సత్యదేవుని గురించి ఆయనేమి బోధించాడు?
యేసు ఏమి బోధించాడు?
సత్యదేవుని గురించి ఆయనేమి బోధించాడు?
దేవునికి ఒక పేరు ఉందా?
దేవునికి ఒక పేరు ఉందని యేసు బోధించాడు. ఆయనిలా చెప్పాడు: “మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక.” (మత్తయి 6:9) దేవుని పేరు యెహోవా అని బైబిలు తెలియజేస్తోంది. (కీర్తన 83:18) యేసు తన శిష్యుల గురించి మాట్లాడుతూ, ప్రార్థనలో తన తండ్రికి ఇలా చెప్పాడు: “వారికి నీ నామమును తెలియజేసితిని.”—యోహాను 17:26.
యెహోవా ఎవరు?
యెహోవా సృష్టికర్త కాబట్టే యేసు ఆయనను ‘అద్వితీయ సత్యదేవుడు’ అని పిలిచాడు. (యోహాను 17:3) యేసు ఇలా అన్నాడు: “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెనని . . . మీరు చదువలేదా?” (మత్తయి 19:4, 5) యేసు ఇంకా ఇలా తెలియజేశాడు: “దేవుడు ఆత్మ.” (యోహాను 4:24) అందుకే మనం దేవుణ్ణి చూడలేము.—నిర్గమకాండము 33:17-20.
దేవుడు మనమేమి చేయాలని ఆశిస్తున్నాడు?
ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఒకరు యేసును అడిగినప్పుడు ఆయనిలా సమాధానమిచ్చాడు: “ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ.”—మార్కు 12:28-31.
దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?
యేసు ఇలా అన్నాడు: ‘నేను తండ్రిని ప్రేమించుచున్నాను.’ ఆయన దేవునిపట్ల తనకున్న ప్రేమను ఎలా చూపించాడు? ‘తండ్రి నాకు ఆజ్ఞాపించినది నేను చేయుచున్నాను’ అని ఆయన చెప్పాడు. (యోహాను 14:31) ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును.” (యోహాను 8:29) మనం దేవుని గురించి నేర్చుకోవడం ద్వారా ఆయనను సంతోషపర్చవచ్చు. యేసు తన శిష్యుల గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను . . . ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3; 1 తిమోతి 2:4.
దేవుని గురించి మనమెలా నేర్చుకోవచ్చు?
దేవుని గురించి నేర్చుకునే ఒక మార్గమేమిటంటే, ఆయన సృష్టించిన వాటిని పరిశీలించడం. ఉదాహరణకు, యేసు ఇలా చెప్పాడు: “ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?” మనం ఏ పాఠం నేర్చుకోవాలని యేసు అలా చెప్పాడు? జీవితావసరాల గురించి చింతిస్తూ దేవుణ్ణి సేవించడం ఆపేయకూడదు.—మత్తయి 6:26-33.
యెహోవా గురించి నేర్చుకునే అత్త్యుత్తమ మార్గం ఏమిటంటే, ఆయన వాక్యమైన బైబిలును అధ్యయనం చేయడమే. యేసు లేఖనాలను “దేవుని వాక్యము” అని పిలిచాడు. (లూకా 8:21) యేసు దేవునితో ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.”—యోహాను 17:17; 2 పేతురు 1:20, 21.
ప్రజలు యెహోవా గురించి సత్యాన్ని నేర్చుకోవడానికి యేసు సహాయం చేశాడు. యేసు గురించి ఆయన శిష్యుల్లో ఒకాయన ఇలా అన్నాడు: “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” (లూకా 24:32) దేవుని గురించి నేర్చుకునేందుకు మనం వినయంగా ఉండడమే కాక, నేర్చుకోవడానికి సిద్ధంగా కూడా ఉండాలి. యేసు ఇలా చెప్పాడు: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరు.”—మత్తయి 18:3.
దేవుని గురించిన జ్ఞానం సంతోషాన్నిస్తుందని ఎందుకు చెప్పవచ్చు?
జీవిత సంకల్పమేమిటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ సంకల్పాన్ని అర్థం చేసుకునేందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసు ఇలా చెప్పాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:3, NW) జీవితాన్ని ఎలా సరైన విధంగా జీవించాలో యెహోవా మనకు చూపిస్తాడు. ‘దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు’ అని కూడా యేసు చెప్పాడు.—లూకా 11:28; యెషయా 11:9. (w 08 2/1)
మరింత సమాచారం కోసం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * పుస్తకంలోని 1వ అధ్యాయాన్ని చూడండి
[అధస్సూచి]
^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినది.
[12వ పేజీలోని చిత్రం]
“వారికి నీ నామమును తెలియజేసితిని.”—యోహాను 17:26
[12, 13వ పేజీలోని చిత్రాలు]
మనం సృష్టిద్వారా, బైబిలు ద్వారా యెహోవా గురించి నేర్చుకోవచ్చు