కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ రోజుల్లో ‘అద్భుత స్వస్థత’ దేవుడే చేస్తున్నాడా?

ఈ రోజుల్లో ‘అద్భుత స్వస్థత’ దేవుడే చేస్తున్నాడా?

ఈ రోజుల్లో ‘అద్భుత స్వస్థత’ దేవుడే చేస్తున్నాడా?

కొన్ని దేశాల్లో సాధారణంగా యాత్రికులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, అక్కడ “నయంకాని” జబ్బులకు, రోగాలకు స్వస్థత జరిగిందని చాలామంది చెప్పుకుంటారు. మరికొన్ని దేశాల్లో మానవాతీత శక్తులతో ప్రజల రోగాలను బాగుచేస్తామని భూతవైద్యులు చెప్పుకుంటారు. ఇంకా ఇతర దేశాల్లో ఆవేశంతోసాగే స్వస్థత కూటాల్లో చక్రాల కుర్చీల్లో నుండి లేచి గంతులు వేస్తూ లేదా తమ ఊతకర్రలను విసిరేసి స్వస్థత పొందామని చెబుతారు.

అలాంటి స్వస్థతలు చేసేవాళ్ళు చాలావరకు విభిన్న మత గుంపులకు చెందినవాళ్ళు, సాధారణంగా వాళ్ళు ఒకరినొకరు మోసగాళ్ళని, అబద్ధికులని లేదా అన్యులని నిందించుకుంటుంటారు. మరైతే, ఒకరంటే ఒకరికి పడని ఇలాంటి అనేకానేక సంస్థల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. నిజానికి బైబిలు “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు” అని చెబుతుంది. (1 కొరింథీయులు 14:​33) మరి అలాంటి ‘అద్భుత స్వస్థతలు’ నిజంగా దేవుడే చేస్తున్నాడా? ఇలా స్వస్థత చేసేవాళ్ళలో కొంతమంది తాము యేసు ఇచ్చిన శక్తితోనే అలా చేస్తున్నామని చెప్పుకుంటారు. యేసు ప్రజల్ని ఎలా స్వస్థపరిచాడో పరిశీలిద్దాం.

యేసు ప్రజల్ని ఎలా స్వస్థపరిచాడు?

ఈ రోజుల్లో స్వస్థత చేసేవాళ్ళ పద్ధతులకు, యేసు రోగుల్ని బాగుచేసిన పద్ధతులకు ఎంతో తేడా ఉంది. ఉదాహరణకు, యేసు తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన ప్రతీ ఒక్కరినీ బాగుచేశాడు. ఆయన తన దగ్గరకు వచ్చినవాళ్ళలో కొంతమందిని మాత్రమే బాగుచేసి, మిగిలినవారిని బాగుచేయకుండా పంపించలేదు. యేసు స్వస్థపర్చిన ప్రజలు పూర్తిగా బాగుపడేవాళ్ళు. అంతేకాక దాదాపు ఎప్పుడూ, స్వస్థత వెంటనే జరిగేది. “ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నముచేసెను” అని బైబిలు చెబుతోంది.​—⁠లూకా 6:⁠19.

ఈ రోజుల్లో విశ్వాస స్వస్థతలు చేసేవాళ్ళు, స్వస్థత జరగనప్పుడు ఆ రోగికి విశ్వాసం లేకపోవడం మూలంగానే అతనికి స్వస్థత జరగలేదని నిందిస్తారు, వాళ్ళలా కాకుండా యేసు ఆయనమీద ఇంకా విశ్వాసం చూపించనివాళ్ళను కూడా స్వస్థపరిచాడు. ఉదాహరణకు, అతను అడగనప్పటికీ యేసు ఒక గ్రుడ్డివాని దగ్గరకు వెళ్ళి అతణ్ణి బాగుచేశాడు. ఆ తర్వాత యేసు ఆయనను, “నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా” అని అడిగాడు. అప్పుడతడు, “ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడు” అని యేసును తిరిగి అడిగాడు. దానికి సమాధానంగా యేసు, “నీతో మాటలాడుచున్నవాడు ఆయనే” అని చెప్పాడు.​—⁠యోహాను 9:​1-7, 35-38.

‘యేసు స్వస్థపర్చినవాళ్ళకు విశ్వాసం ఉండవలసిన అవసరం లేకపోతే, తను స్వస్థపర్చినవాళ్ళతో తరచూ “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను,” అని ఎందుకు అన్నాడు?’ అని మీరనుకోవచ్చు. (లూకా 8:​48; 17:​19; 18:​42) అలా అనడం ద్వారా యేసు, విశ్వాసం ఉండడం వల్ల తనను వెదికినవారికి స్వస్థత జరిగిందనీ, తన దగ్గరకు రావడానికి ప్రయత్నించని వాళ్ళు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారనీ స్పష్టం చేశాడు. స్వస్థత పొందినవాళ్ళు తమ విశ్వాసం వల్ల బాగుపడలేదుగానీ దేవుని శక్తివల్ల బాగుపడ్డారు. యేసు గురించి బైబిలు ఇలా చెబుతోంది, ‘దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.’​—⁠అపొస్తలుల కార్యములు 10:⁠38.

ఈ రోజుల్లో స్వస్థతలు అని అనుకుంటున్నవాటితో డబ్బు చాలావరకు ముడిపడివుంది. విశ్వాస స్వస్థతలు చేసేవాళ్ళకు ప్రజల్ని మెప్పించి, చందాలు బాగా సేకరిస్తారనే పేరుంది. అలా స్వస్థతలు చేసే ఒక వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తాను చేసిన కార్యక్రమాల వల్ల ఒక్క సంవత్సరంలో 8 కోట్ల 90లక్షల (అమెరికా) డాలర్లు సంపాదించుకున్నాడని తెలుస్తోంది. స్వస్థత జరగవచ్చనే ఆశతో పుణ్యక్షేత్రాలను దర్శించే యాత్రికులవల్ల చర్చి సంస్థలు కూడా చాలా లాభాలు గడిస్తున్నాయి. దీనికి భిన్నంగా యేసు తాను స్వస్థపర్చినవాళ్ళ దగ్గర ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు సరికదా ఆయనే కొన్నిసార్లు వాళ్ళకు భోజనం పెట్టాడు. (మత్తయి 15:​30-38) యేసు తన శిష్యులను ప్రకటించడానికి పంపిస్తున్నప్పుడు వాళ్ళకిలా చెప్పాడు, “రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” (మత్తయి 10:⁠8) ఈ రోజుల్లో స్వస్థతచేస్తున్నవాళ్ళ పద్ధతికి, యేసు పద్ధతికి ఎందుకంత తేడావుంది?

“స్వస్థత” చేస్తున్నది ఎవరు?

కొన్ని సంవత్సరాలుగా వైద్యవృత్తిలో ఉన్న కొంతమంది మతం పేరిట స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళ కార్యకలాపాల మీద పరిశోధనలు చేశారు. వాళ్ళేమి కనుగొన్నారు? 20 సంవత్సరాలపాటు ఈ విషయంపై పరిశోధన చేసిన ఇంగ్లాండ్‌కు చెందిన ఒక డాక్టరు ఇలా అన్నాడని లండన్‌ డైలీ టెలిగ్రాఫ్‌ ప్రచురించింది, “స్వస్థత చేసే శక్తి తమకుందని చెప్పుకుంటున్నవాళ్ళ మాటలను రుజువుచేసే వైద్యపరమైన ఆధారం కనీసం ఒక్కటి కూడా లేదు.” పవిత్రమైనవని వాళ్ళు అనుకుంటున్నవాటి మహిమవల్ల, పుణ్యక్షేత్రాల వల్ల, లేదా మతం పేరిట స్వస్థత చేసేవాళ్ళ మహిమవల్ల తమకు బాగయ్యిందని చాలామంది గట్టిగా నమ్ముతారు. మరి వాళ్ళు మోసపోతున్నారా?

ప్రఖ్యాతిగాంచిన కొండమీది తన ప్రసంగంలో యేసు, మతనాయకుల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఆయనను, “ప్రభువా, ప్రభువా, మేము . . . నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?” అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆయన వాళ్ళతో “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండి” అని అంటానని చెప్పాడు. (మత్తయి 7:​22, 23) అలాంటివాళ్ళు తమకుందని చెప్పుకుంటున్న శక్తి వాళ్ళకు ఎక్కడనుండి వచ్చిందో చెబుతూ అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు, “అబద్ధ విషయమైన సమస్తబలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్నవారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును.”​—⁠2 థెస్సలొనీకయులు 2:​9, 10.

పవిత్రమైనవని వాళ్ళు అనుకుంటున్న వస్తువులు, విగ్రహాలు, బొమ్మల వల్ల జరిగే “స్వస్థతలు” దేవుడు చేస్తున్నవి కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” “విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి” అని దేవుని వాక్యం స్పష్టంగా ఆజ్ఞాపిస్తోంది. (1 కొరింథీయులు 10:​14; 1 యోహాను 5:​21) అలాంటి “స్వస్థతలు” సత్యారాధననుండి ప్రజలను దూరం చేయడానికి సాతాను ఉపయోగించే జిత్తుల్లో ఒకటి. “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు” అని బైబిలు చెబుతోంది.​—⁠2 కొరింథీయులు 11:⁠14.

యేసు, ఆయన అపొస్తలులు ఎందుకు స్వస్థతలు చేశారు?

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో రాయబడివున్న నిజమైన అద్భుత స్వస్థతలు యేసు, ఆయన అపొస్తలులు దేవుని సహాయంతోనే వాటిని చేశారని స్పష్టంగా చూపిస్తున్నాయి. (యోహాను 3:⁠2; హెబ్రీయులు 2:​3, 4) యేసు చేసిన అద్భుతాలు ఆయన ప్రకటించిన సందేశానికి మంచి ఆధారంగా కూడా ఉన్నాయి, ఆయన “సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.” (మత్తయి 4:​23) యేసు చేసిన గొప్ప కార్యాలు, అంటే రోగులను స్వస్థపర్చడం, వేలాదిమందికి ఆహారం పెట్టడం, వాతావరణాన్ని అదుపుచేయడం, చివరికి చనిపోయినవారిని తిరిగి లేపడం వంటివి ఆయన తన రాజ్య పరిపాలనలో విధేయులైన మానవులకు ఏమి చేస్తాడో ముందుగా చూపించాయి. అది నిజంగా సువార్తే!

అలాంటి గొప్ప కార్యాలు లేదా ఆత్మ వరాలు యేసు, ఆయన అపొస్తలులు, ఆ వరాన్ని వాళ్ళింకా ఎవరికిచ్చారో వాళ్ళు చనిపోవడంతోనే ఆగిపోయాయి. “ప్రవచనములైనను నిరర్థకములగును; [అద్భుతంగా మాట్లాడే] భాషలైనను నిలిచిపోవును; [దైవీకంగా వచ్చిన] జ్ఞానమైనను నిరర్థకమగును” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరింథీయులు 13:⁠8) ఎందుకు ఆగిపోయాయి? ఎందుకంటే స్వస్థతలతో సహా అద్భుతాల వల్ల జరగాల్సినవన్నీ జరిగే వరకు అంటే యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయా అని, క్రైస్తవ సంఘంపై దేవుని అనుగ్రహం ఉందని గుర్తించేంతవరకు మాత్రమే అవి ఉన్నాయి, ఆ తర్వాత వాటి అవసరం లేదు కాబట్టి అవి ‘నిరర్థకమయ్యాయి’ లేక ఆగిపోయాయి.

అయినప్పటికీ యేసు చేసిన అద్భుత స్వస్థతలు నేడు మనకు చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. దేవుని రాజ్యం గురించి యేసు చెప్పినవాటికి శ్రద్ధనిస్తూ, వాటిమీద విశ్వాసం ఉంచితే, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అనే ప్రేరేపిత ప్రవచనం ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను నెరవేరడాన్ని మనం చూడవచ్చు.​—⁠యెషయా 33:​24; 35:​5, 6; ప్రకటన 21:⁠4. (w08 12/1)