కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవాళి భవిష్యత్తు గురించి ఆయనేమి చెప్పాడు?

మానవాళి భవిష్యత్తు గురించి ఆయనేమి చెప్పాడు?

యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు

మానవాళి భవిష్యత్తు గురించి ఆయనేమి చెప్పాడు?

మనుషులు పరలోకానికి వెళ్తారని యేసు మాటిచ్చాడా?

అవును, ఆయన మాటిచ్చాడు! అంతెందుకు, ఆయన కూడా పునరుత్థానం చేయబడిన తర్వాత అంటే చనిపోయి తిరిగి బ్రతికించబడిన తర్వాత తన తండ్రితో ఉండేందుకు పరలోకానికి ఎక్కిపోయాడు. అయితే ఆయన చనిపోయి బ్రతికించబడడానికి ముందు తన 11 మంది నమ్మకమైన అపొస్తలులతో, “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు . . . మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను” అన్నాడు. (యోహాను 14:2) కానీ ఇలా పరలోకానికి వెళ్లేవారు కొద్దిమందే ఉంటారు. ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.”—లూకా 12:32.

“చిన్నమందకు చెందిన సభ్యులు పరలోకంలో ఏమిచేస్తారు?

ఈ చిన్నగుంపుకు చెందిన సభ్యులు పరలోకంలో యేసుతోపాటు పరిపాలించాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అలాగని మనకెలా తెలుసు? పునరుత్థానమైన తర్వాత యేసు తన అపొస్తలుడైన యోహానుకు ఈ విషయాన్ని వెల్లడిచేస్తూ, నమ్మకస్థులైన కొందరు ‘భూలోకాన్ని ఏలుదురు’ అని చెప్పాడు. (ప్రకటన 1:1; 5:9, 10) ఇది సంతోషకరమైన వార్త. మానవాళికి నేడు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మంచి ప్రభుత్వం అవసరం. యేసు పరిపాలించే ఈ ప్రభుత్వం ఏమి సాధిస్తుంది? యేసు ఇలా అన్నాడు: ‘క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చుంటారు.’ (మత్తయి 19:28, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యేసు, ఆయన అనుచరులు పరిపాలించినప్పుడు “క్రొత్త ప్రపంచం” వస్తుంది అంటే మొదటి మానవ దంపతులు పాపం చేయడానికి ముందు అనుభవించిన పరిపూర్ణ పరిస్థితులు మళ్లీ తీసుకురాబడతాయి.

మిగతా మానవుల భవిష్యత్తు గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసు పరలోకంలో జీవించడానికి సృష్టించబడ్డాడు, కానీ మానవులు భూమ్మీద జీవించడానికే సృష్టించబడ్డారు. (కీర్తన 115:16) అందుకే యేసు ఇలా అన్నాడు: “మీరు క్రిందివారు, నేను పైనుండువాడను.” (యోహాను 8:23) భూమ్మీది మానవులకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని యేసు చెప్పాడు. ఒకసారి ఆయనిలా అన్నాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (మత్తయి 5:5) నిజానికి ఆయన, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు” అని దైవావేశంతో పలికిన కీర్తనకర్త మాటలనే సూచిస్తున్నాడు.—కీర్తన 37:11, 29.

కాబట్టి, నిత్యజీవాన్ని పొందేది పరలోకానికి వెళ్లే “చిన్నమంద” మాత్రమే కాదు. ప్రపంచంలోని మిగతా మానవులందరికీ ఉండే మంచి భవిష్యత్తు గురించి కూడా యేసు మాట్లాడాడు. ఆయనిలా అన్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16.

దేవుడు మానవులకు బాధల్లేకుండా ఎలా చేస్తాడు?

అణచివేతకు కారణమైన రెండిటి నుండి విముక్తి లభిస్తుందని చెబుతూ యేసు ఇలా అన్నాడు: “ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును.” (యోహాను 12:31) మొదట, బాధలకు కారణమైన భక్తిహీనులకు తీర్పు జరిగి వారు నాశనం చేయబడతారు. రెండవది, సాతాను బయటకు త్రోసివేయబడతాడు కాబట్టి, అతడు మానవాళిని ఇక ఎంతమాత్రం మోసగించడు.

అయితే బ్రతికున్నప్పుడు దేవుని గురించి, క్రీస్తు గురించి తెలుసుకునే అవకాశం, వారిని విశ్వసించే అవకాశం దొరక్క చనిపోయినవారి విషయమేమిటి? తన ప్రక్కనే వేలాడదీయబడిన నేరస్థునితో యేసు ఇలా అన్నాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.” (లూకా 23:43) యేసు అతనిని, పరదైసులా అంటే ఉద్యానవనంలా మారిన భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేసినప్పుడు లక్షలాదిమంది ఇతరులతోపాటు అతనికి కూడా దేవుని గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అప్పుడు అతనికి భూమ్మీద నిత్యజీవం పొందే దీనులైన నీతిమంతుల్లో ఒకనిగా ఉండే అవకాశం ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 24:15. (w09 08/01)

మరింత సమాచారం కోసం, బిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 3వ, 7వ అధ్యాయాలు చూడండి. a

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించినది.

[29వ పేజీలోని చిత్రం]

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29