కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు

ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు

చుట్టూ వినిపిస్తున్న భీకరమైన శబ్దాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతే ఎంత బాగుణ్ణో అని యోనాకు అనిపించింది. బయట జోరుగా వీస్తున్న గాలుల తాకిడికి తెరచాపలు, వాటిని కట్టిన తాళ్ళు, తెరచాప స్తంభం భయంకరంగా ఊగిపోతున్నాయి. పెద్దపెద్ద అలలు ఉప్పెనలా పొంగుకొస్తున్నాయి. ఆ ధాటికి తట్టుకోలేక ఓడ కిర్రుకర్రుమంటూ శబ్దాలు చేస్తోంది. కానీ వీటన్నిటికన్నా ఓడలోనివాళ్లు భయంతో పెడుతున్న ఆర్తనాదాలే ఆయన్ని ఎక్కువగా భయపెట్టాయి. ఓడ సిబ్బంది, ప్రయాణికులూ భయంతో అరుస్తూ ఓడను కాపాడడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా తనవల్లే జరిగింది. తనవల్లే వాళ్లందరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని బాధపడుతున్నాడు.

యోనాకు ఇంతటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఆయన యెహోవా దేవుడు చెప్పినట్టు చేయకుండా ఒక పెద్ద తప్పు చేశాడు. ఇంతకీ ఆయన చేసిందేంటి? పరిస్థితి చేయిదాటిపోయిందా? వీటికి జవాబులు తెలుసుకుంటే మనం కూడా ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకు యోనా కథనుండి మనం, దేవునిపై నిజమైన విశ్వాసం చూపించేవారు కూడా కొన్నికొన్నిసార్లు తప్పులు చేస్తారని తెలుసుకుంటాం. అంతేకాదు, వాళ్ళు వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో కూడా నేర్చుకుంటాం.

గలిలయలో పుట్టిన ప్రవక్త

బైబిలు గురించి తెలిసినవాళ్లెవరికైనా, యోనా పేరు వినగానే సాధారణంగా ఆయనలోని లోపాలే అంటే ఆయన దేవుని మాట వినలేదనీ, మొండిగా ప్రవర్తించాడనీ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. యోహోవా దేవుడు యోనాను ఒక ప్రవక్తగా (దేవుని సందేశాలను తెలిపేవాడిగా) సేవచేయడానికి ఎన్నుకున్నాడన్న విషయం మీకు తెలుసా? ఆయన ఒకవేళ విశ్వాసం లేనివాడూ, అవినీతిపరుడూ అయితే యెహోవా అంత పెద్ద బాధ్యతను ఆయనకు అప్పగించేవాడే కాదు.

రెండవ రాజులు 14:25లో మనం యోనా గురించి కొంత తెలుసుకుంటాం. యోనా, 800 సంవత్సరాల తర్వాత యేసు పెరిగిన నజరేతు అనే పట్టణానికి 4 కి.మీ. దూరంలో ఉన్న గత్హేపెరు అనే ఊరిలో పుట్టాడు. * రెండవ యెరొబాము రాజు పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యోనా దేవుని ప్రవక్తగా పనిచేశాడు. అప్పటికి ఏలీయా చనిపోయి చాలా కాలమయ్యింది. ఆయన తర్వాతి ప్రవక్తయైన ఎలీషా కూడా యెరొబాము తండ్రి పరిపాలనలోనే చనిపోయాడు. యెహోవా వాళ్ళిద్దరినీ ఉపయోగించి బయలు ఆరాధనను రూపుమాపినా ఇశ్రాయేలీయులు మళ్లీ అదే తప్పు చేయడం మొదలుపెట్టారు. యోనా కాలం వచ్చేసరికి ఆ దేశాన్ని ‘యెహోవా దృష్టికి చెడ్డగా’ ప్రవర్తించే రాజు పరిపాలిస్తున్నాడు. (2 రాజులు 14:24) సంతోషం మాట అటుంచితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్తగా పనిచేయడం యోనాకు చాలా కష్టమైవుంటుంది. అయినా ఆయన తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు.

అనుకోకుండా ఒక రోజు యోనా జీవితం గొప్ప మలుపు తిరిగింది. యెహోవా ఆయనకు ఒక పనిని అప్పగించాడు. కానీ ఆయనకు అదెంతో కష్టంగా అనిపించింది. ఇంతకీ యెహోవా ఆయనకు ఏ పని అప్పగించాడు?

‘లేచి నీనెవెకు వెళ్లు’

యెహోవా యోనాతో, ‘నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది గనుక నువ్వు లేచి నీనెవె మహా పట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు’ అని చెప్పాడు. (యోనా 1:⁠2) ఆ పని ఆయనకు ఎందుకంత కష్టంగా అనిపించిందో మనం అర్థంచేసుకోవచ్చు. నీనెవె పట్టణం ఆయన ఊరికి పశ్చిమాన దాదాపు 800 కి.మీ. దూరంలో ఉంది. కాలినడకన వెళ్ళాలంటే దాదాపు నెలరోజులు పడుతుంది. అయితే, ఆయన చేయాల్సిన పనితో పోలిస్తే ఈ ప్రయాణంలో ఎదురయ్యే పాట్లు ఏమంత కష్టమైనవి కావు. ఆయన నీనెవెలో అష్షూరీయలకు దేవుని తీర్పు సందేశాన్ని ప్రకటించాల్సివుంది​—⁠వారేమో దౌర్జన్యానికి, క్రూరత్వానికి పేరుమోసినవారు. ఆ తర్వాత కొంతకాలానికి దానికి “నరహత్య చేసిన పట్టణం” అనే పేరు కూడా వచ్చింది. దేవుని స్వంత ప్రజలే యోనా మాటను పట్టించుకోనప్పుడు ఇక ఆ అన్యజనులేం వింటారు? ఒంటరివాడైన ఈ యెహోవా సేవకుడు నీనెవెలాంటి పట్టణంలో ఎలా మనగలడు?​—⁠నహూము 3:​1, 7.

యోనా కూడా అలాగే ఆలోచించివుంటాడా? మనకు తెలీదు. కానీ ఆయన పారిపోయాడనైతే మనకు తెలుసు. యెహోవా తూర్పుకు వెళ్లమంటే ఆయనేమో పశ్చిమానికి బయలుదేరాడు. అదీ వీలైనంత దూరం వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఆయన జొప్పా అనే రేవు పట్టణానికి వెళ్లి అక్కడ తర్షీషుకెళ్లే ఓడ ఎక్కాడు. తర్షీషు స్పెయిన్‌లో ఉండేదని కొందరు విద్వాంసులు అంటారు. అదే నిజమైతే యోనా నీనెవెకు 3,500 కి.మీ. దూరం వెళ్లిపోతున్నాడు. అప్పట్లో మధ్యధరా సముద్రాన్ని మహాసముద్రం అని పిలిచేవారు. ఆ సముద్రానికి అవతలి వైపున్న తర్షీషుకు ఓడలో వెళ్లడానికి కనీసం ఒక సంవత్సరం పట్టేది! యోనా సంవత్సరంపాటు ప్రయాణించడానికైనా సిద్ధపడ్డాడంటే యెహోవా అప్పగించిన పనిని తప్పించుకోవడానికి ఆయనెంత పట్టుదలతో ఉన్నాడో తెలుస్తోంది.

మరి యోనా పిరికివాడా? ఈ ఒక్క సంఘటనబట్టి ఆయన గురించి మనమా నిర్ణయానికి రాకూడదు. మనం చూడబోతున్నట్లు ఆయనెంతో ధైర్యాన్ని చూపించగల సమర్థుడు. అయితే, మనందరిలాగే ఆయనలో కూడా చాలా లోపాలున్నాయి. ఆయన కూడా అపరిపూర్ణుడే. (కీర్తన 51:⁠5) మనలో ఒక్కసారి కూడా భయపడనివారంటూ ఎవరైనా ఉన్నారా?

దేవుడు చెప్పింది చేయడం కొన్నిసార్లు మనకు కష్టంగా అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లయితే అసలు చేయలేం అనిపిస్తుంది. క్రైస్తవులుగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడం మన బాధ్యతే అయినా కొన్నిసార్లు దాన్ని చేయడానికి మనం భయపడతాం. (మత్తయి 24:14) కానీ ‘దేవునికి సమస్తం సాధ్యమే’ లేదా దేవుని సహాయంతో ఆయన చెప్పిన ఏ పనైనా మనం చేయగలం అని యేసు చెప్పిన తిరుగులేని నిజాన్ని మనం కొన్నిసార్లు మర్చిపోతుంటాం. (మార్కు 10:27) ఆ నిజాన్ని మర్చిపోయినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటే మనం యోనా పరిస్థితి అర్థంచేసుకోగలం. తప్పించుకుని పారిపోవాలనుకున్న యోనాకు ఏమి జరిగింది?

దారితప్పిన తన ప్రవక్తను యెహోవా సరిదిద్దాడు

ఇదంతా మీ కళ్ళముందు జరుగుతున్నట్లు ఊహించుకోండి. యోనా బహుశా సరుకులను తీసుకెళ్ళే ఫేనీకేయుల ఓడ ఎక్కి తన సామాను సర్దుకుని కూర్చున్నాడు. ఓడ సిబ్బంది హడావుడిగా అటూఇటూ తిరుగుతూ ఓడ బయలుదేరడానికి కావల్సిన పనులు చేయడం ఆయన గమనిస్తున్నాడు. ఓడ బయలుదేరి మెలమెల్లగా తీరానికి దూరమవుతోంది. హమ్మయ్య! గొప్ప ప్రమాదం తప్పించుకుని బయటపడ్డాను అని యోనా అనుకునివుంటాడు. కానీ, ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

కలలో కూడా ఊహించనంత భయంకరంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పుడున్న పెద్దపెద్ద నౌకల్ని కూడా ఇట్టే ముంచేసేంత పెద్ద కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. నడి సముద్రంలో విసిరికొడుతున్న గాలులు, ఎగసిపడుతున్న కెరటాల మధ్య ఆ ఓడ చిన్న బొమ్మలా కొట్టుకుపోతూ ఉంది. ఆ ధాటికి అది ఎంతసేపని తట్టుకుంటుంది? ఆ తర్వాత ఆయన తన పుస్తకంలో ‘యెహోవాయే సముద్రముమీద పెద్దగాలి పుట్టించాడు’ అని రాశాడు. కానీ ఓడలో ఉన్నప్పుడు ఆయనకు ఆ విషయం తెలుసా? ఏదీ చెప్పలేం. నావికులందరూ ఎవరి దేవుళ్ళకు వాళ్లు మొరపెట్టుకుంటున్నారు. వాళ్లకు ఎలాంటి సహాయం అందదని ఆయనకు తెలుసు. ‘ఓడ బద్దలైపోయే’ పరిస్థితి వచ్చింది అని ఆయన తన పుస్తకంలో రాశాడు. (యోనా 1:4; లేవీయకాండము 19:⁠4) మరి యోనా, ఏ దేవుని దగ్గరనుండైతే పారిపోతున్నాడో, ఆయన్నే సహాయం చేయమని ఎలా అడగ్గలడు?

వాళ్లకేమీ సహాయం చేయలేక యోనా ఓడ లోపలికి వెళ్లి పడుకోవడానికి ఒక చోటు వెతుక్కున్నాడు. అక్కడే గాఢనిద్రలోకి జారుకున్నాడు. * ఓడ సరంగు యోనాను లేపి మిగతావారిలాగే ఆయనను కూడా తన దేవునికి ప్రార్థించమని చెపుతాడు. ఈ తుఫాను వెనుక మానవాతీత శక్తి ఏదో ఉందని ఊహించి అసలు సమస్యకు కారణమెవరో తెలుసుకోవడానికి నావికులు చీట్లు వేస్తారు. ఒక్కొక్కరూ కాదని తేలిపోతుంటే యోనా గుండె నీరుగారిపోయింది. కొద్దిసేపట్లోనే వాళ్లకు విషయం అర్థమయ్యింది. తుఫాను సృష్టించింది యెహోవానే, చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చేలా చేసింది కూడా ఆయనే అని తేలిపోయింది.​—⁠యోనా 1:​5-7.

యోనా, నావికులకు విషయమంతా వివరించాడు. తాను సర్వశక్తిగల దేవుడైన యెహోవా సేవకుణ్ణనీ, ఆయన చెప్పిన పని చేయకుండా ఆయన్ని బాధపెట్టి పారిపోతున్నాననీ, అందుకే వాళ్లమీదకీ విపత్తు వచ్చిపడిందనీ చెప్పాడు. అది విని వారంతా నిర్ఘాంతపోయారు, యోనాకు వారి కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. తమ ఓడనూ, ప్రాణాల్నీ కాపాడుకోవాలంటే ఆయన్నేమి చేయాలని అడిగారు. దానికి ఆయన ఏమన్నాడు? అల్లకల్లోలంగా ఉన్న ఆ చల్లటి నీళ్ళలో మునిగిపోవడం ఎలా ఉంటుందో ఊహించుకుని యోనా ఒళ్లు జలదరించివుంటుంది. కానీ తాను వాళ్ళను రక్షించగలనని తెలిసి తెలిసీ వాళ్లనెలా నట్టేట ముంచగలడు? అందుకే ఆయన వారితో, ‘నన్నుబట్టే ఈ గొప్పతుపాను మీమీదికి వచ్చిందని నాకు తెలుసు; నన్ను ఎత్తి సముద్రములో పడేయండి, అప్పుడు సముద్రం మీమీదికి రాకుండా నిమ్మళిస్తుంది’ అని చెప్పాడు.​—⁠యోనా 1:⁠12.

యోనా నిజంగా పిరికివాడే అయితే అలా అనుండేవాడా? ఆ క్లిష్ట సమయంలో యోనా ధైర్యాన్ని, త్యాగాన్ని చూసి యెహోవా హృదయం ఆనందంతో నిండిపోయివుంటుంది. యోనాకు ఎంత బలమైన విశ్వాసం ఉందో ఇక్కడే అర్థమౌతోంది. మన అవసరాలను పక్కనబెట్టి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసి మనం ఆయనలాంటి విశ్వాసాన్నే చూపించవచ్చు. (యోహాను 13:​34, 35) శారీరకంగా బాధపడేవారిని, మానసికంగా కృంగిపోయినవారిని, దేవుని గురించి తెలుసుకోవాలని కోరుకునేవారిని కలిస్తే వారికి సాయం చేయడానికి మనం శాయశక్తులా ప్రయత్నిస్తామా? అలా చేస్తే యెహోవా ఎంత ఆనందిస్తాడో కదా!

ఆయన త్యాగం ఓడలోని వాళ్ళను కూడా ఎంతో కదిలించింది, అందుకే మొదట్లో వాళ్ళు ఆయన చెప్పింది చేయడానికి ఒప్పుకోలేదు. తుఫాను నుండి బయటపడడానికి వారు చేయగలిగినదంతా చేశారు, కానీ ఫలితం లేకపోయింది. పరిస్థితి అంతకంతకూ విషమిస్తోంది! చివరకు గత్యంతరం లేక, యోనా దేవుడైన యెహోవా తమపై కరుణ చూపించాలని ప్రార్థిస్తూ ఆయనను ఎత్తి సముద్రంలో పడేశారు.​—⁠యోనా 1:​13-15.

దేవుడు యోనాను కరుణించి రక్షించాడు

అంతెత్తునుండి యోనా ఎగసిపడుతున్న నీళ్లలో పడ్డాడు. పైకి తేలడానికి నీళ్లలో గిలగిలా కొట్టుకుంటూ, ఓడ తనకు దూరంగా వెళ్లిపోవడం చూశాడు. కానీ అలలు విజృంభించి ఆయన్ని ముంచేశాయి. యోనా మునిగిపోతూ ఇక అంతా అయిపోయింది అనుకున్నాడు.

అప్పుడు తనకెలా అనిపించిందో యోనా ఆ తర్వాత రాశాడు. ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. యెహోవా కోసం యెరూషలేములో కట్టిన అందమైన దేవాలయాన్ని తానిక ఎప్పటికీ చూడలేనని కుమిలిపోతున్నాడు. సముద్ర గర్భంలోకి దిగిపోతున్నట్టూ, కొండల పునాదుల దగ్గరకు చేరుతున్నట్టూ, సముద్రపు నాచు తనను చుట్టేస్తున్నట్లూ ఆయనకు తెలుస్తోంది. ఇక సముద్రమే తన సమాధి అవుతుందని ఆయనకనిపిస్తోంది.​—⁠యోనా 2:​2-6.

కానీ అక్కడేదో కదులుతున్నట్లుంది! ఏదో నల్లని అస్పష్టమైన ఆకారం తనవైపే వస్తోంది! అదొక్కసారిగా ఆయనమీదికి దూసుకువచ్చి, పెద్దగా నోరు తెరిచి ఆయన్ని అమాంతం మింగేసింది.

ఇహ తన పనైపోయింది అనుకున్నాడు. కానీ ఆశ్చర్యం! తనింకా బతికే ఉన్నాడు! తాను నలిగిపోలేదు, తనకేం అవ్వలేదు. సమాధి కావాల్సిన చేప కడుపులో తనకింకా ఊపిరాడుతూనే ఉంది. తన గుండె ఇంకా కొట్టుకుంటోంది! యోనా జరుగుతున్నదాన్ని నమ్మలేకపోతున్నాడు. ‘గొప్ప మత్స్యం ఒకటి యోనాను మ్రింగేసేలా’ చేసింది తన దేవుడైన యెహోవాయే. అందులో సందేహమే లేదు. *​—⁠యోనా 1:⁠17.

నిమిషాలు, గంటలు అలా గడుస్తున్నాయి. కనీవినీ ఎరుగని ఆ కటిక చీకటిలో యోనా బాగా ఆలోచించి యెహోవా దేవునికి ప్రార్థించాడు. పూర్తి ప్రార్థనను తన పుస్తకంలోని రెండవ అధ్యాయంలో రాసిపెట్టాడు. దాన్ని చదివినప్పుడు మనకెన్నో విషయాలు తెలుస్తాయి. తన ప్రార్థనలో కీర్తనల పుస్తకం నుండి ఎన్నో లేఖనాలను గుర్తుచేసుకున్నాడు కాబట్టి ఆయనకు లేఖనాలు బాగా తెలుసని అర్థమౌతోంది. అంతేకాదు, యోనా తన ప్రార్థన చివరలో ‘కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకొన్న మొక్కుబళ్ళు చెల్లించక మానను. యెహోవాయొద్దే రక్షణ దొరుకుతుంది’ అని అన్నాడు. దీన్నిబట్టి ఆయనకో చక్కని లక్షణం ఉందని తెలుస్తోంది​—⁠అదే కృతజ్ఞత.​—⁠యోనా 2:⁠9.

యెహోవా దేవుడు ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా రక్షించగల సమర్థుడని యోనా తెలుసుకున్నాడు. బాధపడుతున్న తన సేవకుణ్ణి “మత్స్యము కడుపులో” నుండి కూడా యెహోవా రక్షించాడు. మూడు రోజులు ఓ పెద్ద చేప కడుపులో ఒక వ్యక్తిని చనిపోకుండా సురక్షితంగా ఉంచడం యెహోవాకు మాత్రమే సాధ్యం. ‘మన ప్రాణం’ యెహోవా ‘వశంలో’ ఉందని గుర్తుంచుకోవడం మంచిది. (దానియేలు 5:​22, 23) మనం శ్వాస తీసుకుంటున్నాం, జీవిస్తున్నామంటే అదంతా ఆయన చలవే. మరి మనమాయనకు రుణపడి ఉన్నామా? అలాగైతే, మనం యెహోవా చెప్పింది చేయాలి కదా?

మరి యోనా ఏంచేశాడు? యెహోవా చెప్పింది చేసి తనకు ఆయనపట్ల కృతజ్ఞత ఉందని చూపించడం నేర్చుకున్నాడా? అవును నేర్చుకున్నాడు. మూడు రోజుల తర్వాత చేప ఒడ్డుకు వచ్చి ‘యోనాను నేలమీద కక్కివేసింది.’ (యోనా 2:10) ఒక్కసారి ఆలోచించండి, యోనాకు ఈత కొట్టాల్సిన అవసరం కూడా రాలేదు! అయితే సముద్రతీరం నుండి మాత్రం ఆయనే స్వయంగా దారి కనుక్కోవాలి. కానీ ఎంతో సమయం గడవకముందే తనకు నిజంగా కృతజ్ఞత ఉందో లేదో చూపించే అవకాశం ఆయనకు దొరికింది. ‘యెహోవా రెండవ మారు యోనాతో,’ ‘నీవు లేచి నీనెవె మహాపురానికి పోయి నేను నీకు తెలియజేసే సమాచారాన్ని దానికి ప్రకటించు’ అని చెప్పాడని యోనా 3:​1, 2లో రాసివుంది. యోనా ఇప్పుడు ఏమి చేస్తాడు?

యోనా మరో ఆలోచనలేకుండా, ‘లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారం నీనెవె పట్టణానికి పోయాడు.’ (యోనా 3:⁠3) అవును, యోనా దేవుడు చెప్పిందే చేశాడు. తను చేసిన తప్పుల నుండి ఆయన నేర్చుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో కూడా మనం యోనాలాంటి విశ్వాసాన్నే చూపించాలి. మనమందరం పాపులమే, మనమూ తప్పులు చేస్తుంటాం. (రోమీయులు 3:23) తప్పులు చేసినప్పుడు మనం వాటినుండి నేర్చుకుని దేవునికి మళ్ళీ విధేయత చూపిస్తామా లేక దేవుని సేవ చేయడం ఇక మనవల్ల కాదని చేతులెత్తేస్తామా?

యోనా విధేయత చూపించినందుకు యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడా? అవును ఆశీర్వదించాడు. ఒక ఆశీర్వాదం ఏమిటంటే, తనతో ప్రయాణించినవారు బ్రతికి బయటపడ్డారని ఆయనకు ఆ తర్వాత తెలిసుంటుంది. ఓడలో ఉన్నవాళ్ళను కాపాడడానికి యోనా ప్రాణానికి తెగించిన వెంటనే తుఫాను నిమ్మళించింది. అదిచూసి వాళ్ళు తమ అబద్ధ దేవుళ్ళకు కాకుండా యెహోవాకు బలులు అర్పించారు.​—⁠యోనా 1:​15, 16.

చాలాకాలం తర్వాత యోనా ఇంకా గొప్ప ఆశీర్వదాన్ని పొందాడు. అదేంటంటే, యేసుక్రీస్తుకు జరగబోయేదాన్ని యోనా జీవితంలోని సంఘటన ముందే చూపించింది. యోనా పెద్దచేప కడుపులో ఉన్నట్టే తాను కూడా షియోల్‌లో అంటే సమాధిలో ఉంటానని యేసు చెప్పాడు. (మత్తయి 12:​38-40) యోనాను దేవుడు మళ్ళీ బ్రతికించినప్పుడు ఆ విషయం తెలుసుకుని ఆయనెంత పులకించిపోతాడో ఊహించుకోండి! (యోహాను 5:​28, 29) యెహోవా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. యోనాలాగే మీరు కూడా మీ తప్పుల నుండి నేర్చుకుని దేవుడు చెప్పింది చేస్తూ, నిస్వార్థంగా జీవిస్తారా? (w09 1/1)

[అధస్సూచీలు]

^ పేరా 7 యోనా గలిలయ పట్టణంలో పుట్టడం ఆసక్తికరం ఎందుకంటే పరిసయ్యులు యేసు గురించి పొగరుగా మాట్లాడుతూ, ‘విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్తా పుట్టడు’ అని అన్నారు. (యోహాను 7:52) చిన్న పట్టణమైన గలిలయలో ఏ ప్రవక్తా పుట్టలేదు, పుట్టబోడు అని పరిసయ్యులు తీసిపడేశారని చాలామంది అనువాదకులు, పరిశోధకులు అంటున్నారు. అదే నిజమైతే వారు చరిత్రనే కాదు బైబిల్లోని ప్రవచనాలను కూడా నిర్లక్ష్యం చేసినవారౌతారు.​—⁠యెషయా 9:​1, 2.

^ పేరా 17 యోనా బాగా నిద్రపోయాడని చెప్పడానికి ప్రాచీన గ్రీకు సెప్టాజింట్‌ ప్రతుల్లో ఆయన గురక పెట్టాడు అని రాసివుంది. అయితే, ఎవరికేమైనా ఫర్వాలేదు అనుకుని యోనా నిద్రపోయాడని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దుఃఖంతో గుండె బరువెక్కినవాళ్లకి బాగా నిద్రపోవాలనిపిస్తుందనే విషయం మనం మరచిపోకూడదు. గెత్సేమనే తోటలో యేసు వేదనపడుతున్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను ‘దుఃఖం చేత నిద్రించారు.’​—⁠లూకా 22:⁠45.

^ పేరా 25 ‘గొప్ప మత్స్యము’ అనే పదం గ్రీకులో “పెద్ద సముద్ర జీవి” లేదా “పెద్ద చేప” అని అనువదించబడింది. అది ఖచ్చితంగా ఏ చేపో చెప్పడానికి ఆధారాలేం లేవు, అయితే మధ్యధరా సముద్రంలో మనిషిని మింగేసేంత పెద్ద షార్క్‌ చేపలను (ఒక జాతి సొరచేప) కనుగొన్నారు. వేరే సముద్రాల్లో ఇంకా పెద్దపెద్ద షార్క్‌లే ఉన్నాయి. వేల్‌షార్క్‌ అనే చేప దాదాపు 15 మీటర్లు, కొన్నిసార్లు అంతకన్నా పొడవు పెరుగుతుంది.

[31వ పేజీలోని బాక్సు/చిత్రం]

యోనా పుస్తకం విమర్శల్ని ఎదుర్కొంది

▪ యోనా పుస్తకంలోని సంఘటనలు నిజంగా జరిగాయా? పూర్వకాలం నుండే దీన్ని చాలామంది విమర్శిస్తూ వచ్చారు. ఇక మన కాలంలోని బైబిలు విమర్శకులైతే దీన్ని కట్టుకథని, పురాణగాథని, పుక్కిటిపురాణమని, అభూత కల్పనలతో నిండిన పుస్తకమని కొట్టిపారేస్తారు. యోనా, పెద్ద చేప కథకు వేరే విచిత్రమైన అర్థముందని ఓ చర్చీ బోధకుడు వివరించాడు. ఆయనేమి వివరించాడో 19వ శతాబ్దానికి చెందిన ఒక రచయిత ఇలా రాశాడు: ‘అసలు జరిగింది ఏంటంటే, యోనా జొప్పాలో ‘తిమింగలం’ అనే పేరుగల ఒక హోటల్‌లో ఉన్నాడు. అక్కడ చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో హోటల్‌ యజమాని ఆయనను బయటకు గెంటేశాడు. ఆ విషయాన్నే యోనా తన పుస్తకంలో హోటల్లో ఉండడాన్ని తిమింగలం ‘లోపలకి వెళ్ళడం’ అనీ, యజమాని తనను గెంటేయడాన్ని బయటకి ‘కక్కేయడం’ అనీ రాశాడు.’ ఇలాంటివి విన్నప్పుడు, ఆ పెద్ద చేపకన్నా ఎక్కువగా ఈ బైబిలు విమర్శకులే యోనాను మింగేయాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది.

అసలు ఈ బైబిలు పుస్తకాన్ని ఇంతమంది ఎందుకు విమర్శించారు? ఎందుకంటే అది అద్భుతాలను వివరిస్తోంది. చాలామంది విమర్శకులు అలాంటి అద్భుతాలు జరగడం అసాధ్యమనే దృష్టితోనే బైబిలును చదువుతున్నారనిపిస్తోంది. అయితే వాళ్ళలా ఆలోచించడం సరైనదేనా? అది తెలుసుకునే ముందు ఈ విషయం ఆలోచించండి. ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృజించాడు’ అనే ‘మొదటి బైబిలు వచనాన్ని నేను నమ్ముతున్నానా?’ అని ప్రశ్నించుకోండి. (ఆదికాండము 1:⁠1) వివేచనవున్న లక్షలాదిమంది సహేతుకంగా ఆలోచించి ఈ నిజాన్ని ఒప్పుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే, ఈ ఒక్క వాక్యంలోనే ఎన్నో అద్భుతాల ప్రస్తావన ఉంది. అలాంటి అద్భుతమైన దేవుని సృష్టిముందు బైబిల్లోని ఏ అద్భుతమైనా చిన్నదే అవుతుంది.

ఉదాహరణకు దీనిగురించి ఆలోచించండి: మిరుమిట్లుగొలిపే నక్షత్రాలతో నిండిన విశాలమైన ఆకాశాన్నీ, భూమిపై అబ్బురపరిచే సమస్త జీవకోటినీ సృష్టించిన దేవునికి యోనా పుస్తకంలోని అద్భుతాలను చేయడం పెద్ద కష్టమా? ఆయన తుఫాను రప్పించలేడా? పెద్ద చేప మనిషిని మింగేలా చేయలేడా? అదే చేప అతన్ని తిరిగి కక్కేలా చేయలేడా? అపారమైన శక్తివున్న దేవునికి అలాంటి పనులు చేయడం పెద్ద లెక్కేం కాదు.​—⁠యెషయా 40:⁠26.

దేవుని ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఉదాహరణకు, 1758లో ఒక వింత జరిగిందని చెప్పుకుంటారు. ఒక నావికుడు ప్రమాదవశాత్తు ఓడలోనుండి మధ్యధరా సముద్రంలో పడిపోతే ఒక షార్క్‌ చేప అతన్ని మింగేసిందట. అయితే ఫిరంగితో కాల్చగానే ఆ చేప ఆ నావికుణ్ణి బయటకు కక్కేసిందట. అతను కొద్దిపాటి గాయాలతో క్షేమంగా బయటపడ్డాడట. ఒకవేళ ఈ సంఘటన నిజంగా జరిగివుంటే, దాన్ని మనం ఆశ్చర్యం అనో విచిత్రం అనో అంటాం కానీ అద్భుతం అని మాత్రం అనము. మరి దేవుడు తన శక్తితో అంతకన్నా గొప్ప పనులు చేయలేడా?

ఒక మనిషి మూడు రోజులపాటు చేప కడుపులో ఉంటే ఊపిరాడక ఖచ్చితంగా చచ్చిపోతాడని సంశయవాదులు అంటారు. మనిషికి ఎంత తెలివి ఉందంటే, చాలాసేపు నీటి అడుగున శ్వాస తీసుకోవడం కోసం చిన్న సిలిండర్‌లో గాలిని పట్టించి ఎలా తీసుకువెళ్ళాలో కనిపెట్టాడు. మరైతే దేవుడు తన అంతులేని శక్తితో, అనంతమైన జ్ఞానంతో యోనాకు మూడు రోజులపాటు చేప కడుపులో ఊపిరాడేలా చేయలేడా? యేసుకు జన్మనిచ్చిన మరియతో యెహోవా దూత ఒక సందర్భంలో, ‘దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు’ అని చెప్పాడు.​—⁠లూకా 1:​37, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యోనా పుస్తకంలోని సంఘటనలు నిజంగా జరిగాయని చెప్పడానికి ఇంకా ఏ రుజువులున్నాయి? యోనా ఓడ గురించి, దానిలోని సిబ్బంది గురించి సరిగ్గా, సవివరంగా రాశాడు. ఉదాహరణకు యోనా 1:5లో నావికులు, ఓడను తేలికచేయడానికి దానిలోని సరుకులను సముద్రంలో పడేశారని చదువుతాం. ప్రయాణాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురైతే ఆ రోజుల్లో సాధారణంగా అలాగే చేసేవారని పూర్వకాల చరిత్రకారులే కాదు, యూదా శాస్త్రం కూడా చెబుతోంది. యోనా ఆ తర్వాత నీనెవె పట్టణం గురించి రాసిన వివరాలు కూడా చరిత్ర, పురావస్తు శాస్త్రం చెప్పేవాటితో సరిగ్గా సరిపోతున్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా, యోనా గురించి స్వయాన యేసుక్రీస్తే చెప్పాడు. యోనా మూడు రోజులపాటు పెద్ద చేప కడుపులో ఉన్నట్లే తాను కూడా సమాధిలో మూడు రోజులు ఉంటాననడానికి ఆ సంఘటన ముంగుర్తు అని ఆయన చెప్పాడు. (మత్తయి 12:​38-40) యేసుక్రీస్తే ఆయన గురించి మాట్లాడాడు కాబట్టి ఈ యోనా రాసింది అక్షరాలా నిజం. (w09 1/1)

‘దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.’​—⁠లూకా 1:​37, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌