మన స్తుతికి అర్హుడైన సృష్టికర్త
దేవునికి దగ్గరవ్వండి
మన స్తుతికి అర్హుడైన సృష్టికర్త
‘జీవితానికి అర్థమేమిటి’ అని మీకెప్పుడైనా అనిపించిందా? జీవం అర్థంలేని పరిణామం ద్వారా వచ్చిందని నమ్మేవాళ్ళకు ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ దొరకదు. యెహోవా దేవుడే జీవానికి మూలమనే సుస్థిర సత్యాన్ని నమ్మేవాళ్ళ పరిస్థితి అలా ఉండదు. (కీర్తన 36:9) మనల్ని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడని వాళ్ళకు తెలుసు. ఆయన ఉద్దేశమేమిటో ప్రకటన 4:10, 11 చెబుతోంది. అపొస్తలుడైన యోహాను రాసిన ఈ మాటలు, మనమిక్కడ ఎందుకున్నామనేదాని గురించి ఏమి చెబుతున్నాయో పరిశీలిద్దాం.
“ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు [‘శక్తి,’ పరిశుద్ధ బైబల్ ఈజీ-టు-రీడ్ వర్షన్] పొందనర్హుడవు” అని ఎంతో ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతిస్తున్న పరలోక గుంపు గురించి యోహాను వివరించాడు. అలాంటి స్తుతిని పొందడానికి యెహోవా ఒక్కడే అర్హుడు, లేదా ఆయన మాత్రమే తగినవాడు. ఎందుకు? ఎందుకంటే ఆయనే ‘సమస్తాన్ని సృష్టించాడు.’ మరి ఆయన సృష్టించిన తెలివిగల ప్రాణులు ఏమి చేయడానికి పురికొల్పబడాలి?
మహిమ, ఘనత, శక్తి ‘పొందడానికి’ యెహోవా అర్హుడు. విశ్వమంతటిలో అందరికన్నా మహిమగలవాడు, గౌరవించదగినవాడు, శక్తిమంతుడు ఆయనే. ఈ సృష్టంతటినీ ఆయనే చేశాడని చాలామంది గుర్తించరు. అయినప్పటికీ ఆయన చేసిన వాటిని గమనించి ఆయన “అదృశ్యలక్షణములు” గుర్తించేవారు కూడా ఉన్నారు. (రోమీయులు 1:20) కృతజ్ఞత నిండిన హృదయాలతో వాళ్ళు యెహోవాకు మహిమ, ఘనత ఇవ్వడానికి కదిలించబడతారు. అన్నిటినీ అద్భుతంగా చేసింది యెహోవాయేనని, అందుకే ఆయన మన భక్తిపూర్వక గౌరవాన్ని పొందడానికి అర్హుడని నమ్మడానికి ఉన్న తిరుగులేని సాక్ష్యాధారాన్ని, వినేవాళ్ళందరికీ వాళ్ళు ప్రకటిస్తారు.—కీర్తన 19:1, 2; 139:14.
అయితే యెహోవా తన ఆరాధకుల నుండి శక్తిని ఎలా పొందుతాడు? నిజమే, సర్వశక్తిమంతుడైన సృష్టికర్తకు ఎవరూ శక్తిని ఇవ్వలేరు. (యెషయా 40:25, 26) అయినప్పటికీ దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనకు దేవుని లక్షణాలు కొంతమేరకు ఇవ్వబడ్డాయి, వాటిలో శక్తి ఒకటి. (ఆదికాండము 1:27) మన సృష్టికర్త మనకోసం చేసిన దానిపట్ల మనకు నిజంగా కృతజ్ఞత ఉంటే ఆయనకు ఘనత, మహిమ తీసుకురావడానికి మనం మన శక్తిని, బలాన్ని ఉపయోగిస్తాం. మన శక్తినంతటినీ మన సొంత ఆశలు నెరవేర్చుకోవడానికే ఉపయోగించేబదులు, మనం యెహోవా దేవుని సేవలో మన శక్తినంతటినీ వెచ్చించడానికి ఆయన అర్హుడని భావిస్తాం.—మార్కు 12:30.
అయితే మనమిక్కడ ఎందుకున్నాం? ప్రకటన 4:10, 11 ఇలా సమాధానమిస్తుంది, “నీ చిత్తమునుబట్టి అవి [సృష్టింపబడినవన్నీ] యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను.” మనం మన సొంతగా ఉనికిలోకి రాలేదు. దేవుడు సృష్టించినందుకే మనం ఉనికిలో ఉన్నాం. అందుకే మన సొంత ఆశలు తీర్చుకోవడానికే జీవించడం వ్యర్థం, అర్థరహితం. మనశ్శాంతిని, సంతోషాన్ని, సంతృప్తిని పొందాలంటే, మనం దేవుడు ఏమి కోరుతున్నాడో తెలుసుకొని దానికనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే, మనమెందుకు సృష్టించబడ్డామో, ఎందుకు ఉనికిలో ఉన్నామో తెలుసుకోగలుగుతాం.—కీర్తన 40:8. (w08 12/1)
[30వ పేజీలోని చిత్రసౌజన్యం]
NASA, ESA, and A. Nota (STScI)