కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నరకాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

నరకాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

నరకాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

నరకం హింసించే స్థలమని బోధించేవాళ్ళు యెహోవా దేవుని గురించి ఆయన లక్షణాల గురించి తప్పుగా ప్రచారం చేస్తారు. నిజమే, దేవుడు దుష్టులను నాశనం చేస్తాడని బైబిలు చెబుతుంది. (2 థెస్సలొనీకయులు 1:​6-9) కానీ నీతియుక్తమైన కోపం చూపించడమనేది దేవుని ప్రధాన లక్షణం కాదు.

దేవుడు పగతీర్చుకునేవాడు కాదు. “దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా?” అని కూడా ఆయన అడుగుతున్నాడు. (యెహెజ్కేలు 18:​23) దుష్టులు మరణించడం వల్ల దేవునికి సంతోషం కలగనప్పుడు, వాళ్ళు ఎప్పటికీ హింసించబడుతుండడాన్ని చూసి ఆయనెలా ఆనందిస్తాడు?

ప్రేమ దేవుని ప్రధాన లక్షణం. (1 యోహాను 4:⁠8) నిజానికి, “ఆయన అందరికీ మంచి చేస్తాడు. ఆయన వాత్సల్యం ఆయన సృష్టి అంతటిమీద ఉంది.” (కీర్తన 145:​9, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) అలాగే మనం కూడా ఆయనపట్ల హృదయపూర్వకమైన ప్రేమను పెంపొందించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.​—⁠మత్తయి 22:​35-38.

నరకమంటే భయం లేక దేవుడంటే ప్రేమ—⁠ఏది మిమ్మల్ని పురికొల్పుతుంది?

నరకంలో మనుషులు బాధింపబడతారనే బోధ, దేవునిపట్ల అనుచితమైన భయం ఏర్పడేలా చేస్తుంది. దానికి భిన్నంగా దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకుని ఆయనను ప్రేమించడం మొదలుపెట్టే వ్యక్తి ఆయన పట్ల సముచితమైన భయాన్ని ఏర్పర్చుకుంటాడు. “దైవభీతి విజ్ఞానమునకు మొదటిమెట్టు, ఆ గుణమును అలవరచుకొనువారు వివేకవంతులు” అని కీర్తన 111:⁠10 (పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము) వివరిస్తుంది. ఈ దైవభీతి అనుచితమైన భయం కాదుగానీ సృష్టికర్తపట్ల భక్తితో కూడిన భయం. అది ఆయనకు అసంతోషం కలిగించకూడదనే సముచితమైన భయాన్ని మనలో నింపుతుంది.

నరకం గురించిన సత్యం తెలుసుకోవడం, ఒకప్పుడు మత్తుపదార్థాలు ఉపయోగించిన 32 సంవత్సరాల కాథ్లీన్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో గమనించండి. ఆమె జీవితమంతా పార్టీలు, దౌర్జన్యం, తనపై తనకే ద్వేషం, అనైతికతలతో నిండిపోయి ఉండేది. ఆమె ఇలా అంగీకరిస్తోంది, “నేను సంవత్సరం వయసున్న మా పాపను చూసి, ‘దానికి ఎంత అన్యాయం చేస్తున్నానో చూడు, ఇలా చేసినందుకు నేను తప్పకుండా నరకానికి వెళ్తాను’ అని నాలో నేను అనుకునేదాన్ని.” కాథ్లీన్‌ మత్తుపదార్థాలను ఉపయోగించడం మానేయడానికి ఎంతో ప్రయత్నించింది కానీ మానలేకపోయింది. ఆమె ఇలా అంటోంది, “నేను మంచిగా ఉండాలనుకుంటాను కానీ నా జీవితంలో, లోకంలో అన్నీ హృదయవిదారకంగా ఉన్నాయి. మంచిగా ఉండడంలో అర్థం లేదనిపించింది.”

ఆ తర్వాత కాథ్లీన్‌ యెహోవాసాక్షులను కలిసింది. ఆమె ఇలా చెబుతోంది “నరకాగ్ని లేదని తెలుసుకున్నాను. లేఖనాల్లోవున్న సాక్ష్యాధారం ఎంతో అర్థవంతంగా అనిపించింది. నేను నరకంలో కాలవలసిన అవసరం లేదని తెలుసుకోవడం నాకెంతో ఉపశమనాన్ని ఇచ్చింది.” దుష్టత్వం నిర్మూలించబడిన భూమ్మీద, మనుషులు నిరంతరం జీవించవచ్చని దేవుడు చేసిన వాగ్దానం గురించి కూడా ఆమె తెలుసుకుంది. (కీర్తన 37:​10, 11, 29; లూకా 23:​43) “పరదైసు భూమిపై నిరంతరం జీవించవచ్చనే నిజమైన నిరీక్షణ ఇప్పుడు నాకుంది” అని ఆమె అంటోంది.

కాథ్లీన్‌కు మండే నరకంలో పడేయబడతాననే భయం లేకపోయినా, ఆమె మత్తుపదార్థాలను వాడడం మానేయగలిగిందా? ఆమె ఇలా చెబుతోంది “మత్తుపదార్థాలు తీసుకోవాలని నాకు బలంగా అనిపించినప్పుడు యెహోవా దేవుని సహాయం కోసం అర్థిస్తూ ప్రార్థన చేస్తాను. అలాంటి చెడు అలవాట్లపట్ల ఆయన ఆలోచన ఏమిటనేదాని గురించి నేను ఆలోచించాను, ఆయనను నిరాశపర్చకూడదని నేను కోరుకున్నాను. ఆయన నా ప్రార్థనలకు జవాబిచ్చాడు.” (2 కొరింథీయులు 7:⁠1) దేవునికి అసంతోషం కలిగించకూడదనే భయం వల్ల కాథ్లీన్‌ దురలవాట్లను మానేయగలిగింది.

నరకంలో బాధించబడతామనే భయాన్ని కాదుగానీ దేవుని పట్ల ప్రేమను, ఆయనపట్ల సముచితమైన భయాన్ని పెంపొందించుకోవడం, నిరంతర సంతోషాన్ని పొందేలా దేవుడు కోరేదాన్ని చేయడానికి మనల్ని పురికొల్పగలదు. కీర్తనకర్త ఇలా రాశాడు, “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.”​—⁠కీర్తన 128:⁠1. (w08 11/1)

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

నరకం నుండి ఎవరు విడుదల చేయబడతారు?

కొన్ని బైబిలు అనువాదాలు, గెహెన్నా, హేడీస్‌ అనే రెండు గ్రీకు పదాలనూ “నరకం” అనే అనువదించడం ద్వారా గందరగోళాన్ని సృష్టిస్తాయి. బైబిల్లో గెహెన్నా అనే పదం తిరిగి బ్రతికించబడే నిరీక్షణలేని పూర్తి నాశనాన్ని సూచిస్తుంది. దానికి భిన్నంగా, హేడీస్‌లో ఉన్నవారికి తిరిగి జీవించే నిరీక్షణ ఉంటుంది.

కాబట్టి యేసు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఆయన “పాతాళములో [‘హేడీస్‌లో,’ NW] విడువబడలేదు” అని అపొస్తలుడైన పేతురు తన ప్రేక్షకులకు హామీనిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 2:​27, 31, 32; కీర్తన 16:​10) హేడీస్‌ అనే గ్రీకు పదం, ఈ వచనంలో “పాతాళము” అని, ఇతర స్థలాల్లో నరకం అని అనువదించబడింది. యేసు అగ్నిజ్వాలలుండే స్థలానికి వెళ్ళలేదు. యేసు వెళ్ళిన హేడీస్‌ లేదా “పాతాళము” అంటే సమాధి. అయితే హేడీస్‌ నుండి దేవుడు విడుదల చేసేది యేసును మాత్రమే కాదు.

తిరిగి బ్రతికించబడడం గురించి బైబిలు ఇలా చెబుతోంది, ‘మరణము, పాతాళలోకము [“హేడీస్‌,” NW] వాటి వశముననున్న మృతులను అప్పగించెను.’ (ప్రకటన 20:​13, 14) నరకమును ఖాళీ చేయాలంటే తిరిగి బ్రతికించబడడానికి అర్హులని దేవుడు నిర్ణయించిన వారందరినీ మళ్ళీ జీవించేలా చేయాలి. (యోహాను 5:​28, 29; అపొస్తలుల కార్యములు 24:​15) మరణించిన మన ప్రియమైనవాళ్ళు సమాధినుండి తిరిగి రావడాన్ని చూడడం ఎంతటి అద్భుతమైన నిరీక్షణ! అవధుల్లేని ప్రేమగల దేవుడైన యెహోవా అలా చేస్తాడు.