తండ్రిలేని పిల్లలకు తండ్రి
దేవునికి దగ్గరవ్వండి
తండ్రిలేని పిల్లలకు తండ్రి
నిర్గమకాండము 22:22-24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
‘తన పరిశుద్ధాలయంలో ఉండే దేవుడు, తండ్రిలేని వారికి తండ్రి.’ (కీర్తన 68:5) ఆ ప్రేరేపిత మాటలు, యెహోవా దేవుని గురించి హృదయాలను తాకే ఓ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. అదేమిటంటే, యెహోవా నిస్సహాయులను ఆదుకుంటాడు. ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రాన్నిబట్టి చూస్తే, తల్లి లేక తండ్రి చనిపోయిన పిల్లల విషయంలో దేవునికి శ్రద్ధ ఉందనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం, బైబిల్లో ‘తండ్రిలేని పిల్లలు’ అనే మాట మొదటిసారి కనిపించే నిర్గమకాండము 22:22-24 వచనాలను పరిశీలిద్దాం.
దేవుడు ఇలా హెచ్చరించాడు: ‘తండ్రిలేని పిల్లలను బాధపెట్టకూడదు.’ (22వ వచనం) ఇదేదో మానవతా దృక్పథాన్ని చూపించమని కోరడం కాదు. అది దేవుని ఆజ్ఞ. తండ్రిని పోగొట్టుకున్న పిల్లలను సంరక్షించేవాళ్లు, వారి అవసరాలను తీర్చేవాళ్లు ఎవ్వరూ ఉండరు కాబట్టి, వాళ్లను ఇతరులు బాధపెట్టే అవకాశముంది. అలాంటి పిల్లలను ఎవరైనా సరే ఏరకంగానూ “బాధపెట్టకూడదు.” “బాధపెట్టకూడదు” అనే పదం మరో అనువాదంలో “కీడు చేయకూడదు” అని ఉంది. తండ్రిలేని పిల్లలను బాధపెట్టడం దేవుని దృష్టిలో చాలా గంభీరమైన విషయం. ఎంత గంభీరమైనది?
ఆ ఆజ్ఞ ఇలా కొనసాగుతోంది: “వారు మీచేత ఏ విధంగానైనా బాధపడి నాకు ఆక్రందన చేస్తే వారి మొర నేను తప్పక వింటాను.” (23వ వచనం) హెబ్రీ భాషలోని అసలు ప్రతిలో, 22వ వచనంలో “మీరు” అనే బహువచనం, 23వ వచనంలో “నీవు” అనే ఏకవచనం ఉపయోగించబడ్డాయి. కాబట్టి ఒక జనాంగంగా, వ్యక్తిగతంగా ఈ ఆజ్ఞకు లోబడాల్సిన బాధ్యత ఇశ్రాయేలీయులకు ఉందని మూల భాషలోని ఆ పదాలు చూపిస్తున్నాయి. యెహోవా తండ్రిలేని పిల్లల బాధను చూశాడు, సహాయం కోసం వాళ్లు పెట్టిన మొరను విన్నాడు.—కీర్తన 10:14; సామెతలు 23:10, 11.
దేవునికి మొర పెట్టేంతగా ఎవరైనా తండ్రిలేని పిల్లలను బాధపెడితే వారికేమి జరుగుతుంది? “నా కోపాగ్ని రగులుకొంటుంది. మిమ్ములను ఖడ్గంచేత చంపిస్తాను” అని యెహోవా చెప్పాడు. (24వ వచనం) ఒక బైబిలు రెఫరెన్సు గ్రంథం ఇలా చెప్తోంది: ఇది “అక్షరార్థంగా, ‘రక్తం ఉడికిపోవడాన్ని’ సూచిస్తుంది. కోపం నసాళానికెక్కిందని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడతారు.” అయితే, తండ్రిలేని పిల్లల విషయంలో ఇచ్చిన ఆజ్ఞను పాటించేలా చూడాల్సిన బాధ్యతను యెహోవా ఇశ్రాయేలులోని న్యాయాధిపతులకు విడిచిపెట్టలేదనేది గమనించండి. నిస్సహాయులైన పిల్లలను ఎవరైనా బాధపెడితే యెహోవాయే వారిని శిక్షిస్తాడు.—ద్వితీయోపదేశకాండము 10:17, 18.
యెహోవా మారలేదు. (మలాకీ 3:6) తల్లిని లేక తండ్రిని లేదా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలపట్ల యెహోవా కనికరం చూపిస్తాడు. (యాకోబు 1:27) మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమాయక పిల్లలను ఏ రకంగా హింసించినా తండ్రిలేని పిల్లలకు తండ్రియైన దేవునికి న్యాయంగానే ఆగ్రహం వస్తుంది. నిస్సహాయులైన పిల్లలను బాధపెట్టినవాళ్లు “యెహోవా కోపాగ్నిని” తప్పించుకోలేరు. (జెఫన్యా 2:2) అలాంటి దుష్టులు, “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము” అని తెలుసుకుంటారు.—హెబ్రీయులు 10:31. (w09 4/1)