తిమోతి—సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు
మీ పిల్లలకు నేర్పించండి
తిమోతి—సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు
“రెడీయేనా” అని ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా?— అలా అడిగిన వ్యక్తి మీరు సిద్ధంగావున్నారో లేదో తెలుసుకోవడానికి అడిగివుండవచ్చు. అంటే మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయో లేదో, మీరు ముందుగా చదువుకున్నారో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి అలా అడిగివుండవచ్చు. మనం పరిశీలించబోతున్నట్లుగా, తిమోతి సిద్ధంగా ఉండేవాడు.
అంతేకాక తిమోతి సేవచేయడానికి కూడా ఇష్టపడేవాడు. అంటే ఏమిటో మీకు తెలుసా?— దేవుని సేవచేసే అవకాశం లభించినప్పుడు తిమోతి, ‘నేనున్నాను నన్ను పంపుము’ అని చెప్పిన మరో దేవుని సేవకుడు చూపించినలాంటి స్వభావాన్నే చూపించాడు. (యెషయా 6:8) తిమోతి సేవచేయడానికి సిద్ధంగా ఉండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు కాబట్టి ఆయన జీవితం ఎంతో ఉత్సాహంగా గడిచింది. మీకు దాని గురించి తెలుసుకోవాలని ఉందా?—
తిమోతి యెరూషలేముకు వందల కిలోమీటర్ల దూరంలో, లుస్త్రలో జన్మించాడు. ఆయన అమ్మమ్మ లోయి, తల్లి యునీకే లేఖనాలను ఎంతో శ్రద్ధగా చదివేవారు. వారు తిమోతికి చిన్నప్పటి నుండే దేవుని వాక్యాన్ని బోధించారు.—2 తిమోతి 1:3-5; 3:14, 15.
తిమోతి బహుశా ఇంకా యుక్తవయసులో ఉన్నప్పుడే, అపొస్తలుడైన పౌలు ప్రకటించడానికి మొదటిసారి చేసిన తన సుదీర్ఘమైన ప్రయాణంలో బర్నబాతో కలసి లుస్త్రకు వచ్చాడు. బహుశా ఈ సమయంలోనే తిమోతి వాళ్ళ అమ్మ, అమ్మమ్మ క్రైస్తవులయ్యుండవచ్చు. పౌలు బర్నబాలకు ఎదురైన కష్టాల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా?— క్రైస్తవులంటే ఇష్టంలేని వాళ్ళు పౌలును రాళ్ళతో కొట్టి, క్రింద పడవేసి, పట్టణం వెలుపలికి ఈడ్చుకువెళ్ళారు. వారు ఆయన చనిపోయాడనుకున్నారు.
పౌలు బోధిస్తున్న విషయాలను నమ్మినవారు ఆయన చుట్టూ చేరగానే ఆయన లేచి నిలబడ్డాడు. ఆ తర్వాతి రోజు పౌలు, బర్నబా అక్కడినుండి వెళ్ళిపోయారు, అయితే కొద్ది రోజుల తర్వాత లుస్త్రకు తిరిగివచ్చారు. అప్పుడు పౌలు ప్రసంగిస్తూ శిష్యులతో ఇలా చెప్పాడు: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.” (అపొస్తలుల కార్యములు 14:7-22) పౌలు ఎందుకలా చెప్పాడో మీకు తెలుసా?— దేవుని సేవచేసేవారిని ఇతరులు బాధపెడతారు కాబట్టి పౌలు అలా చెప్పాడు. ఆ తర్వాత పౌలు తిమోతికిలా వ్రాశాడు: ‘దేవునిపట్ల భక్తితో జీవించాలనుకునేవారందరు హింసించబడతారు.’—2 తిమోతి 3:12; యోహాను 15:20.
పౌలు బర్నబా, లుస్త్ర నుండి ఇంటికి తిరిగి వచ్చారు. పౌలు తాను ప్రకటించిన ప్రాంతాల్లో క్రొత్తగా శిష్యులైనవారిని ప్రోత్సహించడానికి కొన్ని నెలల తర్వాత సీలను వెంటబెట్టుకొని మళ్లీ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు లుస్త్రకు చేరుకున్నప్పుడు పౌలును మళ్లీ చూసి తిమోతి ఎంత సంతోషించివుంటాడో కదా! పౌలు, సీల తమతోపాటు రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయనింకా సంతోషించివుంటాడు. తిమోతి ఆ ఆహ్వానానికి వెంటనే అంగీకరించాడు. ఆయన సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు.—అపొస్తలుల కార్యములు 15:40–16:5.
వారు ముగ్గురు కలసి ప్రయాణిస్తూ ఎన్నో మైళ్ళు నడిచిన తర్వాత ఒక ఓడ ఎక్కారు. తీరాన్ని చేరుకొని, కాలినడకన గ్రీసులోని థెస్సలొనీకయకు వెళ్ళారు. అక్కడ చాలామంది క్రైస్తవులయ్యారు. కానీ ఇతరులు కోపంతో దాడిచేసేందుకు పోగయ్యేసరికి పౌలు, సీల, తిమోతి తమ ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని బెరయకు వెళ్ళిపోయారు.—అపొస్తలుల కార్యములు 17:1-10.
పౌలు థెస్సలొనీకయలో క్రొత్తగా విశ్వాసులైన వారి గురించి ఎంతో ఆందోళనచెంది, తిమోతిని మళ్ళీ అక్కడకు పంపించాడు. ఎందుకో తెలుసా?— దానికి కారణమేమిటో ఆ తర్వాత పౌలు థెస్సలొనీకయలోని క్రైస్తవులకు ఇలా వివరించాడు: ‘మీరు నిరుత్సాహపడకుండా మిమ్మల్ని ఓదార్చడానికి, స్థిరపరచడానికి ఆయనను పంపుతున్నాను.’ పౌలు యౌవనుడైన తిమోతిని అంత ప్రమాదకరమైన పని మీద ఎందుకు పంపించాడో మీకు తెలుసా?— అక్కడ వ్యతిరేకిస్తున్నవారికి తిమోతి అంతగా తెలియదు, అంతేగాక ఆయన అక్కడకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అందుకే పౌలు ఆయనను పంపించాడు. అలా వెళ్ళడానికి ఎంతో ధైర్యం అవసరం. అలా వెళ్ళడం వల్ల ఏమి జరిగింది? తిమోతి పౌలు దగ్గరకు తిరిగి వచ్చి, థెస్సలొనీకయలోవున్న క్రైస్తవులు ఎంత విశ్వాసంగా ఉన్నారో తెలియజేశాడు. అప్పుడు పౌలు వారికిలా వ్రాశాడు: “మీ విషయములో ఆదరణ పొందితిమి.”—1 థెస్సలొనీకయులు 3:1-7.
తిమోతి తర్వాతి పది సంవత్సరాలు పౌలుతో కలిసి సేవచేశాడు. ఆ తర్వాత పౌలు రోములో బంధించబడ్డాడు. ఆ మధ్యనే చెరసాలనుండి విడుదలైన తిమోతి పౌలుతో ఉండడానికి వెళ్ళాడు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు ఒక పత్రిక వ్రాశాడు, అలా వ్రాయడానికి ఆయన తిమోతిని ఉపయోగించుకొని ఉండవచ్చు. ఆ పత్రికలో పౌలు ఇలా వ్రాశాడు: ‘తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు నిరీక్షించుచున్నాను, ఆయనంత నమ్మకమైనవాడు, ఆయనంత బాగా మీకు సేవచేసేవాడు ఇంకెవడును నాయొద్ద లేడు.’—ఫిలిప్పీయులు 2:19-22; హెబ్రీయులు 13:23.
ఆ మాటలకు తిమోతి ఎంతగా సంతోషించి ఉంటాడో కదా! తిమోతి సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు అందుకే పౌలు ఆయనను ఎంతో ప్రేమించాడు. మీరు కూడా తిమోతిలాగే ఉండాలని మేము ఆశిస్తున్నాము. (w 08 4/1)
ప్రశ్నలు:
❍ తిమోతి ఎక్కడ పెరిగాడు, పౌలు మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి జరిగింది?
❍ పౌలు, సీల తమతోపాటు రమ్మని ఆహ్వానించినప్పుడు తిమోతి ఏమి చేశాడు?
❍ తిమోతి ధైర్యాన్ని ఎలా కనపరిచాడు, పౌలు ఆయనను ఎందుకంతగా ప్రేమించాడు?
[24వ పేజీలోని చిత్రం]
ఏమి జరిగింది?