మా పాఠకులకు
మా పాఠకులకు
ఈసంచిక మొదలుకొని కావలికోట పత్రిక స్వరూపంలో కొన్ని మార్పులుంటాయని మీకు తెలియజేయడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఎలాంటి మార్పులుంటాయో చెప్పే ముందు, వేటిలో మార్పులు ఉండవో చూద్దాం.
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అనే ఈ పత్రిక పేరులో ఎలాంటి మార్పూ ఉండదు. కాబట్టి కావలికోట యెహోవా దేవుణ్ణి సత్యదేవునిగా ఘనపరుస్తూనే ఉంటుంది, ఆయన రాజ్యసువార్తతో పాఠకులను ఓదారుస్తూనే ఉంటుంది. ఈ సంచికలోని 5 నుండి 9 పేజీల్లోవున్న సమాచారం ఆ రాజ్యమేమిటో, అది ఎప్పుడు వస్తుందో చర్చిస్తుంది. అంతేకాక, కావలికోట అనేక దశాబ్దాలుగా చేస్తున్నట్లుగానే యేసుక్రీస్తుపై పాఠకులకున్న విశ్వాసాన్ని బలపరుస్తుంది, బైబిల్లోని సత్యాలను సమర్థిస్తుంది, అలాగే బైబిలు ప్రవచనాల ఆధారంగా ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల అర్థాన్ని వివరిస్తుంది.
మరైతే దీనిలో వచ్చే మార్పులేమిటి? తెలుగులో వచ్చే త్రైమాసిక ప్రతిలోని కొన్ని ఉత్తేజకరమైన కొత్త మార్పులేమిటో గమనించండి. *
ఈ ప్రతిలో మిమ్మల్ని ఆలోచింపజేసే వివిధ ఆర్టికల్స్ వస్తుంటాయి. “మీకిది తెలుసా?” అనే ఆర్టికల్ బైబిలు వృత్తాంతాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే ఆసక్తికరమైన నేపథ్య సమాచారాన్ని అందిస్తుంది. “దేవునికి దగ్గరవ్వండి” అనే ఆర్టికల్, ఆ యా బైబిలు భాగాలనుండి యెహోవా గురించి ఏమి నేర్చుకోవచ్చో తెలియజేస్తుంది. “మా పాఠకుల ప్రశ్న” అనే ఆర్టికల్, చాలామంది అడిగే బైబిలు ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఉదాహరణకు, “దేవుని రాజ్యం మీ హృదయంలోనే ఉందా?” అని చాలామంది అడుగుతుంటారు. దానికి సమాధానం మీకు 13వ పేజీలో కనిపిస్తుంది.
కుటుంబాలకు ప్రయోజనకరమైన కొన్ని ఆర్టికల్స్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాయి. “కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు” అనే ఆర్టికల్ వాటిలో ఒకటి. అది నిజ జీవితంలో ఎదురయ్యే కుటుంబ సమస్యల గురించి చర్చించడమేకాక, అలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేయగలవో చూపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చదివి వినిపించడానికి “మీ పిల్లలకు నేర్పించండి” అనే ఆర్టికల్ ఉంటుంది. “మన యువతకు” అనే మరో ఆసక్తికరమైన ఆర్టికల్‌లో, యౌవనుల కోసం బైబిల్లోని విషయాలను అధ్యయనం చేయించే పాఠం ఉంటుంది.
ఈ త్రైమాసిక ప్రతిలో మరికొన్ని ఆర్టికల్స్ కూడా అప్పుడప్పుడూ వస్తాయి. “వారి విశ్వాసాన్ని అనుసరించండి” అనే ఆర్టికల్ బైబిల్లోని వ్యక్తుల మాదిరిని అనుసరించమని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, ఈ ప్రతిలోని 18-21 పేజీల్లో ప్రవక్తయైన ఏలీయా గురించిన ఉత్తేజకరమైన వృత్తాంతాన్ని మీరు చదువుతారు, ఆయన విశ్వాసాన్ని ఎలా అనుసరించాలో నేర్చుకుంటారు. “. . . నుండి వచ్చిన ఉత్తరం” అనే ఆర్టికల్‌లో, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోవున్న మిషనరీలు, ఇతరులు స్వయంగా వ్రాసిన నివేదికలు ఉంటాయి. “యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు” అనే ఆర్టికల్, ప్రాథమిక బైబిలు బోధలను సరళమైన భాషలో వివరిస్తుంది.
బైబిలును గౌరవిస్తూ, అది నిజంగా ఏమి బోధిస్తోందో తెలుసుకోవాలనుకునే కావలికోట పాఠకులకు ఇది ఆకర్షణీయంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఈ పత్రిక, బైబిలు సత్యాలపట్ల మీకున్న అభిలాషను తీరుస్తుందని మేము ఆశిస్తున్నాం.
ప్రకాశకులు (w 08 1/1)
[అధస్సూచి]
^ పేరా 4 కావలికోట పత్రిక ఇప్పటినుండి రెండు ప్రతులుగా ఉంటుంది. త్రైమాసిక ప్రతి సాధారణ ప్రజల కోసం తయారుచేయబడుతుంది. ప్రతీనెల 15వ తేదీతో వచ్చే అధ్యయన ప్రతిని యెహోవాసాక్షులు తమ సంఘకూటాల్లో అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు, ఆ కూటాలకు ఎవరైనా హాజరవ్వవచ్చు.