కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శుభ్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

శుభ్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

శుభ్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

వేలాది సంవత్సరాలుగా, ప్రాణాంతకమైన రోగాలు, అంటువ్యాధులు మనుషుల్ని పీడిస్తున్నాయి. దేవునికి కోపం వచ్చి పాపులను శిక్షించడానికి అలాంటి రోగాలను తీసుకొచ్చాడని కొంతమంది అనుకున్నారు. వందల సంవత్సరాల నుండీ ఓర్పుగా పరిశీలించి, ఎంతో కష్టపడి పరిశోధన చేసిన తర్వాత రోగాలకు అసలు కారణం మన చుట్టూ ఉన్న సూక్ష్మక్రిములేనని తేలింది.

ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు, ఈగలు, దోమలే రోగాల్ని వాప్తి చేస్తాయనీ శుభ్రత లేకపోవడంవల్లే అంటురోగాలు వస్తాయనీ వైద్య పరిశోధకులు తెలుసుకున్నారు. దీన్నిబట్టి శుచి శుభ్రతను పాటించడమనేది జీవన్మరణాలకు సంబంధించిన విషయం అని చెప్పవచ్చు.

ప్రజలు శుభ్రతను పాటించడమనేది వారి వారి అలవాట్లనుబట్టి, పరిస్థితులనుబట్టి వేర్వేరుగా ఉంటుంది. నీటి సరఫరా, డ్రైనేజీ వంటి సదుపాయాలు లేనిచోట శుభ్రతను పాటించడం నిజానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు అరణ్యంగుండా ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారికి శుభ్రతకు సంబంధించిన సూచనలు ఇచ్చాడు. వాళ్ళున్న పరిస్థితుల్లో మంచి శుభ్రతను పాటించడం చాలా కష్టం!

దేవుడు శుభ్రతకు ఎందుకంత ప్రాముఖ్యతనిస్తున్నాడు? శుభ్రతపట్ల మనకు ఎలాంటి అవగాహన ఉండాలి? రోగాల బారినపడకుండా మీరు, మీ కుటుంబం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు?

స్కూల్‌ అయిపోగానే చింటు * ఆకలితో ఇంటికొచ్చాడు. వాళ్ళుంటున్న చిన్న ఇంటికి వచ్చీరాగానే కాసేపు కుక్కతో ఆడుకుని ఇంట్లోకి వచ్చి స్కూల్‌ బ్యాగును డైనింగ్‌ టేబుల్‌మీద పెట్టేసి అన్నం తినడానికి కుర్చీలో కూర్చున్నాడు.

వంటింట్లో ఉన్న వాళ్ళమ్మ చింటు వచ్చాడని విని ప్లేట్లో వేడి వేడి అన్నం, బీన్స్‌కాయకూర వడ్డించి తీసుకొచ్చింది. శుభ్రంగా ఉన్న టేబుల్‌మీద చింటు స్కూల్‌ బ్యాగు పెట్టడం చూసి ఆమె కోపంగా వాడికేసి చూస్తూ “చింటూ. . . ” అనడంతో విషయం అర్థమై వెంటనే బ్యాగు తీసి పక్కనపెట్టి, “అయ్యో, మర్చిపోయానమ్మా” అంటూ చేతులు కడుక్కోడానికి బయటకు పరుగెత్తాడు. కడుక్కొనివచ్చి అన్నం తిన్నాడు.

ఆరోగ్యం, శుభ్రతవంటి విషయాల్లో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, కుటుంబంలోని వాళ్లందరూ దీనికి సహకరించాలి. చింటు విషయంలోలాగే శుభ్రంగా ఉండేందుకు అలుపెరుగని ప్రయత్నం, పిల్లలకు పదేపదే గుర్తుచేయడం అవసరం కాబట్టి ఈ విషయంలో వారికి ఎంతో కాలంపాటు శిక్షణ ఇవ్వాలి.

ఆహారం ఎన్నో రకాలుగా కలుషితం అవుతుందని చింటు వాళ్లమ్మకు తెలుసు. కాబట్టి, ఆహారాన్ని ముట్టుకునే ముందు ఆమె తన చేతులు కడుక్కుంటుంది, ఆహారంపై ఈగలు వాలకుండా మూతపెట్టి ఉంచుతుంది. ఆహారాన్ని అలా గాలికి వదిలేయకుండా మూతపెట్టి ఉంచి, ఇంటిని శుభ్రంగా ఉంచితే ఎలుకలతో, పందికొక్కులతో, బొద్దింకలతో ఆమెకెలాంటి సమస్యలుండవు.

చింటు వాళ్లమ్మకు, ముఖ్యంగా దేవునికి ఇష్టమైనవి చేయాలనే కోరిక ఉంది కాబట్టి ఆమె అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. “దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు కూడ పరిశుద్ధంగా ఉండాలని బైబిలు చెప్తుంది” అని ఆమె వివరిస్తోంది. (1 పేతురు 1:14-18) “పరిశుద్ధంగా ఉండడం అంటే శుభ్రంగా ఉండడమే. కాబట్టి నా ఇల్లు, నా కుటుంబం శుభ్రంగా ఉండాలని నా ఆశ. ఇంట్లో ప్రతీ ఒక్కరూ నాతో సహకరించడంవల్లే ఇది సాధ్యమౌతోంది” అని కూడా ఆమె అంటోంది.

కుటుంబంలో అందరి సహకారం అవసరం

చింటు వాళ్ల అమ్మ చెప్తున్నట్లు ఇంటి శుభ్రతకు ఇంట్లోవాళ్లందరి సహకారం అవసరం. కొన్ని కుటుంబాలవాళ్ళు, ఇంటా బయటా శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఇప్పుడు ఏమి చేస్తున్నామనేదాని గురించి, ఇంకా ఏమి చేయాలనే దాని గురించి చర్చించుకోవడానికి అప్పుడప్పుడు కొంచెం సమయం తీసుకుంటారు. ఇలా చేస్తే కుటుంబం ఐక్యంగా ఉంటుంది. అంతేకాదు కుటుంబ సంక్షేమం కోసం ప్రతీ ఒక్కరూ తమ వంతుగా ఏమిచేయాలనే దాని గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఉదాహరణకు, దొడ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత, డబ్బులు ముట్టుకున్న తర్వాత, తినడానికి ముందు చేతులు ఎందుకు కడుక్కోవాలో ఒక తల్లి తన పెద్ద పిల్లలకు వివరిస్తుంది. ఆ పెద్దపిల్లలు అలా చేయడం ఎందుకంత ప్రాముఖ్యమో తమ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తారు.

కుటుంబంలో అందరూ తలా ఒకపని చేయవచ్చు. ప్రతీవారం ఇంటిని క్రమంగా శుభ్రం చేసుకోవాలనీ సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో ఇల్లంతా దులిపి, కడిగి శుభ్రం చేసుకోవాలనీ వాళ్ళు అనుకోవచ్చు. ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల సంగతేమిటి? ప్రకృతి వనరుల పరిశోధకుడైన స్టూవర్ట్‌ ఎల్‌ యూడల్‌ అమెరికా గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “మనం జీవిస్తున్న భూమ్మీద, ప్రకృతి సౌందర్యం అంతరించిపోతోంది, అపరిశుభ్రత పెరిగిపోతోంది, ఖాళీ స్థలాలు తరిగిపోతున్నాయి, ప్రతీరోజూ వివిధ రకాల కాలుష్యాలవల్ల ప్రకృతి అంతా నాశనమవుతోంది.”

మీ పరిసరాల గురించి మీరూ అలాగే అనుకుంటున్నారా? పూర్వకాలాల్లో, పట్టణాన్ని శుభ్రం చేయమనీ మురికి కాలువల్లో చెత్తను తీయమనీ అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరకమనీ కలుపు మొక్కలను పీకేయమనీ చెత్త పారేయమనీ ఒక వ్యక్తి దండోరా వేస్తూ ప్రజలకు చెప్పేవాడు. మధ్య ఆఫ్రికాలోని కొన్ని పట్టణాల్లో ఇప్పటికీ అలాగే జరుగుతోంది.

చెత్తాచెదారాన్ని పూర్తిగా నిర్మూలించడం ప్రపంచవ్యాప్తంగా అధికారులకు ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఈ విషయంలో ఏమి చేయాలో వాళ్ళకు దిక్కుతోచట్లేదు. కొన్ని నగరపాలక సంస్థలు చెత్తను ఎప్పటికప్పుడు తీసివేయనందువల్ల వీధుల్లో చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోతోంది. ఈ పనికి స్థానికులను పురమాయించవచ్చు. నిజ క్రైస్తవులు మంచి పౌరులుగా ఉంటూ ఫిర్యాదు చేయకుండా అధికారులు కోరినదాన్ని చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. (రోమీయులు 13:3, 5-7) చేయమని అడిగినదానికన్నా ఎక్కువ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు, ఈ పని చేయడానికి వాళ్ళకు పైన చెప్పినలాంటి దండోరాలు అవసరంలేదు. శుభ్రంగా ఉండడం మంచి శిక్షణకు, బాధ్యతగల ప్రవర్తనకు సూచన అని వాళ్ళకు తెలుసు. ప్రతీ ఒక్కరూ, ప్రతీ కుటుంబం శుభ్రతను పాటించాలి. ఇంటా బయటా శుచి శుభ్రతను పాటిస్తే, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, పరిసరాలూ శుభ్రంగా ఉంటాయి.

వ్యక్తిగత శుభ్రత మనం ఆరాధించే దేవునికి గౌరవాన్ని తెస్తుంది

మనం శుభ్రంగా, మర్యాదకరంగా బట్టలు వేసుకున్నప్పుడు ఇతరులకూ మనకూ ఉన్న తేడాను ప్రజలు వెంటనే గుర్తిస్తారు. అది మనం ఆరాధించే దేవునికి గౌరవాన్ని తెస్తుంది. దాదాపు 15 మంది యువతీ యువకులు ఫ్రాన్స్‌లోని టొలూస్‌లో జరుగుతున్న యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరైన తర్వాత ఒక హోటల్‌కి వెళ్ళారు. వాళ్ళ పక్క టేబుల్‌ దగ్గర కూర్చున్న వృద్ధ జంట వీళ్ళను చూసి ఇప్పుడిక విపరీతంగా అల్లరి మొదలవుతుందని అనుకున్నారు. అయితే, వాళ్ళ మంచి ప్రవర్తనను, వాళ్ళ మధ్య జరుగుతున్న చక్కని సంభాషణను, వాళ్ళు వేసుకున్న మర్యాదకరమైన దుస్తులను చూసి ఈ వృద్ధ జంట ఎంతో ఆశ్చర్యపోయింది. వాళ్ళు వెళ్ళిపోతుండగా ఈ జంట ఒక యువకుడిని పిలిచి వారి మంచి ప్రవర్తనను మెచ్చుకుని, ఈ రోజుల్లో యువతీ యువకులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదు అని అన్నారు.

యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలను, ముద్రణాలయాలను, వసతి భవనాలను చూడడానికి వచ్చే సందర్శకులు ఇవన్నీ ఎంతో శుభ్రంగా ఉండడం చూసి ముగ్ధులవుతారు. ఇక్కడ పనిచేస్తూ, ఇక్కడే నివసించే స్వచ్ఛంద సేవకులు ప్రతీరోజు స్నానాలు చేసి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. సెంట్లు, డియోడరెంట్లు వాడడం శారీరక శుభ్రతకు ప్రత్యామ్నాయం కాదు. పూర్తికాల పరిచర్య చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవకులు సాయంకాలాల్లో, వారాంతాల్లో పొరుగువారికి ప్రకటిస్తున్నప్పుడు వాళ్లు శుభ్రంగా ఉన్నందుకు వాళ్లు చెప్పేదాన్ని వినడానికి ప్రజలు సుముఖత చూపిస్తారు.

‘దేవున్ని అనుకరించండి’

‘దేవున్ని అనుకరించండి’ అని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు. (ఎఫెసీయులు 5:1, NW) యెషయా అనే ప్రవక్త రాసిపెట్టిన ఒక దర్శనంలో దేవదూతలు సృష్టికర్తను “పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” అన్న మాటలతో వర్ణించారు. (యెషయా 6:3) దేవుడు అత్యంత పవిత్రుడు, పరిశుద్ధుడు అని ఈ వర్ణన నొక్కిచెబుతోంది. కాబట్టి, దేవుడు తన సేవకులందరూ పవిత్రంగా, శుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన వాళ్ళతో, ‘నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి’ అని చెప్తున్నాడు.—1 పేతురు 1:14-16.

‘గౌరవప్రదమైన దుస్తులు ధరించాలి’ అని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. (1 తిమోతి 2:9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) బైబిల్లోని ప్రకటన గ్రంథము అనే పుస్తకంలో, ‘స్వచ్ఛంగా తెల్లగా ఉన్న సున్నితమైన నార బట్టలు’ దేవుడు పరిశుద్ధులుగా పరిగణించేవారి నీతి క్రియలకు సూచనగా ఉన్నట్లు వర్ణించబడిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. (ప్రకటన 19:8, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మరోవైపు, లేఖనాలు పాపం గురించి వివరిస్తున్నప్పుడు తరచూ మరకను లేదా మురికిని ఉదాహరణగా ఉపయోగించాయి.—సామెతలు 15:26; యెషయా 1:16; యాకోబు 1:27.

నేడు లక్షలాదిమంది శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉండడం ఎంతో కష్టమయ్యే ప్రాంతాల్లో జీవించాల్సివస్తుంది. దేవుడు ‘ప్రతిదాన్ని కొత్తగా చేసే’ సమయం వచ్చినప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారముంటుంది. (ప్రకటన 21:5, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆ వాగ్దానం నెరవేరినప్పుడు ప్రతీ విధమైన అశుద్ధత, అపరిశుభ్రత ఇక ఎప్పటికీ లేకుండా తీసివేయబడతాయి. (w08 12/1)

[అధస్సూచి]

^ పేరా 6 పేరు మార్చబడింది.

[10వ పేజీలోని బాక్సు]

దేవుడు తన ప్రజలు శుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నాడు

ఇశ్రాయేలీయులు అరణ్యంగుండా ప్రయాణిస్తున్నప్పుడు మలవిసర్జనకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు వారికి చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 23:12-14) దాదాపు 30 లక్షలమందిగా ఉన్న ఆ ప్రజలకు ఇదెంతో కష్టమైయుంటుంది. కానీ అది విష జ్వరం, కలారా వంటి వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడిందనడంలో సందేహం లేదు.

మృతదేహాన్ని తాకిన ఏ వస్తువునైనా పగులగొట్టాలనీ లేదా కడగాలనీ దేవుడు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాడు. దేవుడు అలా ఎందుకు చేయమన్నాడో ఇశ్రాయేలీయులకు తెలీకపోయినా, చెప్పినట్టు చేయడంవల్ల వాళ్ళకు అంటురోగాలు గానీ వ్యాధులుగానీ సోకలేదు.—లేవీయకాండము 11:32-38.

యాజకులు గుడారంలో పనిచేసేటప్పుడు కాళ్ళు, చేతులు తప్పక కడుక్కోవాలి, దానికోసం వాళ్ళు ఇత్తడి గంగాళమును నీళ్ళతో నింపాలి. ఇదంత సులభం కాకపోయినా యాజకులు అలా కడుక్కోవాల్సిందే.—నిర్గమకాండము 30:17-21.

[11వ పేజీలోని బాక్సు]

ఒక వైద్యుని సూచనలు

జీవించివుండడానికి నీరు చాలా ప్రాముఖ్యం. అయితే కలుషితమైన నీరు తాగితే అనారోగ్యంపాలై చనిపోయే ప్రమాదం ఉంది. కామెరూన్‌లోని డ్యోలా తీర వైద్య విభాగంలో ముఖ్య అధికారియైన డా. జె. అమ్‌బాంగే లోబే ఒక ఇంటర్వ్యూలో, పాటించదగిన కొన్ని సూచనలిచ్చారు.

“తాగే నీళ్ళు శుభ్రంగా లేవనిపిస్తే వాటిని కాచి తాగండి” అని చెప్తూ ఆయనిలా హెచ్చరించారు: “బ్లీచింగ్‌ పౌడరు, ఇతర రసాయనాలు వాడొచ్చు, కానీ వాటిని వాడాల్సిన పద్ధతిలో వాడకపోతే ప్రాణానికి ముప్పువాటిల్లే అవకాశం ఉంది. భోజనానికి ముందు, దొడ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సబ్బు పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి పేదవాళ్ళు కూడా దీన్ని కొనుక్కోగలరు. బట్టలు ఉతుక్కోండి, ఒకవేళ చర్మ వ్యాధులుంటే వేడినీళ్ళతో ఉతుక్కోండి.”

ఆ వైద్యుడు ఇంకా ఇలా చెప్తున్నాడు: “కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి. సాధారణంగా మరుగుదొడ్లను, సామాన్ల గదిని శుభ్రం చేయకుండా వదిలేస్తుంటారు, దాంతో అక్కడ బొద్దింకలు, ఈగల బెడద ఎక్కువవుతుంది.” పిల్లల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్తూ ఇలా హెచ్చరించాడు: “మీ చుట్టుపక్కల ఉన్న వాగుల్లో స్నానాలు చేయకండి. వాటినిండా ప్రమాదకరమైన సూక్ష్మక్రిములుంటాయి. పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి, పళ్ళు తోముకోండి. దోమతెర వేసుకుని పడుకోండి.” దీనంతటినిబట్టి మనకర్థమయ్యేది ఏమిటంటే, ప్రమాదం ముంచుకురాకముందే ఆలోచించి తగిన చర్య తీసుకోవాలి.

[10వ పేజీలోని చిత్రం]

మీ బట్టలు ఉతుక్కోవడంద్వారా చర్మ సంబంధమైన సమస్యలను, రోగాలను నివారించవచ్చు

[10వ పేజీలోని చిత్రం]

నిజ క్రైస్తవులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు

[10వ పేజీలోని చిత్రం]

కుటుంబంలోని వాళ్ళంతా శుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత తల్లిదే