కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పక నెరవేరతాయి

యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పక నెరవేరతాయి

యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పక నెరవేరతాయి

“దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. . . . ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియ​జేయుచున్నాను.” (యెషయా 46:​9, 10) భవిష్యత్తు గురించి ఖచ్చితంగా చెప్పగల సామర్థ్యమున్న యెహోవాయే అలా అంటున్నాడు.

భవిష్యత్తు ఖచ్చితంగా ఎలా ఉంటుందో మానవులు చెప్పలేరనే విషయం అందరికీ తెలిసిందే. బైబిలు ప్రవచనాల పుస్తకం కాబట్టి, సత్యాన్వేషకులందరూ దాని గ్రంథకర్త దేవుడే అని బైబిల్లోని వాదన సరైనదో కాదో పరిశోధించడానికి పూనుకోవాలి. ఇప్పటికే నెరవేరిన కొన్ని బైబిలు ప్రవచనాలను మనమిప్పుడు పరిశీలిద్దాం.

ప్రాచీన నాగరికతలు

ఎదోము, మోయాబు, అమ్మోను దేశాలు శాశ్వతంగా నాశనం చేయబడతాయని దేవుడు ప్రవచించాడు. (యిర్మీయా 48:​42; 49:​17, 18; 51:​24-26; ఓబద్యా 8, 18; జెఫన్యా 2:​8, 9) ఒక జనాంగంగా అవి ఉనికిలో లేకుండా పోవడాన్నిబట్టి దేవుని ప్రవచన వాక్యం ఖచ్చితమైనదని రుజువౌతోంది.

ఒక జనాంగం ఎంత పెద్దదైనా కాలక్రమంలో అంతరించి​పోతుందని ఎవరైనా ప్రవచించగలరనీ ఒకరు వాదించవచ్చు. అయితే, బైబిలు కేవలం వాటి నాశనం గురించే చెప్పడం లేదనే ప్రాముఖ్యమైన వాస్తవాన్ని వారు విస్మరిస్తారు. ఉదాహరణకు, బబులోను నాశనం చేయబడే తీరు గురించిన వివరాలు బైబిల్లో తెలియజేయబడ్డాయి. కోరెషు నాయకత్వంలో మాదీయులు ఆ నగరాన్ని జయిస్తారనీ, నగరానికి ప్రాకారంలా ఉన్న నదులు ఎండిపోతాయనీ బైబిలు ప్రవచించింది.​—⁠యెషయా 13:​17-19; 44:27-45:⁠1.

స్వాధీనం చేసుకోబడిన దేశాలన్నీ శాశ్వతంగా కనుమరుగౌతాయని బైబిలు ప్రవచించలేదు. యెరూషలేము విషయాన్నే తీసుకోండి, బబులోనీయులు యెరూషలేమును నాశనం చేస్తారని దేవుడు ప్రవచిస్తున్నప్పుడు ఆ పట్టణం పునఃస్థాపించబడుతుందని ఆయన చెప్పాడు, సాధారణంగా బబులోనీయులు ఎన్నడూ బంధీలను విడుదల చేయరని తెలిసినా ఆయన అలా ప్రవచించాడు. (యిర్మీయా 24:​4-7; 29:​10; 30:​18, 19) అలాగే జరిగింది. యూదా సంతతివారు నేడు కూడా ఒక విభిన్న జాతిగా ఉనికిలో ఉన్నారు.

అంతేకాక, ఐగుప్తు ప్రపంచాధిపత్యాన్ని కోల్పోతుందనీ, కానీ “ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును” అని కూడా యెహోవా ప్రవచించాడు. కొంతకాలానికి, శక్తివంతమైన ఆ ప్రాచీన రాజ్యం ‘హీనమైన రాజ్యంగా’ మారుతుంది. (యిర్మీయా 46:​25, 26; యెహెజ్కేలు 29:​14, 15) అక్షరాలా అదే నిజమయ్యింది. అంతేకాదు, గ్రీసు కూడా ప్రపంచాధిపత్యాన్ని కోల్పోతుందని యెహోవా ప్రవచించాడు. అయితే అది కనుమరుగైపోతుందని మాత్రం ఎన్నడూ చెప్పలేదు. యెహోవా కనుమరుగౌతాయని చెప్పిన నాగరికతలు అంతరించిపోవడాన్నిబట్టి, ఆయన కనుమరుగౌతాయని ప్రవచించని నాగరికతలు ఇప్పటికీ ఉనికిలో ఉండడాన్నిబట్టి మనకేమి తెలుస్తుంది? దేవుని వాక్యంలో నిజమైన, నమ్మదగిన ప్రవచనాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఆశ్చర్యకరమైన వివరాలు

పైన పేర్కొనబడినట్లుగా బబులోను నాశనం చేయబడే తీరు గురించి యెహోవా ఎన్నో వివరాలనిచ్చాడు. అదేవిధంగా తూరు పట్టణపు నాశనం గురించి చెబుతూ యెహెజ్కేలు పుస్తకం, దాని రాళ్లు, దాని కలప, దాని మట్టి ‘నీళ్లలో ముంచివేయబడతాయని’ చెప్పింది. (యెహెజ్కేలు 26:​4, 5, 12) సా.శ.పూ. 332లో అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ తాను అప్పటికే నాశనం చేసిన తూరు పట్టణభాగపు శిథిలాలతో తన సైన్యాలచేత తూరు ద్వీపభాగానికి వారధిలాంటిది కట్టించినప్పుడు అది నెరవేరింది.

దానియేలు 8:​5-8, 21, 22 మరియు 11:​3, 4 వచనాల్లో నమోదుచేయబడిన ప్రవచనంలో, ఎంతో గొప్పవాడైన “గ్రేకులరాజు” గురించిన ఉత్తేజకరమైన వివరాలు కూడా ఇవ్వబడ్డాయి. ఈ రాజు తన అధికారం ఉచ్ఛస్థాయికి చేరుకున్న తర్వాత చనిపోతాడనీ, అతని రాజ్యాన్ని నలుగురు పంచుకుంటారనీ కానీ వారు అతని కుమారులు కాదని తెలియజేయబడింది. ఆ మాటలు రాయబడిన 200 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ ప్రవచించబడినట్లే ఆయన గొప్ప రాజయ్యాడు. అతను అకాల మరణానికి గురయ్యాడని, చివరకు అతని రాజ్యాన్ని అతని కుమారులుకాక అతని నలుగురు సైన్యాధిపతులు పంచుకున్నారని చరిత్ర చెబుతోంది.

సంఘటన జరిగిన తర్వాత ఆ ప్రవచనం రాయబడి ఉండవచ్చని కొందరు విమర్శకులు వాదిస్తారు. అయితే, దానియేలు పుస్తకంలోని పైన పేర్కొనబడిన ప్రవచనాన్ని మళ్లీ ఒకసారి చూడండి. దీనిని ఒక ప్రవచనంగా తీసుకుంటే దీనిలోని వివరాలు అసాధారణమైనవని చెప్పవచ్చు. కానీ చరిత్రనే ప్రవచనంగా మార్చారనుకుంటే మాత్రం ఆ వాదనకు స్పష్టమైన రుజువులు లేవు అన్నట్లు మీకు అనిపించడంలేదా? అలెగ్జాండర్‌ చనిపోయిన తర్వాత జీవించిన ఒక మోసకారి తాను రాసింది ప్రవచనమని చెప్పి పాఠకుల్ని ఆకట్టుకోవాలనుకుంటే, అలెగ్జాండర్‌ చనిపోయిన వెంటనే అతని ఇద్దరు కుమారులు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తారనీ, కానీ వారు హత్యచేయబడతారనీ ఎందుకు చెప్పలేదు? అలెగ్జాండర్‌ చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాతే అతని నలుగురు సైన్యాధిపతులు అతని సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని పొందుతారని ఎందుకు ప్రస్తావించలేదు? ఆ మాటకొస్తే అసలు ఆ గొప్ప రాజు పేరును, అతని నలుగురు సైన్యాధిపతుల పేర్లను ఆయన ఎందుకు పేర్కొనలేదు?

బైబిల్లోని ప్రవచనాలు వాటి సంబంధిత సంఘటనలు జరిగిపోయిన తర్వాతే రాయబడ్డాయన్న వాదన ఎంతోకాలంగా వినిపిస్తూనేవుంది, అయితే అది నిజమని నిరూపించబడలేదు. ఆధారాలను పరిశీలించక ముందే, భవిష్యత్‌ సంఘటనల గురించి చెప్పడం అసాధ్యమని నమ్మేవారే అలా వాదిస్తారు. బైబిలు దేవుని వాక్యమని వారు అంగీకరించరు కాబట్టి వారు గత్యంతరంలేక ప్రతీ విషయాన్ని మానవ దృక్కోణం నుండే వివరిస్తున్నారు. అయితే, దేవుడు బైబిలు రచయిత తానేనని రుజువుచేయడానికి జ్ఞానవంతంగా అవసరమైనన్ని ప్రవచనాలనే రాయించిపెట్టాడు. *

మీరు నిర్దిష్ట ప్రవచనాల గురించి, వాటి నెరవేర్పు గురించి సమయం తీసుకుని ధ్యానిస్తే, అవి మీ విశ్వాసాన్ని బలపర్చగలవు. మీరెందుకు బైబిల్లోని ప్రవచనాలను అధ్యయనం చేయకూడదు? ఈ విషయంలో బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 200వ పేజీలోవున్న పట్టిక మీకు సహాయకరంగా ఉండవచ్చు. * మీరు ఈ సలహాను పాటించాలనుకుంటే, మీ విశ్వాసాన్ని బలపర్చుకోవాలనే లక్ష్యంతో అధ్యయనాన్ని మొదలుపెట్టండి. సమాచారాన్ని కేవలం త్వరత్వరగా చదువుకుంటూ వెళ్ళిపోకండి. బదులుగా, యెహోవా చెప్పిన ప్రవచనాలు అక్షరాలా నెరవేరతాయనే విషయం గురించి ధ్యానించండి. (w 08 1/1)

[అధస్సూచీలు]

^ పేరా 13 బైబిలు ప్రవచనాలు వాటి సంబంధిత సంఘటనలు జరిగిపోయిన తర్వాతే రాయబడ్డాయనే విషయం తప్పు అని నిరూపించే మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన, మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 106-111 పేజీలను చూడండి. కావలికోట ఆగస్టు 15, 1991 4-9 పేజీలు కూడా చూడండి.

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

జీవితంలో అవసరమయ్యే సూత్రాలు

మీరు ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల ఉత్థానపతనాల గురించి అంత ఖచ్చితంగా ప్రవచించిన దేవుడే జీవితంలో మనకు అవసరమయ్యే సూత్రాలను కూడా బైబిల్లో రాయించాడు. వాటిలో ఇవి కొన్ని:

మీరు దేనిని విత్తుతారో ఆ పంటనే కోస్తారు.​—గలతీయులు 6:⁠7.

తీసుకోవడంకన్నా ఇవ్వడంలో ఆనందం ఉంది.​—అపొస్తలుల కార్యములు 20:​35.

ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవడంలోనే సంతోషం ఉంది.​—మత్తయి 5:⁠6.

మీరు మీ జీవితంలో ఈ సూత్రాలను పాటిస్తే అవి మీకు సంతోషాన్ని, విజయాన్ని ఇస్తాయనే నమ్మకంతో ఉండవచ్చు.

[22, 23వ పేజీలోని చిత్రాలు]

ఈ నాగరికతలు శాశ్వతంగా నాశనం చేయబడతాయని దేవుని వాక్యం చెబుతోంది . . .

ఎదోము

బబులోను

. . .కానీ ఇది నాశనం చేయబడుతుందని చెప్పలేదు

గ్రీసు

ఐగుప్తు

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

WHO photo by Edouard Boubat

[23వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌