కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన మన పరిమితులను అర్థం చేసుకుంటాడు

ఆయన మన పరిమితులను అర్థం చేసుకుంటాడు

దేవునికి దగ్గరవ్వండి

ఆయన మన పరిమితులను అర్థం చేసుకుంటాడు

లేవీయకాండము 5:2-11

“నేను ఎంతో ప్రయత్నించాను, అయినా అది చాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు.” దేవునికి ఇష్టమైనవి చేయడానికి తను చేసిన ప్రయత్నాల గురించి ఒక స్త్రీ అన్న మాటలవి. యెహోవా దేవుడు తన సేవకులు శాయశక్తులా చేసే ప్రయత్నాలను అంగీకరిస్తాడా? ఆయన వాళ్ల సామర్థ్యాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటాడా? ఈ ప్రశ్నలకు జవాబు పొందడానికి, నిర్దిష్టమైన బలి అర్పణల గురించి మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలను తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది. ఆ విషయాలు లేవీయకాండము 5:2-11లో కనిపిస్తాయి.

ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు తమ పాపాలకు పరిహారంగా బలులను లేదా అర్పణలను అర్పించాలని దేవుడు కోరాడు. పైన పేర్కొన్న బైబిలు భాగంలో, ఒక వ్యక్తి అనాలోచితంగా లేదా తెలీకుండా పాపం చేసే వివిధ సందర్భాల గురించి ప్రస్తావించబడింది. (2-4 వచనాలు) అతడు తాను పాపం చేశానని గ్రహించినప్పుడు, తన పాపాన్ని ఒప్పుకొని ‘ఆడ గొర్రెపిల్లనేగాని ఆడ మేకపిల్లనే గాని’ పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. (5, 6 వచనాలు) ఒకవేళ అతను గొర్రెనుగానీ, మేకనుగానీ అర్పించలేనంత పేదవాడైతే అప్పుడేమిటి? అతను అప్పుచేసి ఆ జంతువును అర్పించాలని ధర్మశాస్త్రం కోరిందా? ఆయన ఆ జంతువును కొనుక్కోగలిగే వరకు పనిచేస్తూ తన పాపానికి పరిహారాన్ని వాయిదా వేయాలా?

యెహోవా దేవుని వాత్సల్యాన్ని ప్రతిబింబిస్తూ ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: ‘అతడు గొర్రెపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా తీసికొనిరావలెను.’ (7వ వచనం) ఒక ఇశ్రాయేలీయుడు గొర్రెను బలిగా అర్పించలేనంత పేదవాడైతే, తనకు సాధ్యమైనదాన్నే అంటే రెండు తెల్ల గువ్వలనుగాని, రెండు పావురపు పిల్లలను గాని బలి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు.

ఒకవేళ అతను రెండు పక్షులను కూడా అర్పించలేనంత పేదవాడైతే అప్పుడెలా? అప్పుడు, “పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును [అంటే దాదాపు ఒక కిలో గోధుమపిండిని] పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను” అని ధర్మశాస్త్రం చెప్పింది. (11వ వచనం) కడుబీదలకు యెహోవా కొంత మినహాయింపు ఇచ్చి, రక్తం లేకుండా కూడా పాపపరిహార్థబలిని అర్పించే అవకాశాన్నిచ్చాడు. * ప్రాచీన ఇశ్రాయేలులో, పాపానికి పరిహారం చెల్లించి ఆశీర్వాదాన్ని పొందకుండా లేదా దేవునితో సమాధానం ఏర్పర్చుకునే అవకాశం లేకుండా పేదరికం ఎవ్వరినీ అడ్డగించలేదు.

పాపపరిహారార్థంగా అర్పించే అర్పణలకు సంబంధించి యెహోవా ఇచ్చిన నియమం నుండి ఆయన గురించి మనకు ఏమి తెలుస్తుంది? ఆయన దయగలవాడు, అర్థం చేసుకునే దేవుడు, ఆయన తన ఆరాధకుల పరిమితులను పరిగణలోకి తీసుకుంటాడు. (కీర్తన 103:14) వృద్ధాప్యం, అనారోగ్యం, కుటుంబ లేదా మరితర బాధ్యతలవంటి కష్టమైన పరిస్థితులున్నా మనం తనకు దగ్గరై తనతో మంచి సంబంధం ఏర్పర్చుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం శాయశక్తులా చేయగల్గింది చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడని తెలుసుకోవడం మనకెంతో ఓదార్పును ఇస్తుంది. (w09 6/1)

[అధస్సూచి]

^ పేరా 7 బలిగా అర్పించబడే జంతువు రక్తానికి ప్రాయశ్చిత్త విలువ ఉంది, ఎందుకంటే యెహోవా రక్తాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచుతాడు. (లేవీయకాండము 17:11) అలాగని, పేదవాళ్లు అర్పణగా తెచ్చే పిండి విలువలేనిదని అర్థమా? కాదు. అలాంటి అర్పణలను తెచ్చే ప్రజల వినయ మనస్సును, వారి ఇష్టపూర్వకమైన వైఖరిని యెహోవా విలువైనవిగా ఎంచాడు. అంతేకాదు పేదవాళ్లతోసహా ఇశ్రాయేలు జనాంగమంతటి పాపాలకు, ప్రాయశ్చిత్తార్థ దినాన అర్పించబడే జంతు బలుల రక్తంవల్లే ప్రాయశ్చిత్తం కలిగేది.—లేవీయకాండము 16:29, 30.