మీకిది తెలుసా?
మీకిది తెలుసా?
జ్యోతిష్కులు యేసును చూడడానికి ఎప్పుడు వెళ్ళారు?
“తూర్పుదేశపు జ్ఞానులు [‘జ్యోతిష్కులు,’ NW]” యేసును చూడడానికి వెళ్లి, ఆయనకు కానుకలు ఇచ్చారని మత్తయి సువార్త మనకు చెబుతోంది. (మత్తయి 2:1-12) ఆదిమ భాషలోని మూలపాఠం ప్రకారం, “జ్ఞానులు” అని పిలువబడే వారు నిజానికి జ్యోతిష్కులు. యేసును చూడడానికి ఎంతమంది జ్యోతిష్కులు వెళ్ళారో బైబిలు చెప్పడం లేదు. అలాగే, అనేకమంది నమ్ముతున్నట్లు ముగ్గురే వెళ్ళారని చెప్పడానికీ ఎలాంటి స్థిరమైన ఆధారంలేదు; బైబిలు వృత్తాంతంలో కూడా వారి పేర్లు లేవు.
న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ స్టడీ బైబిల్ మత్తయి 2:10-11 వచనాల గురించి ఇలా వ్యాఖ్యానిస్తోంది: “పారంపర్య గాథల ప్రకారం నమ్మబడుతున్నట్లు, యేసు పుట్టినరోజు రాత్రి ఆయనను చూడడానికి జ్యోతిష్కులు వెళ్లలేదు, కానీ, గొర్రెల కాపరులే పశువుల కొట్టానికి వెళ్ళారు. ఆ జ్యోతిష్కులు కొన్ని నెలల తర్వాత వెళ్లి ‘ఇంట్లోవున్న శిశువును’ చూశారు.” ఇది, హేరోదు ఆ పసిబాలుడిని చంపాలనే ఉద్దేశంతో బేత్లెహేములోను దాని పరగణాల్లో రెండుసంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసున్న చిన్నపిల్లలను చంపమని ఇచ్చిన ఆజ్ఞనుబట్టి కూడా రుజువౌతోంది. “జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి” లెక్కించి అతను ఆ వయసువారిని చంపమని ఆజ్ఞాపించాడు.—మత్తయి 2:16.
యేసు పుట్టినరోజు రాత్రే ఆ జ్యోతిష్కులు ఆయనను చూసి బంగారం, ఇతర విలువైన కానుకలు ఇచ్చివుంటే, 40 దినాల తర్వాత యేసును ప్రతిష్ఠించడానికి యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు మరియ రెండు పక్షుల్ని మాత్రమే అర్పించివుండేదికాదు. (లూకా 2:22-24) గొర్రెపిల్లను తేలేకపోయిన పేదవారి కోసం ధర్మశాస్త్రంలో పక్షుల్ని ఇచ్చే ఏర్పాటు ఉండేది. (లేవీయకాండము 12:6-8) అయితే ఆ విలువైన కానుకలు యేసు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఆర్థికంగా సహాయం చేసివుండవచ్చు.—మత్తయి 2:13-15.
లాజరు సమాధి దగ్గరకు రావడానికి యేసుకు నాలుగు రోజులు ఎందుకు పట్టింది?
నిజానికి, యేసు కావాలనే ఆలస్యం చేశాడనిపిస్తోంది. మనమెందుకు అలా చెప్పవచ్చు? యోహాను 11వ అధ్యాయంలోని ఆ వృత్తాంతాన్ని పరిశీలించండి.
బేతనియకు చెందిన లాజరు యేసుకు స్నేహితుడు. లాజరు అనారోగ్యం పాలైనప్పుడు ఆయన అక్కాచెల్లెళ్ళు యేసుకు కబురు పంపించారు. (1-3 వచనాలు) ఆ సమయంలో యేసు తానున్న ప్రాంతం నుండి బేతనియకు చేరుకోవడానికి రెండు రోజులు పడుతుంది. (యోహాను 10:40) ఆ వార్త యేసుకు చేరుకునేసరికే లాజరు బహుశా మరణించి ఉండవచ్చు. ఆ వార్త విన్న యేసు ఏమిచేశాడు? ఆయన “తానున్న చోటనే యింక రెండు దినములు” ఉండి ఆ తర్వాత బేతనియకు బయలుదేరాడు. (6, 7 వచనాలు) కాబట్టి, రెండు రోజులు ఆగి, ఆ తర్వాత రెండు రోజులు ప్రయాణించి వచ్చేసరికి, ఆయన లాజరు మరణించిన నాలుగో రోజున సమాధి దగ్గరకు చేరుకున్నాడు.—17వ వచనం.
గతంలో యేసు రెండు పునరుత్థానాలు చేశాడు. ఒక వ్యక్తిని మరణించిన కొద్దిసేపట్లోనే పునరుత్థానం చేస్తే, మరొకరిని మరణించిన కొన్ని గంటల తర్వాత పునరుత్థానం చేశాడు. (లూకా 7:11-17; 8:49-55) మరి మరణించి నాలుగు రోజులై, అప్పటికే శరీరం కుళ్ళిపోవడం ప్రారంభమైన వ్యక్తిని కూడా ఆయన లేపగలడా? (39వ వచనం) ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక బైబిలు రెఫరెన్సు గ్రంథం చెబుతున్నట్లుగా యూదుల్లో, “మరణించి నాలుగు రోజులైన తర్వాత ఒక వ్యక్తికి ఇక ఎలాంటి నిరీక్షణ ఉండదు; శరీరం అప్పటికే చాలామట్టుకు కుళ్ళిపోవడమే కాక, మూడు రోజులు ఆ శరీరంపై అల్లాడిన ఆత్మ దానిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది” అనే నమ్మకం ప్రబలంగా ఉండేది.
ఆ సమాధి దగ్గర సమకూడిన వారిలో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే, ఇప్పుడు వారు యేసుకు మరణంపై ఉన్న శక్తిని కళ్లారా చూడబోతున్నారు. యేసు, తెరవబడిన సమాధి ఎదుట నిలబడి “లాజరూ, బయటికి రమ్ము” అని బిగ్గరగా అన్నాడు. అప్పుడు ‘చనిపోయినవాడు వెలుపలికి వచ్చాడు.’ (43, 44 వచనాలు) అవును, అనేకమంది మరణించిన తర్వాత ఆత్మ జీవించి ఉంటుందని తప్పుగా అభిప్రాయపడతారు, అయితే మరణించినవారికున్న నిజమైన నిరీక్షణ పునరుత్థానమే.—ఆదికాండము 3:19; యోహాను 11:25. (w 08 1/1)