కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి తండ్రిగా ఎలా ఉండవచ్చు?

మంచి తండ్రిగా ఎలా ఉండవచ్చు?

మంచి తండ్రిగా ఎలా ఉండవచ్చు?

“తండ్రులు తమ పిల్లలకు చిరాకు కలిగించరాదు, అలా చేస్తే వారికి నిరుత్సాహం కలుగుతుంది.”​—⁠కొలొస్సయులు 3:​21, పరిశుద్ధ బైబల్‌ ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

తండ్రి తన పిల్లలకు చిరాకు రప్పించకుండా ఎలా ఉండవచ్చు? తండ్రిగా తానేమి చేయాలో ఆయన గుర్తించడం ఎంతో అవసరం. “తండ్రి తన పిల్లలను ఎలా చూసుకుంటున్నాడనే దాన్నిబట్టే వాళ్ళ మానసిక ఎదుగుదల, తెలివితేటలు ఉంటాయి, ఆయన వాళ్ళను చూసుకునే తీరు పిల్లలమీద ఎన్నో రకాలుగా, ప్రత్యేకమైన రీతిలో ప్రభావం చూపిస్తుంది” అని మానసిక ఆరోగ్యాన్ని గురించి చెప్పే ఒక పత్రికలో ఉంది.

తండ్రి ఏమి చేయాలి? చాలా కుటుంబాల్లో సాధారణంగా పిల్లల్ని అదుపులో పెట్టే బాధ్యత తండ్రిదే. చాలామంది తల్లులు అల్లరి చేస్తున్న పిల్లలతో, ‘నాన్న రానియ్‌, నీ సంగతి చెప్తాను’ అనడం వింటుంటాం. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక చక్కగా సర్దుకుపోయేలా తయారవ్వాలంటే వారిని శిక్షించడం, వారితో కటువుగా ఉండడం కొంతవరకు అవసరమే. అయితే మంచి తండ్రిగా ఉండాలంటే చేయాల్సింది ఇంకా చాలావుంది.

బాధాకరమైన విషయమేమిటంటే, ప్రతీ తండ్రికి చూసి నేర్చుకోవడానికి తగిన ఒక మంచి వ్యక్తి ఉండకపోవచ్చు. కొంతమంది మగవాళ్ళు తండ్రి లేకుండానే పెరిగారు. కొంతమందైతే మొండిగా, కఠినంగా ఉండే తండ్రి పెంపకంలో పెరగడం వలన తమ పిల్లల్ని కూడా అలాగే పెంచాలనుకోవచ్చు. అలాంటి తండ్రి, తన తండ్రి తనను పెంచినట్లు కాకుండా తన పిల్లల్ని బాగా ఎలా పెంచవచ్చు?

ఒక మంచి తండ్రిగా ఉండడానికి అవసరమైన పాటించగల, నమ్మకమైన సలహా ఇచ్చే పుస్తకం ఒకటి ఉంది. బైబిలు అనే ఆ పుస్తకం, కుటుంబాలకు ఉత్తమమైన సలహాలిస్తుంది. అదిచ్చే సలహాలు పాటించలేనివేమీ కాదు, వాటిని పాటించడం వల్ల మనకు ఎలాంటి హానీ జరగదు. బైబిల్లోని సలహాలు, దాని రచయితా, కుటుంబ వ్యవస్థాపకుడూ అయిన యెహోవా దేవుని జ్ఞానానికి అద్దంపడతాయి. (ఎఫెసీయులు 3:​14, 15) మీరొక తండ్రి అయితే పిల్లల్ని పెంచడం గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకోవడం మంచిది. *

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదగడమే కాక దేవునితో దగ్గరి సంబంధాన్ని ఏర్పర్చుకోవాలంటే మీరు మంచి తండ్రిగా ఉండడం ప్రాముఖ్యం. తన తండ్రితో చాలా ప్రేమగా, అతనికి ఎంతో దగ్గరగా ఉండే పిల్లలకు దేవునితో దగ్గరి సంబంధం కలిగివుండడం కూడా సులభంగా ఉంటుంది. మనల్ని సృష్టించిన యెహోవా కూడా ఒక విధంగా మన తండ్రే అని బైబిలు చెబుతుంది. (యెషయా 64:⁠8) పిల్లల కోసం తండ్రి చేయాల్సిన ఆరు విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. ఒక్కో విషయాన్ని చూసేటప్పుడు, ఒక తండ్రి బైబిలు సూత్రాలను పాటించడం, ఆయన తన పిల్లల కోసం చేయాల్సినవి చేయడానికి ఎలా సహాయపడుతుందో పరిశీలిద్దాం.

1 పిల్లలకు తండ్రి ప్రేమ అవసరం

ఒక తండ్రిగా యెహోవా పరిపూర్ణమైన మాదిరి. దేవుడు తన మొదటి కుమారుడైన యేసు విషయంలో ఎలా భావిస్తున్నాడో వర్ణిస్తూ “తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు” అని బైబిలు చెబుతోంది. (యోహాను 3:​35; కొలొస్సయులు 1:​15) యెహోవా తన కుమారుడు తనకు ప్రియమైనవాడనీ, ఆయనను బట్టి తాను ఆనందిస్తున్నానని ఒకటికన్నా ఎక్కువ సందర్భాల్లో చెప్పాడు. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా పరలోకం నుండి మాట్లాడుతూ “నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను” అని అన్నాడు. (లూకా 3:​22) తన తండ్రి తనను ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం యేసుకు ఎప్పుడూ రాలేదు. దేవుని నుండి తండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారని వాళ్ళకు చెప్పడానికి ఎప్పుడూ సంకోచించకండి. ఐదుగురు పిల్లల తండ్రియైన కెల్విన్‌ ఇలా అంటున్నాడు, “మా పిల్లల్ని ప్రేమిస్తున్నానని చెప్పడమేకాక వాళ్ళలో ప్రతీ ఒక్కరిపై వ్యక్తిగతంగా ఆసక్తిని చూపించడం ద్వారా నా ప్రేమను వ్యక్తం చేయడానికి నేనెప్పుడూ ప్రయత్నించేవాణ్ణి. పిల్లల డైపర్లు మార్చి, వాళ్ళకు స్నానం కూడా చేయించేవాణ్ణి.” అంతేగాక మీ పిల్లలను బట్టి మీరు ఆనందిస్తున్నారని వారికి తెలియాలి. కాబట్టి వాళ్ళను అదేపనిగా సరిచేస్తూ, వాళ్ళు చేసిందల్లా తప్పు అనడానికి చూడకండి. బదులుగా వారిని సాధ్యమైనంత వరకు మెచ్చుకుంటూ ఉండండి. టీనేజీలో ఉన్న ఇద్దరు ఆడపిల్లల తండ్రియైన డొనిజెటీ, “ఒక తండ్రి తన పిల్లల్ని మెచ్చుకోవడానికి అవకాశాల కోసం చూడాలి” అని అంటున్నాడు. మీ పిల్లలను బట్టి మీరు ఆనందిస్తున్నారని వారికి తెలియడం వాళ్ళలో తగినంత ఆత్మవిశ్వాసం ఏర్పడేందుకు సహాయం చేయవచ్చు. అది దేవునికి మరింత దగ్గరయ్యేందుకు వాళ్ళకు సహాయం చేస్తుంది.

2 పిల్లలకు మంచి మాదిరి అవసరం

యేసు తన ‘తండ్రి ఏది చేయడం చూస్తాడో అదే’ చేయగలడని యోహాను 5:⁠19 చెబుతుంది. యేసు తన తండ్రి ‘చేస్తున్నదాన్ని’ చూసి అదే చేశాడని లేఖనం చెప్పడాన్ని గమనించండి. పిల్లలు అలాగే చేస్తుంటారు. ఉదాహరణకు, తండ్రి తన భార్యను గౌరవమర్యాదలతో చూసుకుంటే ఆయన కుమారుడు పెద్దవాడైన తర్వాత స్త్రీల పట్ల అలాగే గౌరవమర్యాదలతో నడుచుకుంటాడు. తండ్రి మాదిరి మగపిల్లల దృక్పథాలపైనే కాక, ఆడపిల్లలు పురుషులను ఎలా దృష్టిస్తారనే దానిపై కూడా ప్రభావం చూపిస్తుంది.

క్షమాపణలు చెప్పడం మీ పిల్లలకు కష్టంగా ఉంటోందా? ఈ విషయంలో కూడా వారికి ఒక మంచి మాదిరి ఎంతో అవసరం. తన ఇద్దరు కుమారులు ఒక ఖరీదైన కెమెరాను పాడు చేసిన సందర్భాన్ని కెల్విన్‌ గుర్తుచేసుకుంటున్నాడు. ఆయనకు విపరీతమైన కోపం రావడంతో ఆయన చెక్కబల్లపై మోదేసరికి అది రెండు ముక్కలైంది. కెల్విన్‌ ఆ తర్వాత ఎంతో బాధపడి, అలా కోపం తెచ్చుకున్నందుకు తన భార్యతో సహా అందరికీ క్షమాపణ చెప్పాడు. తానలా క్షమాపణ చెప్పడం తన పిల్లలపై మంచి ప్రభావం చూపించిందని ఆయన భావిస్తున్నాడు, ఎందుకంటే క్షమాపణ చెప్పడం వాళ్ళకెప్పుడూ కష్టంకాదు.

3 పిల్లలకు సంతోషకర వాతావరణం అవసరం

యెహోవా ‘సంతోషంగా ఉండే దేవుడు.’ (1 తిమోతి 1:​11, NW) ఆయన కుమారుడైన యేసు తన తండ్రితో ఉండడంలో గొప్ప ఆనందాన్ని పొందాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. “నేను ఆయన [తండ్రి]యొద్ద ప్రధానశిల్పినై . . . నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని” అని చెబుతూ సామెతలు 8:⁠30 యేసుకు ఆయన తండ్రికి మధ్యవున్న సంబంధాన్ని అర్థంచేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. తండ్రీకుమారుల మధ్య ఎంత ప్రేమగల సంబంధం ఉందో!

మీ పిల్లలకు సంతోషకర వాతావరణం అవసరం. మీ పిల్లలతో ఆడుకోవడానికి సమయం వెచ్చిస్తే అలాంటి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కలిసి ఆడుకుంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అనుబంధం పెరుగుతుంది. యౌవనస్థుడైన కుమారుడున్న ఫెలిక్సు ఆ విషయంతో ఏకీభవిస్తున్నాడు. ఆయన, “మా అబ్బాయితో సరదాగా సమయం గడపడం మా మధ్య ప్రేమగల సంబంధం ఏర్పడడానికి ఎంతో అవసరమైంది. మేము కలిసి ఆటలు ఆడతాం, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటాం, అందమైన ప్రదేశాలకు వెళుతుంటాం. మా కుటుంబమంతా సంతోషంగా కలిసిమెలిసి ఉండడానికి ఇదెంతో సహాయం చేసింది” అని చెబుతున్నాడు.

4 పిల్లలకు దేవునితో దగ్గరి సంబంధం ఉండాలని నేర్పించడం అవసరం

యేసుకు ఆయన తండ్రి నేర్పించాడు. అందుకే యేసు, “నేను ఆయన [తండ్రి]యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను” అని చెప్పగలిగాడు. (యోహాను 8:​26) దేవుని ఉద్దేశం ప్రకారం, పిల్లలు ఎలా ప్రవర్తించాలో, వాళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో వాళ్ళకు నేర్పించవలసిన బాధ్యత తండ్రిదే. మీ పిల్లల మనసుల్లో సరైన సూత్రాలు నాటుకునేలా వారికి నేర్పించడం తండ్రిగా మీకున్న బాధ్యతల్లో ఒకటి. అలా నేర్పించడం చాలా చిన్న వయసునుండే మొదలుపెట్టాలి. (2 తిమోతి 3:​14, 15) ఫెలిక్సు, వాళ్ళ అబ్బాయి చాలా చిన్న వయసులో ఉన్నప్పటినుండే వాడికి బైబిలు కథలు చదివి వినిపించడం మొదలుపెట్టాడు. నా బైబిలు కథల పుస్తకములోవున్న వాటితోపాటు ఆకట్టుకొనే, ఆసక్తికరమైన కథలు ఆయన చెప్పేవాడు. * ఆయన వాళ్ళ అబ్బాయి ఎదుగుతున్న కొద్దీ ఆ పిల్లవాడితో మాట్లాడడానికి వాడి వయసుకు తగిన, బైబిలుకు సంబంధించిన ఇతర ప్రచురణలను ఎంచుకునేవాడు.

డొనిజెటీ ఇలా చెబుతున్నాడు, “కుటుంబ బైబిలు అధ్యయనం సరదాగా ఉండేలా చేయడం కష్టంగానే ఉంటుంది. తల్లిదండ్రులు దైవిక విషయాలకు ప్రాముఖ్యతనివ్వడం చాలా అవసరం ఎందుకంటే చెప్పేదానికి, చేసేదానికీ తేడా ఉంటే పిల్లలు వెంటనే గమనిస్తారు.” ముగ్గురు అబ్బాయిలున్న కార్లోస్‌ “మా కుటుంబానికి ఏమి అవసరమో మేము వారానికొకసారి కూర్చుని మాట్లాడుకుంటాం. ఏ విషయం గురించి చర్చించుకోవాలనేది కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ఎంచుకోవచ్చు.” కెల్విన్‌ తన పిల్లలు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా వాళ్ళతో దేవుని గురించి మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాడు. అది మనకు మోషే చెప్పిన ఈ మాటలను గుర్తుతెస్తుంది, “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”​—⁠ద్వితీయోపదేశకాండము 6:​6, 7.

5 పిల్లలకు క్రమశిక్షణ అవసరం

పిల్లలు ప్రయోజనకరమైన వారిగా, బాధ్యత తెలిసినవారిగా ఎదగాలంటే వారికి క్రమశిక్షణ అవసరం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడమంటే వాళ్ళను భయపెడుతూ, అవమానిస్తూ, వాళ్ళతో కటువుగా ఉండాలని అనుకుంటారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే వాళ్ళతో కటువుగా ఉండాలని బైబిలు చెప్పడం లేదు. దానికి బదులుగా తల్లిదండ్రులు యెహోవాలాగే ప్రేమతో వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలి. (హెబ్రీయులు 12:​4-11) “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు [యెహోవా] యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని బైబిలు చెబుతుంది.​—⁠ఎఫెసీయులు 6:⁠4.

అప్పుడప్పుడూ పిల్లలను దండించడం అవసరమే. కానీ తనను ఎందుకు దండిస్తున్నారో ఆ పిల్లవాడికి అర్థమవ్వాలి. తల్లిదండ్రుల క్రమశిక్షణ వల్ల, వాళ్ళకు తనంటే ఇష్టంలేదని ఆ పిల్లవాడికి అనిపించకూడదు. పిల్లవాడు గాయపడేంత తీవ్రంగా కొట్టడం బైబిలు ప్రకారం తప్పు. (సామెతలు 16:​32) “ప్రాముఖ్యమైన విషయాల్లో నా పిల్లల్ని నేను సరిచేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళమీద ప్రేమ ఉండబట్టే నేను వాళ్ళను సరిచేస్తున్నానని వాళ్ళకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాను” అని కెల్విన్‌ చెబుతున్నాడు.

6 పిల్లలకు కాపుదల అవసరం

పిల్లలను పాడుచేయగల వాటినుండి, వాళ్ళపై చెడు ప్రభావం చూపించే వారినుండి పిల్లలకు కాపుదల అవసరం. బాధాకరమైన విషయమేమిటంటే, మనచుట్టూ ఉన్న లోకంలో అమాయకులైన పిల్లలను పాడుచేయాలని చూసే “దుష్టులు” ఉన్నారు. (2 తిమోతి 3:​1-5, 13, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీ పిల్లల్ని మీరెలా కాపాడవచ్చు? బైబిలు ఈ చక్కని సలహానిస్తుంది, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” (సామెతలు 22:⁠3) మీ పిల్లలను అపాయాల నుండి కాపాడాలంటే అవి రాకముందే వాటి గురించి తెలుసుకోవాలి. సమస్యలకు దారితీయగల పరిస్థితులను ముందుగానే అంచనావేసి, వాటినుండి మీ పిల్లలను కాపాడడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఉదాహరణకు, మీ పిల్లల కోసం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టిస్తే చిక్కుల్లో పడకుండా దానిని ఉపయోగించుకోవడం వాళ్ళకు నేర్పించండి. మీరు గమనించడానికి వీలుగా మీ ఇంట్లో కంప్యూటర్‌ను అందరూ తిరిగే చోట పెట్టడం మంచిది.

పిల్లలను పాడుచేసే వాళ్ళున్న ఈ లోకంలో పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాల గురించి వాళ్ళకు చెప్పి, వాటినుండి ఎలా తప్పించుకోవాలో తండ్రే వాళ్ళకు నేర్పించాలి. మీరు లేనప్పుడు మీ పిల్లలమీద ఎవరైనా అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే ఏమి చేయాలో మీ పిల్లలకు తెలుసా? * మర్మావయవాల సరైన, సరికాని ఉపయోగం గురించి మీ పిల్లలకు తెలిసుండాలి. కెల్విన్‌ ఇలా చెబుతున్నాడు, “ఆ విషయాలు మా పిల్లలకు వాళ్ళ టీచర్లతో సహా వేరే ఎవరైనా నేర్పించాలని నేనెప్పుడూ అనుకోలేదు. లైంగిక విషయాల గురించి, పిల్లలపై అత్యాచారం చేసేవాళ్ళ వల్ల వచ్చే ప్రమాదం గురించి నా పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత నాకే ఉందని నేననుకున్నాను.” ఆయన పిల్లలందరూ ఏ ప్రమాదంలో పడకుండా పెరిగిపెద్దవాళ్ళై, పెళ్ళిళ్ళుచేసుకొని, సంతోషంగా ఉన్నారు.

దేవుని సహాయం తీసుకోండి

దేవునితో దగ్గరి సంబంధాన్ని పెంచుకునేలా సహాయం చేయడమే ఒక తండ్రి తన పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతి. ఈ విషయంలో తండ్రి చక్కని మాదిరి ఎంతో ప్రాముఖ్యం. డొనిజెటీ ఇలా చెబుతున్నాడు, “దేవునితో తమకున్న సంబంధానికి తామెంత విలువిస్తున్నామో తండ్రులు చూపించడం అవసరం. ప్రత్యేకంగా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దానికెంత విలువిస్తున్నారో స్పష్టమవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో యెహోవామీద తనకెంత నమ్మకముందో తండ్రి చూపిస్తాడు. దేవుడు చూపించిన మంచితనానికి పదేపదే కృతజ్ఞతలు చెబుతూ చేసే కుటుంబ ప్రార్థన, దేవుణ్ణి తమ స్నేహితునిగా చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో పిల్లలకు నేర్పిస్తుంది.”

అయితే మంచి తండ్రిగా ఉండడానికి కీలకమేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలో బాగా తెలిసిన యెహోవా దేవుని సలహా తీసుకోండి. మీ పిల్లలను దేవుని వాక్యంలోని నిర్దేశానికి అనుగుణంగా పెంచితే, “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అని చెబుతున్న సామెతలు 22:6లో వర్ణించబడిన ఫలితాలను చూస్తారు. (w08 10/1)

[అధస్సూచీలు]

^ పేరా 6 ఈ ఆర్టికల్‌లో వివరించిన బైబిలు సలహాలు ముఖ్యంగా తండ్రి ఏమిచేయాలో చెప్పినప్పటికీ వాటిలోని చాలా సూత్రాలు తల్లి కూడా పాటించవచ్చు.

^ పేరా 18 యెహోవాసాక్షుల ప్రచురణ.

^ పేరా 25 లైంగిక అత్యాచారాల నుండి మీ పిల్లలను కాపాడడంపై మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 2007, 3-11 పేజీలు చూడండి.

[21వ పేజీలోని చిత్రం]

తండ్రి తన పిల్లలకు మంచి మాదిరిని ఉంచాలి

[22వ పేజీలోని చిత్రం]

దేవునితో దగ్గరి సంబంధం ఏర్పర్చుకోవడానికి తండ్రి తన పిల్లలకు సహాయం చేయాలి

[23వ పేజీలోని చిత్రం]

పిల్లలకు ప్రేమపూర్వక క్రమశిక్షణ అవసరం