కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆకు వాడని’ చెట్టు

‘ఆకు వాడని’ చెట్టు

‘ఆకు వాడని’ చెట్టు

దట్టమైన పచ్చని చెట్లతో నిండిన పల్లెటూరును మీరెప్పుడైనా చూశారా? అది నిజంగా కనువిందు చేస్తుందని మీరు ఒప్పుకుంటారు. పచ్చని పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తే ఆ ప్రాంతంలో అనావృష్టి ఉందని మీరనుకుంటారా? అలా అనుకోరుగానీ, అది చూసిన వెంటనే ఆ చెట్లను సజీవంగా, పచ్చగా ఉంచేందుకు కావలసినంత నీరు అక్కడ ఉందని మీకు అర్థమవుతుంది.

అందుకే బైబిలు దేవునిపై బలమైన విశ్వాసం, ఆయనతో మంచి సంబంధం ఉన్నవారిని దట్టమైన పచ్చని చెట్లతో పోలుస్తోంది. ఉదాహరణకు, మొదటి కీర్తనలోని మొదటి మూడు వచనాల్లో ఉన్న ఈ చక్కని వర్ణనను గమనించండి.

‘దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గంలో నిలువకుండా అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమవుతుంది.’

అలాగే, యిర్మీయా 17:7, 8 వచనాల్లో మనమిలా చదువుతాం, ‘యెహోవాను నమ్ముకొనేవాడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయంగా ఉంటాడు. అతను జలములయొద్ద నాటబడ్డ చెట్టులా ఉంటాడు; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినా దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది, వర్షంలేని సంవత్సరంలో చింతపడదు, కాపు మానదు.’

సరైనది చేస్తూ దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఆయనపై పూర్తి నమ్మకముంచే వ్యక్తికి జరిగే మంచి ఏమిటో చూపించడానికి ఈ రెండు లేఖనాల్లో చెట్లు ఉదాహరణగా ఉపయోగించబడ్డాయి. కాబట్టి మనమిలా అడగవచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో అలాంటి వ్యక్తి ఎలా ఒక పచ్చని చెట్టులా ఉంటాడు? దీన్ని తెలుసుకోవడానికి, ఈ వచనాలను మరింత లోతుగా పరిశీలిద్దాం.

“నీటికాలువల యోరను నాటబడిన” చెట్లు

ఇక్కడ ప్రస్తావించబడిన చెట్లు, కేవలం ఒక నది దగ్గరో లేక కాలువ దగ్గరో కాదు గానీ “నీటికాలువల యోరను” లేదా “జలములయొద్ద” నాటబడ్డాయని వర్ణించబడ్డాయి. యెషయా 44:3, 4లో కూడా ఇలాంటి వర్ణనే కనిపిస్తుంది, అక్కడ యెహోవా దేవుడు, బబులోను నుండి విడుదలైన పశ్చాత్తాపపడిన యూదులను తానెలా చూసుకుంటాడో చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా అన్నాడు, ‘నేను దప్పిగలవానిమీద నీళ్లను, ఎండిన భూమ్మీద ప్రవాహజలాలను కుమ్మరిస్తాను. నీటికాలువలయొద్ద నాటబడ్డ నిరవంజిచెట్లు గడ్డిలో ఎదిగినట్టు వారు ఎదుగుతారు.’ ఇక్కడ, ‘ప్రవాహజలాలు,’ “నీటికాలువలు” దేవుడు ఆశీర్వదించినవారిని పచ్చని నిరవంజి చెట్లలా చేస్తాయని చెప్పబడింది.

ఇప్పుడు కూడా పంట భూములున్న ప్రాంతాల్లో లోతైన బావి, నది, చెరువు, ఆనకట్ట వంటి పెద్ద పెద్ద జలాశయాల నుండి ప్రవహిస్తున్న నీటికాలువలను, ప్రవాహ జలాలను చూడవచ్చు. సాధారణంగా, అవి పొలాలకు, తోటలకు నీటిపారుదల కోసం ఏర్పాటు చేయబడతాయి. కొన్నిసార్లు పళ్ల తోటలకు కూడా అలాగే నీరు పెడతారు. మరికొన్నిసార్లు, నీటి ప్రవాహానికి ఒకవైపున పొలాలు మరోవైపున చెట్లు ఉంటాయి, అవి పొలానికి కంచెలా పనిచేస్తాయి.

అలాంటి ప్రవాహాల దగ్గర చెట్లను నాటినప్పుడు అవెలా పెరుగుతాయి? కీర్తన 1:3, ‘తన కాలంలో ఫలమిచ్చే చెట్టు’ గురించి మాట్లాడుతోంది. బైబిలులో ప్రస్తావించబడిన ప్రాంతాల్లో అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, జల్దరు (ఆపిల్‌) చెట్లు, అలాగే ఖర్జూర చెట్లు, ఒలీవ చెట్లు ఉండేవి. అంజూరపు చెట్లు పెద్ద కొమ్మలతో, 30 అడుగుల ఎత్తు పెరుగుతాయి, కానీ ఇతర అనేక పండ్ల చెట్లు అంత ఎత్తు పెరగవు. అయినా అవి పచ్చగా, ఏపుగా పెరిగి వేటి కాలంలో అవి సమృద్ధిగా ఫలాలనిస్తాయి.

ప్రాచీన కాలాల్లో సిరియా, పాలస్తీనావంటి ప్రాంతాల్లో నిరవంజి చెట్లు నది ఒడ్డున, నీటి ప్రవాహాల పక్కన పెరిగేవి. బైబిల్లో ఈ చెట్లు తరచూ ప్రవాహాలతో, ‘కాలువలతో’ కలిపి ప్రస్తావించబడ్డాయి. (లేవీయకాండము 23:40) ఈ నిరవంజి చెట్ల జాతికి చెందిన గన్నేరు చెట్లు కూడా నీళ్లు పుష్కలంగావున్న ప్రాంతాల్లోనే పెరుగుతాయి. (యెహెజ్కేలు 17:5) ఈ పెద్ద, దట్టమైన చెట్లను గురించి మాట్లాడిన కీర్తనకర్త, యిర్మీయా ఇద్దరూ చెప్పాలనుకున్నది ఏమిటంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచేవారు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు, ‘వారు చేసేదంతా సఫలమవుతుంది.’ మన జీవితంలో, మనం చేసేది కూడా అలాగే సఫలం కావాలని మనం కోరుకోమా?

యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించడం

నేడు ప్రజలు జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పేరుప్రతిష్ఠలు సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ అవి వారికి దొరక్కపోవడంతో వారు నిరుత్సాహానికి గురౌతున్నారు. మరి జీవితంలో నిజమైన సంతృప్తిని, ఎల్లకాలముండే సంతోషాన్ని ఎలా పొందవచ్చు? యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో దీనికి జవాబు ఉంది. ఆయనిలా అన్నాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే పరలోక రాజ్యం వారిదే.’ (మత్తయి 5:3, NW) కాబట్టి, ధనసంపదలు ఉంటే కాదుగానీ మనకు ఆధ్యాత్మిక అవసరముందని గుర్తించి దాన్ని తీర్చుకోవడం ద్వారానే నిజమైన సంతోషాన్ని పొందవచ్చు. అప్పుడు మనం తన కాలంలో ఫలమిచ్చే పచ్చని చెట్టులా, ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం. అయితే, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే ఇంకా ఏమి చేయాలి?

మనం చేయకూడని కొన్ని విషయాల గురించి కీర్తనకర్త చెప్తున్నాడు. “దుష్టుల ఆలోచన,” ‘పాపుల మార్గం,’ ‘అపహాసకులు కూర్చుండే చోటు’ అనేవాటి గురించి ఆయన మాట్లాడాడు. కాబట్టి, దేవుని నియమాలను దూషించేవారి నుండి, చివరికి వాటిని పాటించనివారి నుండి దూరంగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం.

అంతేగాక, మనం దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలి. ఏదైనా ఒక విషయం మనకు నచ్చితే, అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని చేయాలని చూస్తాం. అలాగే దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలంటే దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎంచాలి, అంటే దానిగురించి ఎక్కువగా తెలుసుకోవాలనే, దాన్ని అర్థం చేసుకోవాలనే కుతూహలం ఉండాలి.

చివరిగా, మనం దేవుని వాక్యాన్ని ‘దివారాత్రం’ చదవాలి. అంటే క్రమంగా బైబిలు చదువుతూ చదివిన దాని గురించి ధ్యానించాలి. దేవుని వాక్యం విషయంలో కీర్తనకర్తకు ఉన్నలాంటి భావాలే మనకూ ఉండాలి. ఆయన ఇలా అన్నాడు: ‘నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియంగా ఉంది. దినమెల్ల నేను దాన్ని ధ్యానిస్తున్నాను.’—కీర్తన 119:97.

అవును, మనం యెహోవా దేవుని గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని, అవగాహనను సంపాదించుకొని ఆయనపై, ఆయన వాగ్దానాలపై పూర్తి నమ్మకాన్ని పెంచుకున్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం. అప్పుడు మనం, ‘అతడు చేసేదంతా సఫలమవుతుంది’ అని కీర్తనకర్త చెప్పిన ధన్యుడిలా అంటే సంతోషంగల వ్యక్తిలా ఉంటాం. (w09 3/1)