కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చనిపోయినవాళ్లంటే మీకు భయమా?

చనిపోయినవాళ్లంటే మీకు భయమా?

చనిపోయినవాళ్లంటే మీకు భయమా?

అలా అడగ్గానే చాలామంది “అసలు నేనెందుకు భయపడాలి?” అంటారు. చనిపోయినవాళ్ళు ఇక ఏమీ చేయలేరని వారి నమ్మకం. అయితే, లక్షలాదిమంది ఇతరులు చనిపోయినవారు ఆత్మలౌతారని నమ్ముతారు.

మన దేశంలోనే కాదు పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌ దేశంలో చాలామంది అదే నమ్ముతారు. కానీ, చనిపోయినవాళ్లు ఆత్మలై తమ కుటుంబ సభ్యులనే చంపడానికి తిరిగొస్తారని అక్కడివాళ్ళు నమ్ముతారు. చనిపోయిన బంధువుల ఆత్మశాంతి కోసం కొందరు ఆస్థిపాస్తులు అమ్మి, ఇంకా అవసరమైతే అప్పులుచేసి మరీ జంతువులను బలిస్తారు, శాంతికర్మలు చేయిస్తారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనిలోని ఆత్మ బయటికి వెళ్లిపోతుందనీ, ఆ ఆత్మ బ్రతికున్నవాళ్లతో మాట్లాడగలదనీ కొందరు ఆత్మలను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. కొందరి జీవితాల్లో భయంకరమైన సంఘటనలేవైనా జరిగినప్పుడు ఆత్మలే తమల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని వారునుకుంటారు.

అలాంటిదే ఒక సంఘటన, బెనిన్‌-నైజీరియా సరిహద్దు ప్రాంతంలో ఉంటున్న అగ్బూలా జీవితంలో జరిగింది. ఏమి జరిగిందో ఆయన మాటల్లోనే వినండి: “మా ప్రాంతంలోని ప్రజలు చనిపోయినవాళ్ల ఆత్మలను సంప్రదించడానికి రకరకాల క్షుద్రవిద్యలను పాటిస్తారు. చనిపోయినవారి ఆత్మలు ఆత్మసామ్రాజ్యంలోకి వెళ్లేలా వారి మృతదేహాలకు ఆచారబద్ధంగా స్నానం చేయించడం ఓ ఆనవాయితీ. నేను సాధారణంగా అక్కడ మిగిలిపోయిన సబ్బు బిళ్ళను తీసుకొచ్చి కొన్నిరకాల ఆకులతో కలిపి ఓ మిశ్రమాన్ని తయారుచేసేవాణ్ణి. వేటకు తీసుకెళ్లే తుపాకీకి దాన్ని పూస్తూ ఎలాంటి జంతువును వేటాడాలనుకుంటున్నానో గట్టిగా చెప్పేవాణ్ణి. మా దగ్గర అదొక అలవాటు. ఆ పద్ధతి నిజంగానే పనిచేస్తున్నట్లు అనిపించేది. అయితే, అలాంటి ఆచారాలు పాటించాలంటే చాలా భయమేసేది.”

“ఉన్నట్టుండి మా అబ్బాయిల్లో ఇద్దరు చనిపోయారు. వాళ్లెందుకు చనిపోయారో మాకేమీ అర్థంకాక మామీద ఎవరైనా చేతబడి చేసుంటారని అనుమానం కలిగింది. అది తేల్చుకోవడానికే పేరుమోసిన ఒక ముసలి భూతవైద్యుని దగ్గరకెళ్లాను. నా అనుమానం నిజమేనని అతను చెప్పాడు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, మా పిల్లలమీద చేతబడి చేసిన వ్యక్తి చనిపోయేంతవరకు వాళ్లు ఆత్మ లోకంలోనే ఉంటారనీ, ఆ తర్వాత అతని ఆత్మకు దాసులవుతారనీ చెప్పాడు. మా మూడో అబ్బాయికి కూడా అలాగే జరుగుతుందని చెప్పాడు. కొన్ని రోజుల్లోనే మా మూడో బాబు కూడా చనిపోయాడు.”

ఆ తర్వాత అగ్బూలాకు జాన్‌ పరిచయమయ్యాడు. ఆయనొక యెహోవాసాక్షి. ఆయన పొరుగు దేశమైన నైజీరియాలో ఉంటాడు. ఆయన చనిపోయినవారికి ఏమౌతుందో బైబిల్లోని లేఖనాలు చూపించి వివరించాడు. బైబిలు చెప్పిన విషయాలు అగ్బూలా జీవితాన్నే మార్చేశాయి. అవి మీ జీవితాన్ని కూడా మార్చగలవు.

చనిపోయినవారికి ఏమవుతుంది?

మీకేమనిపిస్తుంది? దీనికి సరైన జవాబు ఎవరు చెప్పగలరు? ఏ మనిషీ చెప్పలేడు. చివరకు ఎంతో పేరుమోసిన మాంత్రికులు కూడా చెప్పలేరు. కానీ, ‘ఆకాశమందున్న, భూమియందున్న దృశ్యమైన, అదృశ్యమైన’ ప్రాణులన్నిటినీ సృష్టించిన యెహోవా మాత్రమే దీనికి జవాబు చెప్పగలడు. (కొలొస్సయులు 1:16) ఆయన దేవదూతలను పరలోకంలో ఉండడానికి చేశాడు. మనుష్యులనూ, జంతువులనూ భూమ్మీద ఉండడానికి చేశాడు. (కీర్తన 104:​4, 23, 24) సమస్త ప్రాణకోటికి జీవం అనుగ్రహించేది ఆయనే. (ప్రకటన 4:​10, 11) కాబట్టి, దేవుడు తన వాక్యమైన బైబిల్లో మరణం గురించి ఏమి చెబుతున్నాడో చూడండి.

యెహోవాయే మొట్టమొదటిసారిగా చనిపోవడం గురించి మాట్లాడాడు. ఆదాము హవ్వలు తనిచ్చిన ఆజ్ఞను మీరితే వాళ్ళు చనిపోతారని హెచ్చరించాడు. (ఆదికాండము 2:17) ఆయన అన్న మాటలకు అర్థమేమిటి? యెహోవా ఆ విషయాన్నే వివరిస్తూ, ‘నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు’ అని చెప్పాడు. (ఆదికాండము 3:19) మనిషి చనిపోయినప్పుడు అతని శరీరం మట్టిలో కలిసిపోతుంది. అంతటితో ఒక వ్యక్తి జీవితం ముగుస్తుంది.

ఆదాము హవ్వలు కావాలనే దేవుని మాట మీరారు, అందుకే వారికి మరణశిక్ష పడింది. అయితే, అందరికన్నా ముందు చనిపోయింది వాళ్ళు కాదు, వాళ్ళ కొడుకు హేబెలు. వాళ్ల అన్న కయీను అతన్ని చంపేశాడు. (ఆదికాండము 4:⁠8) చనిపోయిన తమ్ముడు తన మీద పగతీర్చుకుంటాడని కయీను భయపడలేదు కానీ, బ్రతికున్న మనుష్యులు తననేమైనా చేస్తారేమోనని భయపడ్డాడు.​—⁠ఆదికాండము 4:​10-16.

ఎన్నో వందల సంవత్సరాల తర్వాత, హేరోదు రాజు దగ్గరకు జ్యోతిష్కుల్లొచ్చి అతని రాజ్యంలో “యూదుల రాజు” పూట్టాడని చెప్పినప్పుడు, తన స్థానాన్ని అతనెక్కడ ఆక్రమించుకుంటాడో అని హేరోదు భయపడ్డాడు. ఎలాగైనా ఆ శిశువును చంపాలనే దురుద్దేశంతో హేరోదు, బేత్లెహేములో రెండేళ్ళలోపున్న మగ శిశువుల్ని చంపేయాలని కుట్రపన్నాడు. అయితే, యేసును, మరియను తీసుకుని ‘ఐగుప్తుకు పారిపొమ్మని’ ఒక దేవదూత యోసేపుతో చెప్పాడు.​—⁠మత్తయి 2:​1-16.

హేరోదు చనిపోయిన తర్వాత దేవదూత యోసేపుతో, ఆ ‘శిశువు ప్రాణము తీయాలని చూస్తున్ననవారు చనిపోయారు’ కాబట్టి తిరిగి ఇశ్రాయేలు దేశానికి వెళ్లమని చెప్పాడు. (మత్తయి 2:​19-21) హేరోదు ఇక యేసును ఏమీ చేయలేడని స్వయాన ఒక ఆత్మప్రాణి అయిన దేవదూతకు తెలుసు. చనిపోయిన హేరోదు రాజు ఏదైనా చేస్తాడేమోనని యోసేపు భయపడలేదు. అయితే యోసేపు, బ్రతికివున్న హేరోదు కుమారుడు అర్కెలాయుకు మాత్రం భయపడ్డాడు. ఎందుకంటే అతనొక నిరంకుశ పాలకుడు. అందుకే యోసేపు తన కుటుంబాన్ని తీసుకుని అర్కెలాయు రాజ్యం నుండి బయటకు వెళ్లిపోయి గలిలయలో స్థిరపడ్డాడు.​—⁠మత్తయి 2:⁠22.

ఈ ఉదాహరణలనుబట్టి చనిపోయినవారు ఏమీ చేయలేరని స్పష్టంగా అర్థమౌతోంది. మరి అగ్బూలా జీవితంలోగానీ, ఇతరుల జీవితాల్లోగానీ అలాంటి వింత సంఘటనలు జరగడానికి కారణమేమిటి?

“దయ్యాలు” లేక అపవిత్రాత్మలు

పెద్దయ్యాక యేసు దుష్టాత్మలు పట్టిన వ్యక్తులతో మాట్లాడాడు. వాటికి ఆయనెవరో తెలుసు కాబట్టి అవి ఆయన్ని “దేవుని కుమారుడు” అని పిలిచాయి. యేసుకు కూడా అవి తెలుసు. అవి చనిపోయినవాళ్ల ఆత్మలు కావు. యేసు వాటిని “దయ్యములు” లేక అపవిత్రాత్మలు అని పిలిచాడు.​—⁠మత్తయి 8:​29-31; 10:8; మార్కు 5:⁠8.

బైబిలు, దేవునికి నమ్మకంగా ఉన్న ఆత్మప్రాణుల గురించి, ఆయనకు ఎదురుతిరిగిన ఆత్మప్రాణుల గురించి ప్రస్తావిస్తోంది. దేవుడు ఆదాముహవ్వలను ఏదెను తోట నుండి పంపించేసినప్పుడు దానిలోకి ఎవరూ వెళ్లకుండా తోటకు తూర్పు వైపున కెరూబులనే దేవదూతలను కాపలా ఉంచాడని బైబిల్లోని ఆదికాండము పుస్తకం చెబుతోంది. (ఆదికాండము 3:24) మనుష్యులు ఆత్మప్రాణులను చూడడం బహుశా అదే మొదటిసారి అయ్యుంటుంది.

కొంతకాలం తర్వాత చాలామంది దేవదూతలు భూమ్మీదకు వచ్చి మానవ రూపం దాల్చారు. అయితే వాళ్ళు యెహోవా చెప్పిన పనిమీద రాలేదు. వాళ్లే తాముండాల్సిన పరలోక ‘నివాసస్థలాన్ని విడిచి,’ స్త్రీలను పెళ్లి చేసుకోవాలనే స్వార్థంతో వచ్చారు. (యూదా 6) అలా పెళ్ళిళ్లు చేసుకుని నెఫీలులు అనే సంకర జాతి పిల్లల్ని కన్నారు. నెఫీలులూ, దేవునిపై తిరగబడ్డ వాళ్ల తండ్రులూ భూమిని దౌర్జన్యంతో, చెడ్డ పనులతో నింపేశారు. (ఆదికాండము 6:​1-5) యెహోవా దేవుడు నోవహు కాలంలో భూవ్యాప్తంగా జలప్రళయం రప్పించి భూమిపై పరిస్థితులను సరిదిద్దాడు. దాంతో దుష్టులైన స్త్రీపురుషులు, ఆ సంకరజాతి మనుష్యులందరూ నాశనమయ్యారు. మరి పరలోకం నుండి వచ్చిన దేవదూతలేమయ్యారు?

జలప్రళయం వచ్చినప్పుడు గత్యంతరంలేక పరలోకానికి తిరిగివెళ్లారు. అయితే యెహోవా, అంతకుముందు వారికున్న “ప్రధానత్వమును” అంటే మునుపటి స్థానాన్ని వారికి తిరిగి ఇవ్వలేదు. (యూదా 6) ‘దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా, పాతాళలోకంలోని కటిక చీకటిగల బిలములలోనికి [“టార్టరస్‌లోకి,” NW] తోసి, తీర్పుకు కావలిలో ఉంచడానికి వారిని అప్పగించాడు’ అని బైబిలు చెబుతోంది.​—⁠2 పేతురు 2:⁠4.

టార్టరస్‌ అంటే ఒక ప్రత్యేకమైన స్థలం కాదుగానీ అది పరలోకం నుండి వెలివేయబడిన ఈ దుష్టాత్మలు, ముందు చేసినంత ఎక్కువగా పనిచేయలేని అవమానకరమైన ఖైదులాంటి స్థితి. ఇప్పుడు దయ్యాలు మానవరూపం దాల్చలేరు. అయినా ఇప్పటికీ వాళ్ళకెంతో శక్తివుంది. మన మనసుల్ని, జీవితాల్ని ప్రభావితం చేయగలరు. మనుష్యులను, జంతవులను పట్టిపీడించగలరు. (మత్తయి 12:​43-45; లూకా 8:​27-33) కొన్నిసార్లు చనిపోయినవారి ఆత్మల్లా నటిస్తూ మనుష్యుల్ని మోసం చేస్తారు. ఎందుకు? మనం యెహోవాను ఆయనకు నచ్చేలా ఆరాధించకుండా ఆపడానికీ, చనిపోయినవారికి అసలు ఏమవుతుందో మనకు తెలీకుండా ఉండడానికే అలా చేస్తారు.

భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి?

మరణం గురించీ, ఆత్మలు ఎవరన్న దానిగురించీ బైబిలు చెప్పేది ఎంతో సమంజసంగా ఉందని అగ్బూలాకు అనిపించింది. తానింకా ఎక్కువ నేర్చుకోవాలని ఆయనకు అర్థమైంది. ఆయన జాన్‌తోపాటు బైబిలును, సంబంధిత పుస్తకాలను, పత్రికలను చదవడం మొదలుపెట్టాడు. తన కొడుకులు ఎక్కడో ఆత్మసామ్రాజ్యంలో తమను చంపినవాడి ఆత్మకు బానిసలవ్వడానికి ఎదురుచూడ్డంలేదు కానీ సమాధిలో నిద్రపోతున్నారని తెలుసుకుని ఎంతో సంతోషించాడు.​—⁠యోహాను 11:​11-13.

దయ్యాలకు సంబంధించిన ఎలాంటి ఆచారాలైనా పూర్తిగా మానుకోవాలని అగ్బూలాకు అర్థమైంది. ఆయన మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులన్నిటినీ కాల్చేశాడు. (అపొస్తలుల కార్యములు 19:19) ఆత్మలు పగబడతాయని కొందరు ఆయన్ని భయపెట్టారు. కానీ ఆయన భయపడలేదు. ఎఫెసీయులు 6:​11, 12లో చెప్పినట్లు మనం ‘ఆకాశమండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం’ కాబట్టి ఆయన ‘దేవుడిచ్చే సర్వాంగకవచాన్ని’ ధరించుకున్నాడు. ఆ దైవిక కవచం ధరించుకోవడంలో సత్యం నేర్చుకోవడం, నీతిని పాటించడం, సమాధాన సువార్తను ప్రకటించడం, విశ్వాసం చూపించడం, దేవుని వాక్యమైన ఆత్మఖడ్గాన్ని ఉపయోగించడం ఉన్నాయి. దీన్ని దేవుడు మాత్రమే ఇస్తాడు. అదెంతో శక్తివంతమైనది!

దయ్యాలకు సంబంధించిన ఆచారాలను వదిలేసినందుకు బంధువులు, స్నేహితులు ఆయన్ని వెలివేశారు. అయితే, తన ప్రాంతంలోని యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లినప్పుడు, అక్కడాయనకు బైబిలు బోధలను నమ్మే కొత్త స్నేహితులు దొరికారు.

యెహోవా త్వరలోనే భూమిపైనున్న దుష్టులందరినీ నాశనంచేస్తాడు. దయ్యాలిక ఏమీ చేయకుండా వారిని బంధించే సమయం వస్తుందని అగ్బూలాకు ఇప్పుడు తెలుసు. చివరకు దేవుడు ఆ దయ్యాలను నాశనం చేస్తాడు. (ప్రకటన 20:​1, 2, 10) దేవుడు ‘సమాధులలో ఉన్నవారందరిని’ ఇదే భూమ్మీద తిరిగి బ్రతికిస్తాడు. (యోహాను 5:​28, 29) అంటే రాజైన హేరోదు చంపించిన అన్నెంపున్నెం ఎరుగని పసిపిల్లలు, హేబెలు, ఇంకా లక్షలాదిమంది ఇతరులను కూడా తిరిగి బ్రతికిస్తాడు. తన ముగ్గురు కొడుకులు కూడా తిరిగి వస్తారని అగ్బూలా నమ్మకం. మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోయుంటే వాళ్లు కూడా తిరిగి బ్రతికే అవకాశం ఉంది. అలాంటివాళ్లు తాము చనిపోయినప్పటినుండి తిరిగి జీవం పొందేంతవరకు తమవాళ్లు తమకోసం చేసిన పూజలు, ప్రార్థనల గురించి కూడా తమకేమాత్రం తెలీదని చెపుతారు.

చనిపోయినవాళ్లంటే మీరు భయపడాల్సిన పనిలేదు. మీకు ఇష్టమైనవాళ్లెవరైనా చనిపోయుంటే, వారిని తిరిగి కలుసుకోవడానికి మీరు సంతోషంగా ఎదురుచూడొచ్చు. ఈలోపు మీ విశ్వాసాన్ని పెంచుకునేందుకు బైబిలును శ్రద్ధగా చదివి, దాన్ని అర్థంచేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? బైబిలు బోధలను నమ్మేవారితో సహవసించండి. మీరు సరదాకైనా సరే దయ్యాలకు సంబంధించిన పనులేవైనా చేస్తుంటే వెంటనే మానెయ్యండి. దయ్యాల బారినుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ‘దేవుడిచ్చే సర్వాంగకవచాన్ని ధరించుకోండి.’ (ఎఫెసీయులు 6:11) ఈ విషయంలో యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. వారు మీ ఇంటికే వచ్చి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * అనే పుస్తకంలోనుండి బైబిలు విషయాలను ఉచితంగా నేర్పిస్తారు.

అగ్బూలాకు ఇప్పుడు చనిపోయినవాళ్లంటే భయంలేదు. దయ్యాలు తన దగ్గరకు రాకూడదంటే ఏమి చేయాలో ఆయన నేర్చుకున్నాడు. “మా ముగ్గురు కొడుకులను ఎవరు చంపించారో నాకు తెలీదు. కానీ నేను యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టినప్పటినుండి మాకింకా ఏడుగురు పిల్లలు పుట్టారు. ఆత్మలోకంలో ఉన్న ఎవ్వరూ వాళ్లకు ఏ హానీ చేయలేకపోయారు.” (w09 1/1)

[అధస్సూచి]

^ పేరా 25 యెహోవాసాక్షులు ప్రచురించారు.