కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆదాము పరిపూర్ణుడైతే, ఆయనెలా పాపం చేయగలిగాడు?

ఆదాము పరిపూర్ణుడైతే, ఆయనెలా పాపం చేయగలిగాడు?

మా పాఠకుల ప్రశ్న

ఆదాము పరిపూర్ణుడైతే, ఆయనెలా పాపం చేయగలిగాడు?

దేవుడు ఆదామును సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో సృష్టించాడు కాబట్టి ఆయన పాపం చేయగలిగాడు. ఆయనకలా సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఇవ్వబడినంత మాత్రాన ఆయన పరిపూర్ణుడు కాదనలేము. నిజానికి దేవుడు మాత్రమే సంపూర్ణ భావంలో పరిపూర్ణుడు. (ద్వితీయోపదేశకాండము 32:​3, 4; కీర్తన 18:​30; మార్కు 10:​18) మరెవరిలోనూ మరిదేనిలోనూ అంతటి పరిపూర్ణత లేదు. ఉదాహరణకు మాంసం కోయడానికి కత్తి ఎంతో పనికొస్తుంది, కానీ దాన్ని సూప్‌ తాగడానికి వాడతామా? ఏదైనా ఒక వస్తువు, దానిని దేని కోసం తయారుచేశారో ఆ పని చేస్తేనే, అది పరిపూర్ణమైనది.

మరి దేవుడు ఆదామును దేనికోసం సృష్టించాడు? సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమున్న, ఆలోచించగల ప్రజలు ఆదాము నుండి రావాలని దేవుడు ఆయనను సృష్టించాడు. దేవుని పట్ల, ఆయన మార్గాల పట్ల తమకున్న ప్రేమను వృద్ధిచేసుకోవాలనుకునేవారు, ఆయన ఆజ్ఞలకు లోబడివుండడానికి నిర్ణయించుకోవడం ద్వారా ఆ విషయాన్ని చూపిస్తారు. కాబట్టి దేవుడు మనిషిని సృష్టించినప్పుడే అతడు యాంత్రికంగా విధేయత చూపించేలా అతణ్ణి సృష్టించలేదు, గానీ విధేయత చూపించాలనే కోరిక అతని హృదయంలో స్వచ్ఛందంగా కలుగుతుంది. (ద్వితీయోపదేశకాండము 10:​12, 13; 30:​19, 20) కాబట్టి ఆదాముకు అవిధేయత చూపించే అవకాశం ఇవ్వబడకపోతే అతడు అసంపూర్ణుడు అంటే అపరిపూర్ణుడు అయ్యుండేవాడు. ఆదాము సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకున్నాడో చెబుతూ, “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము” గురించి దేవుడిచ్చిన ఆజ్ఞకు తన భార్యలాగే ఆయన కూడా అవిధేయత చూపించాడని బైబిలు తెలియజేస్తోంది.​—⁠ఆదికాండము 2:​17; 3:​1-6.

మరైతే, మంచేదో చెడేదో నిర్ణయించుకునేందుకు దేవుడు ఆదాముకు ఇచ్చిన సామర్థ్యంలో లోపం ఉందా, అందుకే సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం లేదా ప్రలోభానికి లొంగిపోకుండా ఉండగల సామర్థ్యం ఆయనలో లోపించిందా? ఆదాము అవిధేయత చూపించడానికి ముందు, యెహోవా దేవుడు మొదటి మానవజతతో సహా భూసంబంధమైన సృష్టినంతటినీ పరిశీలించి అదంతా “చాలమంచిదిగ” ఉంది అనే నిర్ధారణకు వచ్చాడు. (ఆదికాండము 1:​31) అందువల్లే ఆదాము పాపం చేసినప్పుడు ఆయన సృష్టికర్త తాను చేసిన సృష్టిలో ఏదో లోపం ఉన్నట్లు దాన్ని సరిచేయాల్సిన అవసరం రాలేదు గానీ ఆ పాపానికి ఆదామే పూర్తిగా బాధ్యుడని ఆయన సరిగానే ఎంచాడు. (ఆదికాండము 3:​17-19) ఆదాము దేవుని పట్ల, సరైన సూత్రాల పట్ల తనకున్న ప్రేమ, దేవునికే విధేయత చూపించేలా తనను నడిపించడానికి అనుమతించలేకపోయాడు.

ఈ విషయాన్ని కూడా గమనించండి, భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఆదాములాగే పరిపూర్ణుడు. అయితే ఆయన, ఆదాముకు కలిగిన ఇతర సంతానంలా కాకుండా పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు, అందుకే ప్రలోభానికి లొంగిపోయే బలహీనత ఆయనకు వారసత్వంగా రాలేదు. (లూకా 1:​30, 31; 2:​21; 3:​23, 38) తీవ్రమైన ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ యేసు తన ఇష్టప్రకారమే తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఆదాము సొంతగా నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యాన్ని ఉపయోగించుకొని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపించాడు, కాబట్టి ఆయన తప్పుకు ఆయనే బాధ్యుడు.

దేవునికి అవిధేయత చూపించాలని ఆదాము ఎందుకు ఎంచుకున్నాడు? అలా చేస్తే తన పరిస్థితి ఏదోరకంగా మెరుగవుతుందని ఆయన అనుకున్నాడా? లేదు, ఎందుకంటే “ఆదాము మోసపరచబడలేదు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 తిమోతి 2:​14) అయితే తినకూడదని దేవుడు చెప్పిన చెట్టు ఫలాన్ని తినాలని అప్పటికే ఎంపిక చేసుకున్న తన భార్య ఇష్టాన్ని మన్నించడానికి నిర్ణయించుకున్నాడు. తన సృష్టికర్తకు విధేయత చూపించాలనే కోరికకన్నా తన భార్యను మెప్పించాలనే కోరికే ఆయనకు ఎక్కువగా ఉంది. తినకూడదని దేవుడు చెప్పిన చెట్టు ఫలాన్ని తినమని హవ్వ ఆదాముకు ఇచ్చినప్పుడు అది తిని దేవునికి అవిధేయత చూపిస్తే దేవునితో తనకున్న సంబంధానికి ఏమవుతుందో ఆలోచించడానికి ఆయన ఒక్క క్షణం ఆగివుండాల్సింది. ఆదాములో దేవుని పట్ల ప్రగాఢమైన, చెక్కుచెదరని ప్రేమ లేకపోవడంతో తన భార్య నుండి వచ్చిన దానితో సహా ఒత్తిడికి లొంగిపోయే బలహీనత అతనిలో ఏర్పడింది.

ఆదాముకు పిల్లలు పుట్టకముందే ఆయన పాపం చేశాడు, అందువల్ల అతని పిల్లలందరూ అపరిపూర్ణులయ్యారు. అయితే ఆదాములాగే మనకు కూడా సొంతగా నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. మన విధేయతను, ఆరాధనను పొందడానికి అర్హుడైన యెహోవా దేవుడు చేసిన మంచి గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఆలోచిస్తూ ఆయనపట్ల ప్రగాఢమైన ప్రేమను వృద్ధిచేసుకుందాం.​—⁠కీర్తన 63:⁠6; మత్తయి 22:​36, 37. (w08 10/1)