కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె ‘వాటిని గురించి ఆలోచించింది’

ఆమె ‘వాటిని గురించి ఆలోచించింది’

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆమె ‘వాటిని గురించి ఆలోచించింది’

గాడిద మీద కూర్చున్న మరియ భారంగా కదిలింది. అప్పటికే ఆమె చాలాసేపటినుండి ప్రయాణిస్తూవుంది. వాళ్ళు దూరానున్న బేత్లెహేముకు వెళ్తున్నారు, ఆమె భర్త యోసేపు, దారి చూపిస్తూ ఆమెకు ముందు నిదానంగా నడుస్తున్నాడు. మరియకు మళ్ళీ ఒకసారి తన గర్భంలోని శిశువు కదిలినట్లు అనిపించింది.

మరియకు నెలలు నిండాయి; ఆమె ఉన్న ఈ పరిస్థితిని వర్ణిస్తూ ఆమె ‘నిండు గర్భిణీ’ అని బైబిలు స్పష్టంగా చెబుతుంది. (లూకా 2:​5, NW) పొలాల వెంబడి వెళ్తున్న ఈ జంటను, పొలం పనులు చేసుకుంటున్న కొంతమంది రైతులు చూసి, ఇలాంటి స్థితిలోవున్న ఈమె ఎందుకు ప్రయాణం చేస్తుందా అని అనుకునివుంటారు. మరియ తన సొంత ఊరు నజరేతునుండి ఇంతదూరం ఎందుకు ప్రయాణించాల్సివచ్చింది?

యూదురాలైన ఈ యువతి కొన్ని నెలల క్రితం, మానవ చరిత్ర అంతటిలో ఎవ్వరూ పొందలేని ఒక ప్రత్యేకమైన బాధ్యతను పొందింది అప్పటి నుండి ఇదంతా మొదలైంది. కాబోయే మెస్సీయాకు అంటే దేవుని కుమారునికి ఆమె జన్మనివ్వాల్సివుంది. (లూకా 1:​35) నెలలు నిండే సమయానికి ఆమె ఇలా బయలుదేరాల్సి వచ్చింది. ఆ బాధ్యత నెరవేరుస్తుండగా మరియ ఎన్నో విశ్వాస పరీక్షలు ఎదుర్కొంది. ఆమె విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి ఆమెకేది సహాయం చేసిందో మనం పరిశీలిద్దాం.

బేత్లెహేముకు వెళ్ళడం

అలా వెళ్ళింది యోసేపు మరియలు మాత్రమే కాదు. కైసరు ఔగుస్తు, దేశంలోని ప్రజలందరూ తమ సొంత ఊర్లకు వెళ్ళి, పేర్లు నమోదు చేసుకోవాలని కొత్తగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు యోసేపు ఏమి చేశాడు? బైబిలు ఇలా చెబుతోంది, “యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, . . . గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.”​—⁠లూకా 2:​1-4.

కైసరు ఆ సమయంలో ఆ ఆజ్ఞను జారీచేయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మెస్సీయా బేత్లెహేములో పుడతాడని దాదాపు ఏడువందల సంవత్సరాల ముందే రాయబడిన ప్రవచనంలో ఉంది. నజరేతుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో బేత్లెహేము అనే పేరుతో ఒక పట్టణం ఉంది. అయినప్పటికీ ప్రవచనం నిర్దిష్టంగా మెస్సీయా, “బేత్లెహేము ఎఫ్రాతా” అనే పట్టణంలో పుడతాడని చెప్పింది. (మీకా 5:⁠2) ఇప్పుడున్న రోడ్లపై ప్రయాణిస్తే, నజరేతు నుండి దక్షిణాన ఉన్న ఈ చిన్న గ్రామానికి చేరుకోవాలంటే కొండల గుండా దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ బేత్లెహేముకే వెళ్ళాలని యోసేపుకు ఆజ్ఞాపించబడింది, ఎందుకంటే అది దావీదు రాజు పూర్వీకుల సొంత ఊరు, యోసేపు ఆయన భార్య కూడా ఆ కుటుంబానికి చెందినవారే.

ఆ ఆజ్ఞను పాటించాలని యోసేపు తీసుకున్న నిర్ణయానికి మరియ మద్దతు ఇచ్చిందా? ఆమెకు ఆ ప్రయాణం చేయడం చాలా కష్టమే. బహుశా అది శరదృతువు మొదలవుతున్నరోజులు కాబట్టి, వేసవికాలం ముగుస్తుండగా కొద్దిపాటి వర్షాలు పడుతుండవచ్చు. అదీకాక ‘గలిలయ నుండి’ వెళ్ళాలంటే ఆయన 760 మీటర్ల ఎత్తులోవున్న బేత్లెహేముకు చేరుకోవడానికి చాలారోజులు ఎంతో కష్టపడి ప్రయాణించాలి. మరియ పరిస్థితిని బట్టి ఎన్నోసార్లు ఆగి ఆగి ప్రయాణించాలి కాబట్టి బహుశా మామూలు కన్నా ఎక్కువ సమయం పడుతుంది. మొదటిసారి గర్భం ధరించిన ఏ స్త్రీయైనా నెలలు నిండి, ప్రసవవేదన మొదలయ్యేసరికి తనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు దగ్గర్లోవుండే తన ఇంట్లోనే ఉండాలని అనుకోవచ్చు. నిస్సందేహంగా ఈ ప్రయాణం చేయడానికి ఆమెకు చాలా ధైర్యం అవసరమైంది.

“మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు” యోసేపు వెళ్ళాడని లూకా రాస్తున్నాడు. ‘మరియ యోసేపుకు భార్యగా ప్రధానము చేయబడినట్లుగా’ కూడా ఆయన రాస్తున్నాడు. (లూకా 2:​4, 5) యోసేపు భార్యగా మరియ ఆయనకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకుంది. ఆమె తన భర్తను ఆరాధనకు సంబంధించిన విషయాల్లో శిరస్సుగా గుర్తించి, ఆయనకు సహకారిగా ఆయన నిర్ణయాలకు మద్దతునివ్వాలని దేవుడు ఆమెకిచ్చిన బాధ్యతకు కట్టుబడివుంది. * కాబట్టి ఆమె ఈ విశ్వాస పరీక్షను కేవలం విధేయతతో జయించింది.

మరియ విధేయత చూపించడానికి ఆమెను ఇంకా ఏది పురికొల్పివుండవచ్చు? మెస్సీయా బేత్లెహేములో పుడతాడని ప్రవచనం చెబుతున్నట్లు ఆమెకు తెలుసా? ఆ విషయం బైబిలు చెప్పడంలేదు. అంతమాత్రాన ఆమెకు తెలియదని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే అది అప్పుడున్న మత నాయకులకే కాదు సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. (మత్తయి 2:​1-7; యోహాను 7:​40-42) లేఖనాల విషయానికొస్తే ఆమెకు ఎంతో జ్ఞానం ఉంది. (లూకా 1:​46-55) ఏదేమైనప్పటికీ తన భర్తకు లోబడి ప్రయాణించినా, ప్రభుత్వాజ్ఞకు లోబడి ప్రయాణించినా, యెహోవా ప్రవచన నెరవేర్పు కోసం ప్రయాణించినా, లేక ఈ మూడు కారణాలనుబట్టి ప్రయాణించినా ఆమె విశిష్ట మాదిరిని ఉంచింది. వినయవిధేయతలు చూపించే స్త్రీపురుషులకు యెహోవా చాలా విలువిస్తాడు. లోబడివుండడాన్ని చాలా చిన్నచూపు చూసే ఈ రోజుల్లో విశ్వాసులందరికీ మరియ మాదిరి చక్కటి ప్రోత్సాహాన్నిస్తుంది.

క్రీస్తు పుట్టుక

దూరం నుండి బేత్లెహేమును చూడగానే మరియ హాయిగా ఊపిరిపీల్చుకొని ఉండవచ్చు. కొండ ప్రాంతాల్లో, చివరిగా కోతకోసే పంటల్లో ఒకటైన ఒలీవ తోటల ప్రక్కనుండి వెళ్తూ మరియ యోసేపులిద్దరూ ఆ చిన్న గ్రామానికున్న చరిత్ర గురించి ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకొనివుంటారు. ప్రవక్తయైన మీకా చెప్పినట్లే యూదా పట్టణాలన్నింటిలో అది ఎంతో స్వల్పమైనది, కానీ ఇక్కడే వెయ్యి కంటే ఎక్కువ సంవత్సరాలకు ముందు బోయజు, నయోమి ఆ తర్వాత దావీదు పుట్టారు.

మరియ యోసేపులు అక్కడికి చేరుకునేసరికే గ్రామమంతా జనంతో క్రిక్కిరిసిపోయివుంది. చాలామంది పేర్లు నమోదు చేసుకోవడానికి వీళ్ళకంటే ముందే రావడంతో వీళ్ళకు సత్రంలో స్థలం దొరకలేదు. * ఆ రాత్రికి వారు ఉండడానికి ఎక్కడా స్థలం దొరక్కపోవడంతో పశువుల పాకలో ఉండాల్సివచ్చింది. తన భార్యకు తొలికాన్పు నొప్పులు మొదలై క్రమంగా ఎక్కువవుతున్నప్పుడు యోసేపు ఎంత కంగారుపడి ఉంటాడో ఒక్కసారి ఊహించండి. అలాంటి అనువుగానిచోట ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.

మరియ పరిస్థితిని ఏ స్త్రీయైనా అర్థం చేసుకోగలదు. వారసత్వంగా వచ్చిన పాపాన్ని బట్టి పిల్లలు పుట్టే సమయంలో స్త్రీలందరూ ప్రసవవేదన పడతారని అప్పటికి దాదాపు 4,000 సంవత్సరాల క్రితమే యెహోవా దేవుడు చెప్పాడు. (ఆదికాండము 3:​16) మరియ ప్రసవవేదన పడలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఆమె పడిన వేదనంతటి గురించి లూకా వివరించలేదు, బదులుగా ఆమె “తన తొలిచూలు కుమారుని క[న్నది]” అని మాత్రమే చెప్పాడు. (లూకా 2:⁠7) మరియకు పుట్టిన పిల్లలందరిలో ఈయన “తొలిచూలు” కుమారుడు, ఆమెకు కనీసం ఏడుగురు పిల్లలు పుట్టారు. (మార్కు 6:⁠3) ఈ బిడ్డ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనవాడే. ఆయన మరియకు మాత్రమే మొదటి కుమారుడు కాదు దేవునికి కూడా అద్వితీయ కుమారుడు, యెహోవా “సర్వసృష్టికి ఆదిసంభూతుడు.”​—⁠కొలొస్సయులు 1:⁠15.

ఇక్కడే లూకా వృత్తాంతం, మరియ ఆయనను “పొత్తిగుడ్డలతో చుట్టి, ... పశువులతొట్టిలో పరుండబెట్టెను” అనే సుపరిచితమైన వివరణను ఇస్తుంది. (లూకా 2:⁠7) క్రీస్తు జననాన్ని వివరిస్తూ వేసే నాటకాల్లో, వర్ణచిత్రాల్లో, దృశ్యాల్లో ఈ సంఘటనను మరీ దయనీయంగా, అవాస్తవికంగా చూపిస్తారు. అయితే నిజానికి ఏమి జరిగిందో పరిశీలించండి. పశువుల తొట్టి అంటే పశువులు తినడానికి మేతవేసే గోలెం. ఆ కుటుంబం పశువుల పాకలో బసచేసింది, అది ఆనాడైనా, ఈనాడైనా మంచి గాలి, పరిశుభ్రత ఉండని స్థలమే. మరో అవకాశం గనుక ఉంటే, ప్రసవానికి ఇలాంటి చోటును ఏ తల్లిదండ్రులు మాత్రం ఎంచుకుంటారు? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు అన్నింటికన్నా మంచి దాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దేవుని కుమారునికి మరియ యోసేపులు ఇంకెంతో మంచిదాన్ని ఇవ్వాలని కోరుకొనివుండవచ్చు.

వారికున్న పరిమితులను బట్టి వాళ్ళు నిరాశచెందలేదు గానీ వాళ్ళకున్నంతలో వాళ్ళు చేయగలిగినదంతా చేశారు. ఉదాహరణకు మరియ, శిశువు విషయంలో తానే స్వయంగా ఎంతో శ్రద్ధతీసుకుంది, వెచ్చగా, సురక్షితంగా ఉండేలా పొత్తిగుడ్డల్లో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో జాగ్రత్తగా పడుకోబెట్టిందని గమనించండి. మరియ తానున్న పరిస్థితులను బట్టి ఎక్కువగా ఆందోళన పడకుండా తాను చేయగలిగినదంతా చేసింది. దేవునికి సేవ చేసేలా ఆ బిడ్డకు మద్దతునివ్వడమే వాళ్ళు చేయగలవాటన్నింటిలోకి చాలా ప్రాముఖ్యమైనదని ఆమెకు, యోసేపుకు కూడా తెలుసు. (ద్వితీయోపదేశకాండము 6:​6-8) దేవుణ్ణి ఆరాధించడం గురించి అంతగా పట్టించుకోని ఇప్పటి లోకంలో కూడా తెలివైన తల్లిదండ్రులు దేవుని ఆరాధనకు ప్రథమస్థానమివ్వడం అలవాటు చేసుకునేలా తమ పిల్లలను పెంచుతారు.

ప్రోత్సాహాన్నిచ్చిన సందర్శనం

అప్పటివరకు నిమ్మళంగా ఉన్న పరిసరాల్లో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆ శిశువును చూడడానికి గొర్రెల కాపరులు ఆ పశువుల పాకలోకి పరుగుపరుగున వచ్చారు. వాళ్ళెంతో ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళ ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. వాళ్ళు తమ మందలతో నివసిస్తున్న కొండప్రాంతాన్ని విడిచి గబగబా ఇక్కడకు వచ్చారు. * వాళ్ళను ఆశ్చర్యంగా చూస్తున్న ఆ తల్లిదండ్రులతో అంతకుముందు వాళ్ళు చూసిన అద్భుతం గురించి చెప్పారు. కొండప్రాంతంలో ఉన్నవాళ్ళకు ఆ రాత్రిపూట దూత అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. యెహోవా మహిమ చుట్టూ ప్రకాశించింది, అప్పుడు దూత, క్రీస్తు లేదా మెస్సీయా ఇప్పుడే బేత్లెహేములో పుట్టాడని చెప్పాడు. ఆ శిశువు పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడివుండడం మీరు చూస్తారని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యకరంగా శక్తివంతమైన దూతల గుంపు ప్రత్యక్షమై యెహోవా మహిమను స్తుతిస్తూ పాడడం కూడా వాళ్ళు చూశారు.

ఈ సాధారణ మనుష్యులు బేత్లెహేముకు అంత పరుగుపరుగున రావడం వింతేమీ కాదు. దూత వివరించినట్లే అప్పుడే పుట్టిన శిశువును అక్కడ చూసి వాళ్ళెంతో పులకించిపోయివుంటారు. వాళ్ళు ఈ శుభవార్తను తమతోనే ఉంచుకోలేదు గానీ, “తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.” (లూకా 2:17, 18) అప్పటి మతనాయకులు గొర్రెల కాపరులను చిన్నచూపు చూసేవారని మనకు తెలుస్తోంది. కానీ యెహోవా, నమ్మకస్థులైన ఈ సామాన్యులను ఎంతో విలువైనవారిగా ఎంచాడు. అయితే వాళ్ళ రాక మరియపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?

మరియ ప్రసవవేదన వల్ల ఎంతో అలసిపోయినప్పటికీ, వాళ్ళు వచ్చి చెబుతున్న ప్రతీ మాటను ఎంతో శ్రద్ధగా విన్నది. ఆమె వినడమే కాక ‘ఇవన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించింది.’ (లూకా 2:​19, పరిశుద్ధ బైబల్‌ ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఈ యువతి నిజంగానే ఆలోచనాపరురాలు. దూత వర్తమానం చాలా ప్రాముఖ్యమని ఆమెకు తెలుసు. ఆమె తన కుమారుడైన ఈ శిశువు ఎవరో, ఆయన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలని ఆమె దేవుడైన యెహోవా కోరుకున్నాడు. కాబట్టి ఆమె వినడం కంటే ఎక్కువే చేసింది. రాబోయే నెలల్లో, సంవత్సరాల్లో మళ్ళీమళ్ళీ మననం చేసుకునేందుకుగాను ఆమె ఈ మాటలన్నీ తన హృదయంలో పదిలం చేసుకుంది. అలా చేయడం వల్లే మరియ తన జీవితమంతటిలో విశ్వాసం చూపించగలిగింది.

మరియ మాదిరిని మీరు అనుసరిస్తారా? యెహోవా తన వాక్యాన్ని ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలతో నింపాడు. మనం ఈ సత్యాలపై అవధానముంచకపోతే మనకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మనమలా ప్రయోజనం పొందాలంటే బైబిలును ఏదో పుస్తకంలా కాదుగానీ దేవుని ప్రేరేపిత వాక్యమని గుర్తించి దాన్ని క్రమంగా చదవాలి. (2 తిమోతి 3:​16) మరియలాగే మనం కూడా మన హృదయాల్లో ఆధ్యాత్మిక విషయాలు నింపుకొని వాటి గురించి ఆలోచించాలి. యెహోవా ఇస్తున్న ఉపదేశాన్ని ఇంకా బాగా ఎలా పాటించాలో ఆలోచిస్తూ, మనం బైబిల్లో చదివిన విషయాలను మననం చేస్తే మన విశ్వాసం వృద్ధిచెందుతుంది.

మనసులో ఉంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు

ఆ శిశువు పుట్టిన 8వ రోజున మరియ యోసేపులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించి, ముందే నిర్దేశించబడినట్లు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. (లూకా 1:​31) ధర్మశాస్త్రంలో పేదవాళ్ళ కోసం ఉన్న ఏర్పాటునుబట్టి రెండు గువ్వలుగానీ, రెండు పావురాలను గానీ శుద్ధీకరణ కోసం అర్పించడానికి 40వ రోజున బేత్లెహేము నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి ఆయనను తీసుకొని వెళ్ళారు. ఇతర తల్లిదండ్రులు అర్పిస్తున్నట్లుగా పొట్టేలును, గువ్వను ఇవ్వలేకపోతున్నందుకు సిగ్గుగా అనిపించినా వాళ్ళు అలాంటి భావాలకు అంత ప్రాధాన్యతనివ్వలేదు. ఏదేమైనప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు శక్తివంతమైన ప్రోత్సాహాన్ని పొందారు.​—⁠లూకా 2:​21-24.

వృద్ధుడైన సుమెయోను, వాళ్ళ దగ్గరకు వచ్చి మరియ తన మనసులో ఉంచుకోవాల్సిన మరికొన్ని విలువైన విషయాలను చెప్పాడు. మెస్సీయాను చూసినంతవరకు చనిపోడని ఆయనకు వాగ్దానం చేయబడింది, ఈ చిన్న బిడ్డయైన యేసే వాగ్దానం చేయబడిన రక్షకుడని యెహోవా పరిశుద్ధాత్మ ఆయనకు సూచించింది. అలాగే ఎంతో బాధను సహించాల్సిన ఒక రోజు వస్తుందని కూడా సుమెయోను మరియను హెచ్చరించాడు. ఆమె హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకుపోయినంతగా ఆమె బాధపడుతుందని ఆయన చెప్పాడు. (లూకా 2:​25-35) ఆ మాటలు ఆమెను అప్పటికి బాధపెట్టినా మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన కష్టకాలంలో మరియ తట్టుకొని నిలబడేందుకు ఆమెకు సహాయం చేసివుండవచ్చు. సుమెయోను తర్వాత, ప్రవక్త్రియైన అన్న శిశువుగావున్న యేసును చూసి, యెరూషలేము విడుదల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఆయన గురించి చెప్పింది.​—⁠లూకా 2:​36-38.

మరియ యోసేపులు తమ బిడ్డను యెరూషలేములోవున్న యెహోవా ఆలయానికి తీసుకురావాలనుకోవడం ఎంత చక్కటి నిర్ణయం! అలా తమ కుమారుడు జీవితాంతం యెహోవా దేవాలయానికి క్రమంగా వచ్చేందుకు పునాది వేశారు. అక్కడున్నప్పుడు వాళ్ళకు సాధ్యమైనదంతా చేసి మంచి ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందారు. ఆ రోజు మరియ విశ్వాసం ఎంతో బలపడి, ధ్యానించడానికి, ఇతరులతో పంచుకోవడానికి సరిపడే ప్రాముఖ్యమైన విషయాలతో తన హృదయాన్ని నింపుకొని ఆ దేవాలయం నుండి తిరిగివచ్చింది.

ఆ మాదిరిని నేటి తల్లిదండ్రులు అనుసరించడం చూడముచ్చటైన విషయం. యెహోవాసాక్షులుగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రైస్తవ కూటాలకు నమ్మకంగా తీసుకువస్తారు. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు యెహోవా సేవకోసం చేయగలిగినదంతా చేస్తూ తోటి విశ్వాసులకు ప్రోత్సాహాన్నిచ్చేలా మాట్లాడతారు. వాళ్ళు క్రైస్తవ కూటాలనుండి దృఢంగా, సంతోషంగా, ఇతరులతో పంచుకోవడానికి మంచి విషయాలతో తిరిగి వెళ్తారు. వాళ్ళతో పాటు హాజరవమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అలాచేస్తే మరియలాగే మీ విశ్వాసం కూడా ఎంతో బలపడుతుంది. (w08 10/1)

[అధస్సూచీలు]

^ పేరా 10 “మరియ లేచి” ఎలీసబెతును చూడడానికి ‘వెళ్ళింది’ అని బైబిలు చెబుతున్న సందర్భంతో ఈ సందర్భాన్ని పోల్చి, రెండింటికున్న తేడాను గమనించండి. (లూకా 1:​39) ఆ సమయానికి మరియకు ప్రధానం అయినా అవివాహితగానే ఉంది కాబట్టి యోసేపును అడగకుండానే వెళ్ళివుండవచ్చు. అయితే ఈ ఇద్దరికీ పెళ్ళైన తర్వాత ఈ ప్రయాణంలో యోసేపే మరియను తీసుకొని వెళ్ళాడని తెలుస్తోంది.

^ పేరా 14 ఆ రోజుల్లో ప్రయాణీకులు బసచేయడానికి సాధారణంగా పట్టణాల్లో సత్రాలుండేవి.

^ పేరా 19 ఈ కాపరులు తమ మందలతోపాటు పొలంలో ఉండడం, బైబిలు కాలవృత్తాంతం సూచిస్తున్నదాన్ని ధృవీకరిస్తుంది, అదేమిటంటే గొర్రెల మందలను ఇంటి దగ్గరే ఉంచుకొనే డిసెంబరులో కాదు గానీ అక్టోబరు మొదట్లో క్రీస్తు పుట్టాడు.