కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది

ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది

ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది

“ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమిమీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది” అని బైబిలు చెప్తోంది. పుట్టడానికి, చనిపోవడానికి, కట్టడానికి, పడగొట్టడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి సమయం ఉందని ఈ మాటలు రాసిన ప్రాచీనకాల జ్ఞానియైన సొలొమోను రాజు చెప్పాడు. చివర్లో ఆయనిలా అన్నాడు: ‘మనిషి చేసే కష్టానికి అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా?’—ప్రసంగి 3:1-9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఈ వచనాలను చదివి కొంతమంది, ప్రతీదానికి ముందే సమయం నిర్ణయించబడిందన్న విషయం బైబిలు బోధిస్తుందని అనుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే, బైబిలు విధి సిద్ధాంతాన్ని సమర్థిస్తుందని వాళ్ళు అనుకుంటారు. అది నిజమా? జీవితంలో ప్రతీదాన్ని విధే నిర్ణయిస్తుందన్న ఆలోచనను బైబిలు సమర్థిస్తోందా? “లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి” కాబట్టి బైబిల్లో మనం ఒకచోట చదివింది మరోచోట చదివేదాంతో పొందికగా ఉండాలి. అందుకే, ఈ విషయం గురించి దేవుని వాక్యమైన బైబిల్లోని ఇతర లేఖనాలు ఏమి చెప్తున్నాయో చూద్దాం.—2 తిమోతి 3:16, 17, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

సమయం, అనుకోని సంఘటనలు

బైబిల్లోని ప్రసంగి అనే పుస్తకంలో సొలొమోను ఇంకా ఇలా రాశాడు: ‘నేను ఆలోచిస్తున్నప్పుడు సూర్యునిక్రింద జరుగుతున్నది నాకు అర్థమైంది. వేగంగా పరిగెత్తేవాళ్ళు పరుగుపోటీలో గెలవరు; బలంగలవాళ్ళు యుద్ధంలో విజయం సాధించరు; జ్ఞానంగలవాళ్ళకు కూడా ఆహారం లభించదు; వివేకవంతులకు కూడా ఐశ్వర్యం ఉండదు; చివరికి తెలివిగలవాళ్ళకు కూడా అనుగ్రహం దొరకదు.’ ఎందుకు? ఆయనిలా వివరించాడు: ‘సమయం, అనుకోని సంఘటనలు అందరికీ ఎదురవుతాయి.’—ప్రసంగి 9:11 NW.

మనుషుల జీవితాల్ని విధే నిర్ణయిస్తుందని సొలొమోను చెప్పలేదు గానీ ‘సమయం, అనుకోని సంఘటనలు అందరికీ ఎదురవుతాయి’ కాబట్టి ప్రతీ పనికి ఫలితం ఫలానా విధంగా ఉంటుందని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరని ఆయన అన్నాడు. తరచూ ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నందుకో, కాని సమయంలో కాని స్థలంలో ఉన్నందుకో ఆయనకు ఏదైనా జరుగుతుంది.

ఉదాహరణకు, ‘వేగంగా పరిగెత్తేవాళ్ళు పరుగుపోటీలో గెలవరు’ అనే మాటల్నే తీసుకోండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్‌ ఏంజిల్స్‌లో 1984 ఒలింపిక్స్‌లో అందరినీ ఆశ్చర్యపర్చిన, ప్రసిద్ధ 3000 మీటర్ల మహిళల పరుగుపందెం గురించి బహుశా మీకు గుర్తుండేవుంటుంది లేదా మీరు చదివేవుంటారు. ఈ పరుగుపందెంలో ఇద్దరు బంగారు పతకాన్ని సాధించాలనుకున్నారు. వారిలో ఒకరు బ్రిటన్‌కు చెందినవారైతే, మరొకరు అమెరికాకు చెందినవారు. పందెం మధ్యలో వారు ఒకరినొకరు గుద్దుకోవడంతో ఒకామె కిందపడిపోయి పోటీ నుండి తొలగించబడింది. మరొకామె నిరుత్సాహంతో ఏడవ స్థానంలో నిలిచింది.

విధివల్లే వారికి అలా జరిగిందా? కొందరు అలాగే అనొచ్చు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా, ఒకరినొకరు గుద్దుకోవడంతో పరుగుపందెంలో ఓడిపోయారు. మరి వాళ్ళలా గుద్దుకోవాలని రాసిపెట్టివుందా? దీనికి కూడా కొందరు అవుననే అంటారు. కానీ, బలసామర్థ్యాల్లో ఏమాత్రం తీసిపోని వారిద్దరు ఒకరిపై మరొకరు విజయం సాధించాలని తీవ్రంగా పోటీ పడినందుకే వాళ్ళలా గుద్దుకున్నారని వ్యాఖ్యానకర్తలు అన్నారు. ‘సమయం, అనుకోని సంఘటనలు అందరికీ ఎదురవుతాయి’ అని బైబిలు చెప్తోంది. ఒక వ్యక్తి ఫలానాది చేయాలని ఎంత ప్రయత్నించినా దానికి తగ్గ ఫలితం రాకుండా చేసే అనుకోని పరిస్థితులు కొన్ని ఎదురవుతూనే ఉంటాయి, అంతమాత్రాన విధివల్లే అలా జరిగిందని చెప్పలేం.

మరైతే, ‘ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది’ అని బైబిలు చెప్తున్నప్పుడు దానర్థమేమిటి? మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేయగల్గింది ఏదైనా ఉందా?

ప్రతీ ప్రయత్నానికి తగిన సమయం

ప్రసంగి పుస్తకాన్ని రాసిన సొలొమోను ఆయా వ్యక్తులకు జరగబోయేదాని గురించో ఆయా వ్యక్తులు చనిపోయిన తర్వాత పొందబోయే ఫలితం గురించో మాట్లాడలేదు గానీ దేవుడు ఉద్దేశించినదాని గురించి, మానవుల కోసం అది ఏమి చేస్తుందనే దాని గురించి మాట్లాడాడు. అలాగని మనకెలా తెలుసు? దాని సందర్భాన్ని గమనిస్తే తెలుస్తుంది. నియమిత ‘సమయం ఉన్నట్టు’ అనిపించే అనేక విషయాల గురించి ప్రస్తావించిన తర్వాత ఆయన ఇలా రాశాడు: ‘దేవుడు మనుషులకు అప్పగించిన పనిని నేను గమనించాను. దేని కాలంలో దాన్ని ఆయన చక్కగా చేశాడు.’—ప్రసంగి 3:10, 11, NW.

దేవుడు మనిషికి చేయడానికి ఎన్నో పనులిచ్చాడు. అంతేగాక, వాటిలో మనకిష్టమైనదాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కూడా మనకిచ్చాడు. వాటిలో చాలావాటిని సొలొమోను పేర్కొన్నాడు. అయితే, ప్రతీపనికి ఒక సరైన సమయముంటుంది. ఆ పనిని ఆ సమయంలో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. ఉదాహరణకు, ప్రసంగి 3:2లో సొలొమోను రాసిన ఈ మాటల్నే తీసుకోండి, ‘నాటడానికి, నాటబడినదాన్ని పెరికివేయడానికి సమయం ఉంది.’ ప్రతీ పంటను నాటడానికి సరైన సమయం ఒకటుంటుందని రైతులకు తెలుసు. రైతు ఈ విషయాన్ని పట్టించుకోకుండా పంటను నాటాల్సిన కాలంలో నాటకపోతే ఏమి జరుగుతుంది? ఎంతో కష్టపడినా, మంచి పంట చేతికి రాకపోతే రైతు విధివల్లే అలా జరిగిందనడంలో ఏమన్నా అర్థముంటుందా? ఏమాత్రం ఉండదు. రైతు సరైన కాలంలో పంటను నాటకపోతే పంట చేతికి రాదు. అదే, సృష్టికర్త పెట్టిన ప్రకృతి నియమానికి తగ్గట్టుగా పంటను నాటితే మంచి పంట చేతికి వస్తుంది.

కాబట్టి దేవుడు తాను ఉద్దేశించినదాని ప్రకారంగా మనుషుల పనులను నిర్దేశించే నియమాలను ఏర్పాటు చేశాడే కానీ మానవుల జీవితం ఫలానా విధంగా ఉండాలనో, అన్నీ ఫలానా విధంగా జరగాలనో ముందే నిర్ణయించలేదు. మనుషులు తాము చేసే పనులకు మంచి ఫలితం పొందాలంటే, దేవుడు ఉద్దేశించినదాన్ని, ఆయన ఏర్పాటు చేసిన సమయాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టు నడుచుకోవాలి. మనుషుల జీవితం ఫలానా విధంగా ఉండాలని దేవుడు నిర్ణయించలేదుగానీ తను చేయాలనుకున్నదాన్ని మాత్రం ఆయన ముందే నిర్ణయించాడు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. యెహోవా దేవుడు ఇలా చెప్పాడని యెషయా అనే ప్రవక్త రాశాడు: ‘నా నోటినుండి వచ్చే మాట నిష్ఫలంగా నాదగ్గరకు తిరిగిరాకుండా నాకు అనుకూలమైనదాన్ని నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది.’—యెషయా 55:11.

భూమి గురించి మానవుల భవిష్యత్తు గురించి ఖచ్చితంగా సఫలమయ్యే దేవుని “మాట” లేక ఆయన చేస్తానని చెప్పినది ఏమిటి?

దేవుడు చేస్తానని చెప్పినదాన్ని అర్థంచేసుకోవడం

సొలొమోను మాటల ఆధారంగా దీన్ని అర్థంచేసుకోవచ్చు. ‘దేని కాలంలో దాన్ని దేవుడు చక్కగా చేశాడు’ అని చెప్పిన తర్వాత సొలొమోను ఇంకా ఇలా రాశాడు: ‘ఆయన మనుషుల హృదయాల్లో శాశ్వతకాలాన్ని ఉంచాడు, సత్య దేవుడు చేసినవాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అది సరిపోదు.’—ప్రసంగి 3:11, NW.

చాలామంది ఈ వచనాన్ని వివరిస్తూ ఎంతో రాశారు. అసలు విషయమేమిటంటే, మన జీవితం గురించి, చివరకు మనకేమి జరుగుతుందనే దాని గురించి ఎప్పుడో ఒకప్పుడు మనలో ప్రతీ ఒక్కరం ఆలోచించేవుంటాం. చరిత్రంతటినీ గమనిస్తే, కష్టపడి పనిచేసి చివరకు చనిపోవడమే జీవితమని అంగీకరించడం చాలామందికి కష్టమనిపించింది. మానవులమైన మనం మాత్రమే, ప్రస్తుత జీవితం గురించేకాదు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తాం. అంతేకాదు, మనం చనిపోకుండా శాశ్వతంగా జీవించి ఉండాలని కోరుకుంటాం. ఎందుకు? లేఖనం చెప్తున్నట్లు దేవుడు ‘మనుషుల హృదయాల్లో శాశ్వతకాలాన్ని ఉంచాడు.’

మనుషులు శాశ్వతంగా జీవించాలనే కోరికతోనే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి మరో జీవితం ఉంటుందనే సిద్ధాంతాన్ని తయారుచేసుకున్నారు. చనిపోయిన తర్వాత మనిషి ఏదో రకంగా బ్రతికేవుంటాడని కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది, మనిషి ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాడని నమ్ముతారు. మనిషి జీవితంలోని ప్రతీది విధి చేతుల్లోనే ఉందనీ లేదా దేవుడే నిర్ణయిస్తాడనీ దానికి మనం చేయగల్గిందేమీ లేదనీ ఇతరులు అనుకుంటారు. విచారకరంగా, ఈ సిద్ధాంతాలేవీ శాశ్వతంగా జీవించాలనే మనిషి కోరికను తీర్చలేకపోయాయి. ఎందుకంటే, ‘సత్య దేవుడు చేసినవాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం’ మానవ ప్రయత్నాలవల్ల సాధ్యంకాదని బైబిలు చెప్తోంది.

తెలుసుకోవాలనే ఆత్రుతవున్నా జవాబులు తెలుసుకోలేక ఆలోచనాపరులు ఎంతోకాలంగా తల బద్దలుకొట్టుకుంటున్నారు. శాశ్వతంగా జీవించాలనే కోరికను దేవుడు మన హృదయంలో ఉంచాడు కాబట్టి ఆ కోరికను తీర్చుకోవాలంటే మనమేమి చేయాలో తెలుసుకోవడానికి మనం ఆయనపైనే ఆధారపడడం సబబు కాదా? యెహోవా ‘తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు’ అని బైబిలు చెప్తోంది. (కీర్తన 145:16) దేవుని వాక్యమైన బైబిలును జాగ్రత్తగా చదివితే జీవితం గురించి, మరణం గురించి, భూమిపట్లా మానవులపట్లా దేవుని నిత్యసంకల్పం గురించి అంటే దేవుడు ఉద్దేశించిన దాని గురించి సంతృప్తికరమైన వివరణలను తెలుసుకోవచ్చు.—ఎఫెసీయులు 3:8-11. (w09 3/1)

[5వ పేజీలోని బ్లర్బ్‌]

‘వేగంగా పరిగెత్తేవాళ్ళు పరుగుపోటీలో గెలవరు.’—ప్రసంగి 9:11, NW.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

రైతు సరైన కాలంలో పంట నాటనందుకు పంట చేతికి రాకపోతే విధివల్లే అలా జరిగిందనడంలో ఏమన్నా అర్థముంటుందా?

[7వ పేజీలోని బ్లర్బ్‌]

దేవుడు ‘మనుషుల హృదయాల్లో శాశ్వతకాలాన్ని ఉంచాడు’ కాబట్టే మనం జనన మరణాల గురించి ఆలోచిస్తాం