దేవుని పేరును ఉపయోగించడం తప్పా?
దేవుని పేరును ఉపయోగించడం తప్పా?
తరచూ “పాత నిబంధన” అని పిలువబడే హెబ్రీ లేఖనాల్లో దేవుని పేరు יהוה (కుడినుండి ఎడమకు చదవాలి) అనే రూపంలో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే దేవుని పేరు యోద్, హె, వా, హె అనే నాలుగు హీబ్రూ అక్షరాలతో వ్రాయబడుతుంది, సాధారణంగా అది యహ్‌వహ్ అని వ్రాయబడుతుంది.
చాలాకాలం క్రితం, యూదుల్లో దేవుని పేరును ఉపయోగించడం తప్పు అనే ఒక మూఢనమ్మకం ఏర్పడింది. అందువల్ల వారు దానిని ఉచ్ఛరించడం మానేశారు, వారు తమ లేఖనాల్లో దానికి బదులు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే, చాలామంది బైబిలు అనువాదకులు ఆ పేరును “యావే” లేదా “యెహోవా” అని అనువదించారు. అలా అనువదించిన వాటిలో పవిత్ర గ్రంథము అనే క్యాతలిక్ అనువాదము ఒకటి. ఈ అనువాదము ప్రకారం, ఒకవేళ ఇశ్రాయేలీయులు నిన్నెవరు పంపించారని అడిగితే ఏమి చెప్పాలని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయనిలా చెప్పాడు: “ఇస్రాయేలీయులతో నీవిట్లు చెప్పవలెను. మీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరములవారు అందరు నన్ను ఈ పేరుతోనే పిలుతురు.”—నిర్గమకాండము 3:15.
యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు తాను దేవుని పేరును ఎలా ఉపయోగించాడో చెబుతూ, “వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను” అని అన్నాడు. పరలోక ప్రార్థన అని సాధారణంగా పిలువబడే ప్రార్థనలో యేసు, “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అన్నాడు.—యోహాను 17:26; మత్తయి 6:9, 10.
జీసస్ ఆఫ్ నాజరెత్ అనే తన ఇటీవలి పుస్తకంలో 16వ పోప్ బెనడిక్ట్ దేవుని పేరు ఉపయోగించడం గురించి చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి, “ఇశ్రాయేలీయులు . . . దేవుడు తన పేరు అని తెలియజేసిన యహ్‌వహ్ అనే పదాన్ని అన్యదేవతల పేర్లతో సమానస్థాయికి తీసుకురాకుండా ఉండేందుకు దానిని ఉపయోగించడానికి నిరాకరించడం ఎంతో సమంజసమైనదే. అదే విధంగా, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ మార్మికమైనదిగా, ఉచ్ఛరించకూడనిదిగా పరిగణించిన ఈ పేరును, ఇటీవలి బైబిలు అనువాదాలు అది కేవలం ఏదో ఒక పాత పేరు అన్నట్లు దానిని ఉపయోగించడం తప్పు.”
మీరేమనుకుంటున్నారు? దేవుని పేరును ఉపయోగించడం సరైనదా, కాదా? “సర్వకాలములందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరములవారు అందరు నన్ను ఈ పేరుతోనే పిలుతురు” అని యెహోవాయే చెబుతున్నప్పుడు ఆయనను ఎవరైనా వ్యతిరేకించడం సమంజసమేనా? (w 08 7/1)
[26వ పేజీలోని చిత్రం]
యేసు ప్రార్థించేటప్పుడు దేవుని పేరును ఉపయోగించాడు