కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

మీరెప్పుడైనా అసూయపడ్డారా?యోసేపు అన్నలు ఆయనపై అసూయపడ్డారు

మీరెప్పుడైనా అసూయపడ్డారా?యోసేపు అన్నలు ఆయనపై అసూయపడ్డారు

అసూయపడడం అంటే అసలేమిటో తెలుసుకుందాం. ఇతరులు ఎవరినైనా మంచివాడనో, అందగాడనో, తెలివైనవాడనో మెచ్చుకుంటే అతనిని ఇష్టపడడం మీకెప్పుడైనా కష్టమనిపించిందా? *​—⁠ మీరు అతనిపై అసూయపడుతుంటే మీకలాగే అనిపించవచ్చు.

తల్లిదండ్రులు పిల్లల్లో ఒకరికంటే మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తుంటే కుటుంబంలో అసూయ మొదలవుతుంది. అసూయవల్ల పెద్ద సమస్యను ఎదుర్కొన్న ఒక కుటుంబం గురించి బైబిలు చెబుతుంది. దానివల్ల వచ్చిన కష్టమేమిటో, దానినుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.

యాకోబు పన్నెండు మంది కొడుకుల్లో యోసేపు పదకొండవవాడు, యోసేపు అన్నలు ఆయనపై అసూయపడ్డారు. ఎందుకో మీకు తెలుసా?​—⁠ ఎందుకంటే వాళ్ళ తండ్రియైన యాకోబు మిగిలిన కొడుకులకంటే యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు. ఉదాహరణకు యాకోబు, యోసేపు కోసం అందమైన నిలువుటంగీ కుట్టించాడు. యాకోబు యోసేపును ఎందుకంతగా ప్రేమించాడంటే, యోసేపు ఆయనకు ‘వృద్ధాప్యంలో పుట్టాడు.’ అంతేకాదు యోసేపు, యాకోబు ఎంతో ప్రేమించిన తన భార్య రాహేలుకు మొదటి కొడుకు.

‘యోసేపు అన్నలు తమ తండ్రి యోసేపును తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించడం చూసి యోసేపుమీద పగపట్టారు’ అని బైబిలు చెబుతుంది. ఆ తర్వాత ఒకరోజు యోసేపు, తన తండ్రితో సహా తన కుటుంబంలోని వారందరూ తనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లుగా తనకు కల వచ్చిందని చెప్పాడు. అందుకు ‘అతని అన్నలు అతనిపై అసూయపడ్డారు’ అని బైబిలు చెబుతుంది, యోసేపు అలాంటి కల గురించి చెప్పినందుకు ఆయన తండ్రి కూడా ఆయనను గద్దించాడు.​—⁠ఆదికాండము 37:​1-11.

కొంతకాలం తర్వాత అంటే యోసేపుకు 17 సంవత్సరాలున్నప్పుడు, ఆయన అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరమ్మని యాకోబు యోసేపును పంపించాడు. ఆయన రావడం చూసి ఆయన అన్నల్లో ఎక్కువమంది ఆయనను ఏమి చేయాలనుకున్నారో మీకు తెలుసా?​—⁠వాళ్ళు ఆయనను చంపేయ్యాలనుకున్నారు! కానీ రూబేను, యూదా మాత్రం ఆయనను చంపకూడదనుకున్నారు.

కొంతమంది వర్తకులు ఆ దారిన ఐగుప్తుకు వెళ్ళడం చూసి, “వానిని అమ్మివేయుదము రండి” అని యూదా అన్నాడు. వాళ్ళు అనుకున్నట్లే అమ్మేశారు. ఆ తర్వాత వాళ్ళు ఒక మేకను చంపి దాని రక్తంలో యోసేపు అంగీని ముంచి దానిని తమ తండ్రికి చూపించినప్పుడు ఆయన ‘దుష్టమృగము వానిని తినివేసెను’ అని ఏడ్చాడు.​—⁠ఆదికాండము 37:​12-36.

కొంతకాలానికి, యోసేపు ఐగుప్తు పాలకుడైన ఫరో అభిమానాన్ని పొందాడు. ఎందుకంటే ఫరోకు వచ్చిన కలల్లో రెండింటికి ఆయన దేవుని సహాయంతో అర్థాన్ని చెప్పగలిగాడు. మొదటి కలలో, బలిసిన ఏడు ఆవుల్ని వాటి వెంటే వచ్చిన ఏడు చిక్కిన ఆవుల్ని చూశాడు. రెండవ కలలో, పుష్ఠిగల ఏడు మంచి వెన్నులను వాటి తర్వాత ఏడు పీల వెన్నులను చూశాడు. ఆ రెండు కలలకు అర్థం, ఏడు సంవత్సరాలపాటు పంటలు బాగా పండుతాయని ఆ తర్వాత ఏడు సంవత్సరాలపాటు కరవు వస్తుందని యోసేపు చెప్పాడు. కరవు కాలం వచ్చేసరికి సిద్ధంగా ఉండేలా పంటలు బాగా పండిన సంవత్సరాలలో ఆహారాన్ని సమకూర్చి భద్రం చేసే పనిని ఫరో యోసేపుకు అప్పగించాడు.

కరవు వచ్చినప్పుడు, ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంటున్న యోసేపు కుటుంబానికి ధాన్యం అవసరమైంది. ధాన్యం తీసుకురావడానికి యోసేపు 10 మంది అన్నలను యాకోబు పంపించాడు. వాళ్ళు యోసేపును చూసినప్పటికీ ఆయనను గుర్తుపట్టలేదు. యోసేపు తానెవరో తన అన్నలకు చెప్పకుండా వాళ్ళకు పరీక్ష పెట్టాడు, ఆయనకు అంత హాని చేసినందుకు వాళ్ళెంతో బాధపడుతున్నారని యోసేపు తెలుసుకున్నాడు. ఆ తర్వాత యోసేపు తానెవరో వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు మళ్ళీ కలుసుకున్నందుకు ఎంత సంబరపడివుంటారో కదా!​—⁠ఆదికాండము 40 నుండి 45 అధ్యాయాలు.

అసూయపడడం గురించి, ఈ బైబిలు కథ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?​—⁠అసూయ వలన పెద్ద కష్టమే రావచ్చు, ఒక్కోసారి సొంత సహోదరునికి కూడా హాని చేయడానికి నడిపించవచ్చు. అపొస్తలుల కార్యములు 5:​17, 18, అపొస్తలుల కార్యములు 7:​54-59 చదివి, ప్రజలు అసూయతో యేసు శిష్యులకు ఏమి చేశారో చూద్దాం.​​—⁠ ఇది చదివిన తర్వాత మనం అసూయపడకుండా ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలిసిందా?​—⁠

యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకు పిల్లలు పుట్టారు, మనుమలను, మునిమనుమలను కూడా చూశాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని, అసూయపడకూడదని యోసేపు తన పిల్లలకు ఖచ్చితంగా బోధించివుంటాడు.​—⁠ఆదికాండము 50:​22, 23, 26. (w08 10/1)

^ పేరా 3 మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని వాళ్ళను ప్రోత్సహించాలని గుర్తుంచుకోండి.