కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
గొడవల్ని ఎలా పరిష్కరించుకోవాలి?
భర్త వాదన: “మా పెళ్లైనప్పటి నుండి నేను, నా భార్య శారా * మా తల్లిదండ్రులతోనే ఉంటున్నాం. ఒకరోజు, మా తమ్ముడి స్నేహితురాలు తనని మా కారులో వాళ్ల ఇంటి దగ్గర దింపమని అడిగింది. సరేనని మా బాబుని కూడా నా వెంట తీసుకువెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చేసరికి నా భార్య శారా కారాలు మిరియాలు నూరుతూ కనిపించింది. మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆమె ఇంట్లో అందరి ముందు నన్ను పట్టుకుని స్త్రీలోలుడివని నానా మాటలు అంది. నేను కోపం ఆపుకోలేక చెడామడా తిట్టేయడంతో ఆమె కోపం ఇంకా ఎక్కువైంది.”
భార్య వాదన: “మా బాబుకు అసలే ఒంట్లో బాగోలేదు, అప్పుడు మా దగ్గర అంతగా డబ్బుకూడా లేదు. అందుకే నా భర్త ఫెర్నాండొ మా అబ్బాయిని వెంటబెట్టుకొని ఆ అమ్మాయిని కారులో తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా బాధేసింది. ఆ విషయాన్నే ఆయన ఇంటికి రాగానే చెప్పాను. మా ఇద్దరికీ పెద్ద గొడవ జరిగింది, ఇద్దరం అసభ్యంగా తిట్టుకున్నాం. కానీ ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను.”
భార్యాభర్తలు గొడవపడినంత మాత్రాన వారిలో ప్రేమలేదని అర్థమా? కాదు! పైన పేర్కొనబడ్డ ఫెర్నాండొ, శారాలకు ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమవుంది. అయితే, ఎంతో సంతోషంగావున్న కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడూ గొడవలు వస్తాయి.
అసలు గొడవలెందుకు వస్తాయి, అవి మీ వివాహబంధాన్ని పాడుచేయకుండా ఉండాలంటే మీరేమి చేయవచ్చు? దేవుడే వివాహ స్థాపకుడు కాబట్టి, ఈ విషయంలో ఆయన వాక్యమైన బైబిలు ఏమి చెబుతోందో పరిశీలించడం సబబుగా ఉంటుంది.—ఆదికాండము 2:21, 22; 2 తిమోతి 3:16, 17.
సమస్యలను అర్థం చేసుకోండి
చాలామంది భార్యాభర్తలు ఒకరితో ఒకరు ప్రేమగా, స్నేహపూర్వకంగా వ్యహరించాలని కోరుకుంటారు. అయితే, నిజానికి వారు ఎందుకు అలా చేయలేరో వివరిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23) కాబట్టి భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం కష్టంగా ఉండవచ్చు. కొంతమందికైతే, గొడవ మొదలయ్యిందంటే చాలు గట్టిగా అరవడం, బూతులు తిట్టడం లాంటివి చేయకుండా ఉండడం ఎంతో కష్టమనిపించవచ్చు. (రోమీయులు 7:21; ఎఫెసీయులు 4:31) ఇంకా ఏ విషయాలు కూడా గొడవలకు దారితీయవచ్చు?
సాధారణంగా భార్యాభర్తల సంభాషణా శైలి ఒకేలా ఉండదు. మెచికో ఇలా అంటోంది: “చర్చించడంలో విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు చాలా వేరుగా ఉన్నాయని మా పెళ్ళైన కొత్తలోనే నాకర్థమైపోయింది. నేనేమో ఏమి జరిగిందనేకాక అసలు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో కూడా చెప్పాలనుకుంటాను, కానీ మావారేమో జరిగింది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు.”
మెచికోకి ఉన్న సమస్యే చాలామందికి ఉంది. చాలామంది భార్యాభర్తల్లో ఒకరు అభిప్రాయభేదాల గురించి ఎక్కువగా చర్చించాలనుకుంటే మరొకరు దానికి ససేమిరా అంగీకరించకపోవచ్చు. కొన్నిసార్లు ఒకరు ఎంత ఎక్కువగా మాట్లాడాలనుకుంటే, మరొకరు అంత తక్కువగా మాట్లాడాలనుకుంటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి స్వభావమే మెల్లమెల్లగా మొదలవడం గమనించారా? మీలో ఒకరు ఎప్పుడూ మాట్లాడేవారిగా, మరొకరు నోరు మెదపనివారిగా ఉన్నారా?
గొడవలకు దారితీసే మరో విషయం కూడా ఉంది.
ఒక వ్యక్తి తాను పెరిగిన కుటుంబ వాతావరణాన్నిబట్టి తన భర్తతో లేదా భార్యతో ఫలానా విధంగా మాట్లాడాలని అనుకునే అవకాశం ఉంది. పెళ్ళై ఐదు సంవత్సరాలైన జెస్టిన్ ఇలా చెబుతున్నాడు: “దేని గురించైనా అంతగా మాట్లాడుకోని కుటుంబం మాది. అందుకే నేను పెదవి విప్పి బాహాటంగా ఇతరులతో చెప్పలేను. ఇది నా భార్యకు విసుగు తెప్పిస్తుంది. వాళ్ళ ఇంట్లోవాళ్ళు మాత్రం ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకుంటారు. అందుకే తను ఏమనుకున్నా నాతో గలగలా చెప్పేస్తుంది.”సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి?
తరచూ తమ ప్రేమను మాటల్లో వ్యక్తం చేసుకున్నంత మాత్రాన వాళ్లది చక్కని దాంపత్యం అని చెప్పలేమని వివాహాలను అధ్యయనం చేసిన కొందరు చెబుతున్నారు. భార్యాభర్తలు లైంగిక సుఖాన్ని అనుభవించడం, బాగా డబ్బు ఉండడం వంటివేవీ కూడా మంచి వివాహ జీవితానికి ప్రాముఖ్యం కాదు. కానీ గొడవలు వచ్చినప్పుడు భార్యాభర్తలు వాటిని ఎలా పరిష్కరించుకుంటారు అనే దాన్నిబట్టే వారిది చక్కని దాంపత్యం అని చెప్పగలం.
అంతేకాదు, ఒక జంట వివాహం చేసుకున్నప్పుడు వారిని జతపరిచింది మనుష్యులు కాదుగానీ దేవుడు అని యేసు చెప్పాడు. (మత్తయి 19:4-6) కాబట్టి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం దేవుణ్ణి ఘనపరుస్తుంది. మరోవైపు, ఒక భర్త తన భార్యను ప్రేమించకపోయినా, పట్టించుకోకపోయినా యెహోవా అతని ప్రార్థనను వినడు. (1 పేతురు 3:7) భార్య తన భర్తపట్ల గౌరవం చూపించకపోతే నిజానికి ఆమె కుటుంబానికి భర్తను శిరస్సుగా అంటే యజమానిగా నియమించిన యెహోవాను అగౌరవపరిచినట్లే అవుతుంది.—1 కొరింథీయులు 11:3.
విజయానికి తోడ్పడే అంశాలు —నొప్పించేలా మాట్లాడకండి
మీరు మాట్లాడే విధానం ఎలా ఉన్నా లేదా మీరు ఎలాంటి కుటుంబం నుండి వచ్చినా, మీరు బైబిలు సూత్రాలను పాటిస్తూ గొడవల్ని చక్కగా పరిష్కరించుకోవాలంటే, నొప్పించేలా మాట్లాడడం మానుకోవాలి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:
‘నేను మాటకు మాట అనకుండా ఉండగలనా?’
“ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును” అనేది జ్ఞానవంతమైన ఒక సామెత. (సామెతలు 30:33) దాని అర్థం ఏమిటి? ఈ ఉదాహరణను పరిశీలించండి. ఇంటి ఖర్చులను (“మనం క్రెడిట్ కార్డు వాడకం తగ్గించుకోవాలి”) ఎలా తగ్గించుకోవాలనే విషయంలో మొదలైన చిన్న గొడవ, ఒకరినొకరు విమర్శించుకునే (“నీ కసలు బాధ్యతే తెలీదు”) స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. మీ భార్యా లేదా భర్త మీ ప్రవర్తనను తప్పుపడుతూ మీమీద మండిపడడం ద్వారా మీ ‘ముక్కు పిండారే’ అనుకోండి, మీకూ వెంటనే దానికితగ్గ జవాబు ఇవ్వాలనిపిస్తుంది. కానీ, మాటకు మాట అనడం కోపానికి, వాదులాట ఎక్కువ అవడానికే దారితీస్తుంది.
బైబిలు రచయిత యాకోబు ఇలా హెచ్చరిస్తున్నాడు: “ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!” (యాకోబు 3:5, 6) భార్యాభర్తలు తమ మాటలను అదుపులో ఉంచుకోకపోతే చిన్న చిన్న కీచులాటలు ఇట్టే పెద్ద గొడవలుగా మారగలవు. భార్యాభర్తల మధ్య అలాంటి ఆవేశపూరిత గొడవలు పదేపదే జరిగితే వారిద్దరి మధ్య ప్రేమ పెరిగే అవకాశం ఉండదు.
మాటకు మాట అనే బదులు, దూషింపబడి కూడా ‘బదులు దూషింపని’ యేసును మీరు అనుకరించగలరా? (1 పేతురు 2:23) గొడవ త్వరగా సమసిపోవాలంటే, మీ జత అభిప్రాయం సరైనదే అయ్యుంటుందని గ్రహించాలి. అంతేకాదు, ఆ గొడవకు మీరూ కొంతమేరకు బాధ్యులు కాబట్టి క్షమాపణ అడగాలి.
ఇలా చేసి చూడండి: ఈ సారి గొడవ మొదలైనప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా భార్యా లేదా భర్త ఫలానా విధంగా ఆలోచించడానికి సరైన కారణాలే ఉండివుంటాయని ఒప్పుకుంటే వచ్చే నష్టమేమిటి?’ ఈ గొడవకు నేనెంతవరకు బాధ్యుణ్ణి? నేను క్షమాపణ ఎందుకు అడగకూడదు?
‘నా జత అభిప్రాయాలను చులకన చేయడం లేదా తేలిగ్గా తీసిపారేయడం లాంటివి చేస్తున్నానా?’
“మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు” పాలుపంచుకోండి అని దేవుని వాక్యం ఆదేశిస్తోంది. (1 పేతురు 3:8) రెండు కారణాలనుబట్టి ఈ సలహాను పాటించలేకపోవచ్చు. ఒక కారణమేమిటంటే, మీరు మీ జత మనస్సును లేదా భావాలను సరిగా అర్థంచేసుకోలేకపోవచ్చు. ఉదాహరణకు, ఒక విషయాన్ని గురించి మీ జత మీకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లైతే, “ఇంత చిన్న విషయానికే ఎందుకలా బెంబేలుపడిపోతున్నావు” అని అనాలనిపిస్తుంది. వారు సమస్యను సరైన దృక్కోణంలో చూసేందుకు మీ జతకు సహాయపడాలనే ఉద్దేశంతోనే మీరలా అనాలనుకుంటారు. అయితే, అందరికీ అలాంటి మాటలు రుచించవు. తాము ప్రేమించేవారు తమ పరిస్థితిని అర్థం చేసుకుంటారని భార్యభర్తలిద్దరూ గ్రహించాలి.
ఒక వ్యక్తి అహంభావంవల్ల కూడా తన జత అభిప్రాయాలను, భావాలను చులకన చేయవచ్చు. ఒక అహంకారి ఇతరులను ఎప్పుడూ చులకన చేస్తూ తనే గొప్పవాణ్ణని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతను ఇతరులను దూషిస్తూ మాట్లాడవచ్చు, వారిని వేరేవారితో పోల్చి అవమానకరంగా మాట్లాడవచ్చు. యేసు కాలంలోని పరిసయ్యుల, శాస్త్రుల ఉదాహరణను గమనించండి. ఎవరైనా, ఆఖరికి తోటి పరిసయ్యుడైనా సరే వారి అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడితే చాలు అహంకారులైన పరిసయ్యులు, శాస్త్రులు వారిని దూషిస్తూ, కించపరుస్తూ మాట్లాడేవారు. (యోహాను 7:45-52) ఈ విషయంలో యేసుక్రీస్తు పూర్తి భిన్నంగా ఉన్నాడు. ఇతరులు తమ బాధలను ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.—మత్తయి 20:29-34; మార్కు 5:25-34.
మీ భార్య లేదా భర్త తన అభిప్రాయాలను గానీ, భావాలను గానీ మీతో చెప్పినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో ఒకసారి ఆలోచించండి. మీ మాటలు, స్వరం, ముఖ కవళికలు మీరు వారిని అర్థం చేసుకుంటున్నారని చూపించేవిగా ఉంటాయా? లేక మీ జత భావాలు అంత ప్రాముఖ్యంకానట్లు ప్రవర్తిస్తారా?
ఇలా చేసి చూడండి: ఇప్పటినుండి కొన్ని వారాలపాటు మీరు మీ జతతో ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. మీరు ఒకవేళ తీసిపారేసినట్లు లేదా వ్యంగ్యంగా మాట్లాడినా వెంటనే క్షమాపణ చెప్పండి.
‘నేను తరుచూ నా భార్యా లేదా భర్త ఉద్దేశాలు స్వార్థపూరితమైనవని అనుకుంటున్నానా?’
“యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా?” (యోబు 1:9, 10) ఆ మాటల ద్వారా సాతాను నమ్మకస్థుడైన యోబు ఉద్దేశాలు స్వార్థపూరితమైనవని ఆరోపించాడు.
భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండకపోతే వారు కూడా అలాంటి పనే చేసే అవకాశముంది. ఉదాహరణకు, మీ జత మీకేదైనా మంచిచేస్తే వారు ఏదో ఆశించే అలా చేశారనీ లేదా మీనుండి ఏదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారనీ అనుకుంటారా? భార్య లేదా భర్త ఏదైనా తప్పుచేస్తే, వారు స్వార్థపరులని, శ్రద్ధలేనివారని అనుకుంటారా? వెంటనే గతంలో చేసిన ఇలాంటి తప్పులను తవ్వితీసి, ఈ తప్పును కూడా కలిపి ఏకరువుపెడతారా?
ఇలా చేసి చూడండి: మీ జత మీ కోసం చేసిన మంచి పనులను రాసిపెట్టుకోండి. వారు ఏ మంచి ఉద్దేశాలతో అలా చేసివుంటారో కూడా రాసిపెట్టుకోండి.
అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ప్రేమ . . . అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” (1 కొరింథీయులు 13:4, 5) నిజమైన ప్రేమ గుడ్డిది కాదు, అలా అని అది అపకారాన్ని మనస్సులోనూ ఉంచుకోదు. పౌలు ఇంకా ఇలా పేర్కొన్నాడు: “ప్రేమ . . . అన్నిటిని నమ్మును.” (1 కొరింథీయులు 13:7) ప్రజలు ఏది చెప్పినా ప్రేమ నమ్మతుందని కాదు, కానీ అది నమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. తప్పుపట్టదు, అనుమానించదు. బైబిలు ప్రోత్సహించే ప్రేమ క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది, మరో వ్యక్తి ఉద్దేశాలు మంచివే అయ్యుంటాయని ఆలోచించేందుకు సిద్ధంగా ఉంటుంది. (కీర్తన 86:5; ఎఫెసీయులు 4:32) భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ఇలాంటి ప్రేమను చూపించుకుంటే వారి వివాహ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. (w 08 2/1)
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి . . .
-
ఆర్టికల్ మొదట్లో ప్రస్తావించబడిన భార్యాభర్తలు ఏ పొరపాటు చేశారు?
-
నేను కూడా అలాంటి తప్పులను చేయకుండా ఎలా జాగ్రత్తపడగలను?
-
ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ఏ విషయాలను అన్వయించుకోవడానికి కృషి చేయాలి?
^ పేరా 3 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.