“దేవుని పోలి నడుచుకొనుడి”
దేవునికి దగ్గరవ్వండి
“దేవుని పోలి నడుచుకొనుడి”
దయ. కరుణ. క్షమ. ప్రేమ. ఈ రోజుల్లో అలాంటి మంచి లక్షణాలను చూపించేవారు కరువయ్యారన్నది విచారకరమైన విషయం. మీ సంగతేమిటి? ఎంత ప్రయత్నించినా అలాంటి సుగుణాలను వృద్ధిచేసుకోవడం అసాధ్యమని మీకెప్పుడైనా అనిపించిందా? లోతుగా పాతుకుపోయిన చెడ్డ అలవాట్లు, గతంలోని చేదు అనుభవాలు వంటి కొన్ని అడ్డంకులు మంచి లక్షణాలను వృద్ధిచేసుకోవడం అసాధ్యం చేస్తాయని తననుతాను నిందించుకునే మనసు పదేపదే చెబుతుండవచ్చు. అయినప్పటికీ బైబిలు మనకు అభయాన్నిచ్చే ఒక సత్యాన్ని బోధిస్తోంది. అదేమిటంటే, మంచి లక్షణాలను వృద్ధిచేసుకొనే సామర్థ్యం మనలో ఉందని మన సృష్టికర్తకు తెలుసు.
“కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి” అని దేవుని వాక్యమైన బైబిలు నిజ క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. (ఎఫెసీయులు 5:1) దేవునికి తన ఆరాధకులపైవున్న నమ్మకాన్ని ఈ మాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అదెలా? యెహోవాదేవుడు మనిషిని తన స్వరూపమందు, తన పోలికె చొప్పున సృష్టించాడు. (ఆదికాండము 1:26, 27) అలా దేవుడు తన లక్షణాలతో వారిని సృష్టించాడు. * కాబట్టి బైబిలు “దేవుని పోలి నడుచుకొనుడి” అని క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నప్పుడు, స్వయంగా యెహోవాయే వారితో ఇలా అంటున్నట్లుగా ఉంది, ‘నాకు నీ మీద నమ్మకం ఉంది. నీలో అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ కొంతమేరకు నన్ను పోలి నడుచుకోగలవని నాకు తెలుసు.’
దేవునికున్న లక్షణాల్లో మనం వేటిని వృద్ధిచేసుకోవచ్చు? దానికి ముందూ తర్వాతా ఉన్న లేఖనాల్లో దీనికి సమాధానం ఉంది. పౌలు దేవుని పోలి నడుచుకోమని ఇచ్చిన ప్రోత్సాహాన్ని “కావున” అనే పదంతో మొదలుపెట్టాడని గమనించండి. ఈ పదం దయ, కరుణ, క్షమ గురించి చెప్పే దీనికి ముందున్న వచనంతో ఈ వచనాన్ని ముడిపెడుతుంది. (ఎఫెసీయులు 4:32; 5:1) దేవుని పోలి నడుచుకోమని ప్రోత్సహించిన వచనం తర్వాత పౌలు, నిస్వార్థమైన ప్రేమ ఉందని చూపించే జీవన విధానాన్ని చేపట్టమని క్రైస్తవులకు చెప్పాడు. (ఎఫెసీయులు 5:2) దయ చూపించడంలో, కరుణాహృదయంతో ఉండడంలో, ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించడంలో, ప్రేమ చూపించడంలో మనం అనుకరించగల అత్యంత గొప్ప మాదిరి నిజానికి యెహోవాదేవుడే.
మనం ఎందుకు దేవునిలా ఉండాలని కోరుకోవాలి? “మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి” అని పౌలు చెబుతున్న మాటల్లోవున్న శక్తివంతమైన స్ఫూర్తిని గమనించండి. అది మనసును తాకేలా లేదా? యెహోవా తన ఆరాధకులను తనకు ఎంతో ఇష్టమైన పిల్లల్లా చూస్తాడు. ఒక పిల్లవాడు అచ్చంగా తన తండ్రిలా ఉండడానికి ప్రయత్నించినట్లే, నిజ క్రైస్తవులు తమ పరలోకపు తండ్రిలా ఉండడానికి తాము చేయగలిగినదంతా చేసేందుకు ప్రయత్నిస్తారు.
మనుష్యులు తనను పోలి నడుచుకోవాలని యెహోవా బలవంతపెట్టడు. బదులుగా, సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చి ఆయన మనకు గౌరవాన్నిచ్చాడు. దేవుని పోలి నడుచుకోవాలా వద్దా నిర్ణయించుకోవాల్సింది మీరే. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) అయితే, దేవునికున్నటువంటి లక్షణాలను చూపించే సామర్థ్యం మీలో ఉందని ఎప్పుడూ మరిచిపోకండి. దేవుని పోలి నడుచుకోవాలంటే ముందు మీరు ఆయన ఎలాంటివాడో తెలుసుకోవాలి. మరెవరితోను పోల్చడానికి సాధ్యంకాని దేవుని గొప్ప వ్యక్తిత్వం లక్షలాదిమంది ఆయనను పోలి నడుచుకునేలా వారిని ఆకర్షించింది. ఆయన లక్షణాలన్నిటి గురించి, ఆయన మార్గాలన్నిటి గురించి నేర్చుకోవడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది. (w08 10/1)
[అధస్సూచి]
^ పేరా 5 మనం దేవుని పోలికె చొప్పున సృష్టించబడ్డామంటే దాని భావం మనమాయన లక్షణాలతో సృష్టించబడ్డామని కొలొస్సయులు 3:9, 10 సూచిస్తోంది. దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునేవారు, “సృష్టించినవాని [దేవుని] పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును” ధరించుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు.