కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నరకం గురించి యేసు ఏమి బోధించాడు?

నరకం గురించి యేసు ఏమి బోధించాడు?

నరకం గురించి యేసు ఏమి బోధించాడు?

యేసు ఇలా చెప్పాడు, “నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోకి పోవుటకంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు.”​​—⁠మార్కు 9:​47, 48, పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము.

మరో సందర్భంలో యేసు తీర్పుకాలంలో దుష్టులతో ఇలా అంటానని చెప్పాడు, “శాపానికి గురి అయిన వారలారా! నా దగ్గరనుంచి పోండి! అపనింద పిశాచానికీ వాడి దూతలకూ సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పోండి!” వీళ్ళు “శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు” అని కూడా ఆయన చెప్పాడు.​​—⁠మత్తయి 25:​41, 46, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

యేసు చెప్పిన పై మాటలను మీరు మొదటిసారి చదివినప్పుడు నరకాగ్ని గురించి ఆయన బోధించాడని మీకు అనిపించవచ్చు. కానీ “చచ్చినవారికి ఏమీ తెలియదు” అని స్పష్టంగా చెబుతున్న దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నది యేసు ఉద్దేశం కాదు.​​—⁠ప్రసంగి 9:​5, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

మరైతే యేసు, ఒక వ్యక్తి “నరకాగ్నిలో” పడేయబడడం గురించి చెప్పినప్పుడు దేని గురించి మాట్లాడాడు? యేసు హెచ్చరించింది నిజమైన “నిత్యాగ్ని” గురించా లేక దానికి వేరే అర్థమేమైనా ఉందా? దుష్టులు “శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు” అంటే దాని అర్థమేమిటి? ఈ ప్రశ్నలను మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

యేసు, ఒక వ్యక్తి “నరకాగ్నిలో” పడేయబడడం గురించి చెప్పినప్పుడు దేని గురించి మాట్లాడాడు? మార్కు 9:47లో ‘నరకం’ అని అనువదించబడిన గ్రీకు పదం గెహెన్నా. ఈ పదం హిన్నోము లోయ అనే భావమున్న గెహ్‌ హిన్నోము అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. హిన్నోము లోయ ప్రాచీన యెరూషలేము వెలుపల ఉండేది. ఇశ్రాయేలు రాజుల కాలంలో పిల్లల్ని బలివ్వడానికి దానిని ఉపయోగించేవారు, ఎంతో అసహ్యమైన ఆ ఆచారాన్ని దేవుడు ఖండించాడు. అలాంటి అబద్ధ ఆరాధన చేసేవారిని శిక్షిస్తానని దేవుడు చెప్పాడు. అప్పటినుండి హిన్నోము లోయ, “వధలోయ” అని పిలువబడింది, అక్కడ “జనుల శవములు” పాతిపెట్టబడకుండా పడివుండేవి. (యిర్మీయా 7:​30-34) కాబట్టి హిన్నోము లోయ, బ్రతికివున్నవారిని హింసించే స్థలం కాదుగానీ పెద్ద సంఖ్యలో శవాలను పడేసే స్థలం అవుతుందని యెహోవా ముందే చెప్పాడు.

యేసు కాలంలో యెరూషలేము నివాసులు హిన్నోము లోయను చెత్తాచెదారం పడేయడానికి ఉపయోగించేవారు. పరమ నీచులైన కొంతమంది నేరస్థుల శవాలను అక్కడ పడేసి చెత్తనూ శవాలనూ కాల్చడానికి అగ్ని ఆరకుండా ఉండేలా చూసేవారు.

యేసు చావని పురుగుల గురించి, ఆరని అగ్ని గురించి మాట్లాడినప్పుడు, ఆయన యెషయా 66:24ను ఉద్దేశించి మాట్లాడాడని తెలుస్తోంది. “[దేవుని] మీద తిరుగుబాటుచేసినవారి కళేబరముల” గురించి చెబుతూ “వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు” అని యెషయా అన్నాడు. పాతిపెట్టడానికి అర్హులుకాని వారి శవాలకు జరిగే దాని గురించే యెషయాలోని ఈ మాటలు సూచిస్తున్నాయని యేసుకూ ఆయన శ్రోతలకూ తెలుసు.

కాబట్టి హిన్నోము లోయను లేదా గెహెన్నాను, తిరిగి బ్రతికించబడే నిరీక్షణలేని మరణానికి సరైన గుర్తుగా యేసు ఉపయోగించాడు. దేవుడు “శరీరాన్నీ ఆత్మనూ కూడా నరకంలో నాశనం చేయగలడు” అని హెచ్చరించినప్పుడు ఆయన ఈ విషయాన్నే స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాడు. (మత్తయి 10:​28, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) కాబట్టి గెహెన్నా, నిత్యం హింసించబడడానికి కాదుగానీ శాశ్వతంగా చనిపోవడానికే గుర్తు.

యేసు హెచ్చరించింది నిజమైన “నిత్యాగ్ని” గురించా లేక దానికి వేరే అర్థమేమైనా ఉందా? యేసు చెప్పిన, మత్తయి 25:41లో రాయబడివున్న “నిత్యాగ్ని” ‘అపనింద పిశాచం కోసం వాడి దూతల కోసం’ సిద్ధపరచబడిందని గమనించండి. నిజమైన అగ్ని ఆత్మ ప్రాణులను కాల్చగలదని మీరనుకుంటున్నారా? లేదా యేసు ‘అగ్ని’ అనే పదాన్ని వేరే అర్థంతో ఉపయోగించాడా? ఆయన అదే ప్రసంగంలో చెప్పిన ‘మేకలు, గొఱ్ఱెలు’ ఖచ్చితంగా నిజమైనవి కాదు, అవి రెండు రకాల ప్రజలను సూచిస్తున్నాయి. (మత్తయి 25:​32, 33) యేసు చెప్పిన నిత్యాగ్ని అలంకారభావంలో దుష్టులను పూర్తిగా నాశనం చేస్తుంది.

దుష్టులు “శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు” అంటే దాని అర్థమేమిటి? మత్తయి 25:46లో కొలాసిన్‌ అనే గ్రీకు పదాన్ని చాలా అనువాదాలు “శిక్ష” అని అనువదించినప్పటికీ, “చెట్ల పెరుగుదలను ఆపడం” లేదా అనవసరమైన కొమ్మలను కత్తిరించడం అన్నది దాని అసలు అర్థం. కాబట్టి గొర్రెలాంటి ప్రజలు నిత్యజీవాన్ని పొందితే, పశ్చాత్తాపం చూపించని మేకలాంటి వాళ్ళు “శాశ్వతమైన శిక్ష” అనుభవిస్తారు అంటే వాళ్ళు నిత్యం జీవించే అవకాశాన్ని కోల్పోతారు.

మీరేమనుకుంటున్నారు?

మానవులు చావులేని వాళ్ళని యేసు ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఆయన చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతుకుతారని తరచూ బోధించాడు. (లూకా 14:​13, 14; యోహాను 5:​25-29; 11:​25) చనిపోయినవాళ్ళ ఆత్మలు ఇంకా బ్రతికేవున్నాయని యేసు నమ్మివుంటే వాళ్ళు తిరిగి బ్రతుకుతారని ఆయనెందుకు చెబుతాడు?

దేవుడు దుష్టులను నిరంతరం క్రూరంగా హింసిస్తాడని యేసు బోధించలేదు గానీ, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేసెను” అని చెప్పాడు. (యోహాను 3:​16, పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము) మరైతే తనను విశ్వసించనివాళ్ళు చనిపోతారని యేసు ఎందుకు సూచించాడు? వాళ్ళు నరకాగ్నిలో వేదన అనుభవిస్తూ ఎప్పటికీ జీవించేవుంటారన్నది ఆయన ఉద్దేశమైతే ఆయన అలాగే చెప్పివుండేవాడు కదా?

నరకం హింసించబడే స్థలం అనే సిద్ధాంతం బైబిలులో ఎక్కడా లేదు. నిజానికిది క్రైస్తవ బోధగా చెలామణి అవుతున్న అన్యమత నమ్మకం. (6వ పేజీలోవున్న, “నరకం గురించిన క్లుప్త చరిత్ర” అనే బాక్సు చూడండి.) దేవుడు ప్రజలను నరకంలో నిత్యం హింసించడు. నరకాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోవడం దేవుడు ఎలాంటివాడనే విషయంలో మీకున్న అభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? (w08 11/1)

[6వ పేజీలోని బాక్సు]

నరకం గురించిన క్లుప్త చరిత్ర

అన్యమత నమ్మకాల నుండి వచ్చింది: ప్రాచీన ఐగుప్తీయులు నరకాగ్నిని నమ్మారు. ‘నరకకూపంలో పడేయబడి, అక్కడినుండి ఇక తప్పించుకోలేని, జ్వాలల్లోనుండి ఇక బయటకు రాలేని’ వాళ్ళ గురించి సా.శ.పూ. 1375కి చెందిన ద బుక్‌ అమ్‌టాట్‌ మాట్లాడుతోంది. గ్రీకు తత్వవేత్తయైన ప్లూటార్క్‌ (సుమారు సా.శ. 46-120), పాతాళలోకంలో ఉండేవాళ్ళ గురించి ఇలా రాశాడు, “[వాళ్ళు] భయంకరంగా క్రూరంగా, ఘోరంగా హింసించబడుతూ ఆక్రందనలు చేశారు.”

యూదామత నమ్మకాలు ప్రభావితమయ్యాయి: ఎస్సెన్స్‌ అనే యూదా మతశాఖకు చెందినవాళ్ళు “ఆత్మలు చావవని ఎప్పటికీ అలాగే కొనసాగుతాయని” నమ్మేవాళ్ళని చరిత్రకారుడైన జోసీఫస్‌ (సా.శ. 37-సుమారు 100) నివేదించాడు. ఆయనింకా ఇలా చెప్పాడు, “ఇది గ్రీకుల అభిప్రాయంలాగే ఉంది . . . దుష్టాత్మలు అంధకారమైన, భయంకరమైన ప్రదేశంలో నిరంతరం శిక్షించబడతాయని వాళ్ళు నమ్ముతారు.”

“క్రైస్తవత్వంలోకి” ప్రవేశపెట్టబడింది: సా.శ. రెండవ శతాబ్దంలో అపొకలిప్స్‌ ఆఫ్‌ పీటర్‌ అనే అప్రమాణిక గ్రంథం దుష్టుల గురించి మాట్లాడుతూ, “ఆరని అగ్ని వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడింది” అని చెప్పింది. “ఎజ్రాయేల్‌ అనే కోపిష్ఠుడైన దూత, సగం కాలిన స్త్రీ పురుషుల శరీరాలను తీసుకువచ్చి, అంధకారకూపంలో పడేస్తాడు, అదే నరకం; కోపిష్ఠుడైన ఒక ఆత్మప్రాణి వాళ్ళను కొరడాతో కొడతాడు” అని కూడా అది చెప్పింది. అదే కాలంలో, దుష్టులకు వచ్చే శిక్షల గురించి ప్రవచిస్తూ గ్రీకు ప్రవక్త్రియైన సిబిల్‌ ఇలా అన్నట్లు ఆంటియోక్‌కు చెందిన థియోఫిలస్‌ అనే రచయిత రాశాడు, “మీపైకి నరకాగ్ని వస్తుంది, ప్రతీరోజూ మీరు అగ్ని జ్వాలల్లో కాల్తారు.” ఈ మాటలు “సత్యమైనవి, ప్రయోజనకరమైనవి, న్యాయమైనవి, మనుషులందరికీ లాభకరమైనవి” అని థియోఫిలస్‌ చెబుతున్న మాటల్లో భాగమే.

మధ్యయుగాల్లోని దౌర్జన్యం న్యాయమైనదే అని సమర్థించడానికి నరకాగ్ని ఉపయోగించబడింది: దాదాపు 300 మంది ప్రొటస్టెంటులను హింసాకొయ్యపై కాల్చిన ఇంగ్లాండ్‌కు చెందిన ఒక రాణి (1553-1558) ఇలా చెప్పినట్లు తెలుస్తుంది, “మతభ్రష్టుల ఆత్మలు ఆ తర్వాత నరకంలో నిరంతరం కాల్చబడతాయి కాబట్టి వాళ్ళను భూమిపైనే కాల్చడం ద్వారా దైవిక ప్రతీకారాన్ని అనుకరించడంకంటే సరైనది మరొకటి నాకుండదు.”

ప్రస్తుత నమ్మకం: ఇటీవలి సంవత్సరాల్లో కొన్ని మత శాఖలు నరకం గురించి తాము బోధించేవాటిలో కొన్ని మార్పులు చేశాయి. ఉదాహరణకు, 1995లో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు సంబంధించిన డాక్ట్రిన్‌ కమీషన్‌ ఇలా చెప్పింది, “నరకం అంటే నిత్య హింస కాదు; బదులుగా ఉనికిలో లేకుండాపోవడం. దేవునికి వ్యతిరేకమైన జీవితమార్గాన్ని ఎంపిక చేసుకోవడం మూలంగా వచ్చే పర్యవసానం అదే.”

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

‘అగ్ని గుండము’ అంటే ఏమిటి?

అపవాది ‘అగ్ని గుండములో’ పడేయబడతాడని, ‘యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడతాడు’ అని ప్రకటన 20:⁠10 చెబుతోంది. అపవాది ఎప్పటికీ హింసించబడుతూనే ఉండాలంటే దేవుడు అతణ్ణి సజీవంగా ఉంచాలి కానీ యేసు అతణ్ణి ‘నాశనంచేస్తాడు’ అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 2:​14) సూచనార్థకమైన ఈ అగ్ని గుండము “రెండవ మరణమును” సూచిస్తుంది. (ప్రకటన 21:⁠8) ఆ మరణం బైబిల్లో మొదట ప్రస్తావించబడిన మరణం కాదు అంటే ఆదాము పాపం మూలంగా వచ్చిన మరణం కాదు, ఎందుకంటే తిరిగి బ్రతికించబడినప్పుడు ఈ మరణం నుండి విడుదల పొందవచ్చు. (1 కొరింథీయులు 15:​21, 22) ‘అగ్ని గుండము’ తనలో ఉన్నవారిని విడుదల చేస్తుందని బైబిలు చెప్పడం లేదు కాబట్టి “రెండవ మరణము” అంటే మరో రకమైన మరణమైవుండాలి. అలా చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతికే అవకాశం ఉండదు.

మరి ‘అగ్ని గుండములో’ ఉండేవాళ్ళు ఏ భావంలో ఎల్లకాలం బాధింపబడతారు? కొన్నిసార్లు ‘బాధింపబడతారు’ అనే పదానికి ఎవరినైనా “నిర్బంధించడం” అనే భావం ఉండవచ్చు. ఒకసారి దయ్యాలు యేసుకు ఎదురుగావచ్చి, “కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు [అగాధములో నిర్బంధించుటకు] ఇక్కడికి వచ్చితివా?” అని అరిచాయి. (మత్తయి 8:​29; లూకా 8:​30, 31) కాబట్టి ‘అగ్ని గుండములో’ ఉన్నవారందరూ నిత్య నిర్బంధం లేక “రెండవ మరణము” అనే “బాధ” అనుభవిస్తారు.