క్షమించడానికి ఇష్టపడే దేవుడు
దేవునికి దగ్గరవ్వండి
క్షమించడానికి ఇష్టపడే దేవుడు
“ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.” (కీర్తన 86:5) హృదయాన్ని స్పృశించే ఆ మాటలతో, యెహోవా దేవుడు ఉదారంగా క్షమిస్తాడని బైబిలు మనకు హామీనిస్తోంది. అపొస్తలుడైన పేతురు జీవితంలో జరిగిన ఒక సంఘటన యెహోవా “బహుగా” క్షమిస్తాడని స్పష్టంగా చూపిస్తోంది.—యెషయా 55:7.
యేసుకు సన్నిహితులైనవారిలో పేతురుకూడా ఉన్నాడు. యేసు భూ జీవితపు చివరి రాత్రి భయానికిలోనై పేతురు గంభీరమైన పాపం చేశాడు. యేసును చట్టవిరుద్ధంగా విచారణ చేస్తున్న ప్రాంగణంలో, యేసు ఎవరో తనకు తెలియదని పేతురు ఒక్కసారి కాదు మూడుసార్లు అందరిముందు చెప్పాడు. పేతురు మూడవసారి తెలియదని చెప్పిన తర్వాత యేసు “తిరిగి, పేతురువైపు చూ[శాడు].” (లూకా 22:55-61) యేసు అలా చూసినప్పుడు పేతురు ఎలా భావించివుంటాడో మీరు ఊహించగలరా? పేతురు తాను చేసిన గంభీరమైన తప్పును గ్రహించి, దాన్ని ‘తలచుకుంటూ ఏడ్చాడు.’ (మార్కు 14:72) పశ్చాత్తాపపడిన ఆ అపొస్తలుడు తాను మూడుసార్లు అబద్ధం చెప్పినందుకు దేవుడు తనను క్షమిస్తాడో లేదో అనుకొనివుండవచ్చు.
యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత పేతురుతో మాట్లాడిన మాటల మూలంగా, తాను క్షమించబడ్డానో లేదో అని పేతురుకు ఏమైనా సందేహాలు ఉండుంటే అవి తొలగిపోయాయి. యేసు కఠినంగా మాట్లాడలేదు, నిందించలేదు. బదులుగా ఆయన పేతురును ఇలా అడిగాడు, “నీవు నన్ను . . . ప్రేమించుచున్నావా?” దానికి పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని సమాధానమిచ్చాడు. అప్పుడు యేసు, “నా గొఱ్ఱె పిల్లలను మేపుము” అని చెప్పాడు. యేసు రెండవసారి అదే ప్రశ్న అడిగాడు, అప్పుడు పేతురు బహుశా కాస్త నొక్కిచెబుతూ అదే సమాధానమిచ్చాడు. అప్పుడు యేసు, “నా గొఱ్ఱెలను కాయుము” అన్నాడు. యేసు మూడవసారి అదే ప్రశ్న ఇలా అడిగాడు, “నన్ను ప్రేమించుచున్నావా?” ఈ సారి “పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని ఆయనతో అన్నాడు. అప్పుడు యేసు “నా గొఱ్ఱెలను మేపుము” అని చెప్పాడు.—యోహాను 21:15-18.
యేసుకు జవాబు తెలిసినప్పటికీ ఎందుకు ఆ ప్రశ్నలు అడిగాడు? యేసు హృదయాలను చదవగలడు, అందుకే పేతురు తనను ప్రేమిస్తున్నాడని ఆయనకు తెలుసు. (మార్కు 2:8) యేసు ఆ ప్రశ్నలు అడగడం ద్వారా, తనకు ప్రేమ ఉందని మూడుసార్లు నొక్కిచెప్పే అవకాశాన్ని పేతురుకు ఇచ్చాడు. “నా గొఱ్ఱె పిల్లలను మేపుము. . . . నా గొఱ్ఱెలను కాయుము. . . . నా గొఱ్ఱెలను మేపుము” అని యేసు పశ్చాత్తాపపడిన అపొస్తలుడితో చెప్పడం, యేసుకు తనపై ఇంకా నమ్మకముందని ఆయనకు హామీనిచ్చింది. ఎందుకంటే ఎంతో అమూల్యమైన సంపద గురించి అంటే యేసుకు ప్రియమైన గొర్రెవంటి అనుచరుల విషయంలో శ్రద్ధ తీసుకొనే బాధ్యతను పేతురుకు అప్పగించాడు. (యోహాను 10:14, 15) యేసు దృష్టిలో తాను ఇంకా నమ్మదగినవాడిగా ఉన్నానని తెలుసుకొని పేతురు తప్పక ఉపశమనం పొందివుంటాడు.
పశ్చాత్తాపపడిన అపొస్తలుడిని యేసు క్షమించాడన్నది స్పష్టం. యేసు తన తండ్రి లక్షణాలను, మార్గాలను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తాడు కాబట్టి యెహోవా కూడా పేతురును క్షమించాడనే నిర్ధారణకు రావచ్చు. (యోహాను 5:19) యెహోవా క్షమించడానికి వెనుకాడేవాడు కాదుగానీ పశ్చాత్తాపపడిన పాపిని “క్షమించడానికి సిద్ధంగా” ఉన్న కనికరంగల దేవుడు. అది మనకు ఓదార్పునివ్వడంలేదా? (w 08 6/1)