“సమమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు”
దేవునికి దగ్గరవ్వండి
“సమమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు”
జీవితంలోని అనేక విషయాల వల్ల అంటే బాధ, నిరుత్సాహం, ఒంటరితనం వంటివాటివల్ల మనకు దుఃఖం కలుగుతుంది, చివరకు నిరాశ కూడా కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ‘నాకెవరు సహాయం చేస్తారు’ అనుకోవచ్చు. 2 కొరింథీయులు 1:3, 4లోని అపొస్తలుడైన పౌలు మాటలు, ఆదరణకు మూలమైన యెహోవా దేవుని గురించి చెబుతున్నాయి.
3వ వచనంలో దేవుడు, “కనికరము చూపు తండ్రి” అని పిలువబడ్డాడు. దానర్థమేమిటి? “కనికరము” అని అనువదించబడిన గ్రీకుపదం, ఇతరులు అనుభవిస్తున్న బాధనుబట్టి దయచూపించడాన్ని సూచిస్తుంది. * ఈ పదాన్ని “జాలిపడడం” లేక “ఎంతో శ్రద్ధ చూపించడం” అని కూడా అనువదించవచ్చని ఒక బైబిలు పఠనీయ గ్రంథం చెబుతోంది. దేవుని “కనికరము” ఆయన చర్య తీసుకునేలా చేస్తుంది. దేవుని వ్యక్తిత్వంలోని ఈ అంశం గురించి తెలుసుకోవడం, ఆయనకు సన్నిహితం కావాలని కోరుకునేలా చేస్తుంది, కాదంటారా?
యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని కూడా పౌలు చెబుతున్నాడు. ఆయనిక్కడ, “బాధలో లేక దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఓదార్చడం, ఆ వ్యక్తికి సహాయం చేయడానికి లేక ఆయనను ప్రోత్సహించడానికి ఏదైనా చేయడం అనే తలంపును” అందజేసే పదాన్ని ఉపయోగించాడు. “బాధ అనుభవిస్తున్న ఒక వ్యక్తికి, తన బాధను సహించడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిని ఓదారుస్తాం” అని ది ఇంటర్ ప్రెటర్స్ బైబిల్ వర్ణిస్తోంది.
‘దేవుడు మనల్ని ఎలా ఓదారుస్తాడు, మన బాధను సహించడానికి కావలసిన ధైర్యాన్ని ఎలా ఇస్తాడు’ అని మీరు అడగవచ్చు. ఆయన ముఖ్యంగా తన వాక్యమైన బైబిలు ద్వారా అలా చేస్తాడు, ఈ విషయంలో ప్రార్థన కూడా మనకు సహాయం చేస్తుంది. “లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై” దేవుడు మనకు ప్రేమపూర్వకంగా తన వాక్యాన్నిచ్చాడు అని పౌలు చెప్పాడు. అదనంగా, మన హృదయపూర్వక ప్రార్థనల ద్వారా మనం “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము[ను]” అనుభవించవచ్చు.—రోమీయులు 15:4; ఫిలిప్పీయులు 4:7.
యెహోవా తన ప్రజలకు ఎంతమేరకు ఆదరణ అనుగ్రహిస్తాడు? దేవుడు ‘మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తాడు’ అని పౌలు చెప్పాడు. (2 కొరింథీయులు 1:4) మనం ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను, బాధను అనుభవిస్తున్నా, దానిని సహించడానికి అవసరమైన ధైర్యాన్ని, బలాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు. అది ఓదార్పుకరంగా లేదా?
దేవుడిచ్చే ఆదరణ దానిని పొందినవారికి మాత్రమే పరిమితం కాదు. దేవుడు మనల్ని ఎందుకు ఓదారుస్తున్నాడంటే, మనం ‘దేవుడు మనలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారం కావడానికి’ అని పౌలు చెప్పాడు. మన శ్రమల్లో మనం ఆదరణను పొందాం కాబట్టి, మనం ఇతరులపట్ల సానుభూతి చూపించి, అవసరంలో ఉన్నవారికి సహాయహస్తాన్ని అందించగలుగుతాం.
‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవునిగా’ యెహోవా, మన సమస్యలు లేదా బాధ అదృశ్యమయ్యేలా చేయకపోవచ్చు. అయినప్పటికీ మనం ఒక విషయంలో మాత్రం నమ్మకం కలిగి ఉండవచ్చు, అదేమిటంటే, మనం ఆదరణ కోసం ఆయనవైపు తిరిగితే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి బాధనైనా, కష్టాన్నైనా సహించేలా ఆయన మనల్ని బలపర్చగలడు. అలాంటి కరుణగల దేవుడు మన ఆరాధనకు, మన స్తుతికి ఖచ్చితంగా అర్హుడు. (w 08 9/1)
[అధస్సూచి]
^ పేరా 5 దేవుడు “కనికరము చూపు తండ్రి” అని పిలువబడ్డాడు. కరుణ ఆయన నుండే పుడుతుంది, అది ఆయన స్వభావంలో ఒక భాగం.