కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వారి బాధ నాకు తెలుసు”

“వారి బాధ నాకు తెలుసు”

దేవునికి దగ్గరవ్వండి

“వారి బాధ నాకు తెలుసు”

నిర్గమకాండము 3:1-10

“యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.” (యెషయా 6:3) ఆ ప్రేరేపిత మాటలు, యెహోవా శుద్ధుడూ పవిత్రుడూ అని సూచిస్తున్నాయి, ఈ విషయంలో ఆయనకు ఎవ్వరూ సాటిరారు. మీరిలా అనుకోవచ్చు: ‘ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను సమీపించడం సాధ్యమౌతుందా? అంతటి పరిశుద్ధుడైన దేవుడు పాపులం, అపరిపూర్ణులం అయిన మనపట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తాడా?’ దేవుడు అభయమిస్తూ మోషేతో చెప్పిన మాటలను పరిశీలిద్దాం. ఆ మాటలు నిర్గమకాండము 3:1-10లో (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) రాయబడివున్నాయి.

ఒకరోజు మోషే గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక వింత చూశాడు. మండుతున్న ఒక ముండ్లపొద “కాలిపోకుండా ఉండటం” ఆయన గమనించాడు. (2వ వచనం) అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ పొద దగ్గరకు వెళ్లాడు. ఆ మంటల్లో నుండి యెహోవా ఒక దూత ద్వారా మోషేతో మాట్లాడుతూ, “దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం” అని చెప్పాడు. (5వ వచనం) ఒక్కసారి ఆలోచించండి, ఆ మండుతున్న పొద యెహోవా సమక్షానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఆ స్థలమే పవిత్రమైపోయింది!

పరిశుద్ధ దేవుడు మోషేతో మాట్లాడడానికి ఒక కారణముంది. దేవుడు ఇలా చెప్పాడు: ‘ఐగుప్తులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఐగుప్తువాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు.’ (7వ వచనం) దేవుడు తన ప్రజల దీనావస్థను చూశాడు, వారి మొర విన్నాడు. వారి దుఃఖాన్ని తన దుఃఖంగా ఎంచాడు. “వారి బాధ నాకు తెలుసు” అని దేవుడు చెప్పాడన్నది గమనించండి. “నాకు తెలుసు” అనే మాటను ఒక పుస్తకం ఇలా వివరిస్తోంది: “ఆ మాట ఎంతో వాత్సల్యం, శ్రద్ధ, కనికరం ఉండడాన్ని సూచిస్తుంది.” యెహోవా మోషేతో అన్న మాటలు, ఆయన ఎంతో ప్రేమగల, శ్రద్ధగల దేవుడని చూపిస్తున్నాయి.

దేవుడు ఏమి చేశాడు? ఆయన తన ప్రజల దీనావస్థను దయతో చూసి, వారి మొరను కనికరంతో విని ఊరుకోలేదుగానీ అవసరమైన చర్య తీసుకున్నాడు. ఆయన తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, “మంచిమంచి వాటితో నిండిన చాలా మంచి దేశం” అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావాలని ఉద్దేశించాడు. (8వ వచనం) వారిని విడుదలచేసి తీసుకొచ్చే పనిని యెహోవా మోషేకు అప్పగిస్తూ, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తునుంచి బయటకు తీసుకురా’ అని ఆయనతో చెప్పాడు. (10వ వచనం) మోషే సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు తీసుకువచ్చి దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తిచేశాడు.

యెహోవా మారలేదు. ఆయన ఆరాధకులు, దేవుడు తాము అనుభవించే కష్టాలను చూస్తాడనీ సహాయం కోసం తాము చేసే ప్రార్థనలు వింటాడనీ నమ్మవచ్చు. వారి బాధలన్నీ ఆయనకు తెలుసు. అయితే, శ్రద్ధగల దేవుడు తన సమర్పిత సేవకులపట్ల కేవలం కనికరపడడమేకాదు వారి తరఫున కావాల్సిన చర్య తీసుకోవడానికి కదిలించబడతాడు. ఎందుకంటే, ఆయన వారి గురించి ‘చింతిస్తున్నాడు.’—1 పేతురు 5:7.

దేవుడు కనికరం గలవాడు కాబట్టి మనం ఆయన సహాయం చేస్తాడనే ఆశతో ఉండవచ్చు. దేవుని సహాయంతో అపరిపూర్ణులమైన మనం ఆయన నీతియుక్తమైన, పరిశుద్ధమైన ప్రమాణాలకు తగినట్లుగా జీవించవచ్చు. (1 పేతురు 1:14-16) కృంగుదలతో, నిరుత్సాహంతో బాధపడిన ఒక క్రైస్తవ స్త్రీకి, ముండ్లపొద దగ్గర మోషే అనుభవం గురించిన వృత్తాంతం ఓదార్పునిచ్చింది. ఆమె ఇలా అంది: “దేవుడు మన్నునే పరిశుద్ధంగా మార్చగలిగినప్పుడు నన్ను కూడా తిరస్కరించడనే ఓ చిన్న ఆశ నాకుంది. ఆ ఆలోచనే నాకెంతో ఓదార్పునిచ్చింది.”

మీకు పరిశుద్ధ దేవుడైన యెహోవా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఉందా? ఆయనతో దగ్గరి సంబంధం ఏర్పర్చుకోవడం అసాధ్యమైనదేమీ కాదు. ఎందుకంటే, యెహోవాకు ‘మనం నిర్మించబడిన రీతి తెలుసు. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు.’—కీర్తన 103:14. (w09 3/1)