మియన్మార్ తుఫాను బాధితులకు సహాయం అందింది
మియన్మార్ తుఫాను బాధితులకు సహాయం అందింది
నర్గీస్ తుఫాను 2008 మే 2న మియన్మార్‌ను ఎంతో శక్తివంతంగా తాకింది. వెంటనే అది అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కింది. * ఆ తుఫాను ఇర్రావాడి తీరప్రాంతాన్ని ముంచెత్తడంతో 1,40,000 మంది చనిపోయినట్టు లేదా గల్లంతైనట్టు తెలిసింది.
ఆశ్చర్యకరంగా, ఆ ప్రాంతంలోవున్న చాలామంది యెహోవాసాక్షుల్లో ఎవ్వరికీ ప్రాణహాని జరగలేదు. వాళ్ళు పటిష్ఠంగా నిర్మించబడిన తమ రాజ్యమందిరాల్లో తలదాచుకున్నారు కాబట్టి వాళ్లలో ఎక్కువమంది తప్పించుకోగలిగారు. ఒక ప్రాంతంలో, నీటిమట్టం 15 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో 20 మంది సాక్షులు, 80 మంది గ్రామీణులు తొమ్మిది గంటలపాటు రాజ్యమందిరపు పైకప్పుమీదే కూర్చుండిపోయారు. వాళ్లందరూ తమ ప్రాణాలు కాపాడుకున్నారు. విచారకరంగా, అదే గ్రామానికి చెందిన 300 మంది ఇతరులు చనిపోయారు. చాలా గ్రామాల్లో, రాజ్యమందిరాలు మాత్రమే తుఫాను తాకిడిని తట్టుకొని నిలబడ్డాయి.
తుఫాను వచ్చిన రెండు రోజులకే యాంగోన్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం సముద్ర ముఖభాగాన ఉన్న బోతింగోన్ సంఘానికి ఒక సహాయక బృందాన్ని పంపించింది. ఆ బృందం బియ్యం, నూడుల్స్, నీళ్లు, కొవ్వొత్తులు తీసుకొని తుఫాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రయాణిస్తూ దొంగలను తప్పించుకుంటూ కుళ్లిపోతున్న శవాలను దాటుకుంటూ బోతింగోన్ చేరుకుంది. వాళ్లే ఆ ప్రాంతానికి చేరుకున్న మొదటి సహాయక బృందం. వాళ్లు తెచ్చిన వాటిని స్థానిక సాక్షులకు అందించి వాళ్లను ప్రోత్సహించడానికి బైబిలు ప్రసంగాలను ఇచ్చారు. అంతేకాక, వాళ్ళకు కొన్ని బైబిళ్ళను, బైబిలు సాహిత్యాలను కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ల వస్తువులన్నీ తుఫానులో కొట్టుకుపోయాయి.
తుఫానుకు గురైన సాక్షుల వైఖరి ఎంతో అభినందనీయం. తుఫాను తాకిడికి ఘోరంగా దెబ్బతిన్న ఇర్రావాడి ప్రాంతంలో ఉన్న సంఘానికి చెందిన ఒక సాక్షి ఇలా అన్నాడు: “మాకున్నవన్నీ పోయాయి. మా ఇళ్లన్నీ నాశనమయ్యాయి. మా పంటలన్నీ కొట్టుకుపోయాయి. తాగే నీళ్లు కలుషితమైపోయాయి. అయినా, ఇతరుల్లా మన సహాదర సహోదరీలు ఎక్కువగా ఆందోళన పడలేదు. వాళ్లకు యెహోవాపై, ఆయన సంస్థపై పూర్తి నమ్మకముంది. మేము ఇక్కడే ఉన్నా, మరెక్కడికెళ్లినా మాకిచ్చే ఏ నిర్దేశాన్నైనా పాటిస్తాం.”
అన్నీ కోల్పోయిన 30 మంది సాక్షుల ఒక గుంపు ఆహారం, బట్టలు, వసతి కోసం అవి ఇచ్చే ప్రాంతానికి చేరుకోవడానికి 10 గంటల ప్రయాణం చేసి వెళ్లారు. ఆ ప్రయాణంలో వాళ్లు సంతోషంగా రాజ్య గీతాలు పాడారు. వాళ్లు ఆ ప్రాంతానికి చేరుకోకముందు, దగ్గర్లోవున్న ఓ పట్టణంలో యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశం జరుగుతోందని విని ముందు ఆధ్యాత్మిక ఆహారాన్ని, క్రైస్తవ సహవాసాన్ని ఆనందించడానికి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
తుఫాను తాకిడికి గురైన ప్రాంతమంతటిలో యెహోవాసాక్షుల 35 ఇళ్లు నాశనమయ్యాయి, 125 ఇళ్లు కొంతమేరకు దెబ్బతిన్నాయి, 8 రాజ్యమందిరాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సంతోషకరంగా, బ్రాంచి కార్యాలయ భవనాలు అంతగా దెబ్బతినలేదు.
మొదట్లో, తుఫానువల్ల దగ్గర్లోవున్న రోడ్లమీద పెద్దపెద్ద చెట్లు అడ్డంగా పడిపోవడంతో ఎవ్వరూ బ్రాంచికి చేరుకోవడానికీ బ్రాంచి నుండి బయటకు రావడానికీ వీలుకాలేదు. తుఫాను తాకిడి తగ్గిన కొన్ని గంటలకే బ్రాంచిలో పని చేస్తున్న 30 కన్నా ఎక్కువమంది ఏ పెద్ద పరికరాలు లేకుండానే తమ చేతులతో ఆ చెట్లను తీసేయడం ప్రారంభించారు. వాళ్లు పనిచేస్తుండగా ప్రజలు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు. అలా నిలబడిపోయిన పొరుగువారికోసం, పనిచేస్తున్నవారికోసం యెహోవాసాక్షులైన కొంతమంది స్త్రీలు కొద్ది సేపట్లోనే చల్లని పానీయాలూ తాజా పండ్లూ తీసుకొని వచ్చారు. జరుగుతున్నది గమనించిన ఒక జర్నలిస్టు, “ఇంత బాగా పనిచేస్తున్నారే! ఎవరు వీళ్ళు?” అని అడిగాడు. ఎవరో తెలుసుకున్న తర్వాత, “యెహోవాసాక్షులకున్నంత సేవా స్ఫూర్తి ఇంకా చాలామందికి ఉంటే ఎంతో బాగుంటుంది” అన్నాడు.
తుఫాను వచ్చిన వెంటనే సహాయ పనులను చూసుకోవడానికి యెహోవాసాక్షులు దేశంలోని రెండు ప్రాంతాల్లో సహాయక కమిటీలను ఏర్పాటు చేశారు. సహాయక బృందాల్లో వందలమంది స్వచ్ఛందంగా పనిచేశారు. కొన్ని రోజుల్లోనే వసతి కోల్పోయిన సాక్షులకోసం ఇళ్లు నిర్మించబడ్డాయి. సహాయక బృందం ఒక యెహోవాసాక్షి కోసం ఇల్లు కట్టడానికి వచ్చినప్పుడు ఆమె ఇరుగుపొరుగువాళ్లు చూస్తున్నది నమ్మలేకపోయారు. ఒకామె ఇలా అంది: “ఈ యెహోవాసాక్షి కోసం ఆమె చర్చివాళ్లు ఆమె ఇంటిని మరమ్మత్తు చేయడానికి వచ్చారు. కానీ, బౌద్ధమతస్థులైన నా స్నేహితులెవ్వరూ నాకు సహాయం చేయడానికి రాలేదు. ఆమె నాకు ప్రకటించినప్పుడు నేను విని ఒక యెహోవాసాక్షినైతే ఎంత బాగుండేదో!”
నిర్మాణ పనులు చేపట్టినవాళ్లు, సహాయక బృందం థాన్లిన్ అనే పట్టణంలో పూర్తిగా పాడైపోయిన ఒక ఇంటిని చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోని యెహోవాసాక్షులు, “మాకేమీ కాలేదు. మా ఇల్లు కూడా బాగానే ఉంది. ఫర్వాలేదు మేము ఇక్కడే ఉండగలం. కొంతమంది సాక్షులకు ఇది కూడా లేదు. వెళ్ళి వాళ్లకు సహాయం చేయండి” అని అన్నప్పుడు వాళ్లెంతో కదిలించబడ్డారు.
యాంగోన్‌లోని ఒక ప్రాంతంలో కొంతమంది తలదాచుకోవడానికి స్థానిక చర్చీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, ఆ చర్చీ తలుపు తాళం వేసివుండడంతో ఎవ్వరూ లోపలికి వెళ్లలేకపోయారు. ప్రజలు ఎంతో నిరాశపడి కోపంతో ఆ చర్చీ తలుపులు విరగ్గొట్టాలనుకున్నారు. దానికి పూర్తి భిన్నంగా, యెహోవాసాక్షులు మాత్రం తుఫాను సమయంలో చాలామందికి తమ రాజ్యమందిరాల్లో ఆశ్రయమిచ్చారు. ఉదాహరణకు, డాలా అనే పట్టణంలో యెహోవాసాక్షులైన భార్యాభర్తలు ఆశ్రయం కోసం వచ్చిన 20 మంది పొరుగువారిని తమ రాజ్యమందిరంలోకి రానిచ్చారు. మరుసటిరోజు ఉదయం తిరిగి వెళ్లడానికి వారికి ఇళ్లు లేవు, తినడానికి తిండీ లేదు. దాంతో ఆ భర్త ఎవరో బియ్యం అమ్మడాన్ని చూసి అందరికీ సరిపోయేంత కొనుక్కొచ్చాడు.
యాంగోన్‌లోని ఒక కుటుంబంలో కొంతమంది యెహోవాసాక్షులు, మిగతావాళ్లేమో వేర్వేరు చర్చీలకు వెళ్తారు. తుఫాను తర్వాత, కుటుంబమంతా రాజ్యమందిరంలో జరుగుతున్న కూటాలకే వచ్చారు. ఎందుకు? ఆ కుటుంబంలోని ఒకామె ఇలా చెప్పింది: “మా చర్చీవాళ్లు తుఫాను తర్వాత వచ్చి మమ్మల్ని చూస్తామని
చెప్పారుగానీ ఎవ్వరూ రాలేదు. అయితే, యెహోవాసాక్షులు మాత్రం వచ్చారు. యెహోవాసాక్షులైన మీరు మాకు ఆహారం, నీళ్లు ఇచ్చారు. మీరు ఇతర చర్చీల్లాంటివాళ్లు కాదు!” యెహోవాసాక్షులుకాని ఆ కుటుంబంలోనివాళ్లు కూడా కావలికోట అధ్యయనంలో “యెహోవా మన మొర ఆలకిస్తాడు” అనే ఆర్టికల్ చర్చించబడుతున్నప్పుడు చాలా వ్యాఖ్యానాలు చేశారు.యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్న ఒక స్త్రీ తుఫాను వచ్చిన తర్వాతి వారం వాళ్ల సంఘ కూటానికి వెళ్లింది. కూటంలో బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ఓ ఉత్తరం చదివి వినిపించబడింది. ఆ ఉత్తరం, తుఫాను బాధితులకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఏమేమి చేశారో వివరించి తుఫాను నుండి బ్రతికి బయటపడ్డవాళ్ల అనుభవాలను తెలియజేసింది. ఆ ఉత్తరంలోని విషయాలను విని ఆమె ఏడ్వడం మొదలుపెట్టింది. యెహోవాసాక్షులందరూ క్షేమంగా ఉన్నారని విని ఆమె ఎంతో సంతోషించింది. ఆ తర్వాత, ఆమె కూడా అవసరమైన సహాయం పొందింది, ఆమె ఇంటిపక్కనే ఆమెకు ఓ నివాసం ఏర్పాటు చేయబడింది. యెహోవాసాక్షులు తనపట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నారని ఆమె చెప్పింది.
‘మీరు ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగివుంటే దీనిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు’ అని యేసు చెప్పాడు. (యోహాను 13:35) నిజమైన విశ్వాసం ఒక వ్యక్తి చేసే మంచి పనుల్లో కనిపిస్తుందని శిష్యుడైన యాకోబు కూడా చెప్పాడు. (యాకోబు 2:14-17) యెహోవాసాక్షులు ఆ మాటల విలువను గ్రహించి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా అలాంటి ప్రేమను చూపించడానికి శాయశక్తులా కృషి చేస్తారు. (w09 3/1)
[అధస్సూచి]
^ పేరా 2 ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెప్తోంది: “అట్లాంటిక్, కరీబియన్ ప్రాంతాల్లో వచ్చే తుఫానులను సాధారణంగా హరికేన్‌లు అని అంటారు. అదే పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో, చైనా సముద్ర ప్రాంతాల్లో వచ్చే తుఫానులను టైఫూన్‌లు అని అంటారు.”
[27వ పేజీలోని బ్లర్బ్]
నిజమైన విశ్వాసం ఒక వ్యక్తి చేసే మంచి పనుల్లో కనిపిస్తుందని బైబిలు చెప్తోంది