కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు మరణించడం మిమ్మల్ని ఎలా రక్షించగలదు?

యేసు మరణించడం మిమ్మల్ని ఎలా రక్షించగలదు?

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం సా.శ. 33లో, పస్కా అనే యూదుల పండుగ రోజున అమాయకుడైన ఆవ్యక్తి ఇతరులు జీవం పొందేలా తాను మరణించాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయనే నజరేయుడైన యేసు. అయితే అంత గొప్ప కార్యంవల్ల ఎవరు ప్రయోజనం పొందవచ్చు? మానవజాతి అంతా ప్రయోజనం పొందవచ్చు. జీవితాలను రక్షించే ఆ త్యాగాన్ని గురించి సుపరిచితమైన ఒక బైబిలు లేఖనం క్లుప్తంగా ఇలా చెబుతోంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”​—⁠యోహాను 3:​16.

ఈ వచనం చాలామందికి తెలిసినప్పటికీ చాలా కొద్దిమందికే దాని అర్థం తెలుసు. ‘మనకోసం క్రీస్తు తన ప్రాణాన్ని ఎందుకు బలివ్వాలి? ఒక్క వ్యక్తి మరణం మొత్తం మానవ​జాతిని శాశ్వత మరణం నుండి ఎలా తప్పించగలదు’ అని వారు అనుకుంటారు. బైబిలు ఈ ప్రశ్నలకు స్పష్టమైన, సంతృప్తి​కరమైన సమాధానాలను ఇస్తోంది.

మానవజాతిని పట్టిపీడిస్తున్న మరణం ఎలా ప్రారంభమైంది?

మానవులు కొంతకాలంపాటు ఈ భూమిపై జీవించి, కష్టసుఖాలను అనుభవించి, చనిపోయి ఆ తర్వాత మరో మంచి స్థలానికి వెళ్ళిపోవడానికే సృష్టించబడ్డారని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం ప్రకారం చూస్తే, మానవజాతి కోసం దేవుడు సంకల్పించిన దానిలో మరణం భాగంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే బైబిలు, వేరే కారణం వల్ల మానవులు చనిపోతున్నారని తెలియజేస్తోంది. అదిలా చెబుతోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:​12) ఈ వచనం చెబుతున్నట్లుగా పాపము వల్లే మనుష్యులు చనిపోతున్నారు. మానవులకు పాపానికి సంబంధించిన మరణాంతకమైన దుష్పరిణామాలు ఎదురయ్యేందుకు కారణమైన ఆ ‘ఒక్క మనిషి’ ఎవరు?

మనుష్యులందరూ ఒకే మూలం నుండి వచ్చారనే విషయాన్ని అనేకమంది శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడీయా చెబుతోంది, ఆ మూలం అంటే ఆ ‘ఒక్క మనిషి’ ఎవరో బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. ఆదికాండము 1:⁠27లో ఇలా ఉంది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” ఆ మొదటి మానవ జంట సర్వాధికారియైన దేవుని సృష్టికే మకుటాయమానంగా ఉందని బైబిలు పేర్కొంటోంది.

ఆదికాండము వృత్తాంతం, యెహోవా దేవుడు మొదటి మానవుణ్ణి సృష్టించడాన్ని గురించి చెప్పిన తర్వాత మానవుల గురించి మరిన్ని వివరాలను కూడా తెలియజేస్తోంది. గమనార్హ మైన విషయం ఏమిటంటే, అవిధేయతవల్ల మరణం సంభవిస్తుందని చెప్పడానికి తప్ప ఆ వృత్తాంతమంతటిలో ఇంకెక్కడా దేవుడు మరణం గురించి మాట్లాడలేదు. (ఆదికాండము 2:​16, 17) మానవులు అందమైన ఉద్యానవనంలాంటి పరిస్థితులుండే పరదైసు భూమిపై ఆనందంగా, ఆయురారోగ్యాలతో నిరంతరం జీవించాలని ఆయన అనుకున్నాడు. అంతేకానీ, వారు వృద్ధాప్యంలో బాధలు అనుభవించి, చివరకు చనిపోవాలని ఆయన అనుకోలేదు. మరైతే మానవులు అందరూ ఎందుకు చనిపోతున్నారు?

మొదటి మానవ జంట తమకు జీవాన్ని ప్రసాదించిన యెహోవా దేవునికి ఉద్దేశపూర్వకంగానే అవిధేయులయ్యారని ఆదికాండము 3వ అధ్యాయం నివేదిస్తోంది. అందుకే యెహోవా వారిని ముందే హెచ్చరించినట్లుగా వారిని శిక్షించాడు. ఆయన మనుష్యునికి ఇలా చెప్పాడు: “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:​19) దేవుడు చెప్పినట్లే ఆ ఇద్దరు అవిధేయులు చివరకు చనిపోయారు.

అయితే కేవలం ఆ మొదటి జంటకే నష్టం వాటిల్లలేదు. వారి అవిధేయతవల్ల వారి సంతానం పరిపూర్ణ జీవితాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయింది. యెహోవా దేవుడు, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి” అని ఆదాము హవ్వలతో చెప్పినప్పుడు వారికింకా పుట్టని పిల్లలను కూడా తన సంకల్పంలో భాగంగా చేస్తూ మాట్లాడాడు. ​(ఆదికాండము 1:28) అనతికాలంలో, మానవ కుటుంబం భూమి అంతటిపై విస్తరించి, మృత్యువు గడపతొక్కకుండా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవించేవారు. కానీ వారి పితరుడైన ఆదాము అంటే ఆ ‘ఒక్క మనిషి’ వారిని పాపానికి దాసులుగా అమ్మేయడంతో వారికి మరణం అనివార్యం అయ్యింది. ఆ మొదటి మానవుని సంతానానికి చెందినవారిలో ఒకడైన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై యున్నాను.”​—⁠రోమీయులు 7:​14.

విధ్వంసకారులు అరుదైన కళాకృతులను నాశనం చేసినట్లుగానే, ఆదాము పాపము చేయడం ద్వారా దేవుని అద్భుత సృష్టియైన మానవజాతికి తీరని నష్టం వాటిల్లజేశాడు. ఆదాముకు పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు పిల్లలు, మనుమలు కూడా పుట్టారు. ప్రతీ తరంవారు పుట్టి, పెరిగి, పిల్లలను కని, చివరకు చనిపోయారు. వారందరూ ఎందుకు చనిపోయారు? ఎందుకంటే వారందరూ ఆదాము పిల్లలే. “ఒకని అపరాధము​వలన అనేకులు చనిపో[యారు]” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 5:​15) ఆదాము తన కుటుంబానికి చేసిన నమ్మక​ద్రోహం వల్ల వారికి అనారోగ్యం, వృద్ధాప్యం, తప్పులు చేసే ప్రవృత్తి, మరణం వంటివి సంక్రమించాయి. ఆదాము నమ్మక​ద్రోహం చేసిన కుటుంబంలో మనందరం కూడా సభ్యులమే.

తనతోపాటు పాపానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడు​తున్న అపరిపూర్ణ మానవులందరి దయనీయ స్థితిని గురించి అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు వ్రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఆయనిలా వాపోయాడు: “నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” ఆయన అడిగిన ప్రశ్న ప్రాముఖ్యమైనది, కాస్త కష్టమైనది కూడా. పౌలుతో సహా పాపమరణాల దాసత్వం నుండి విముక్తి కావాలని కోరుకునేవారందరినీ ఎవరు విడిపించగలరు? దానికి పౌలే ఇలా జవాబిస్తున్నాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా [మనల్ని విడిపించిన] దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 7:​14-25) అవును, మన సృష్టికర్త తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని విడిపించే ఏర్పాటు చేశాడు.

మానవులను విడిపించే దేవుని ఏర్పాటులో యేసు పాత్ర

మరణానికి నడిపించే పాపానికి దాసులైన మానవజాతిని విముక్తి చేయడంలో తన పాత్రేమిటో యేసే వివరిస్తూ ఇలా చెప్పాడు: ‘మనుష్యకుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను.’ (మత్తయి 20:​28) యేసు ప్రాణము విమోచన క్రయధనముగా [విడిపించేందుకు చెల్లించే మూల్యంగా] ఎలా పని చేస్తుంది? ఆయన మరణం మనకెలా ప్రయోజనాలను చేకూరు​స్తుంది?

బైబిలు యేసును “పాపము లేని,” “పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న” వ్యక్తిగా వర్ణిస్తోంది. యేసు తన జీవితమంతటిలో దేవుని ధర్మశాస్త్రానికి పూర్తిగా లోబడ్డాడు. (హెబ్రీయులు 4:⁠15; 7:​26) కాబట్టి యేసు పాపము వల్లనో, ఆదాములా అవిధేయత వల్లనో మరణించలేదు. (యెహెజ్కేలు 18:⁠4) బదులుగా యేసు మరణానికి అర్హుడు కాకపోయినా మానవజాతిని పాపమరణాల నుండి విడిపించాలనే తన తండ్రి కోరికను నెరవేర్చడానికి తాను మరణించడానికి ఒప్పుకున్నాడు. పైన చెప్పబడినట్లుగా “విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును” యేసు ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఇంతవరకూ ఎవరూ చూపించనంత గొప్ప ప్రేమతో యేసు ఇష్టపూర్వకంగా ‘ప్రతీ మనిషి కొరకు మరణాన్ని అనుభవించాడు.’​—⁠హెబ్రీయులు 2:⁠9.

యేసు బలిగా అర్పించిన జీవితం సరిగ్గా ఆదాము పాపము చేసినప్పుడు కోల్పోయిన పరిపూర్ణ జీవితంలాంటిదే. యేసు మరణం వల్ల ఏమి జరిగింది? యేసు ప్రాణాన్ని యెహోవా “అందరికొరకు విమోచన క్రయధనముగా” అంగీకరించాడు. (1 తిమోతి 2:⁠6) అంటే దేవుడు, యేసు ధారపోసిన అమూల్యమైన రక్తంతో పాపమరణాలకు బానిసలుగా ఉన్న మానవజాతిని తిరిగి కొన్నాడు.

మానవ సృష్టికర్త ప్రేమతో చేసిన ఈ గొప్ప త్యాగాన్ని బైబిలు పదేపదే ప్రస్తావిస్తోంది. క్రైస్తవులు “విలువపెట్టి కొన​బడినవారు” అని పౌలు వారికి గుర్తుచేశాడు. (1 కొరింథీయులు 6:​20; 7:⁠23) క్రైస్తవులను మరణకరమైన జీవితాన్నుండి విడిపించడానికి దేవుడు వెండి బంగారాలను ఉపయోగించలేదు కానీ తన కుమారుని రక్తాన్ని ఉపయోగించాడని పేతురు వ్రాశాడు. (1 పేతురు 1:​18, 19) యెహోవా క్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలితో మానవులను శాశ్వతమైన మరణం నుండి విడిపించే ఏర్పాటు చేశాడు.

క్రీస్తు విమోచన క్రయధనం నుండి మీరు ప్రయోజనం పొందుతారా?

క్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనం వల్ల కలిగే నిత్య ప్రయోజనాల గురించి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఆయనే [యేసుక్రీస్తే] మన పాపములకు శాంతి​కరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వ​లోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:⁠2) అవును, క్రీస్తు విమోచన క్రయధనం మానవజాతి అంతటికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అంటే ప్రతీ ఒక్కరూ ఏమీ చేయకుండానే ఆ విలువైన ఏర్పాటు నుండి ప్రయోజనం పొందుతారని దానర్థమా? కాదు. ఉదాహరణకు, ఆపదలో ఉన్నవారిని రక్షించే విషయాన్ని గురించి ఆలోచించండి. కార్మికులు కొందరు గనిలో చిక్కుకుపోయారనుకుందాం. వారిని రక్షించడానికి ఒక బావి (షాప్టు) నుండి బోనును (కేజిని) కిందకు దించుతారు. బ్రతికి బయటపడాలంటే ప్రతీ వ్యక్తి ఆ బోనులోకి ఎక్కాలి. అలాగే క్రీస్తు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలనుకునేవారు దేవుని ఆశీర్వాదం కోసం వేచిచూస్తే సరిపోదు. వాళ్ళు చర్యలు తీసుకోవాలి.

ఎలాంటి చర్యలు తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు? యోహాను 3:⁠36 ఇలా చెబుతోంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును.” మనం క్రీస్తు బలిపట్ల విశ్వాస​ముంచాలని దేవుడు కోరుతున్నాడు. అదొక్కటే సరిపోదు. “మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను [యేసును] ఎరిగియున్నామని తెలిసికొందుము.” (1 యోహాను 2:⁠3) కాబట్టి, పాపమరణాల నుండి విముక్తి పొందాలంటే, మనం క్రీస్తు విమోచన క్రయధనంపై విశ్వాసముంచడం, క్రీస్తు ఆజ్ఞలకు లోబడడం చాలా ప్రాముఖ్యం అని స్పష్టమౌతుంది.

యేసు విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించే ఒక ప్రాముఖ్యమైన మార్గమేమిటంటే, ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం దానిపట్ల మెప్పుదలను ప్రదర్శించాలి. చనిపోవడానికి ముందు యేసు విశ్వసనీయులైన తన అపొస్తలులతోపాటు సూచనార్థక భోజనాన్ని ప్రారంభించి, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” ఆజ్ఞాపించాడు. (లూకా 22:​19) యెహోవాసాక్షులు దేవుని కుమారునితో తమకున్న స్నేహాన్ని ఎంతో విలువైనదిగా పరిగణిస్తారు, అందుకే వారు ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞను పాటిస్తారు. ఈ సంవత్సరం యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ శనివారం మార్చి 22న సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. యేసు ఆజ్ఞను పాటించడానికి ఈ ప్రత్యేక కూటానికి హాజరవమని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు ఆ ఆచరణ జరిగే సమయాన్ని, స్థలాన్ని మీకు చెప్పగలరు. దానికి హాజరైనప్పుడు, క్రీస్తు విమోచన క్రయధనం మిమ్మల్ని ఆదాము పాపంవల్ల ఎదురౌతున్న మరణాంతకమైన దుష్ఫలితాల నుండి విముక్తి చేయాలంటే మీరు ఏమి చేయాల్సి ఉంటుందో అక్కడ ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు.

తమను నాశనమవకుండా కాపాడిన సృష్టికర్త, ఆయన కుమారుడు చేసిన త్యాగంపట్ల నేడు చాలా కొద్దిమందికే కృతజ్ఞత ఉంది. ఆ బలిపట్ల విశ్వాసముంచేవారు ఒక ప్రత్యేకమైన సంతోషాన్ని చవిచూస్తారు. అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవుల గురించి ఇలా వ్రాశాడు: ‘మీరు ఆయనను [యేసుక్రీస్తును] విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగలవారై ఆనందించు​చున్నారు.’ (1 పేతురు 1:​8, 9) యేసుక్రీస్తుపట్ల ప్రేమను, ఆయన విమోచన క్రయధన బలిపట్ల విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడం ద్వారా ప్రస్తుతం మీ జీవితంలో సంతోషాన్ని అనుభవించడమేకాక, పాపమరణాల నుండి రక్షించబడతారని కూడా ఎదురుచూడవచ్చు. (w 08 3/1)