కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చనిపోయినవారికి ఏ నిరీక్షణ ఉందని ఆయన చెప్పాడు?

చనిపోయినవారికి ఏ నిరీక్షణ ఉందని ఆయన చెప్పాడు?

యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు

చనిపోయినవారికి ఏ నిరీక్షణ ఉందని ఆయన చెప్పాడు?

యేసు కనీసం ముగ్గురిని పునరుత్థానం చేసి, చనిపోయినవారికి ఒక నిరీక్షణ ఉందని చూపించాడు. (లూకా 7:​11-17; 8:​49-56; యోహాను 11:​1-45) చనిపోయినవారికి ఏ నిరీక్షణ ఉందో అర్థం చేసుకోవడానికి మొదట మనమెందుకు చనిపోతున్నామో, దానికి కారణమెవరో తెలుసుకోవాలి.

మనమెందుకు అనారోగ్యానికి గురై, చనిపోతాము?

యేసు, ప్రజల పాపాలను క్షమించినప్పుడు వారు స్వస్థతపొందారు. ఉదాహరణకు, పక్షవాతముగల ఒకరిని తన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు యేసు, “నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి​—⁠నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పెను.” (మత్తయి 9:​2-6) కాబట్టి, రోగగ్రస్థులవడానికి, చనిపోవడానికి పాపమే కారణం. మొదటి మనుష్యుడైన ఆదాము నుండి మనకు పాపం వారసత్వంగా వచ్చింది.​—⁠లూకా 3:​38; రోమీయులు 5:⁠12.

యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు ఎన్నడూ పాపం చేయలేదు. అందుకే ఆయన చనిపోవలసిన అవసరం లేదు. కానీ మన బదులు ఆయన చనిపోయి, మన పాపాలకు మూల్యం చెల్లించాడు. “పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు” తన రక్తం ‘చిందింపబడుతుందని’ చెప్పాడు.​—⁠మత్తయి 26:⁠28.

“మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను” అని కూడా యేసు అన్నాడు. (మత్తయి 20:​28) యేసు తాను చెల్లించిన మూల్యాన్ని “విమోచన క్రయధనము” అని అన్నాడు, ఎందుకంటే అది ఇతరులకు చనిపోకుండా ఉండే అవకాశాన్నిచ్చింది. యేసు ఇంకా ఇలా అన్నాడు, “[వారికి] జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.” (యోహాను 10:​10) చనిపోయినవారికున్న నిరీక్షణ గురించి పూర్తిగా అర్థంచేసుకోవాలంటే చనిపోయినవారు ఏ స్థితిలో ఉంటారో కూడా మనం తెలుసుకోవాలి.

చనిపోయినవారు ఏ స్థితిలో ఉంటారు?

యేసు తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు, చనిపోయినవారు ఏ స్థితిలో ఉంటారో వివరించాడు. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, ‘మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుపడానికి బేతనియకు వెళ్లుచున్నాను. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు​—⁠లాజరు చనిపోయెను అని వారితో స్పష్టముగా చెప్పెను.’ చనిపోయినవారు నిద్రిస్తున్నారని, వారు స్పృహలో ఉండరని యేసు స్పష్టం చేశాడు.​—⁠యోహాను 11:​1-14.

యేసు తన స్నేహితుడైన లాజరు చనిపోయిన నాలుగురోజుల తర్వాత ఆయనను తిరిగి బ్రతికించాడు. లాజరు చనిపోయి సమాధిలోవున్న ఆ నాలుగురోజుల్లో తనకు ఏదో జరిగినట్లు ఆయన చెప్పాడని బైబిల్లో ఎక్కడా లేదు. చనిపోయినప్పుడు లాజరు స్పృహలేకుండా, ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు.​—⁠ప్రసంగి 9:​5, 10; యోహాను 11:​17-44.

చనిపోయినవారికి ఏ నిరీక్షణ ఉంది?

చనిపోయినవారు నిత్యం జీవించే అవకాశంతో తిరిగి బ్రతికించబడతారు. యేసు ఇలా అన్నాడు, “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”​—⁠యోహాను 5:​28, 29.

దేవుడు తన ప్రేమను ఈ నిరీక్షణనివ్వడంలో చూపించాడు. యేసు చెప్పినట్లు, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”​—⁠యోహాను 3:​16; ప్రకటన 21:​4, 5. (w08 11/1)

మరింత సమాచారం కోసం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * పుస్తకంలోని 6వ అధ్యాయం చూడండి.

[అధస్సూచి]

^ పేరా 15 యెహోవాసాక్షుల ప్రచురణ.