కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కడవరి స్థితి” గురించి ఆలోచించండి

“కడవరి స్థితి” గురించి ఆలోచించండి

“కడవరి స్థితి” గురించి ఆలోచించండి

జీవితంలో మనమెన్నో ఎంపికలు చేసుకోవలసివుంటుంది. మనమేదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు దాని పర్యవసానాలు ఎలావుంటాయో ఆలోచించడం జ్ఞానయుక్తమైనది. కొందరు తాము తీసుకున్న నిర్ణయాలనుబట్టి ఆ తర్వాత ఎంతో విచారించారు. బహుశా మీరు కూడా, ‘దీని పర్యవసానాలు ఎలావుంటాయో నాకు ముందే తెలిసుంటే, నేనసలు అలా చేయకపోదును’ అని అనేవుంటారు.

అనుభవజ్ఞుడైన ప్రయాణికుడు ప్రతీమార్గం ఎక్కడకు వెళుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆయన మ్యాప్‌ చూస్తాడు, ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన​వారిని సంప్రదిస్తాడు. ఆయన తాను వెళ్ళే దారిలో కనిపించే మార్గసూచిలను ఖచ్చితంగా గమనిస్తాడు. జీవనమార్గంలో పయనిస్తున్నప్పుడు ఏది సరైన మార్గమో మీరెలా తెలుసుకోవచ్చు? ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రజల గురించి ఒకసారి దేవుడు మోషే ద్వారా ఇలా చెప్పాడు, “వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.”—ద్వితీ​యోపదేశకాండము 32:29.

శ్రేష్ఠమైన ఉపదేశం

జీవన గమనంలో మనకెదురయ్యే మార్గాల “కడవరి స్థితి” లేదా గమ్యం ఎలావుంటుందోనని మనం సందేహించాల్సిన అవసరం లేదు. దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మానవులంతా ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవడం మంచిదో చెప్పగలడు. మానవులు ఎంచుకున్న ఎన్నో మార్గాలను, వాటి పర్యవసానాలను ఆయన చూశాడు. బైబిలిలా చెబుతోంది, “నరుని మార్గములను యెహోవా యెరుగును. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.”—సామెతలు 5:21.

యెహోవా తనను ప్రేమించేవారి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. తన వాక్యమైన బైబిలుద్వారా వారికి శ్రేష్ఠమైన మార్గమేదో చెబుతాడు. మనమిలా చదువుతాం, “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” కాబట్టి మీరేదైనా మార్గంలో ప్రయాణించడం ప్రారంభించేముందు, “నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము” అని ప్రార్థించిన ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు చేసినట్లే, యెహోవా ఉపదేశం తెలుసుకోవడానికి ప్రయత్నించడం జ్ఞానయుక్తమైనది.—కీర్తన 32:8; 143:8.

నమ్మకమైనవాడు, అనుభవజ్ఞుడు అయిన ప్రయాణికుడు ఇచ్చే సూచనలను అనుసరించడం, ధైర్యాన్ని, భద్రతాభావాన్ని ఇవ్వవచ్చు. మీరు ఆ మార్గం ఎక్కడకు వెళుతుందో అని విచారించరు. దావీదు యెహోవా నడిపింపును, నిర్దేశాన్ని అడిగి, దానిని అనుసరించాడు. ఫలితంగా, ఆయన అనుభవించిన మనశ్శాంతి 23వ కీర్తనలో రమ్యంగా వర్ణించబడింది. దావీదు ఇలా వ్రాశాడు, “యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ​జేయుచున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను.”—కీర్తన 23:1-4.

వారి అంతము ఎలావుంటుంది?

జీవనమార్గంపై ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు, సరైన మార్గం నుండి తన “పాదములు జారుటకు కొంచెమే తప్పెను” అని అంగీకరించాడు, ఆయన కీర్తనకర్త అయిన ఆసాపు లేదా ఆయన కుమారుల్లో ఒకరు అయ్యుండవచ్చు. ఆయన ఎందుకలా భావించాడు? ఆయన అనీతిపరుల, దౌర్జన్యకారుల సంక్షేమాన్ని చూశాడు, “భక్తిహీనుల క్షేమము[ను]” బట్టి మత్సరపడ్డాడు. వారు “ఎల్లప్పుడు నిశ్చింతగలవారై” ఉన్నట్లు ఆయనకు అనిపించింది. అంతకంటే ఘోరంగా కీర్తనకర్త తానెంచుకున్న నీతిమార్గాన్ని అనుసరించడం జ్ఞానయుక్తమైనదేనా అని సందేహించడం ప్రారంభించాడు.—కీర్తన 73:2, 3, 6, 12, 13.

ఆ తర్వాత కీర్తనకర్త యెహోవా ఆలయంలోకి ప్రవేశించి, భక్తిహీనులు ఎదుర్కొనే పర్యవసానాల గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాడు. “వారి అంతము” ఎలావుంటుందో ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. తానెవరి విషయంలో మత్సరపడ్డాడో వారి పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆయన ఆలోచించాడు. వారి అంతము ఎలావుంటుంది? అలాంటి ప్రజలు “కాలుజారు చోట” ఉన్నారని, “మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు” అని ఆయన గ్రహించాడు. కీర్తనకర్త అనుసరిస్తున్న మార్గం విషయమేమిటి? ‘తరువాత యెహోవా నన్ను మహిమలో చేర్చుకొనును’ అని ఆయన చెప్పాడు.—కీర్తన 73:17-19, 24.

సరైన మార్గాలను అనుసరించకుండా లేదా అనుమానాస్పద వ్యవహారాల ద్వారా వస్తుసంబంధంగా వర్ధిల్లేవారి చర్యల పర్యవసానాల గురించి కీర్తనకర్త ఆలోచించడం, తాను సరైన మార్గంలోనే ఉన్నాననే నిశ్చయతను ఆయనకు కలిగించింది. ఆయనిలా పేర్కొన్నాడు, “నాకైతే దేవుని పొందు ధన్యకరము.” యెహోవా దేవునికి సన్నిహితంగా ఉండడంవల్ల ఎల్లప్పుడూ శాశ్వత ప్రయోజనాలు చేకూరతాయి.​—కీర్తన 73:28.

మీరు “నడచు మార్గము” ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి

నేడు మనకు కూడా ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. మీకు ఆకర్షణీయమైన వ్యాపార అవకాశం లభించవచ్చు, పదోన్నతి పొందే అవకాశం రావచ్చు, ఎక్కువ డబ్బు వచ్చే వ్యాపారంలో భాగస్వామిగా ఉండమనే ఆహ్వానం దొరకవచ్చు. ఏ కొత్త పని ప్రారంభించడంలోనైనా కొంత ప్రమాదముండే అవకాశముంది. అంతేగాక, మీరు ఎంచుకున్న మార్గపు “కడవరి స్థితి” గురించి ముందే ఆలోచించడం జ్ఞానయుక్తం కాదా? పర్యవసానాలు ఎలా ఉండే అవకాశముంది? మీకు, మీ భాగస్వామికి ఒత్తిడి కలిగిస్తూ మీరు మీ ఇంటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుందా? మీతోపాటు వ్యాపారం చేస్తున్నవారి లేదా హోటళ్లలోగానీ మరెక్కడైనాగానీ మీరు కలిసేవారి చెడు సహవాసానికి గురయ్యే ప్రమాదముందా? మీరు మీ ముందున్న మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, జ్ఞానవంతమైన నిర్ణయం తీసుకో​గలుగుతారు. మీరు “నడచు మార్గము” ఎక్కడికి వెళ్తుందో చూసుకోమని సొలొమోను ఇచ్చిన సలహాను అనుసరించండి.​—సామెతలు 4:26.

మనందరం, ముఖ్యంగా యౌవనస్థులు ఆ సలహా గురించి ఆలోచించడం మంచిది. ఒక యౌవనస్థుడు లైంగిక కోరికలు రేకెత్తించే దృశ్యాలు ఉన్నాయని తనకు తెలిసిన ఒక వీడియోను అద్దెకు తెచ్చుకుని చూశాడు. ఆ తర్వాత ఆయన చెప్పినట్లుగా, ఆ వీడియో చూశాక ఆయనలో కోరిక ఎంతగా రేకెత్తిందంటే దగ్గర్లో నివసిస్తుందని తనకు తెలిసిన ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. దానితో ఆయనెంతో కృంగిపోయాడు, ఆయనలో అపరాధభావాలు కలిగాయి, లైంగిక సంబంధమైన వ్యాధుల గురించిన భయంపట్టుకుంది. ఆయన విషయంలో జరిగినది, ‘వెంటనే పశువు వధకు పోవునట్లు వాడు దానివెంట పోయెను’ అని బైబిలులో వర్ణించబడినట్లుగానే ఉంది. ఆయన “కడవరి స్థితి” గురించి ఆలోచించివుంటే ఎంత బాగుండేది!—సామెతలు 7:22, 23.

మార్గసూచిలను నమ్మండి

మార్గసూచిలను అలక్ష్యంచేయడం జ్ఞానయుక్తం​కాదని చాలామంది అంగీకరిస్తారు. అయితే విచారకరంగా, జీవనమార్గంలో తమకివ్వబడిన నిర్దేశం నచ్చనప్పుడు కొంతమంది అలాగే అలక్ష్యంచేస్తారు. యిర్మీయా కాలంలోని కొంతమంది ఇశ్రాయేలీయుల పరిస్థితిని ఆలోచించండి. ఆ జనాంగం నిర్ణయం తీసుకోవలసిన అవసరమున్నప్పుడు యెహోవా దేవుడు వారికిలా ఉపదేశించాడు, “పురాతన మార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి.” కానీ ఆ ప్రజలు, “అందులో నడుచుకొనము” అని మొండిగా సమాధానమిచ్చారు. (యిర్మీయా 6:16) వారి తిరుగుబాటు ధోరణి వల్ల ఏర్పడిన “కడవరి స్థితి” లేదా పర్యవసానం ఏమిటి? సా.శ.పూ. 607లో బబులోనీయులు వచ్చి యెరూషలేము పట్టణాన్ని సమూలంగా నాశనంచేసి, దాని నివాసులను బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళారు.

దేవుడిచ్చిన మార్గసూచిలను అలక్ష్యంచేస్తే మనకెలాంటి ప్రయోజనమూ చేకూరదు. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక​ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని లేఖనాలు మనకు ఉపదేశిస్తున్నాయి.​—సామెతలు 3:5, 6.

దేవుని హెచ్చరికలు మనకెంతో ప్రాముఖ్యమైన నిర్దేశాన్నిస్తాయి. ఉదాహరణకు, బైబిల్లో “భక్తిహీనుల త్రోవను చేరకుము. దుష్టుల మార్గమున నడువకుము” అని చెప్ప​బడింది. (సామెతలు 4:14) అలాంటి హానికరమైన మార్గాల్లో ఒకటి సామెతలు 5:3, 4లో ఇలా వర్ణించబడింది, “జార స్త్రీ పెదవులనుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు. అది రెండంచులుగల కత్తియంత పదును​గలది.” వేశ్యతోనైనా, ఇతరులెవరితోనైనా అనైతిక సంబంధం పెట్టుకోవడం కొంతమందికి ఎంతో ఉత్సుకతను కలిగించేదిగా అనిపించవచ్చు. కానీ దేవుడు, నైతిక ప్రవర్తన విషయంలో ఇచ్చిన హెచ్చరికలను అలక్ష్యంచేయడం నాశనానికే దారితీస్తుంది.

అలాంటి మార్గంలో అడుగుపెట్టే ముందు, ‘ఇది నన్నెక్కడికి తీసుకువెళుతుంది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించు​కోండి. కాస్త ఆగి, “కడవరి స్థితి” ఎలావుంటుందో పరిశీలించుకుంటే, తీవ్రమైన పర్యవసానాలకు దారితీసే మార్గాన్ని చేపట్టకుండా ఉండగలుగుతారు. అలాంటి మార్గసూచిలను నిర్లక్ష్యం చేసేవారు ఎయిడ్స్‌కు, లైంగికంగా సంక్రమించే ఇతర వ్యాధులకు గురవుతారు, అవాంఛిత గర్భధారణలు, గర్భస్రావాలు వంటి సమస్యలను ఎదుర్కో​వలసి వస్తుంది, ఇతరులతో వారి సంబంధాలు పాడైపోతాయి, వారిలో అపరాధభావాలు కలుగుతాయి. అనైతిక సంబంధాన్ని కొనసాగించేవారి గమ్యాన్ని అపొస్తలుడైన పౌలు స్పష్టంగా పేర్కొన్నాడు. వారు, “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.”—1 కొరింథీయులు 6:9, 10.

“ఇదే త్రోవ”

కొన్నిసార్లు ఒక మార్గం మనల్ని ఎక్కడకు తీసుకువెళుతుందో గ్రహించడం కష్టం. కాబట్టి, దేవుడు ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకుంటున్నందుకు, స్పష్టమైన నిర్దేశాన్నిస్తున్నందుకు మనమెంతో కృతజ్ఞత కలిగివున్నాం. “ఇదే త్రోవ, దీనిలో నడువుడి” అని యెహోవా చెప్పాడు. (యెషయా 30:21) యెహోవా చూపిస్తున్న ఆ మార్గం మనలను ఎక్కడికి తీసుకువెళుతుంది? ఆ మార్గం ఇరుకుగా ఉన్నా, కష్టంగా ఉన్నా అది నిత్యజీవానికి నడిపిస్తుందని యేసు చెప్పాడు.—మత్తయి 7:13, 14.

మీరు ప్రయాణిస్తున్న మార్గం గురించి ఒక్కక్షణం ఆలోచించండి. అది సరైన మార్గమేనా? అది ఎక్కడకు వెళ్తుంది? యెహోవా నిర్దేశం కోసం ప్రార్థించండి. ‘మ్యాప్‌ను’ అంటే బైబిలును సంప్రదించండి. దేవుని మార్గాల్లో నడుస్తున్న అనుభవజ్ఞుడైన ప్రయాణికుణ్ణి సంప్రదించడం అవసరమని కూడా మీరు అనుకోవచ్చు. మీరు మీ దిశను మార్చుకోవడం అవసరమని గ్రహిస్తే, వెంటనే మార్చుకోండి.

ఒక ప్రయాణికుడు తాను సరైన మార్గంపైనే వెళ్తున్నానని సూచించే మార్గసూచిని చూసి తరచూ ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతాడు. మీ జీవన గమనాన్ని పరిశీలించు​కున్నప్పుడు మీరు నీతిమంతుల మార్గంలో నడుస్తున్నారని వెల్లడైతే దానిలోనే కొనసాగడానికి ప్రోత్సహించ​బడండి. ప్రయాణంలోని అత్యంత ప్రతిఫలదాయకమైన భాగం ముందుంది.—2 పేతురు 3:13.

ప్రతీమార్గం ఎక్కడికో ఒక చోటుకు వెళ్తుంది. మీరు ఎంపిక చేసుకున్న మార్గంలో పయనించి గమ్యాన్ని చేరుకున్నప్పుడు మీరెక్కడుంటారు? మీరు అక్కడ నిలబడి, ‘నేను మరో మార్గాన్ని ఎన్నుకునివుంటే ఎంత బావుండేది?’ అని అనుకోవడంవల్ల ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి మీరు జీవనమార్గంలో తర్వాతి అడుగు వేసేముందు ‘ “కడవరి స్థితి” ఎలావుంటుంది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించు​కోండి. (w 08 9/1)

[30వ పేజీలోని బాక్సు/చిత్రం]

“కడవరి స్థితి” ఎలా ఉంటుంది?

యౌవనస్థులు సాధారణంగా, ప్రజాదరణ పొందినవాటిలా కనిపిస్తున్నవాటితో ప్రయోగాలు చేయాలనే ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురవుతారు. అలాంటివి కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ఎవరైనా మీకు సిగరెట్‌ త్రాగే ధైర్యం లేదని సవాలు చేయవచ్చు.

సదుద్దేశంగల ఉపాధ్యాయుడు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించమని మిమ్మల్ని ప్రోత్సహించ​వచ్చు.

మత్తుపానీయాలు, చివరికి మాదకద్రవ్యాలు విరివిగా అందించబడే పార్టీకి మీరు ఆహ్వానించబడవచ్చు.

“మీ ప్రొఫైల్‌ను అంటే మీ ఫోటోలను, ఇతర వ్యక్తిగత వివరాలను ఇంటర్నెట్‌లో ఎందుకు పెట్టకూడదు?” అని ఎవరైనా సూచించవచ్చు.

దౌర్జన్యం లేదా అనైతికత నిండివున్న సినిమా చూద్దామని ఒక స్నేహితుడు మిమ్మల్ని అడగవచ్చు.

ఇలాంటి ప్రలోభాల్లో ఏదైనా మీకు ఎప్పుడైనా ఎదురైతే, అప్పుడు మీరేం చేస్తారు? మీరు వెంటనే ఆ ప్రలోభానికి లొంగిపోతారా, లేక “కడవరి స్థితి” ఎలావుంటుందా అని జాగ్రత్తగా ఆలోచిస్తారా? “ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం జ్ఞానయుక్తమైనది.​—సామెతలు 6:27, 28.