కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిరాశాజనకమైన పరిస్థితులున్నా మీరు సంతోషంగా ఉండవచ్చు

నిరాశాజనకమైన పరిస్థితులున్నా మీరు సంతోషంగా ఉండవచ్చు

నిరాశాజనకమైన పరిస్థితులున్నా మీరు సంతోషంగా ఉండవచ్చు

అసలెప్పుడూ నిరాశ చెందనివారంటూ ఎవరైనా ఉన్నారా? అంతెందుకు, మన పరలోకపు తండ్రియైన యెహోవా దేవునికి కూడా నిరాశ వల్ల కలిగే బాధేంటో తెలుసు. ఉదాహరణకు, ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని దాసత్వం నుండి విడిపించి వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. కానీ “మాటిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 78:​41) అయినా యెహోవా ఎల్లప్పుడూ ‘సంతోషముగల దేవునిగానే’ ఉన్నాడు.​—⁠1 తిమోతి 1:⁠8-11, NW.

మనల్ని ఎన్నో విషయాలు నిరాశపరచవచ్చు. అయితే, వాటివల్ల మనం సంతోషాన్ని పోగొట్టుకోవాలా? యెహోవా దేవుడు నిరాశపరిచే పరిస్థితులతో వ్యవహరించిన తీరునుండి మనమేమి నేర్చుకోవచ్చు?

నిరాశాజనకమైన విషయాలు

మనందరికీ ‘కాలవశముచేత, అనూహ్యంగా’ ఏదైనా జరగవచ్చు అని దేవుని వాక్యం చెబుతోంది. (ప్రసంగి 9:​11, NW) అనుకోకుండా నేరం జరగడం, దుర్ఘటన బారినపడడం లేదా వ్యాధులు రావడం మనల్ని తీవ్ర ఆందోళనకు, నిరాశకు గురి​చేయవచ్చు. “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును” అని కూడా బైబిలు చెబుతోంది. (సామెతలు 13:​12) మనకు ఏదైనా మంచి జరగాలని కోరుకుని దానికోసం ఎదురుచూడడంలో ఆనందం ఉంది. కానీ అది త్వరగా జరగకపోతే మనం నిరాశవల్ల కృంగిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, డన్‌కన్‌ * మిషనరీ సేవకుడవ్వాలనీ, అందులోనే కొనసాగాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే అనేక సంవత్సరాలు మిషనరీ సేవ చేసిన తర్వాత ఆయన, ఆయన భార్య తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సివచ్చింది. “జీవితంలో మొట్టమొదటిసారి నాకు ఏమి చేయాలో తోచలేదు. నేనిక ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోలేదు. జీవితంలో అన్నీ వ్యర్థమనిపించాయి” అని ఆయన చెబుతున్నాడు. క్లార్‌ విషయంలో జరిగినట్లుగా కొన్నిసార్లు నిరాశవల్ల కలిగే బాధ చాలాకాలంపాటు ఉండవచ్చు. “నేను ఏడు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు నాకు గర్భస్రావం అయి మాకు పుట్టబోయే బిడ్డ చనిపోయింది. అది జరిగి ఇప్పటికీ చాలా సంవత్సరాలైంది, కానీ ఇప్పటికీ ఎవరైనా ఒక చిన్నబ్బాయి స్టేజీపై ప్రసంగమివ్వడం చూస్తేచాలు ‘మా బాబు ఒకవేళ బ్రతికుంటే వాడికి కూడా ఇంతే వయసుండేది’ అని నాలో నేను అనుకుంటూ ఉంటాను” అని ఆమె చెబుతోంది.

మరో వ్యక్తి మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు అంటే పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వదిలి వెళ్లిపోయినప్పుడు, భార్య లేదా భర్త వదిలేసినప్పుడు, పిల్లలు ఎదురు తిరిగినప్పుడు, సహచరుడు నమ్మకద్రోహం చేసినప్పుడు, స్నేహితులు విశ్వాస​ఘాతుకంగా ప్రవర్తించినప్పుడు మీకు చాలా బాధ కలగ​వచ్చు. మనం క్లిష్టమైన కాలాల్లో అపరిపూర్ణ ప్రజల మధ్య జీవిస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు నిరాశాజనకమైన పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి.

మనం దేనిలోనైనా విఫలమైతే కూడా మనం నిరాశ​పడవచ్చు. ఉదాహరణకు, ఒక పరీక్షలో ఫెయిలు అయినా, ఉద్యోగం దొరక్కపోయినా, ఒకరి ప్రేమను పొందలేకపోయినా మనం దేనికీ పనికిరామని అనిపించవచ్చు. మన ఆప్తు​లెవరైనా క్రైస్తవులుగా కొనసాగలేకపోయినా మనం నిరాశకు లోనవ్వచ్చు. మేరీ ఇలా అంటోంది: “మా అమ్మాయి చక్కని క్రైస్తవురాలిగా ఉన్నట్లే కనిపించింది. నేను ఆమెకు ఆదర్శవంతంగా ఉన్నాననుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆమె యెహోవా దేవుణ్ణి తృణీకరించి, కుటుంబ విలువలను మంటగలిపిందో నేను పూర్తిగా ఓడిపోయానని అనిపించింది. వేరే వాటిలో నేను సాధించిన విజయాలేవీ ఆ దుఃఖాన్ని పూడ్చలేకపోయాయి. నేను చాలా నిరాశపడ్డాను.”

అలాంటి నిరాశను మీరు ఎలా తాళుకోవచ్చు? జవాబు కోసం యెహోవా నిరాశాజనకమైన పరిస్థితులతో వ్యవహరించడంలో ఎలాంటి మాదిరినుంచాడో పరిశీలించండి.

ఎలా పరిష్కరించాలో ఆలోచించండి

యెహోవా మొదటి మానవజంటకు ప్రేమపూర్వకంగా అన్నీ అనుగ్రహించినా చివరకు వాళ్ళు కృతఘ్నులుగా, తిరుగుబాటు​దారులుగా తయారయ్యారు. (ఆదికాండము 2, 3 అధ్యాయాలు) వారి కుమారుడైన కయీను చెడు నడవడిని అలవర్చుకున్నాడు. అతడు యెహోవా హెచ్చరికను పెడచెవిని పెట్టి, తన తమ్ముడిని చంపేశాడు. (ఆదికాండము 4:​1-8) అప్పుడు యెహోవా ఎంత నిరాశ చెందివుంటాడో మీరు ఊహించగలరా?

అయితే, నిరాశవల్ల యెహోవా తన సంతోషాన్ని ఎందుకు కోల్పోలేదు? ఎందుకంటే ఈ భూమంతటినీ పరిపూర్ణులైన మానవులతో నింపాలనే తన ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు యెహోవా ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. (యోహాను 5:​17) ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఆయన విమోచన క్రయధనాన్ని, తన రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. (మత్తయి 6:​9, 10; రోమీయులు 5:​18, 19) యెహోవా దేవుడు సమస్య గురించి కాదు, సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాడు.

మనం ఏమి చేసివుండాల్సింది, ఎలా చేసివుండాల్సింది అని ఆలోచించే బదులు మనం ఇకపై చెయ్యాల్సిన వాటిగురించి ఆలోచించమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది. అదిలా చెబుతోంది: “ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.”​—⁠ఫిలిప్పీయులు 4:⁠8.

నిరాశను సరైన మనోభావంతో చూడడం

మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగల కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఉదాహరణకు, అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు, వివాహ భాగస్వామి విడిచి వెళ్లిపోవచ్చు లేక చనిపోవచ్చు, సంఘంలో మనకున్న సేవాధిక్యతలను కోల్పోవచ్చు. మన ఆరోగ్యం క్షీణించవచ్చు, ఇంటిని లేదా స్నేహితులను పోగొట్టుకోవచ్చు. అయితే, ఆ పరిస్థితులను మనం ఎలా తాళుకోవచ్చు?

వేటికి ప్రాముఖ్యతనివ్వాలో నిర్ణయించుకోవడం కొందరికి సహాయకరంగా అనిపించింది. ముందు ప్రస్తావించబడిన డన్‌కన్‌ ఇలా అన్నాడు: “మేము ఇక ఎప్పటికీ మిషనరీలుగా సేవ చేయలేమని తెలుసుకున్నప్పుడు నేను, నా భార్య చాలా కృంగిపోయాము. చివరకు మేము రెండు విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలని నిర్ణయించుకున్నాం. ఒకటి అత్తను చూసుకోవడం, రెండోది వీలైతే పూర్తికాల పరిచర్యలో కొనసాగడం. మేము ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాటికేమైనా అడ్డొస్తుందా అని ఆలోచిస్తాం. అలా చేసినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం మాకు కష్టం అనిపించడంలేదు.”

నిరాశాజనక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనలో చాలామందిమి బాధ కలిగించే అనవసరమైన విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ఉదాహరణకు పిల్లలను పెంచడానికి, ఉద్యోగం సంపాదించడానికి, విదేశీ క్షేత్రంలో సువార్త ప్రకటించడానికి మనం చేసే ప్రయత్నాలకు మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దానితో ‘నేను ఏదీ సాధించలేను’ అని మనం కుమిలిపోవచ్చు. అయితే, మానవజాతి ఆరంభంలో జరిగిన సంఘటనలు దేవుణ్ణి నిరాశపరిచినా, ఆయన తాను ఏదీ సాధించలేనని అనుకోలేదు. మనం చేసే ప్రయత్నాలకు వెంటనే ఫలితాలు రానంత మాత్రాన మనమిక ఏమీ సాధించలేమని అర్థంకాదు.​—⁠ద్వితీయోపదేశకాండము 32:​4, 5.

ఎవరైనా మనల్ని నిరాశపరచినప్పుడు వాళ్లమీద మండిపడడం ఎంతో సులభం. కానీ యెహోవా అలా చేయడు. దావీదు రాజు, ఒక స్త్రీతో వ్యభిచారం చేసి, ఆమె భర్తను చంపించి యెహోవాను నిరాశపరిచాడు. అయినా యెహోవా దావీదు నిజంగా పశ్చాత్తాపపడడాన్ని చూసి, ఆయనను తన సేవలో కొనసాగనిచ్చాడు. అలాగే విశ్వస​నీయుడైన యెహోషాపాతు రాజు దేవుని శత్రువులతో పొత్తు కుదుర్చుకుని తప్పు చేశాడు. యెహోవా ప్రవక్త ఇలా చెప్పాడు: “అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును. అయితే . . . నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.” (2 దినవృత్తాంతములు 19:​2, 3) యెహోషాపాతు ఒక్క తప్పు చేసినంత మాత్రాన తనకు ద్రోహం చేసినట్లు కాదని యెహోవా గుర్తించాడు. అదే విధంగా మన స్నేహితులు తప్పు చేసినప్పుడు మనం అతిగా ప్రతిస్పందించకుండా ఉంటే, మనం వారిని పోగొట్టుకోకుండా ఉంటాము. మనల్ని నిరాశపరచిన స్నేహితుల్లో మంచి లక్షణాలు ఉండేవుంటాయి.​—⁠కొలొస్సయులు 3:​13.

విజయపథంలో అలాంటి నిరాశాజనకమైన విషయాలను అవసరమైన అనుభవాన్నిచ్చే సోపానాలుగా పరిగణించాలి. మనం పాపం చేసినప్పుడు మనం నిరాశపడవచ్చు. అయినా ఏమి చేయాలో తీర్మానించుకుని సరైన చర్యలు తీసుకుంటే ముందుకు సాగిపోవచ్చు. దావీదు రాజు ఎంతో నిరాశానిస్పృహలకు గురైనప్పుడు ఇలా వ్రాశాడు: “దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి. . . . నా దోషము కప్పుకొనక నీ [యెహోవా] యెదుట నా పాపము ఒప్పుకొంటిని. . . . నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.” (కీర్తన 32:​3-5) దేవుడు మన నుండి ఆశించినవాటిని మనం చేయలేదని గ్రహించినప్పుడు, మనం దేవుణ్ణి క్షమించమని కోరాలి. మన తప్పులను సరిచేసుకుని, ఇకపై దేవుని ఉప​దేశాన్ని జాగ్రత్తగా పాటిస్తామని తీర్మానించు​కోవాలి.​—⁠1 యోహాను 2:​1, 2.

నిరాశను తాళుకునేందుకు ఇప్పుడే సిద్ధపడండి

భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మనలో ప్రతీ ఒక్కరికీ నిరాశాజనకమైన పరిస్థితులు ఎదురౌతాయనడంలో సందేహం లేదు. మరి దానికి సిద్ధంగా ఉండడానికి మనమేమి చేయవచ్చు? నిరాశాజనకమైన ఒక సంఘటన బ్రూనో అనే వృద్ధ క్రైస్తవుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది, దీనిగురించి ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయనిలా అన్నాడు: “దేవునితో నా సంబంధాన్ని బలపర్చుకోవడానికి నేను ఇంతకు ముందు ఏదైతే చేస్తూ వచ్చానో దాన్నే నేనింకా చేస్తున్నాను. నిరాశను తాళుకోవడానికి అదే నాకు ఎంతగానో సహాయం చేసింది. క్రూర ప్రపంచం ఇంత క్రూరంగా ఉన్నా, దాన్ని దేవుడు ఎందుకిలాగే ఉండనిస్తున్నాడో తెలుసుకున్నాను. దేవునితో దగ్గర సంబంధాన్ని పెంపొందించుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. నేను దేవునితో నా సంబంధాన్ని బలపర్చుకోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే, దేవుడు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తున్నాడనే నమ్మకంతో నేను ఆ బాధనంతటిని తట్టుకోగలిగాను.”

మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తుండగా మనం ఒక విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు: మనమే నిరాశకు గురైనా లేదా ఇతరులు మనల్ని నిరాశపరిచినా, దేవుడు మనల్ని ఎప్పటికీ నిరాశపరచడు. నిజానికి, యెహోవా అనే తన పేరుకు అర్థం “నేను ఎలా కావాలంటే అలా అవుతాను” అని దేవుడు చెప్పాడు. (నిర్గమకాండము 3:⁠14, NW) ఆ పేరుకున్న అర్థాన్నిబట్టి దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చడానికి ఎలా కావాలంటే అలా అవుతాడనే నమ్మకంతో ఉండవచ్చు. తన రాజ్యం ద్వారా, తన చిత్తము లేదా తాను అనుకున్నది “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరుతుందని” ఆయన వాగ్దానం చేశాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను . . . సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.”​—⁠మత్తయి 6:​9, 10; రోమీయులు 8:​38, 39.

ప్రవక్తయైన యెషయా ద్వారా దేవుడు చేసిన ఈ వాగ్దానం నెరవేరుతుందని మనం నమ్మకంగా ఎదురుచూడవచ్చు: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.” (యెష. 65:​17) నిరాశాజనకమైన స్మృతులన్నీ గతించిపోయే సమయం దగ్గరపడిందనే నిరీక్షణ నిజంగా ఎంత అద్భుత​మైనదో కదా! (w 08 3/1)

[అధస్సూచి]

^ పేరా 5 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[29వ పేజీలోని బ్లర్బ్‌]

మనం చేసే ప్రయత్నాలకు వెంటనే ఫలితాలు రానంత మాత్రాన మనం ఇక ఏదీ సాధించలేమని అర్థంకాదు

[30వ పేజీలోని బ్లర్బ్‌]

మనం ఏమి చేసివుండాల్సింది, ఎలా చేసివుండాల్సింది అని ఆలోచించే బదులు మనం ఇకపై చెయ్యాల్సిన వాటిగురించి ఆలోచించమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది

[31వ పేజీలోని చిత్రాలు]

మానవులు తప్పులు చేసినా దేవుడు సంతోషంగానే ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు తన ఉద్దేశం నిశ్చయంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది

[32వ పేజీలోని చిత్రం]

దేవునితో మన సంబంధాన్ని బలపరచుకునేందుకు ప్రాముఖ్యతనివ్వడం నిరాశను తాళుకునేందుకు మనకు సహాయం చేస్తుంది