బోధించేవారు తరచూ తమ “స్వకీయ దురాశల” వల్ల, అంటే పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించే చాలామంది వైజ్ఞానికుల్లో ఒకరిగా మెలగాలనే కోరికను​బట్టి అలా బోధిస్తారు గానీ వాస్తవాలనుబట్టి కాదు. జీవకణాల సంక్లిష్టమైన కార్యవిధానం గురించి దాదాపు తన జీవితకాలమంతా అధ్యయనం చేసిన జీవరసాయన శాస్త్రవేత్త మైఖెల్‌ బిహి, కణనిర్మాణం పరిణమించడం గురించి బోధించేవాళ్ళు తమ వాదన సరైనదని నిరూపించుకోవడానికి వారికి ఎలాంటి ఆధారం లేదని వివరించారు. ఈ పరమాణువులు పరిణమించి వేరేవాటిగా మారే అవకాశం ఉందా? “పరమాణువులు పరిణమించడం అనేది వైజ్ఞానికపరంగా రుజువు చేయలేని విషయం. వైజ్ఞానికపరమైన ప్రసిద్ధ పత్రికలు, ప్రత్యేక పత్రికలు లేదా పుస్తకాల్లాంటి ఏ సాహిత్యంలోనూ నిజమైన, సంక్లిష్టమైన జీవరసాయన వ్యవస్థల్లో పరమాణువులు పరిణమించాయని గానీ, అలా జరిగే అవకాశం ఉందని గానీ ఇంతవరకూ ఎవరూ పేర్కొనలేదు. . . . పరమాణువుల పరిణామం విషయంలో డార్విన్‌ చేసే వాదన వట్టి భూటకం” అని బిహి వ్రాశాడు.

పరిణామవాదులు తాము రుజువు చేయలేని విషయాన్ని గురించి ఎందుకు అంత బలంగా వాదిస్తారు? దానికి కూడా జవాబిస్తూ, బిహి ఇలా అంటున్నాడు: “అనేకులు, చివరకు ప్రసిద్ధ వైజ్ఞానికుల్లో కూడా అనేకులు మానవాతీత శక్తి ఎదో ప్రకృతిని సృష్టించింది అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.

మేధావుల్లా కనిపించాలనే తపనతో ఉండే చాలామంది మతనాయకులకు కూడా ఈ సిద్ధాంతం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వీరు అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు వ్రాసిన ఉత్తరంలో వర్ణించినవారిలానే ఉన్నారు. ఆయనిలా వ్రాశాడు: “దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; . . . ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట​వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమ​పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.” (రోమీయులు 1:​19-22) అలాంటి అబద్ధ బోధకుల బోధలు మిమ్మల్ని మోసం చేయకుండా మీరెలా జాగ్రత్తపడవచ్చు?

సాక్ష్యాధారాలనుబట్టి సృష్టికర్తను విశ్వసించండి

విశ్వాసాన్ని నిర్వచిస్తున్నప్పుడు బైబిలు సాక్ష్యాధారాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అదిలా చెబుతోంది: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై​యున్నది.” (హెబ్రీయులు 11:⁠1) సృష్టికర్త ఉన్నాడని నిరూపించే సాక్ష్యాధారాలున్నప్పుడే దేవునిపై నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. మీరు ఆ సాక్ష్యాధారాలను ఎక్కడ కనుగొనవచ్చో బైబిలు చూపిస్తోంది.

దైవ ప్రేరితుడైన బైబిలు రచయిత దావీదు ఇలా వ్రాశాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (కీర్తన 139:​14) ఎక్కడో ఎందుకు మీ శరీరాన్ని, మీ చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల శరీరాల అద్భుతమైన రూపకల్పనను ఆలోచించడానికి మీరు సమయం తీసుకుంటే మన సృష్టికర్తకున్న జ్ఞానంపట్ల మనలో భక్తిపూర్వక భయాన్ని నింపుతుంది. మనం జీవించి ఉండేలా మన శరీరంలోని వేలాది వ్యవస్థల్లో ఇమిడివున్న ప్రతీ అవయవం ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాక, విశ్వంలోని ప్రతీది ఎంతో ఖచ్చితంగా, క్రమపద్ధతిలో రూపొందించబడింది అనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. దావీదు ఇలా వ్రాశాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.”​—⁠కీర్తన 19:⁠1.

సృష్టికర్త గురించి బైబిల్లో ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. దానిలోని 66 పుస్తకాలూ ఒకే అంశాన్ని గురించి ప్రస్తావించడం, దానిలోని ఉన్నత నైతిక ప్రమాణాలు, దానిలో ముందే తెలియజేయబడ్డ విషయాలన్నీ ఖచ్చితంగా జరగడం వంటివన్నీ దాని గ్రంథకర్త సృష్టికర్తే అనడానికి సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. బైబిలు బోధలను అర్థం చేసుకోవడం ద్వారా అది నిజంగా సృష్టికర్త వాక్యమనే నమ్మకం కూడా మీకు కలుగుతుంది. ఉదాహరణకు, బాధలు ఎందుకు ఉన్నాయి, దేవుని రాజ్యం అంటే ఏమిటి, మానవుల భవిష్యత్తు ఏమిటి, సంతోషాన్ని ఎలా కనుగొనవచ్చు వంటి విషయాల గురించి బైబిలు చెప్పే విషయాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు దేవుని జ్ఞానం ఎంతటిదో స్పష్టంగా కనిపిస్తుంది. “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు” అని వ్రాసిన పౌలులాగే మీరూ దేవుణ్ణి స్తుతించాలనుకుంటారు.​—⁠రోమీయులు 11:​33.

మీరు సాక్ష్యాధారాలను పరిశీలిస్తుండగా మీ విశ్వాసం బలపడుతుంది. బైబిలు చదువుతున్నప్పుడు మీరు సృష్టికర్త స్వరాన్నే వింటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఆయనిలా చెబుతున్నాడు: “భూమిని కలుగజేసిన​వాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వ​సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.” (యెషయా 45:​12) అవును, సమస్తాన్ని సృష్టించింది యెహోవాయేనని చూపించే సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు మీరు చేసే కృషి వృథాకాదు. (w 08 1/1)

[14వ పేజీలోని బ్లర్బ్‌]

‘దేవుడు యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు’ అని అపొస్తలుడైన పౌలు విద్యావంతులైన గ్రీకులకు చెప్పాడు

[15వ పేజీలోని బ్లర్బ్‌]

పరిణామ సిద్ధాంతం ఆధునిక మానవుణ్ణి ఉన్నత స్థాయికి పరిణమిస్తున్న జంతువుగా వర్ణిస్తోంది. బైబిలు ఆయనను పరిపూర్ణ మానవుని సంతానంగా, పరిపూర్ణత నుండి దిగజారుతున్న వ్యక్తిగా వర్ణిస్తోంది

[16వ పేజీలోని బ్లర్బ్‌]

“పరమాణువులు పరిణమించడం అనేది వైజ్ఞానికపరంగా రుజువు చేయలేని విషయం”

[17వ పేజీలోని బ్లర్బ్‌]

జీవరాశుల అద్భుతమైన రూపకల్పన, మన సృష్టికర్తకున్న జ్ఞానంపట్ల మనలో భక్తపూర్వక భయాన్ని నింపుతుంది