కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు

కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు

యోనాకు ఆలోచించడానికి చాలా సమయముంది. ఆయన నేలమార్గాన 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్ళాలి. దానికి నెల రోజులపైనే పడుతుంది. ఆయన దగ్గరి దారులను, సురక్షితమైన దారులను వెతుక్కుని, ఎన్నో కొండలు, గుట్టలు దాటుకుంటూ లోయలగుండా వెళ్ళాలి. విశాలమైన సిరియా ఎడారి చుట్టూ తిరిగి యూఫ్రటీసులాంటి పెద్ద నదులను దాటుకుంటూ సిరియా, మెసొపొతమియ, అష్షూరులలోని పట్టణాల్లో, గ్రామాల్లో పరదేశుల మధ్య ఆశ్రయం పొందాలి. రోజులు గడుస్తుండగా, ఆయన తనకెంతో భయం కల్గిస్తున్న తన గమ్యం గురించి ఆలోచించాడు. ఆయన వేసే ప్రతీ అడుగుతో ఆయన చేరుకోవలసిన గమ్యస్థానం దగ్గరపడింది, అదే నీనెవె పట్టణం.

ఒక్క విషయం మాత్రం యోనాకు బాగా తెలుసు: ఆయన ఈ నియామకం నుండి తప్పించుకుని ఎక్కడికీ పారిపోలేడు. అంతకు ముందు ఆయన అదే చేయడానికి ప్రయత్నించాడు. శక్తివంతమైన అష్షూరు సామ్రాజ్యంపై తన తీర్పు సందేశాన్ని ప్రకటించమని యెహోవా ఆయనకు మొదట చెప్పినప్పుడు వెంటనే ఆయన వ్యతిరేక దిశలో వెళుతున్న ఓడలోకి ఎక్కాడు. అప్పుడు యెహోవా ఒక పెద్ద తుఫాను రప్పించాడు. తన తిరుగుబాటు వల్ల ఓడలో ఉన్న వారందరి ప్రాణాలకు ముప్పు వచ్చేలా ఉందని యోనాకు అర్థమైపోయింది. ధైర్యవంతులైన ఆ నావికులను కాపాడడానికి యోనా తనను సముద్రంలో ఎత్తి పడేయమని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు అయిష్టంగానే ఆ పనిచేశారు. తన చావు ఖాయమని యోనా అనుకున్నాడు. అయితే, యెహోవా ఒక పెద్దచేప యోనాను మింగేసి మూడు రోజుల తర్వాత సురక్షితంగా తీరంలో కక్కేసేలా ఏర్పాటుచేశాడు. ఈ అనుభవం యోనాపై గొప్ప ప్రభావం చూపించింది. ఎందుకంటే జరిగిందానికి ఆయనెంతో ఆశ్చర్యపోయి దేవుడు చెప్పింది చేయాలని నిశ్చయించుకున్నాడు. *—యోనా, 1, 2 అధ్యాయాలు.

నీనెవెకు వెళ్ళమని యెహోవా రెండవసారి చెప్పినప్పుడు యోనా ప్రవక్త విధేయతతో ఆ సుదీర్ఘ ప్రయాణం కోసం తూర్పువైపుగా బయలుదేరాడు. (యోనా 3:1-3) యెహోవా ఇచ్చిన క్రమశిక్షణను స్వీకరించి యోనా మారాడా? ఉదాహరణకు, యెహోవా యోనాపట్ల కనికరపడి ఆయనను మునిగిపోకుండా కాపాడి, ఆయన చేసిన తిరుగుబాటుకు ఆయనను శిక్షించకుండా, ఈ పనిచేయడానికి రెండోసారి అవకాశమిచ్చాడు. ఇంత జరిగిన తర్వాతైనా యోనా ఇతరులపట్ల కనికరం చూపించడం నేర్చుకున్నాడా? కనికరం అనే ఈ లక్షణం చూపించడాన్ని నేర్చుకోవడం అపరిపూర్ణ మనుషులకు చాలా కష్టం. యోనా పడిన కష్టం నుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాం.

తీర్పు సందేశం, ఆశ్చర్యకరమైన స్పందన

యోనా నీనెవెను యెహోవా చూసినట్లు చూడలేదు. మనమిలా చదువుతాం: ‘నీనెవె పట్టణం దేవుని దృష్టిలో గొప్ప పట్టణం.’ (యోనా 3:3) యెహోవా ‘నీనెవెను మహాపురము’ అని మూడుసార్లు అన్నట్టుగా యోనా పుస్తకంలో ఉంది. (యోనా 1:2; 3:2; 4:11) యెహోవా దృష్టిలో ఈ పట్టణం ఎందుకంత గొప్పది లేదా ప్రాముఖ్యమైనది?

నీనెవె పట్టణం చాలా ప్రాచీనమైనది. జలప్రళయం తర్వాత నిమ్రోదు కట్టించిన పట్టణాల్లో ఇదొకటి. ఇది చాలా విశాలమైన ముఖ్యపట్టణం, దీనిలో అనేక నగరాలున్నాయి. ఆ పట్టణంలో కాలినడకన ఒక చివర నుండి మరో చివరకు వెళ్ళాలంటే మూడురోజులు పడుతుంది. (ఆదికాండము 10:11; యోనా 3:3) నీనెవె పట్టణం చాలా ఆకర్షణీయమైనది. ఎందుకంటే దీనిలో వైభవోపేతమైన గుళ్ళు, పెద్ద ప్రహారీ గోడలు, ఇతర భవనాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని బట్టి కాదుగానీ, ఆ పట్టణంలో ఉన్న ప్రజలనుబట్టే యెహోవా దేవుడు దాన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు. ఆ కాలంలో నీనెవె పట్టణ జనాభా ఎంతో ఎక్కువ. వాళ్ళెంతో చెడ్డపనులు చేసినప్పటికీ యెహోవా వాళ్ళ విషయంలో శ్రద్ధ చూపించాడు. మనుషుల ప్రాణాలను ఆయనెంతో విలువైనవిగా ఎంచుతాడు. చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి, ఆయన దృష్టికి సరైనది చేసే సాధ్యతవున్న వ్యక్తులను ఆయన గుర్తిస్తాడు.

చివరకు యోనా నీనెవె పట్టణానికి చేరుకున్నప్పుడు, ఆ పట్టణంలో ఉన్న 1,20,000 కంటే ఎక్కువ జనాభా ఆయన్ని మరింత భయపెట్టివుంటుంది. * తన సందేశాన్ని ప్రకటించడానికి అనువైన స్థలం కోసం చూస్తూ ఆయన ఒక రోజంతా నడిచి, జనంతో కిటకిటలాడుతున్న పట్టణంలోకి ప్రవేశించాడు. ఆ ప్రజలతో ఆయనెలా మాట్లాడాడు? అష్షూరు భాషను నేర్చుకుని ఉంటాడా? లేక యెహోవా ఆ భాష మాట్లాడే సామర్థ్యాన్ని ఆయనకు అద్భుతరీతిలో ఇచ్చివుంటాడా? మనకు తెలీదు. బహుశా ఆయన ఒక అనువాదకుణ్ణి పెట్టుకుని నీనెవె ప్రజలకు తన సొంత భాష అయిన హెబ్రీ భాషలో ప్రకటించివుంటాడు. ఆయన ఏవిధంగా చెప్పినాసరే, “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును” అనే సూటైన సందేశం ఆయనకు ప్రజాదరణేమీ తీసుకురాదు. (యోనా 3:4) ఆయన అదే విషయాన్ని ధైర్యంగా అందరికీ ప్రకటిస్తూ వెళ్ళాడు. అలా చేసి, ఎంతో ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూపించాడు. యోనా చూపించిన ఈ లక్షణాలు క్రైస్తవులకు ముందెప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరం.

నీనెవె ప్రజలు యోనా సందేశాన్ని విన్నారు. అయితే వాళ్ళు కోపోద్రేకులై, తనపై దాడి చేస్తారని బహుశా యోనా అనుకునివుంటాడు. కానీ ఊహించని విధంగా, ప్రజలు ఆయన సందేశాన్ని విని తమ పాపాలకు పశ్చాత్తాపపడ్డారు. ఆయన ప్రకటించిన నాశన సందేశం కార్చిచ్చులా పాకిపోయింది. ప్రజలంతా దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. యోనా పుస్తకం ఇలా చెప్తోంది: “నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.” (యోనా 3:5) గొప్పా బీదా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పశ్చాత్తాపపడ్డారు. ఈ వార్త రాజుదాకా చేరింది.

రాజు కూడా పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. రాజు తన సింహాసనం మీద నుండి దిగివచ్చి, రాజవస్త్రాలను తీసేసి, తన దేశ ప్రజలందరిలాగే గోనెపట్ట కట్టుకుని “బూడిదెలో కూర్చుండెను.” అప్పటికే ప్రజలు తమ సొంతగా చేస్తున్న ఉపవాసం, రాజు తన ‘మంత్రులతో’ కలిసి ఆజ్ఞ జారీ చేయడంతో అధికారిక చర్యగా మారింది. పెంపుడు జంతువులతో సహా అందరూ గోనెపట్ట కట్టుకోవాలని రాజు ఆజ్ఞాపించాడు. * తన ప్రజలు తప్పు చేశారనీ, హింసకు పాల్పడ్డారని రాజు వినయంగా అంగీకరించాడు. అంతేకాక, రాజు తన ప్రజలు పశ్చాత్తాపపడడం చూసి దేవుడు వాళ్ళపై కనికరం చూపిస్తాడనే ఆశను వ్యక్తంచేస్తూ, ‘మనము లయము కాకుండ దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకొనును’ అని అన్నాడు.—యోనా 3:6-9.

నీనెవె వాసుల్లో అంతటి మార్పు అంత త్వరగా రావడం గురించి కొందరు విమర్శకులు సందేహాలు వ్యక్తంచేస్తారు. అయితే, ప్రాచీన కాలాల్లోని అలాంటి సంస్కృతులకు చెందిన ప్రజలకు చాలా మూఢనమ్మకాలుండేవని, వాళ్ళు చాలా త్వరగా మారిపోయేవాళ్ళని, కాబట్టి ప్రజల్లో ఆ విధమైన ప్రతిస్పందన అసాధారణమైనదేమీ కాదని బైబిలు పండితులు పేర్కొన్నారు. ఎవరు ఏమి చెప్పినా, నీనెవె వాసుల పశ్చాత్తాపం గురించి యేసుక్రీస్తు తను భూమిపై ఉన్నప్పుడు ప్రస్తావించాడు. (మత్తయి 12:41) ఆయనకు తనేమి మాట్లాడుతున్నాడో బాగా తెలుసు. ఎందుకంటే ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు పరలోకం నుండి ఆయన ప్రత్యక్షంగా చూశాడు. (యోహాను 8:57, 58) అయితే, నీనెవె వాసులు పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఎలా స్పందించాడు?

దేవుని కనికరం, మానవవుని కఠినత్వం

యోనా ఆ తర్వాత ఇలా రాశాడు: ‘ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకున్నాక వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడి వారికి చేస్తానని తాను మాట ఇచ్చిన కీడు చేయలేదు.’—యోనా 3:10.

నీనెవె వాసుల విషయంలో తను చెప్పిన తీర్పు తప్పని యెహోవా అనుకున్నాడని దాని అర్థమా? కాదు. “ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు, ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు” అని బైబిలు యెహోవా గురించి చెప్తోంది. (ద్వితీయోపదేశకాండము 32:4) నీనెవె వాసుల మీద యెహోవాకు కలిగిన నీతియుక్తమైన ఆగ్రహం తగ్గింది. ఆ ప్రజల్లో వచ్చిన మార్పును యెహోవా గమనించి, వారిపైకి తను తీసుకురావాలనుకున్న శిక్ష ఇప్పుడు వారిపైకి తీసుకురావడం న్యాయం కాదని అనుకున్నాడు. అది దేవుడు కనికరం చూపించాల్సిన సందర్భం.

యెహోవా మతగురువులు తరచూ వర్ణించేలాంటి కఠినుడు, కనికరంలేనివాడు, క్రూరుడు కాదు. దానికి భిన్నంగా, ఆయన సహేతుకమైనవాడు, పరిస్థితులకు అవసరమైన విధంగా మారేవాడు, కనికరంగలవాడు. యెహోవా దుష్టులను శిక్షించాలనుకున్నప్పుడు మొదట భూమ్మీదున్న తన ప్రతినిధుల ద్వారా హెచ్చరిస్తాడు. ఎందుకంటే, దుష్టులు నీనెవె ప్రజల్లాగే పశ్చాత్తాపపడి తమ మార్గాలను మార్చుకోవాలని యెహోవా ఎంతో ఆశిస్తున్నాడు. (యెహెజ్కేలు 33:11) యెహోవా తన ప్రవక్తయైన యిర్మీయాకు ఇలా చెప్పాడు: ‘పెల్లగిస్తానని, విరగగొడతానని, నశింపజేస్తానని ఏదో ఒక జనం గురించి గాని రాజ్యం గురించి గాని నేను చెప్పివుంటే ఏ జనం గురించి నేను చెప్పానో ఆ జనం చెడుతనం చేయడం మానితే నేను వారికి చేయ ఉద్దేశించిన కీడు గురించి సంతాపపడతాను.’—యిర్మీయా 18:7, 8.

అయితే, యోనా ప్రవచనం వ్యర్థమైందా? కాలేదు. ఎందుకంటే యెహోవా ఉద్దేశించినట్లే అది ప్రజల్ని హెచ్చరించింది. నీనెవె వాసులు చెడుగా ప్రవర్తించారు కాబట్టే వాళ్లకు ఆ హెచ్చరిక ఇవ్వబడింది. దాంతో వాళ్లు పశ్చాత్తాపపడ్డారు. ఒకవేళ వాళ్లు మళ్లీ చెడుగా ప్రవర్తిస్తే, యెహోవా వాళ్లపై తన తీర్పును అమలు చేస్తాడు. ఆ తర్వాత సరిగ్గా అలాగే జరిగింది.—జెఫన్యా 2:13-15.

యోనా తను అనుకున్న సమయంలో నాశనం రానప్పుడు ఎలా స్పందించాడు? ‘యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు’ అని బైబిలు చెప్తోంది. (యోనా 4:1) చివరకు, యోనా యెహోవానే సరిదిద్దుతున్నట్లు ప్రార్థించాడు. తాను ఇంటిదగ్గరే ఉండిపోతే బాగుండేదని అన్నాడు. యెహోవా నీనెవె వాసులను నాశనం చేయడనే విషయం తనకు తెలుసనీ, అందుకే తాను తర్షీషుకు పారిపోయాననీ చెప్పాడు. ఇక బ్రతికుండడం కంటే చావడమే మేలని అంటూ తనను చంపమని యెహోవాతో అన్నాడు.—యోనా 4:2, 3.

యోనాను బాధించింది ఏమిటి? ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు మెదిలాయో మనకు తెలీదు. కానీ, యోనా ఆ ప్రజలందరి ఎదురుగా నీనెవె నాశనం గురించి ప్రకటించాడని మాత్రం మనకు తెలుసు. ఆయన చెప్పింది వాళ్లు నమ్మారు. తీరా చూస్తే ఏ నాశనం ముంచుకు రాలేదు. ప్రజలు తనను ఎగతాళి చేస్తారనో అబద్ధ ప్రవక్త అంటారనో ఆయన భయపడ్డాడా? ఏదేమైనా, ప్రజలు పశ్చాత్తాపపడినందుకు, యెహోవా కనికరం చూపించినందుకు యోనా సంతోషించలేదు. బదులుగా, ఆయన ఎంతో బాధపడ్డాడు, తనపై తనే జాలిపడ్డాడు, తన పరువు పోయిందని కుమిలిపోయాడు. అయినా, కనికరంగల దేవుడైన యెహోవా నిరుత్సాహపడుతున్న యోనాలో మంచినే చూశాడు. యోనా అమర్యాదగా ప్రవర్తించినందుకు యెహోవా ఆయనను శిక్షించలేదు గానీ “నీవు కోపించుట న్యాయమా?” అంటూ సౌమ్యంగా ఆలోచన రేకేత్తించే ఓ ప్రశ్న వేశాడు. (యోనా 4:4) దానికి యోనా కనీసం జవాబైనా ఇచ్చాడా? దీని గురించి బైబిలు ఏమీ చెప్పట్లేదు.

యోహోవా యోనాకు ఒక పాఠం నేర్పించాడు

నిరాశతోవున్న ప్రవక్త నీనెవె నుండి తన ఇంటివైపుగా కాదుగానీ తూర్పువైపుగా నీనెవె ప్రాంతం చక్కగా కనిపించే కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడొక చిన్న గుడారం వేసుకొని నీనెవె నాశనాన్ని చూద్దామని కూర్చున్నాడు. అప్పటికీ, నీనెవె నాశనమౌతుందనే యోనా ఎదురుచూస్తుండవచ్చు. క్షమించడానికి సిద్ధంగాలేని యోనాకు కనికరం చూపించడానికి సంబంధించి యెహోవా ఎలా ఒక పాఠాన్ని నేర్పించాడు?

రాత్రికిరాత్రే యెహోవా ఒక సొర చెట్టును మొలిపించాడు. యోనా నిద్రలేచి, పెద్ద పెద్ద ఆకులతో గుబురుగా పెరిగిన ఆ చెట్టును చూశాడు. అది, దుర్భలంగావున్న తన గుడారం కన్నా ఎక్కువ నీడనిచ్చింది. దాన్ని చూసి యోనా ఎంతో సంతోషించాడు. తనకు దేవుని ఆశీర్వాదం, ఆమోదం ఉన్నాయని చూపించడానికి దేవుడే ఆ సొర చెట్టును మొలిపించి ఉంటాడనుకొని ‘బహు సంతోషించాడు.’ అయితే యెహోవా, యోనాను ఎండ తగలకుండా కాపాడాలని, ఆయనకు వచ్చిన కోపాన్ని తగ్గించాలని మాత్రమే ఆ చెట్టును మొలిపించలేదు, ఆయనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. అందుకే యెహోవా ఆ చెట్టును ఒక పురుగు తొలిచేలా చేశాడు, దాంతో చెట్టు చచ్చిపోయింది. ఆ తర్వాత, యోనా ఎండకు సొమ్మసిల్లేంతవరకు దేవుడు “వేడిమిగల తూర్పుగాలిని” రప్పించాడు. మరోసారి ఎంతో విసిగిపోయిన యోనా తనను చంపేయమని దేవున్ని అడిగాడు.—యోనా 4:6-8.

ఈసారి సొర చెట్టు విషయంలో కోపపడడం న్యాయమేనా అని యెహోవా ఆయన్ని అడిగాడు. పశ్చాత్తాపపడాల్సిందిపోయి, “ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే” అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. యెహోవా ఆయనకు విషయాన్ని స్పష్టంగా వివరించాలనుకున్నాడు.—యోనా 4:9.

యోనా నాటకపోయినా, పెంచకపోయినా ఒకే రాత్రిలో పెరిగి చచ్చిపోయిన ఆ అల్పమైన చెట్టు విషయంలో అంత బాధపడడం సరైనదేనా అని యెహోవా తర్కిస్తూ, “నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” అని అడిగాడు.—యోనా 4:10, 11. *

యెహోవా సొర చెట్టును ఉపయోగించి నేర్పించిన పాఠంలో ముఖ్యమైన విషయం మీకు అర్థమైందా? యోనా ఆ చెట్టు కోసం ఏమీ చేయలేదు. మరోవైపున, యెహోవాయే మనుషుల ప్రాణాలకు మూలం కాబట్టి అందరినీ కాపాడుతున్నట్లే నీనెవే ప్రజలను కూడా కాపాడాడు. యోనా 1,20,000 మంది ప్రాణాలతోసహా వాళ్ల పాడిపశువులన్నిటికంటే ఎక్కువగా ఒక సొర చెట్టును విలువైనదిగా చూడడం సరైనదేనా? స్వార్థపరుడిగా మారేలా తన గురించి తాను ఎక్కువగా ఆలోచించినందువల్లే ఆయన అలా ప్రవర్తించాడు, కాదంటారా? తనకు ప్రయోజనం కలిగినందుకే ఆయన ఆ చెట్టు గురించి బాధపడ్డాడు. స్వార్థపూరిత ఆలోచనలతో అంటే తన పరువు కాపాడుకోవడానికి, తను నిజమైన ప్రవక్తనని నిరూపించుకోవడానికి యోనా నీనెవె పట్టణంపై ఆగ్రహించాడు.

ఎంత చక్కని పాఠం! యోనా ఈ అనుభవం నుండి పాఠమేమైనా నేర్చుకున్నాడా అనే ప్రశ్న తలెత్తుతుంది. యోనా పుస్తకం యెహోవా అడిగిన ప్రశ్నతో ముగుస్తుంది. ఆ ప్రశ్నకు ఇప్పటికీ జవాబు ఇవ్వబడలేదు. యోనా జవాబు ఇవ్వనేలేదని కొంతమంది విమర్శకులు అనవచ్చు. నిజానికి, ఆయన జవాబిచ్చాడు. యోనా రాసిన పుస్తకమే ఆ జవాబు అని చెప్పవచ్చు. ఎందుకంటే, యోనా పుస్తకాన్ని రాసింది యోనానే అని ఆధారాలు చూపిస్తున్నాయి. యోనా తన సొంత ఊరికి సురక్షితంగా చేరుకొని ఈ వృత్తాంతాన్ని రాయడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. వయసులో పెద్దవాడు, జ్ఞానవంతుడు, వినయస్థుడు అయిన యోనా ఒకప్పుడు తాను చేసినవాటికి విచారిస్తూ తన తప్పుల గురించి, తను చేసిన తిరుగుబాటు గురించి, కనికరం చూపించడానికి తను మొండిగా నిరాకరించడం గురించి రాయడాన్ని మనం దృశ్యీకరించుకోవచ్చు. యెహోవా ఇచ్చిన జ్ఞానవంతమైన ఉపదేశం నుండి యోనా ఖచ్చితంగా పాఠం నేర్చుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన కనికరం చూపించడం నేర్చుకున్నాడు. మరి మన విషయమేమిటి? (w09 4/1)

[అధస్సూచీలు]

^ పేరా 4 కావలికోట ఏప్రిల్‌-జూన్‌, 2009 సంచికలో ఉన్న “వారి విశ్వాసాన్ని అనుసరించండి—ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 9 యోనా కాలంలో, ఇశ్రాయేలు రాజధానియైన సమరయ జనాభా దాదాపు 20,000 నుండి 30,000 వరకు ఉండివుంటుందని అంచనా వేయబడింది. నీనెవె పట్టణ జనాభాతో పోలిస్తే ఇది నాలుగోవంతు కూడా ఉండదు. నీనెవె పట్టణం సుభిక్షంగా ఉన్న కాలంలో, అది ప్రపంచంలోనే అతి పెద్ద పట్టణమై ఉండవచ్చు.

^ పేరా 11 ఈ విషయం వింతగా అనిపించవచ్చు. కానీ ప్రాచీన కాలాల్లో అలా జరిగేది. ప్రాచీన పర్షియన్లు ప్రజాదరణ పొందిన ఒక అధికారి చనిపోయినందుకు దుఃఖిస్తున్నప్పుడు వాళ్ళ సంతాప కార్యక్రమాల్లో పాడి పశువులు కూడా ఉండేవని గ్రీకు చరిత్రకారుడైన హెరొడోటస్‌ చెప్పాడు.

^ పేరా 24 యెహోవా వాళ్లను కుడియెడమలు ఎరుగని ప్రజలని అనడం, వాళ్లు ఆయన ప్రమాణాల విషయంలో పసిపిల్లల్లా ఏమీ తెలియకుండా ఉన్నారని సూచిస్తుంది.

[16వ పేజీలోని బ్లర్బ్‌]

నీనెవె ప్రజల్లాగే, దుష్టులు తమ పాపాలకు పశ్చాత్తాపపడి మారాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు

[17వ పేజీలోని బ్లర్బ్‌]

కనికరం చూపించడానికి సంబంధించి యోనాకు పాఠం నేర్పించడానికి దేవుడు సొర చెట్టును ఉపయోగించాడు