మీ పిల్లలకు నేర్పించండి
దావీదు—ఆయన ఎందుకు భయపడలేదు?
మీకెప్పుడైనా భయమేస్తుందా?— * మనలో చాలామందికి కొన్నిసార్లు భయమేస్తుంది. మీకు భయమేసినప్పుడు మీరేమి చేయవచ్చు?— మీకన్నా పెద్దవాళ్ళ దగ్గరకో, బలంగా ఉన్నవాళ్ళ దగ్గరకో వెళ్ళవచ్చు. మీ అమ్మగానీ నాన్నగానీ మీకు సహాయం చేయవచ్చు. అయితే మనం ఎవరిని సహాయం అడగాలో దావీదు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనిలా పాడాడు, ‘నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునియందు నమ్మికయుంచి యున్నాను. నేను భయపడను.’—కీర్తన 56:3, 4.
దావీదు భయపడకుండా ఉండడడం ఎవరి దగ్గర నేర్చుకున్నాడని మీరనుకుంటున్నారు? తన అమ్మానాన్నల దగ్గరా?— ఆయన వారి దగ్గరే నేర్చుకుని ఉండవచ్చు. ఆయన తండ్రియైన యెష్షయి, దేవుడు వాగ్దానం చేసిన “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసుక్రీస్తుకు పూర్వీకుడు అంతేగాక ఆయనెంతో విశ్వసనీయుడు. (యెషయా 9:6; 11:1-3, 10) యెష్షయి తండ్రి పేరు అంటే దావీదు తాతగారి పేరు ఓబేదు. ఈ ఓబేదు తల్లి పేరుతో బైబిల్లో ఒక పుస్తకం ఉంది. ఆమె పేరేమిటో మీకు తెలుసా?— ఆమె పేరు రూతు, ఆమె చాలా నమ్మకంగా ఉండేది, ఆమె భర్త పేరు బోయజు.—రూతు 4:21, 22.
దావీదు పుట్టడానికి చాలాకాలం ముందే రూతు, బోయజు చనిపోయారు. బోయజు తల్లి పేరు మీకు తెలిసేవుంటుంది, ఆమె దావీదు వాళ్ళ తాతగారికి నానమ్మ. ఆమె యెరికోలో ఉండేది, వేగు చూడడానికి వచ్చిన కొంతమంది ఇశ్రాయేలీయులు తప్పించుకోవడానికి సహాయం చేసింది. యెరికో గోడలు కూలిపోయినప్పుడు తొగరుదారాన్ని అంటే ఒక ఎర్రని తాడును కిటికీలోనుండి వేలాడదీసి తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఆమె పేరేమిటి?— ఆమె పేరు రాహాబు, ఆమె యెహోవా ఆరాధకురాలయ్యింది, ఆమె ధైర్యాన్ని చూసి క్రైస్తవులందరూ నేర్చుకోవచ్చు.—యెహోషువ 2:1-21; 6:22-25; హెబ్రీయులు 11:30, 31.
దావీదు తండ్రి, తల్లి విశ్వసనీయులైన ఆ యెహోవా సేవకుల గురించి ఆయనకు అన్ని విషయాలు చెప్పే ఉంటారు, ఎందుకంటే అలాంటి విషయాలు పిల్లలకు బోధించాలని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించబడింది. (ద్వితీయోపదేశకాండము 6:4-9) యెష్షయి చిన్న కొడుకైన దావీదు భవిష్యత్తులో ఇశ్రాయేలీయులపై రాజుగా ఉండడానికి ఆయనను దేవుని ప్రవక్తయైన సమూయేలు ఎంపికచేసే సమయం వచ్చింది.—1 సమూయేలు 16:4-13.
ఒకరోజు, దేవుని శత్రువులైన ఫిలిష్తీయులతో యుద్ధంచేస్తున్న ముగ్గురు అన్నలకు భోజనం తీసుకువెళ్ళమని యెష్షయి దావీదును పంపించాడు. దావీదు యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి వచ్చేసరికి
అక్కడ భారీకాయుడైన గొల్యాతు, “జీవముగల దేవుని సైన్యములను” రెచ్చగొడుతూ మాట్లాడడాన్ని విన్నాడు. తనతో యుద్ధం చేయమంటున్న గొల్యాతు సవాలును ఎదుర్కోవడానికి అందరూ భయపడుతున్నారు. గొల్యాతును ఎదుర్కోవడానికి దావీదు ఇష్టపడుతున్నాడని విన్న సౌలు రాజు ఆయనను పిలిపించాడు. కానీ దావీదును చూసిన సౌలు, “నీవు బాలుడవు” అన్నాడు.తన తండ్రి మందలోని గొర్రెలను ఎత్తుకుపోవడానికి వచ్చిన సింహాన్ని, ఎలుగుబంటిని తానెలా చంపాడో దావీదు సౌలుకు వివరించాడు. గొల్యాతు కూడా “వాటిలో ఒకదానివలె” అవ్వాల్సిందేనని దావీదు అన్నాడు. దానికి సౌలు, “పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండును గాక” అని అన్నాడు. అలా చెప్పగానే దావీదు ఐదు నున్నని రాళ్ళు ఏరుకొని తన దగ్గరున్న చిక్కంలో వేసుకొని, వడిసెల తీసుకొని, ఆ భారీకాయునితో పోరాడడానికి వెళ్ళాడు. ఒక కుర్రవాడు తనతో పోరాడడానికి రావడం చూసిన గొల్యాతు, ‘నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు వేస్తాను’ అని గట్టిగా అరిచాడు. దానికి దావీదు, ‘యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. నేను నిన్ను చంపుతాను’ అని జవాబిచ్చాడు.
అప్పుడు దావీదు గొల్యాతు వైపు పరుగెత్తి, చిక్కంలో నుండి ఒక రాయి తీసుకొని, వడిసెలలో పెట్టి సూటిగా గొల్యాతు నుదుటి మీదకు విసిరాడు. అంతటి భారీకాయుడు చచ్చిపోవడం చూసి ఫిలిష్తీయులు భయంతో పారిపోయారు. ఇశ్రాయేలీయులు వెంటాడి వారిని ఓడించారు. 1 సమూయేలు 17:12-54లో ఉన్న ఈ కథంతా మీ కుటుంబంతో కలిసి చదవండి.
మీరు పిల్లలు కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించడానికి కొన్నిసార్లు భయపడవచ్చు. యిర్మీయా మొదట్లో చిన్నవాడినని భయపడినప్పుడు దేవుడాయనతో ‘భయపడకుము, నేను నీకు తోడైయున్నాను’ అన్నాడు. యిర్మీయా ధైర్యం తెచ్చుకొని దేవుడాయనకు చెప్పినట్లే ప్రకటించాడు. దావీదు, యిర్మీయాల్లాగే యెహోవాపై నమ్మకముంచితే మీరు కూడా భయపడకుండా ఉండడం నేర్చుకోవచ్చు.—యిర్మీయా 1:6-8. (w08 12/1)
^ పేరా 3 మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని వాళ్ళను ప్రోత్సహించాలని గుర్తుంచుకోండి.