సాటిలేని తండ్రి
దేవునికి దగ్గరవ్వండి
సాటిలేని తండ్రి
“తండ్రి.” ఆ పదం వినగానే ప్రేమా, అనురాగం గౌరవం వంటి భావాలు మనలో మెదులుతాయి. తన పిల్లలను నిజంగా ప్రేమించే ఒక తండ్రి వారు ప్రయోజకులయ్యేలా వారికి సహాయం చేస్తాడు. అందుకే బైబిలు సహేతుకంగానే యెహోవా దేవుణ్ణి “తండ్రీ” అని పిలుస్తోంది. (మత్తయి 6:9) యెహోవా ఎలాంటి తండ్రి? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు మనం, యేసు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు యెహోవా ఆయనతో అన్న మాటలను పరిశీలిద్దాం. ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడే పద్ధతినిబట్టి ఆయన ఎలాంటి తండ్రి అనే విషయం గురించి చాలా తెలుసుకోవచ్చు.
దాదాపు సా.శ. 29వ సంవత్సరం అక్టోబరు నెలలో యేసు బాప్తిస్మం తీసుకోవడానికి యొర్దాను నది దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఏమి జరిగిందో బైబిలు ఇలా చెబుతోంది: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” (మత్తయి 3:16, 17) స్వయంగా యెహోవానే ఆప్యాయంగా పలికిన ఆ మాటలనుబట్టి ఆయన ఎలాంటి తండ్రో తెలుస్తోంది. యెహోవా తన కుమారునితో పలికిన మాటల్లోని మూడు అంశాలను గమనించండి.
అదే వృత్తాంతం గురించి లూకా సువార్త, యెహోవా “నీవు” అనే ఏకవచనాన్ని ఉపయోగించి “నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను” అని అన్నాడని చెబుతోంది.—లూకా 3:22.
ముందుగా యెహోవా “ఈయన నా కుమారుడు” అని అన్నప్పుడు నిజానికి ఆయన, ‘నేను నీకు తండ్రిని అయినందుకు గర్వపడుతున్నాను’ అని చెబుతున్నాడు. పిల్లలు తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని, తమపట్ల తల్లిదండ్రులు శ్రద్ధ కనబరచాలని కోరుకుంటారు. తన పిల్లల అవసరాలను గుర్తించే తండ్రి వాటిని తీరుస్తాడు. కుటుంబంలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని పిల్లలకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యేసు పెరిగి పెద్దయిన తర్వాత కూడా తన తండ్రి తనకు అలాంటి గుర్తింపును ఇవ్వడంవల్ల యేసుకు ఎలా అనిపించివుంటుందో ఊహించండి!
రెండవదిగా, యెహోవా ఆయనను “ప్రియ కుమారుడు” అని పిలవడం ద్వారా ఆయనంటే తనకెంత ప్రేమ ఉందో బాహాటంగా తెలియజేశాడు. మరోమాటలో చెప్పాలంటే ఆ తండ్రి ‘నాకు నీపట్ల ప్రేమ ఉంది’ అని చెబుతున్నాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలపట్ల ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తం చేస్తాడు. అలాంటి మాటలతోపాటు ఆయన చూపించే అనురాగం పిల్లలు వర్ధిల్లడానికి తోడ్పడుతుంది. తనమీద ఉన్న ప్రేమను తన తండ్రి వ్యక్తం చేసినప్పుడు యేసు ఎంతగా ఆనందించివుంటాడో కదా!
మూడవదిగా, “నీయందు నేనానందించుచున్నాను” అని చెప్పడం ద్వారా యెహోవా తన కుమారుణ్ణి ఇష్టపడుతున్నానని చెప్పాడు. అంటే ఆయన ‘బాబూ, నువ్వు చేసిన పనులు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి’ అని అంటున్నాడని చెప్పవచ్చు. ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలు చేసే మంచి పనులు లేదా మాట్లాడే మంచి మాటలు తనకు సంతోషం కలిగిస్తాయని వారికి చెప్పే అవకాశాల కోసం చూస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లలు చేసిన పనులను ఇష్టపడినప్పుడు వారు ఎంతో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. తన తండ్రి ఆమోదం తనకుందని తెలుసుకున్నప్పుడు యేసు ఖచ్చితంగా ప్రోత్సహించబడివుంటాడు.
నిజంగానే యెహోవా ఒక సాటిలేని తండ్రి. మీకు కూడా అలాంటి తండ్రి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అలాగైతే, మీరు కూడా యెహోవాను మీ తండ్రిగా చేసుకోవచ్చనే హామీ మీకు ఉంది. మీరు విశ్వాసంతో ఆయన గురించి తెలుసుకొని, ఆయన ఇష్టపడే విధంగా నడవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తే ఆయన తప్పకుండా స్పందిస్తాడు. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని బైబిలు చెబుతోంది. (యాకోబు 4:8) ఇంతటి అద్భుతమైన తండ్రియైన యెహోవా దేవునితో దగ్గరి సంబంధం కలిగివుండడంకన్నా మరింకేది మీకు భద్రతాభావాన్ని ఇస్తుంది? (w 08 1/1)