కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2 దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి

2 దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి

2 దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి

“ఏకైక సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే శాశ్వత జీవం.”—యోహాను 17:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

ఆటంకం: దేవుడు లేడని కొందరు అంటారు. మరికొందరు, దేవుడు ఒక వ్యక్తి కాదుగానీ ఓ మహత్తరమైన శక్తి అంటారు. దేవుడు నిజమైన వ్యక్తి అని నమ్మేవాళ్లు ఆయన ఎవరు, ఆయన లక్షణాలేమిటి వంటి విషయాల గురించి పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు బోధిస్తారు.

దాన్నెలా అధిగమించవచ్చు? దేవుడు చేసినవాటిని పరిశీలించడం ద్వారా ఆయన గురించి తెలుసుకోవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘ఆయన అదృశ్యలక్షణాలు, అంటే ఆయన నిత్యశక్తి, దేవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడంవల్ల తేటపడుతున్నాయి.’ (రోమీయులు 1:20) సృష్టిని జాగ్రత్తగా పరిశీలిస్తే మన సృష్టికర్తకున్న జ్ఞానం, శక్తి గురించి ఎంతో తెలుసుకోవచ్చు.—కీర్తన 104:24; యెషయా 40:26.

దేవుడు ఎలాంటివాడో తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి దేవుని వాక్యమైన బైబిలును స్వయంగా పరిశీలించాలి. మీ ఆలోచనను మలిచేందుకు ఇతరులకు అవకాశమిచ్చే బదులు బైబిలు ఇస్తున్న ఈ సలహాను పాటించండి: “ఇక మీదట ఈ లోకంతీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!” (రోమీయులు 12:2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఉదాహరణకు, బైబిలు దేవుని గురించి తెలియజేస్తున్న వాస్తవాలను పరిశీలించండి.

దేవునికి ఒక పేరు ఉంది. ఆ పేరు బైబిలు అసలు ప్రతిలో వేలసార్లు ఉండేది. అనేక అనువాదాల్లో ఆ పేరు కీర్తన 83:18లో కనిపిస్తుంది. అక్కడిలా ఉంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”

యెహోవా దేవుడు మనుషులు చేసే పనులకు స్పందిస్తాడు. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు ఆయనిచ్చిన మంచి నిర్దేశాలను అలక్ష్యం చేశారు. వాళ్ళు చేసిన పనికి ఆయన ‘దుఃఖపడ్డాడు.’ వాళ్ల పనులు ‘ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా ఎంతో బాధ కలిగించాయి.’—కీర్తన 78:40, 41, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యెహోవా మనలో ప్రతీఒక్కరిపైన శ్రద్ధ చూపిస్తాడు. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.”—మత్తయి 10:29-31, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌.

దేవుడు ఒక జాతిని లేదా సంస్కృతిని మరో దానికన్నా ఎక్కువగా చూడడు. అపొస్తలుడైన పౌలు ఏథెన్సులోని గ్రీసు దేశస్థులకు ఇలా చెప్పాడు: ‘యావద్భూమిమీద కాపురముండటానికి ఆయన ఒకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. ఆయన మనలో ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాడు.’ (అపొస్తలుల కార్యములు 17:26, 27) అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: ‘దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనంలోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవానిని ఆయన అంగీకరిస్తాడు.’—అపొస్తలుల కార్యములు 10:34, 35.

ప్రతిఫలం ఏమిటి? కొంతమంది ‘శ్రద్ధతో దేవుని సేవ చేస్తారు కానీ వాళ్ల శ్రద్ధ జ్ఞానంమీద ఆధారపడిలేదు.’ (రోమీయులు 10:2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దేవుని గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో మీకు తెలిస్తే, మీరు మోసపోకుండా ఉండగలుగుతారు, ‘దేవునికి సన్నిహితం కాగలుగుతారు.’—యాకోబు 4:8, NW. (w09 5/1)

మరింత వివరణ కోసం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * పుస్తకంలోని “దేవుని గురించిన సత్యం ఏమిటి?” అనే 1వ అధ్యాయాన్ని చూడండి.

[అధస్సూచి]

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించారు.

[6వ పేజీలోని చిత్రం]

దేవుడు చేసినవాటిని పరిశీలించడం ద్వారా ఆయన గురించి తెలుసుకోవచ్చు