కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

యేసు ప్రార్థనలో యెహోవాను “నాయనా, తండ్రీ” అని ఎందుకు పిలిచాడు?

నాయనా అని అనువదించబడిన అబ్బా అనే అరామిక్‌ పదానికి “తండ్రి” లేదా “ఓ తండ్రీ” అని అర్థం. లేఖనాల్లో కనిపించే మూడు సందర్భాల్లోనూ అది ప్రార్థనలో పరలోక తండ్రియైన యెహోవాను సంబోధిస్తూ ఉపయోగించబడింది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో, ఆ పదానికి ఎలాంటి ప్రత్యేకత ఉండేది?

ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా తెలియజేస్తుంది: “యేసు జీవించిన కాలంలో తండ్రితో సన్నిహితంగావుండే, తండ్రిని గౌరవించే పిల్లలు సాధారణంగా తమ తండ్రిని అలా పిలిచేవాళ్ళు.” తండ్రిమీదున్న ఆప్యాయతతో పిల్లలు అలా పిలిచేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళు నేర్చుకునే మొదటి మాటల్లో అదొకటి. ప్రాముఖ్యంగా యేసు తీవ్రంగా ప్రార్థిస్తున్నప్పుడు తన తండ్రిని అలా సంబోధించేవాడు. యేసు ఇంకా కొన్ని గంటల్లో మరణిస్తాడనగా గెత్సెమనే తోటలో యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనను “నాయనా, తండ్రీ” అని పిలిచాడు.—మార్కు 14:36.

“గ్రీకు-రోమన్‌ కాలానికి చెందిన యూదుల సాహిత్యంలో దేవుణ్ణి నాయనా అని సంబోధించడం చాలా అరుదు. దేవునితో అంత సన్నిహితత్వం ఉన్నట్లు ఆయనను అలా పిలవడం ఎంతో తప్పుగా పరిగణించబడడమే అందుకు కారణం కావచ్చు,” అయితే “దేవునితో తనకు సన్నిహితత్వం ఉందని తాను అంతకు ముందు చెప్పిన అసాధారణమైన విషయాన్ని మళ్ళీ పరోక్షంగా ధృవీకరించడానికే యేసు ప్రార్థనలో ఆ పదాన్ని ఉపయోగించాడు” అని కూడా ఆ రెఫరెన్సు గ్రంథం చెప్తోంది. లేఖనాల్లో ఈ పదం అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మరో రెండుచోట్ల కనిపిస్తుంది. ఒకచోట “నాయనా” అనీ, మరోచోట “అబ్బా” అనీ ఆ పత్రికల్లో ఉంది. దీన్నిబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా తమ ప్రార్థనల్లో ఈ పదాన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది.—రోమీయులు 8:15; గలతీయులు 4:6. (w09 4/1)