కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు”

“ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు”

దేవునికి దగ్గరవ్వండి

“ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు”

అపొస్తలుల కార్యములు 17:24-27

ఈ సువిశాల విశ్వంతో పోలిస్తే మానవులు నిజానికి ఎంతో అల్పులు. బహుశా మీరిలా ఆలోచించి ఉండవచ్చు, ‘మానవమాత్రులు సర్వశక్తిమంతుడైన దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండడం నిజంగా సాధ్యమేనా?’ యెహోవా అనే పేరుగల దేవుడు, మనమాయనకు సన్నిహితం కావాలని కోరుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఆయనలా కోరుకుంటున్నాడా? దానికి సాంత్వనదాయకమైన సమాధానం, అపొస్తలుల కార్యములు 17:24-27లో వ్రాయబడివున్నట్లుగా, అపొస్తలుడైన పౌలు ఏథెన్సులోని విద్యావంతులైన పురుషులను ఉద్దేశించి పలికిన జ్ఞానవంతమైన మాటల్లో లభిస్తుంది. యెహోవా గురించి పౌలు ప్రస్తావించే నాలుగు విషయాలను గమనించండి.

మొదటిగా పౌలు, దేవుడు ‘జగత్తును అందలి సమస్తమును నిర్మించెను’ అని చెప్పాడు. (24వ వచనం) జీవితాన్ని ఎంతో ఆనందదాయకం చేసే అందం, వైవిధ్యం మన సృష్టికర్త ప్రేమకు, ఆలోచనకు నిదర్శనం. (రోమీయులు 1:20) అలాంటి దేవుడు, తానంతగా ప్రేమించే ప్రజలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

రెండవదిగా, యెహోవా “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.” (25వ వచనం) యెహోవా జీవాధి​పతి. (కీర్తన 36:9) జీవించడానికి ఎంతో అవసరమైన గాలి, నీరు, ఆహారం అన్నీ మన సృష్టికర్త మనకిచ్చిన బహుమానాలే. (యాకోబు 1:17) ఉదారుడైన మన దేవుడు, ఆయనెవరో తెలుసుకొని, ఆయనకు దగ్గరయ్యే అవకాశాన్ని మనకివ్వకుండా మనకు దూరంగా ఉంటాడని నమ్మడం సహేతుకంగా ఉంటుందా?

మూడవదిగా, దేవుడు ‘యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెను.’ (26, 27 వచనాలు) యెహోవా నిష్పక్షపాతి, ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు. (అపొస్తలుల కార్యములు 10:34) ఆయన పక్షపాతం ఎలా చూపిస్తాడు? ఆయన ‘ఒక్కడిని’ అంటే ఆదామును సృష్టించాడు, ఆ ఆదాము నుండే అన్ని జనాంగాలు, జాతులు ఏర్పడ్డాయి. “మనుష్యులందరు రక్షణ” పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. (1 తిమోతి 2:4) కాబట్టి, మన శరీర వర్ణం, దేశం, జాతి నేపథ్యం ఏదైనా మనందరం దేవునికి దగ్గరవ్వవచ్చు.

చివరిగా పౌలు ఎంతో హామీనిచ్చే ఒక సత్యాన్ని తెలియ​జేస్తున్నాడు, అదేమిటంటే, యెహోవా “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (26, 27 వచనాలు) యెహోవా ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ, ఆయన తనకు దగ్గరవ్వాలని నిజంగా కోరుకునేవారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు కానీ తనకు ‘మొఱ్ఱపెట్టువారి కందరికి ఆయన సమీపముగా ఉన్నాడు’ అని ఆయన వాక్యం మనకు హామీనిస్తోంది.—కీర్తన 145:18.

మనం తనకు దగ్గరవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడని పౌలు మాటలను బట్టి స్పష్టమవుతోంది. అయితే ఆయన, తన కోసం ‘తడవులాడి, వెదకేవారికి’ మాత్రమే అలాంటి సాన్నిహిత్యాన్ని అనుగ్రహిస్తాడని పౌలు వివరిస్తున్నాడు. (26, 27 వచనాలు) బైబిలు అనువాదకుల కోసమైన ఒక పఠనీయ గ్రంథం ఇలా చెబుతోంది, “ఈ రెండు క్రియాపదాలు సాధ్యమయ్యే అవకాశాన్ని . . . లేక సాధ్యమయ్యే కోరికను వ్యక్తం చేస్తున్నాయని అర్థమవుతోంది.” సోదాహరణంగా చెప్పాలంటే, మీకు బాగా తెలిసిన గదే అయినా చీకటిగావుంటే మీరు స్విచ్‌ కోసమో తలుపు కోసమో వెతుక్కుంటారు, అయినప్పటికీ మీరు దేనికోసం వెదుకుతున్నారో అది దొరుకుతుందని మీకు తెలుసు. అలాగే మనం దేవుని కోసం యథార్థంగా తడవులాడి, వెదికితే మన ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని మనం నమ్మకంతో ఉండవచ్చు. మనం ఆయనను ‘[నిజంగా] కనుగొంటాం’ అని పౌలు మనకు హామీ ఇస్తున్నాడు.​—26, 27 వచనాలు.

దేవునికి దగ్గరవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీరు విశ్వాసంతో ఆయన కోసం ‘తడవులాడి, వెదికితే’ మీరు నిరాశ చెందరు. యెహోవాను కనుగొనడం కష్టమేమీ కాదు, ఎందుకంటే ఆయన “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (w 08 7/1)