విశ్వాసం అంటే ఏమిటి?
విశ్వాసం అంటే ఏమిటి?
వి శ్వాసాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? కొందరు దాన్ని గుడ్డి నమ్మకం అంటారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత వ్యాసకర్త, విలేఖరి హెచ్. ఎల్. మెన్కెన్ ఒకసారి ఇలా అన్నాడు: “సాధ్యంకానివి సాధ్యమౌతాయన్న పిచ్చినమ్మకమే విశ్వాసం.”
అయితే దేవుని వాక్యమైన బైబిలు, విశ్వాసం అంటే గుడ్డి నమ్మకమనో, పిచ్చి నమ్మకమనో చెప్పట్లేదు. కానీ, ‘విశ్వాసమనేది నిరీక్షించేవాటి నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువు’ అని చెప్తోంది.—హెబ్రీయులు 11:1.
విశ్వాసం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి, మనం ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం:
• విశ్వాసం గురించి బైబిలు ఇస్తున్న నిర్వచనానికి, ప్రజలు అనుకునేదానికి మధ్య తేడా ఏమిటి?
• బైబిలు చెప్పేలాంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
• మీరు బలమైన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
హక్కు దస్తావేజు, గట్టి రుజువు
బైబిల్లోవున్న హెబ్రీయుల పత్రిక రాసే సమయానికి, ‘నిజస్వరూపం’ అని అనువదించబడిన గ్రీకు పదం వాడుకలో ఉండేది. ఆ గ్రీకు పదాన్ని సాధారణంగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన దస్తావేజుల్లో, ఫలానాది తమకే ఖచ్చితంగా లభిస్తుందని రూఢీగా తెలియజేయడానికి ఉపయోగించేవారు. అందుకే ఒక రెఫరెన్సు గ్రంథం, హెబ్రీయులు 11:1వ వచనాన్ని ‘విశ్వాసం అనేది నిరీక్షించేవాటి హక్కు దస్తావేజు’ అని అనువదించవచ్చని చెప్తోంది.
మంచి పేరున్న కంపెనీ నుండి ఏదైనా వస్తువు కొని, అది మీ ఇంటికి వచ్చేంతవరకు వేచి చూసినప్పుడు మీరు ఆ విధమైన విశ్వాసాన్నే కనబరుస్తారు. మీరు డబ్బు కట్టినట్టు చూపించే రశీదు మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆ కంపెనీని విశ్వసిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రశీదు, మీరు కొన్న వస్తువు మీ ఇంటికి వస్తుందని అనడానికి మీ దగ్గరున్న హక్కు దస్తావేజు. ఒకవేళ మీరు ఆ రశీదు పోగొట్టుకున్నా లేదా ఎక్కడైనా పారేసినా, ఆ వస్తువు మీది అనడానికి మీ దగ్గర ఏ ఆధారమూ ఉండదు. అలాగే, దేవుడు తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాడని విశ్వసించేవాళ్లు, తాము నిరీక్షించినది ఖచ్చితంగా పొందుతారు. మరోవైపు, విశ్వాసం లేనివాళ్లు లేదా దాన్ని పోగొట్టుకున్నవాళ్లు దేవుడు వాగ్దానం చేసినవాటిని పొందడానికి అర్హులు కారు.—యాకోబు 1:5-8.
హెబ్రీయులు 11:1 ఇచ్చిన నిర్వచనంలోని రెండవ భాగం అంటే, “రుజువు” అని అనువదించబడిన పదానికి, కంటికి కనిపించే దానికి భిన్నంగావున్న వాస్తవాన్ని నమ్మడానికి కావాల్సిన ఆధారం అని అర్థం. ఉదాహరణకు, సూర్యుడు తూర్పున ఉదయించి ఆకాశంలో కదులుతూ పశ్చిమాన అస్తమిస్తాడు కాబట్టి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదుగానీ భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం వెల్లడి చేస్తున్నాయి. ఒకసారి మీరు ఆ వాస్తవాన్ని తెలుసుకొని అది నిజమని అంగీకరిస్తే, మీ కళ్లకు ఏమి కనిపించినా భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని విశ్వసిస్తారు. విశ్వసించడం అంటే వాస్తవాలను అర్థం చేసుకోకుండా నమ్మడం కాదుగానీ విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా అర్థంచేసుకోవడం.
బలమైన విశ్వాసం ఎంత ప్రాముఖ్యం?
బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని బైబిలు ప్రోత్సహిస్తోంది. ఇలాంటి విశ్వాసం గట్టి రుజువుపై ఆధారపడివుంటుంది. దీన్ని పెంపొందించుకోవడానికి మన నమ్మకాలను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘విశ్వాసం లేకుండా దేవున్ని ఆనందపరచడం అసంభవం. దేవుని దగ్గరకి రావాలనుకున్నవారు ఆయనున్నాడని, అడిగిన వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి.’—హెబ్రీయులు 11:6, ఈజీ-టు-రీడ్ వర్షన్.
బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. తర్వాతి పేజీల్లో చర్చించబడిన నాలుగు చర్యలు తీసుకుంటే మీరు వాటిని అధిగమించవచ్చు. (w09 5/1)